ఉద్యోగానికి దరఖాస్తు చేసేటప్పుడు ‘ఎక్స్‌పెక్టెడ్ శాలరీ’ ఎలా అడగాలి? కంపెనీ ప్రతిపాదించే ‘శాలరీ రేంజ్’ను ఎలా అర్థం చేసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో నివసిస్తున్న మ్యారీ (పేరు మార్చాం) అక్టోబర్‌లో ఒక పెద్ద బహుళ జాతీయ కంపెనీలో ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు కావాల్సిన అన్ని అర్హతలు ఆమెకు ఉన్నాయి.
దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. ఈ ఉద్యోగం కోసం మీకెంత జీతం కావాలని కూడా కంపెనీ అడిగింది. దీనిలో కనిష్ఠ వేతనం నుంచి గరిష్ఠ వేతన పరిధి(శాలరీ రేంజ్)ని ప్రకటించింది.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు దానిలో గరిష్ఠ వేతన పరిమితికి దగ్గరగా వేతనాన్ని కోరినట్లు బీబీసీ వర్క్‌లైఫ్ ప్రతినిధి ఎమిలీ మెక్‌క్రారీ-రూయిజ్-ఎస్పార్జాకు మ్యారీ చెప్పారు.
కానీ, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఆమె అప్లికేషన్ తిరస్కరణకు గురైనట్లు ఈమెయిల్ వచ్చింది.
అదే కంపెనీలో రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే పరిచయమున్న ఒక వ్యక్తి ద్వారా తన అప్లికేషన్ ఎందుకు తిరస్కరణకు గురైందో మ్యారీకి తెలిసింది.
తాను అడిగిన వేతనం చాలా ఎక్కువగా ఉందని, అందుకే అప్లికేషన్ రిజక్ట్ చేశారని మ్యారీ చెప్పారు. గరిష్ఠ పరిమితికి దగ్గర్లో వేతనాలు అడిగే వారి కంటే తక్కువ వేతనాలు అడిగే వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీ భావించిందని తెలిపారు.
దీని కోసం కంపెనీ ఒక ఆల్గారిథాన్ని ఏర్పాటు చేసింది. మ్యారీ లాగా ఎక్కువ వేతనాలు అడిగే అప్లికేషన్లను తిరస్కరించేలా ఈ ఆల్గారిథం పనిచేయనుంది.

ఫొటో సోర్స్, Getty Images
కంపెనీలు మోసం చేస్తున్నాయా?
నోయిడాలో ఉండే కంటెంట్ రైటర్ పవన్ కుమార్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఎన్నో కంపెనీలకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటూ వచ్చానని, చాలా సార్లు తన అప్లికేషన్ వెంటనే తిరస్కరించే వారని పవన్ కుమార్ బీబీసీ ఉద్యోగి ఆదర్ష్ రాథోడ్‌కి చెప్పారు.
‘‘అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎందుకు ఇలా అవుతుందో తొలుత నాకసలు అర్థం కాకపోయేది. టెస్ట్‌కు లేదా ఇంటర్వ్యూకు పిలవకుండానే నా అప్లికేషన్‌ను తిరస్కరించేవారు. ఆ తర్వాత, నేనడిగే జీతం వల్లే ఇలా జరుగుతుందని అర్థమైంది. ఎక్స్‌పెక్టెడ్ శాలరీ(మీరు అంచనా వేస్తున్న జీతం ఎంత) కారణం వల్లనే నా దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తెలుసుకున్నాను’’ అని పవన్ కుమార్ తెలిపారు.
‘‘లింక్డిన్‌లో ఒక కంటెంట్ కంపెనీ ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల శాలరీ రేంజ్‌లో ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. రూ.10 లక్షలు జీతం అడుగుతూ దరఖాస్తు పెట్టుకున్నప్పుడు నా అప్లికేషన్ తిరస్కరించారు. కానీ, నెల తర్వాత అదే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ, ఈసారి నేను దరఖాస్తు చేసుకునేటప్పుడు రూ.8 లక్షల జీతాన్ని మాత్రమే అడిగాను. దీంతో టెస్ట్‌కు పిలిచారు’’ అని పవన్ చెప్పారు.
ఈ రంగంలో పనిచేసే చాలా మందికి ఇది జరుగుతుందన్నారు. కంపెనీలు అంత వేతనం ఇవ్వనప్పుడు ఎందుకిలా చెబుతాయో అర్థం కావడం లేదన్నారు.
