విజయనగర రాజులు కట్టించిన ఈ ఆలయం గోపురాన్ని లాటరీ టికెట్లు అమ్మి పునర్ నిర్మించారు

సుచింద్రంలోని ఆలయం

ఫొటో సోర్స్, bbc

ఫొటో క్యాప్షన్, తనుమలయాన్ ఆలయం
    • రచయిత, ఎస్. మహేశ్
    • హోదా, బీబీసీ కోసం

ఈ ఆలయ గోపుర పునర్మిర్మాణానికి అవసరమైన నిధులను లాటరీ టికెట్లను విక్రయించడం ద్వారా సమకూర్చాలని నిర్ణయించారు. అలా వచ్చిన డబ్బుతో ఎత్తైన గోపుర నిర్మాణం జరిగింది.

తమిళనాడు రాష్ట్రంలో లాటరీ టికెట్ల అమ్మకాలపై ఇప్పుడు నిషేధం ఉంది. కానీ 148 ఏళ్ల క్రితం అదే లాటరీ టికెట్ల విక్రయంతోనే కన్యాకుమారి జిల్లా సుచింద్రం పట్టణంలోని ప్రముఖ తనుమలయాన్ ఆలయ రాజగోపుర పునర్మిర్మాణం జరిగింది. ఈ ఆలయాన్ని స్థానుమలయన్ ఆలయం అని కూడా పిలుస్తారు. దేశంలోని 108 శైవ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి.

స్థానుమలయన్ అంటే త్రిమూర్తులు అనే అర్థం వస్తుంది. స్థాను అంటే శివుడు, మలయ అనగా విష్ణువు, ఆయన్ అంటే బ్రహ్మ అని చెప్తారు.

ఈ ఆలయం కన్యాకుమారిలోని పలయన్ నదీ తీరాన ఉంది.

1875లో రాజ గోపుర నిర్మాణానికి నిధులు సమకూర్చడం కోసం లాటరీ టికెట్లు విక్రయించినట్లుగా చరిత్రకారులు చెప్తారు.

ఆలయ రాజగోపురం

ఫొటో సోర్స్, bbc

ఫొటో క్యాప్షన్, తనుమలయాన్ ఆలయ రాజగోపురం

134 అడుగుల ఎత్తైన రాజ గోపురం

చరిత్రకారులు కె.కె.పిళ్లై 1953లో ‘ది సుచింద్రం టెంపుల్’ పేరిట ప్రచురించిన పుస్తకంలో రాజగోపురం ఎత్తు 134 అడుగుల 6 అంగుళాలుగా పేర్కొన్నారు.

సుమారుగా 90 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ఉంటుందని రాశారు.

దీని గురించి వర్ణిస్తూ, అప్పటి ట్రావెన్ కోర్ రాజ్యంలో ఈ ఆలయ గోపుర నిర్మాణ శైలి మరెక్కడా లేనంత గొప్పగా ఉందని పేర్కొన్నారు.

పరిశోధకులు డా.ఏకే పెరుమాళ్ తాను రాసిన ‘ధనుమలయన్ టెంపుల్’ పుస్తకంలో ఆలయ చరిత్ర గురించి ప్రస్తావించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ- ఆలయానికి సంబంధించి మలయాళ సంవత్సరం 720 (1544AD కాలం) నాటి శిలాశాసనాలు రాజగోపుర స్థలంలో లభ్యమయ్యాయని తెలిపారు.

వీటిలో అప్పటి విజయనగర రాజులు విఠలార్, అతని సోదరులు ఆలయాన్ని నిర్మించినట్లుగా వివరాలు ఉన్నట్లు తెలిపారు.

ఆ తరువాత 344 ఏళ్ల పాటు ఆలయ గోపురం చెక్కుచెదరకుండా అలానే ఉన్నట్లు చెప్పారు.

1881లో ట్రావెన్‌కోర్ రాజ్యపు రాజు విసకం ఆలయ గోపురాన్ని పునర్నిర్మించే బాధ్యతను తీసుకున్నారు.

అలా మళ్లీ పనులు మొదలయ్యాయి. నాలుగేళ్ల తర్వాత ఆయన మరణించారు. అధికారం చేపట్టిన రాజు తిరునాళ్ ఆలయ శిఖర పునర్నిర్మాణాన్ని 1888లో పూర్తిచేసినట్లుగా డా.పెరుమాళ్ పేర్కొన్నారు.

