లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈడీ అధికారి, ఎలా దొరికిపోయారంటే....

తమిళనాడులోని దిండిగల్ సమీపంలోని రూ.20 లక్షల లంచం తీసుకుంటున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారిని తమిళనాడు అవినీతి నిరోధకశాఖాధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన అంకిత్ తివారీ నాలుగునెలల నుంచి మదురై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్నారు.
అవినీతి నిరోధకశాఖ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు అంకిత్ తివారీ తమిళనాడులోని ఓ ప్రభుత్వాధికారిని కలిసి, ఆయన మీద నమోదైన కేసులో చర్యలు తీసుకోకుండా ఉండటానికి రూ.51 లక్షలు ఇవ్వాలని కోరారు. ఇందులో మొదటి విడతగా రూ. 20 లక్షలు తీసుకున్నారు.
సంబంధిత అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవంబరు 31న అవినీతి నిరోధక శాఖాధికారులు కేసు నమోదు చేశారు. దీంతో అంకిత్ తివారీ పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు రసాయనాలు పూసిన నోట్లకట్టలను ఉపయోగించారు. వాటిని సదరు అధికారికి అందించి, అంకిత్ తివారీకి ఇవ్వాలని సూచించారు.
దిండిగల్ సమీపంలోని చెట్టినాయకన్‌పట్టి వద్ద తివారీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు అవినితి నిరోధక, నిఘా విభాగ ఎస్పీ శరవణన్, డిఎస్సీ నాగరాజన్, ఇన్‌స్పెక్టర్ రూపా కీతరాణి ప్రయత్నించారు. అయితే వీరిని చూడగానే తివారీ తన వాహనాన్ని వెనక్కి తిప్పి, బైపాస్ రోడ్డు మీదుగా సర్వీసురోడ్డులోకి వెళ్ళారని అవినీతి నిరోధక విభాగ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.
దీంతో ఇతనిని వెంబండించిన అధికారులు ఎట్టకేలకు ఆయనను పట్టుకున్న తరువాత చెట్టినాయక్‌పట్టి పవర్ బోర్డు ఆఫీసులో విచారించారు. తివారీ దగ్గరున్న 20 లక్షల రూపాయల నగదును జప్తుచేసి, అవినీతి నిరోధకశాఖ కార్యాలయానికి తరలించారు.
అంకిత్ తివారీని అరెస్ట్ చేసి, దిండిగల్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి మోహన్ నివాసంలో హాజరుపరచగా, 15రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించారు.

లంచం ఎలా తీసుకున్నారంటే....
ఓ ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవినీతి నిరోధక శాఖాధికారులు నవంబరు 30న అంకిత్ తివారీపైన కేసు నమోదు చేశారు. తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారినని, తరువాత రోజు ఉదయం మదురై లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి విచారణకు రావాలంటూ ఓ ప్రభుత్వ వైద్యుడికి అక్టోబరు 29న ఓ వాట్సాప్ కాల్ వచ్చినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్యుడిపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ 2018లో ఏసీబీ నమోదు చేసిన కేసులో విచారణ జరపాల్సిందిగా ప్రధాని కార్యాలయం నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని తివారీ చెప్పారు. ఈ విచారణకు హాజరైన సందర్భంగా 3 కోట్లరూపాయలు ఇస్తే ఎటువంటి చర్యలు లేకుండా చేస్తామని తివారీ తనతో అన్నారని ఆ డాక్టర్ తన ఫిర్యాదులో చెప్పారు.
అంతమొత్తం ఇవ్వలేనని చెప్పడంతో వాట్సాప్ కాల్‌లో హార్దిక్‌గా పరిచయం చేసుకున్న అంకిత్ తన పై అధికారులతో మాట్లాడి నవంబరు 1నాటికల్లా రూ. 51 లక్షలు ఇవ్వాలని చెప్పారు. ఈ మేరకు 20 లక్షల రూపాయల ప్రాథమిక చెల్లింపు జరిగింది.
మళ్ళీ అక్టోబరు 31వ తేదీ రాత్రి అంకిత్ తివారీ డాక్టర్‌కు ఫోన్ చేసి డబ్బు సిద్ధమైందా లేదా అని అడిగారు. డబ్బు రెడీ అయిందంటే ఉదయాన్నే ఫోన్ చేస్తానని చెప్పిన తివారీ, అన్నట్టుగానే నవంబరు 1వ తేదీ ఉదయం ఫోన్ చేశారు. ఉదయం 7గంటల 17 నిమిషాలకు ఫోన్ చేసి, తాను మదురై నుంచి నాథమ్ మీదుగా వస్తున్నానని, దారిలో డబ్బు తీసుకుంటానని చెప్పారు.
ఉదయం 7.46కు మరోసారి డాక్టర్‌కు కాల్ చేసిన తివారీ తర్వాత కాసేపటికే డాక్టర్ కార్ దగ్గరకు చేరుకున్నారు. డబ్బు తెచ్చారా అంటూ ఆరా తీశారు.
తాను రూ. 20 లక్షలే తెచ్చానని డాక్టర్ చెప్పడంతో మిగిలిన డబ్బులు కూడా త్వరగా తెచ్చివ్వాలని తివారీ అన్నారు. తెచ్చిన డబ్బును తన చేతికి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ వ్యవహారమంతా డాక్టరు కారులో ముందుభాగంలో అమర్చిన కెమెరాలో రికార్డు అయింది.

కేంద్ర ప్రభుత్వోద్యోగిని అరెస్ట్ చేయచ్చా?
డాక్టరు ఫిర్యాదు మేరకు అంకిత్‌ను అవినీతి నిరోధకశాఖాధికారులు అరెస్ట్ చేశారు. దీంతోపాటుగా మదురై ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ రీజినల్ ఆఫీస్‌లో ఏసీబీ అధికారులు పోలీసుల సాయంతో తనిఖీ చేశారు. తొలుత తనిఖీలు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిరాకరించినప్పటికీ, చర్చల అనంతరం అంగీకరించారు.
ఈమేరకు అంకిత్ తివారీని అరెస్ట్ చేసి, ఆయన నుంచి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వద్ద కూడా సీఆర్పీఎప్ బలగాలను మోహరించారు. ఈ కార్యాలయంపైన కూడా దాడులు జరగవచ్చనే వార్తలతో భద్రత పెంచారు.
కేంద్రప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటే ఏం చేయాలనే విషయంలో నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన సీబీఐ ఇటువంటి కేసులను విచారిస్తుంది.
అయితే ఈ కేసులో లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయినందున , కేంద్రప్రభుత్వ అధికారులకు తెలియజేసే సమయం లేక వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
అరెస్ట్ చేసిన తరువాత కేంద్ర సంస్థలకు ఈ విషయం తెలపాల్సి ఉందని నిబంధనలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
- నేపాల్‌లో తొలి స్వలింగ సంపర్కుల పెళ్ళి రిజిస్ట్రేషన్
- LGBT లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్... ఈ పదాలకు అర్థం ఏంటి?
- పాకిస్తాన్ నుంచి మనుషుల అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? బీబీసీ అండర్ కవర్ రిపోర్టర్‌తో స్మగ్లర్ ఆజం చెప్పిన సీక్రెట్స్...
- రష్యా నుంచి అర్జెంటీనాకు చేరుకుంటున్న వేలమంది గర్భిణులు, అరెస్టు చేస్తున్న పోలీసులు, ఎందుకు?
- ఇలా పోపట్: 50 ఏళ్లుగా భారత్ లో ఉంటున్నా, ప్రపంచంలో ఏ దేశానికీ చెందని మహిళ ఈమె
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