శాలరీ రేంజ్‌ను చెప్పడం ద్వారా కంపెనీలు ఎలాంటి నేరాన్ని చేయడం లేదని ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ జాపియర్‌లో రిక్రూటింగ్ మేనేజర్‌గా పనిచేసే బొన్నీ డిల్బర్ బీబీసీ వర్క్‌లైఫ్‌తో అన్నారు. ఉద్యోగానికి సంబంధించిన ‘శాలరీ రేంజ్’ను అభ్యర్థులు అర్థం చేసుకోనప్పుడు తామేం చేయలేమని చెప్పారు.
‘‘ఒక ఉద్యోగానికి సంబంధించి వేతన పరిధి 70 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల మధ్యలో ఉంటే, ఆ పోస్టులో చేరే వ్యక్తిని 85 వేల డాలర్లకు నియమించుకుంటామని అర్థం. మిగిలిన మొత్తం బోనస్, ఇంక్రిమెంట్ రూపంలో ఉద్యోగులకు అందుతుంది. అలా లక్ష డాలర్ల వరకు పొందవచ్చు’’ అని ఆమె వివరించారు.
‘‘గరిష్ఠ వేతన పరిధి లక్ష డాలర్లు అంటే, కొత్త ఉద్యోగి కంపెనీలో చేరగానే లక్ష ఇస్తామని కాదు. మీరు దరఖాస్తు చేసుకుంటున్న పోస్టుకు గరిష్ఠంగా లక్ష డాలర్ల వరకు మీరు పొందగలరని అర్థం’’ అని తెలిపారు.
ఉద్యోగులందరూ గరిష్ఠ పరిమితిని పొందరు. బాగా ప్రతిభ చూపించిన ఉద్యోగులు మాత్రమే గరిష్ఠ వేతనాన్ని పొందుతారని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వేతన పరిధి విషయంలో ఉన్న చట్టాలేంటి?
అమెరికాలో 2020 నుంచి పలు రాష్ట్రాల్లో వేతన పరిధి కోసం కొన్ని చట్టాలను తీసుకొచ్చారు. దీని ద్వారా వేతనాల విషయంలో పారదర్శకతను తీసుకురావాలని భావించారు. ఈ చట్టాల కింద, ఒక ఉద్యోగానికి ఎంత జీతం ఇవ్వనున్నారో కంపెనీలు తప్పనిసరిగా తెలియజేయాలి.
ఇది ఉద్యోగ అభ్యర్థులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ పోస్టుకు ఎంత జీతం ఇస్తారో అభ్యర్థులకు ముందే తెలుస్తుంది. ఇలా చేయడం ద్వారా టెస్ట్ లేదా ఇంటర్వ్యూ తర్వాత జరిగే వేతన చర్చలలో సమయం వృథా కాకుండా ఉంటుంది.
కానీ, ఈ చట్టాలు కంపెనీలకు, ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు అసౌకర్యవంతంగా ఉన్నాయి.
‘‘రిక్రూట్ చేసుకునే ముందే వేతన పరిధి తెలియజేయడం ద్వారా, ఆ సంస్థల ప్రత్యర్థులు అంతకంటే ఎక్కువ జీతంతో అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయని 44 శాతం కంపెనీలు భావిస్తున్నాయి’’ అని జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ జిప్‌రిక్రూటర్ సర్వేలో వెల్లడైందని బీబీసీ వర్క్‌లైఫ్ తెలిపింది.
ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను కూడా కంపెనీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. తొలుత ఎంతో కొంత వేతన పరిధితో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత వారికి నచ్చిన వేతనాలను చెల్లిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అస్పష్టత, గందరగోళం
ఉద్యోగ ప్రకటన జారీ చేసినప్పుడు ఇచ్చే వేతన పరిధి వివరాలు స్పష్టంగా ఉండడం లేదని వాషింగ్టన్ డీసీలో సొంతంగా రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న కార్పొరేట్ మాజీ రిక్రూటర్ క్రిస్టెన్ గ్రెగ్స్ బీబీసీ వర్క్‌లైఫ్‌కి చెప్పారు.
ఈ కారణం వల్ల వేతన విషయానికి సంబంధించిన సమాచారం విషయంలో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు.
‘‘కేవలం చట్టపరమైన నిబంధనలను అనుసరించేందుకు మాత్రమే వ్యాపార ప్రకటనలో వేతన పరిధి వివరాలను కంపెనీలు ఇస్తున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తున్నాయి’’ అని గ్రెగ్స్ చెప్పారు.
‘‘వేతన పరిధిని సరిగ్గా వివరించనప్పుడు మొత్తంగా పే స్కేల్ ఎంతో తెలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అధిక వేతనం ఉద్యోగాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. కానీ, ఈ గందరగోళానికి ఒకటే పరిష్కారం.. నియమించుకునే అభ్యర్థికి కంపెనీ ఎంత వేతనం ఇవ్వాలనుకుంటుందో స్పష్టంగా తెలియజేయాలి’’ అని క్రిస్టెన్ గ్రెగ్స్ అన్నారు.