ఆధారం

ఫొటో సోర్స్, bbc

ఫొటో క్యాప్షన్, లాటరీ టికెట్లు విక్రయించాలని రాజు ఇచ్చిన ఆదేశం

వట్టపల్లి మఠాధిపతులు

మలయాళంలో వట్టం అంటే ఏర్పాట్లు అని అర్థం. పల్లి అంటే ఆలయం. వట్టపల్లి అంటే ఆలయంలో ఏర్పాట్ల గురించి శ్రద్ధ తీసుకునేవారని ఆర్థం.

సుచింద్రం తనుమలయాన్ ఆలయంలో పూజలు, వేడుకలు చేసే హక్కు వట్టపల్లి మఠాధిపతులకు వంశపారంపర్యంగా సంక్రమించింది.

సుచింద్రంలో శాశ్వతనివాసం ఉన్న వట్టపల్లి మఠాధిపతులకు ఆలయ కార్యక్రమాల్లో రథం ముందు జండా పట్టుకునే హక్కు ఉంది. ఒకప్పుడు ఆలయానికి సంబంధించిన తాళాలు, విలువైన వస్తువులు, పాత్రలు కూడా వారి స్వాధీనంలోనే ఉండేవి. ఈ అంశాలన్నీ కేకే పిళ్లై రాసిన ద సుచిందురం టెంపుల్- ఏ మనోగ్రాఫ్ అనే పుస్తకంలో రాశారు.

వట్టపల్లి మఠంలోని సభ్యులు సంస్కృతం, మలయాళంలో దిట్టలే కాకుండా జ్యోతిష్యం, వైద్య శాస్త్రంలో నిపుణులని ఈ పుస్తకంలో వివరించారు.

పునరుద్ధరణకు నిధుల కోసం లాటరీ టిక్కెట్ల అమ్మకం

ప్రస్తుతం కన్యాకుమారి జిల్లాలోని ప్రాంతాలన్నీ1728 నుంచి 1948 వరకూ ట్రావెన్‌కోర్ రాజ్యంలో భాగంగా ఉండేవి.

ట్రావెన్‌కోర్ రాజు అయ్యం తిరునాళ్ హయాంలో సుచింద్రం ఆలయ గోపుర నిర్మాణానికి ప్రస్తుత లెక్కల ప్రకారం 70 వేల రూపాయలు అవసరం అయ్యాయి.

1875లో సుచింద్రం వట్టపల్లి మఠానికి పరమేశ్వర శర్మ అలియాస్ బచ్చు సీనియర్ నాయకుడు. ట్రావెన్‌కోర్ రాజులకు ముఖ్య సలహాదారు కూడా. లాటరీ టిక్కెట్లు అమ్మడం ద్వారా నిధులు సేకరించి ఆలయ గోపురానికి మరమ్మతులు చేపట్టవచ్చని ఆయన ట్రావెన్‌కోర్ రాజుకు సలహా ఇచ్చారు.

రాజుకు సలహా ఇచ్చిన పరమేశ్వర శర్మ ”మా కుటుంబంలో ఆరు తరాల క్రితం నాటి వ్యక్తి” అని ఆయుర్వేదిక్ డాక్టర్ శివ ప్రసాద్ చెప్పారు. ఈయన ప్రస్తుతం సుచింద్రం వట్టపల్లి మఠంలో ఉంటున్నారు.

“మలయాళపు సంవత్సరం 1050 ( క్రీ.శ. 1875)లో లాటరీ టిక్కెట్లు అమ్మేందుకు రాజు అనుమతి ఇచ్చారు” అని శివ ప్రసాద్ చెప్పారు.

గోపురం మరమ్మత్తులకు ప్రభుత్వం 30 వేల రూపాయలు ఇస్తుందని, మిగతా 40 వేల రూపాయలు లాటరీ టిక్కెట్ల అమ్మకం ద్వారా వసూలు చేయాలని నిర్ణయించారు. ఒక్కో లాటరీ టికెట్‌ను ఆ రోజున్న ధరల ప్రకారం ఒక రూపాయిగా నిర్ణయించారని ఆయన చెప్పారు.

ప్రస్తుతం సుచింద్రం వట్టపల్లి మఠం వైద్యుడు శివప్రసాద్ తండ్రి కలమేశ్వర శర్మ ఆయుర్వేదంలోనూ నిపుణుడు. వాళ్లు కేరళలోని వైకుం ప్రాంతానికి చెందినవారు.

లాటరీ టిక్కెట్లు అమ్మాలనే ఆదేశాలను నాటి రాజు మలయాళంలోనే ఇచ్చారు.

అయితే ఎన్ని లాటరీ టిక్కెట్లు అమ్మారు, లాటరీలో ఎవరు గెలిచారనే దానిపై ఎలాంటి సమాచారం లేదని ఏకే పెరుమాళ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)