ఒంట్లోని రోగాల గురించి చిగుళ్లు ఏం చెబుతాయి?

దంత వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలా మంది చిగుళ్ల వ్యాధులను సాధారణ విషయంగా పరిగణిస్తారు

డెంటిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు మీరు మామూలుగా దంతాల ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు. నోటికి సంబంధించిన మిగతా అంశాలను మర్చిపోతారు.

మీరు ఇలా చేస్తున్నారంటే మీరు విలువైన సమాచారాన్ని కోల్పోతున్నారన్నమాట.

నోటి ఆరోగ్యాన్ని సులభంగా అంచనా వేయవచ్చు. పైగా మీ శరీరంలో ఏం జరుగుతుందో అత్యంత కచ్చితంగా నోటి ఆరోగ్యం ద్వారా తెలుసుకోవచ్చు.

అంతకుమించి మీ శరీరాన్ని సరైన స్థితిలో ఉంచుకునే విషయంలో నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కీలకం.

‘‘కంటి నుంచి రక్తం కారుతుంటే మీరు పట్టించుకోకుండా ఉంటారా? మరి చిగుళ్ల నుంచి రక్తం వస్తే ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు’’ అంటూ యూకే అడ్వర్టైజ్‌మెంట్లలో చెబుతుంటారని లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ఆఫ్ డెంటిస్ట్రీ డైరెక్టెర్ ప్రొఫెసర్ నికాస్ డోనస్ తెలిపారు.

‘‘తీవ్రమైన చిగుళ్ల వ్యాధితో జీవితాన్ని గడిపే వారున్నారు. పైగా ఈ వ్యాధులు సాధారణమని వారు నమ్ముతుంటారు’’ అని బీబీసీతో నికాస్ చెప్పారు.

చిగుళ్ల వ్యాధులకు డయాబెటిస్, కరోనరీ గుండె వ్యాధులకు సంబంధం ఉన్నట్లుగా నిరూపించే అనేక ఆధారాలు ఉన్నాయి.

ఈ వ్యాధులపై పోరాటంలో విస్మరిస్తున్న పెద్ద అంశం నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని చాలా అధ్యయనాల్లో తేలింది.

‘‘వివిధ దీర్ఘకాలిక వ్యాధులు, శరీరంలోని ఇతర భాగాలకు నోటికి ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు చిగుళ్ల వ్యాధుల ప్రభావం గురించి బయటపడుతుంది.

మానవాళిలో చిగుళ్ల వ్యాధి అనేది ఆరో అత్యంత సాధారణ దీర్ఘకాలిక వ్యాధి. ప్రపంచంలోని 101 కోట్ల మంది అంటే జనాభాలో 11.2 శాతం మంది చిగుళ్ల వ్యాధుల బారిన పడ్డారు’’ అని నికాస్ తెలిపారు.

దంత వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

చిగుళ్ల వ్యాధులు

చిగుళ్ల వ్యాధులు లేదా పీరియడాంటైటిస్ అనేది చిగుళ్లకు వచ్చే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ అని దానివల్ల దంతాల చుట్టూ ఉండే సున్నితమైన టిష్యూ ప్రభావితం అవుతుందని అమెరికాలోని మయో క్లినిక్ పేర్కొంది.

‘‘పీరియడాంటైటిస్‌కు చికిత్స తీసుకోకుంటే దంతాలకు మద్దతుగా ఉండే ఎముక నాశనం అవుతుంది. ఫలితంగా పళ్లు వదులవుతాయి లేదా ఊడిపోతాయి’’ అని చెప్పింది.

చిగుళ్ల నుంచి రక్తం రావడం, ఎర్రబారడం, నొప్పి, దుర్వాసన వంటివి పీరియడాంటైటిస్ సాధారణ లక్షణాలు.

టైప్2 డయాబెటిస్‌కు చిగుళ్ల వ్యాధులకు సంబంధం ఉన్నట్లు అనేక ఆధారాలు ఉన్నాయి.