‘హైరింగ్’, ‘ఫుల్ పే స్కేల్’ రెండూ భిన్నమైన అంశాలు. వేతన పరిధి(శాలరీ రేంజ్ లేదా హైరింగ్ రేంజ్) అంటే.. కొత్తగా నియమించుకునే అభ్యర్థులకు కనిష్ఠం నుంచి గరిష్ఠంగా వేతనం ఇస్తారో తెలియజేయడం.
ఫుల్ పే స్కేల్ అంటే.. ఈ పోస్టుకు గరిష్ఠంగా ఎంత వేతనం పొందుతారో స్పష్టంగా తెలియజేయడం.

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారమేంటి?
ఉద్యోగ ప్రకటన ఇచ్చేటప్పుడు అత్యధిక వేతనాన్ని చెప్పి, తక్కువ జీతాన్ని ఇవ్వడం అన్నివేళలా తప్పు కాదని చండీగడ్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసే నవీన్ ఠాకూర్ చెప్పారు.
‘‘దీనికి మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అనుభవానికి కాకుండా నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే రంగాలు చాలా ఉన్నాయి. తక్కువ అనుభవం ఉన్న వారు ప్రతిభ సంగతి పక్కన పెట్టి తక్కువ జీతాన్నిఆశిస్తారు. కానీ, వారు ఇతర అభ్యర్థుల కంటే మెరుగ్గా ఉంటారు. అలాంటి సమయంలో, నిర్దేశిత పరిధి కంటే అత్యధిక వేతనాన్ని వారికి ఇస్తారు’’ అని నవీన్ ఠాకూర్ వివరించారు.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు, హైరింగ్ రేంజ్ కాకుండా ఫుల్ పే స్కేల్ తెలుసుకోవాలని జాపియర్ బొన్నీ డిల్బర్ చెప్పారు.
కంపెనీలు, ఇతర ఎంప్లాయర్స్ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.
‘‘ఉద్యోగులను ఆహ్వానించేటప్పుడు హైరింగ్ రేంజ్ కాకుండా.. ఫుల్ పే స్కేల్ గురించి సమాచారం ఇవ్వాలనుకుంటే, దాన్ని స్పష్టంగా చెప్పాలి’’ అని చెప్పారు.
‘‘ఒకవేళ ఉద్యోగాన్ని కొట్టాలనుకుంటే, నేను గరిష్ఠ పరిధికి దగ్గరగా ఉన్న జీతంతో ఉద్యోగాన్ని సంపాదించను. ఎందుకంటే, ఆ తర్వాత నాకెలాంటి గ్రోత్ ఉండదు’’ తెలిపారు.
పవన్ కూడా ఇదే రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
‘‘ఉదాహరణకు.. నాకు రూ.10 లక్షల జీతం కావాలనుకుంటే, రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో జీతమిచ్చే ఉద్యోగానికి కాకుండా.. రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో వేతనాన్ని ఆఫర్ చేసే ఉద్యోగానికి నేను దరఖాస్తు చేస్తాను’’ అని చెప్పారు.
తాను కూడా తనకెంత కావాలో తొలుత అప్లికేషన్‌లో చెప్పకుండా ఉంటే బాగుండేదని మ్యారీ చెప్పారు.
కంపెనీలు ఆఫర్ చేసిన రేంజ్‌కు మధ్యలో వేతనాన్ని కోరి ఉంటే, తన అప్లికేషన్ తిరస్కరణకు గురి కాకుండా ఉండేదని బీబీసీ వర్క్‌లైఫ్‌కి మ్యారీ చెప్పారు.
ఇవి కూడా చదవండి
- దిల్లీ: వాయు కాలుష్యంతో దేశంలో ప్రతియేటా 20 లక్షలకు పైగా మరణాలు... గాలిని శుభ్రం చేయాలనే 40 ఏళ్ల ఆరాటంతో సుప్రీం కోర్టు పొరపాట్లు చేసిందా?
- గాజా, యుక్రెయిన్ కాకుండా ఈ భూమ్మీద ఇంకెన్ని యుద్ధాలు జరుగుతున్నాయో మీకు తెలుసా?
- ఉజ్బెకిస్తాన్ అమ్మాయిలను అక్రమంగా భారత్‌కు తరలించి బలవంతంగా సెక్స్‌వర్కర్లుగా మార్చేస్తున్నారు...
- ప్రపంచంలోనే అతి ‘దీన ఏనుగు’ చివరకు ఎలా కన్ను మూసిందంటే....
- చైనా పిల్లల్లో వ్యాపిస్తున్న ఈ వ్యాధి ఏమిటి ? భారత్‌కు ఎంత ప్రమాదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