‘‘నిజానికి పీరియడాంటల్ వ్యాధులు ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ రోగులకు కూడా పీరియడాంటల్ వ్యాధి ఉంటుంది’’ అని నికాస్ చెప్పారు.

నోటికి, డయాబెటిస్‌కు మధ్య సంబంధం ఉందని యూకేలోని సాలిస్‌బరీ హాస్పిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ గ్రాహం లాయిడ్ జోన్స్ చెప్పారు.

‘‘మనం నోటిని రోగనిరోధక అవయవంగా చూడాలి. నోటి ఆరోగ్యం విషయంలో రాజీ పడితే సాధారణంగా నోటిలో నివసించే బ్యాక్టీరియా శరీరంలోని ఇతర భాగాలకు వెళుతుంది. ఈ బ్యాక్టీరియాలు చాలా వ్యాధులకు కారణం అవుతాయి. ఉన్న వ్యాధులను మరింత అధ్వానంగా మార్చుతాయి’’ అని ఆయన హెచ్చరించారు.

దంత వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

నోటి నుంచి గుండె వరకు..

చిగుళ్ల వ్యాధితో టైప్‌2 డయాబెటిస్‌కు మాత్రమే కాకుండా ఇతర వ్యాధులకు కూడా సంబంధం ఉంటుంది.

పీరియడాంటైటిస్ బ్యాక్టీరియా, రక్తం ద్వారా శరీరం అంతటా ప్రయాణిస్తుంది. చివరకు అది గుండెపై ప్రభావం చూపుతుంది.

‘‘పీరియడాంటైటిస్ కారణంగా ఇన్‌ఫ్లమేటరీ కాంపోనెంట్స్ రక్తంలో చేరి ఫ్లేక్స్‌ను ఏర్పరుస్తాయి. ఈ ఫ్లేక్స్ వల్ల రోగుల్లో గుండె బలహీనపడటం నుంచి గుండె పోటు వంటి సమస్యలు తలెత్తుతాయి’’ అని నికాస్ డోనస్ అన్నారు.

ఏదైనా ఒక ఇమ్యూన్ డిసీజ్ కారణంగా లేదా డ్రగ్ వాడకం వల్ల నోటి రక్షణ వ్యవస్థ బలహీనంగా మారినప్పుడు ఎండోకార్డైటిస్ అనే ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ ప్రబలుతుంది.

‘‘ఇది చాలా అరుదైన వ్యాధి. దీనివల్ల గుండె అంతర్గత కణజాలాలు ప్రభావితం అవుతాయి’’ అని డాక్టర్ లాయిడ్ జోన్స్ వివరించారు.

‘‘నోటి మార్గం ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు పాతోజెన్స్ (బ్యాక్టీరియా) వెళ్తాయనేది స్పష్టమైంది. క్రమంగా నోటి నుంచి వెళ్లిన ఈ బ్యాక్టీరియా రక్తం ద్వారా మిగతా శరీర భాగాలకు చేరుకుంటుంది. ఇది ఇతర వ్యాధులకు దారి తీయవచ్చు లేదా ఉన్న వ్యాధుల్ని మరింత తీవ్రంగా మార్చవచ్చు’’ అని చెప్పారు.

దంత వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వృద్ధాప్యంలో 21 దంతాలను కలిగి ఉంటే మేధోపర క్షీణత తక్కువగా ఉంటుందని కొందరు డాక్టర్లు చెబుతున్నారు

మేధోపరమైన క్షీణత వస్తుందా?

ముసలితనంలో మేధోపర క్షీణతకు ఈ బ్యాక్టీరియాకు సంబంధం ఉండొచ్చని కొందరు పరిశోధకులు అంటున్నారు. అయితే డయాబెటిస్, గుండె వ్యాధులకు ఉన్నట్లుగా నోటితో మేధోపర క్షీణతకు సంబంధించి బలమైన ఆధారాలు లేవు.

వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు ఒక వ్యక్తిలో 21 లేదా అంతకంటే ఎక్కువ దంతాలు ఉన్న వారికంటే, 21 కంటే తక్కువ దంతాలు ఉన్నవారిలో మేధోపర క్షీణత ఎక్కువ ఉన్నట్లు తన అధ్యయనాల్లో డాక్టర్ వివాన్ షా స్పష్టం చేశారు.

‘‘ఇది ఇటీవలి అధ్యయనం. అయితే ఆలోచనాశక్తి లోపిస్తే పళ్లు తోముకోవడం, ఫ్లాస్ చేసే సామర్థ్యాలు ప్రభావితం అవుతాయని చెప్పగలం.

ఇది పోషకాహారానికి సంబంధించినది కూడా. తక్కువ దంతాలు ఉంటే అన్ని రకాల ఆహారాలు తీసుకోలేరు. ఇది అంతిమంగా ఆలోచనా శక్తి తగ్గడానికి దారి తీస్తుంది’’ అని షా అన్నారు.

చిగుళ్ల వ్యాధులు రావడానికి, తీవ్రతరం కావడానికి కొన్ని నిర్దిష్ట జీవులకు మధ్య సంబంధం ఉందని లాయిడ్ జోన్స్ అన్నారు.

‘‘జింజివాలిస్ అనేది ఒక ప్రత్యేక, ఆసక్తికర జీవి. నరాల్లోని కణాలను చంపే న్యూరోటాక్సిన్లతో ఈ జీవి కప్పబడి ఉంటుంది. ఈ జీవి నోటిలో ఉండటమే కాకుండా ఎర్రబారిన చిగుళ్ల నుంచి శరీరంలోకి వెళ్తుంది. అల్జీమర్స్ ఉన్నవారిలో మెదడు, సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్‌లో ఇది కనిపిస్తుంది’’ అని లాయిడ్ చెప్పారు.

నోటికి, శరీరంలోకి ఇతర వ్యవస్థలకు ఉన్న సంబంధాలు పీరియడాంటల్ వ్యాధిని ఆరంభంలోనే నివారించడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతాయి.

దంత వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

నోటి సంరక్షణ

‘‘నోటి వ్యాధులన్నింటినీ నివారించగలం, కొంతవరకు చికిత్స అందించగలం. అయితే నోటి క్యాన్సర్ ఇందుకు మినహాయింపు. ఇది పూర్తిగా భిన్నమైనది’’ అని డోనస్ అన్నారు.

దంతవైద్యం, మెడిసిన్‌ను మరింత ఏకీకృతం చేయడం ద్వారా వైద్యులు, దంతాలను మాత్రమే పరీక్షీంచకుండా శరీరం మొత్తాన్ని ఒక వ్యవస్థగా పరిగణించి చికిత్స అందించగలరు అని చెప్పారు.

ఈ స్పెషాలిటీ వైద్య కలయికకు ప్రినేటల్ కేర్ ఒక మంచి ఉదాహరణ. గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా నోటిలోని బ్యాక్టీరియా శక్తిమంతం కాగలదు. తల్లిని, బిడ్డను ప్రమాదంలోకి నెట్టగలదు అని షా అన్నారు.

‘‘నెలలు నిండకుండానే పిల్లలు జన్మించడం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటి ప్రమాదాలను ఇది పెంచుతుంది. అందుకే తల్లులతో మాట్లాడటం, వారికి సరైన సంరక్షణ అందించడం చాలా కీలకం’’ అని చెప్పారు.

నోటి ఆరోగ్యం విషయంలో మన ఆలోచన మార్చుకోవడం చాలా ముఖ్యమని లాయిడ్ జోన్స్ అన్నారు.

మన నోటిలో ఉండే ఆరోగ్యకర సూక్ష్మజీవులను కాపాడటానికి నోటి సంరక్షణ పద్ధతులను అనుసరించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి: