హెచ్‌డీ110067: గ్రహాంతర జీవుల కోసం వెతుకుతుంటే కనిపించిన 'కొత్త సౌర వ్యవస్థ' ఎలా ఉంది?

ఫొటో సోర్స్, THIBAUT ROGER/NCCR PLANETS
- రచయిత, పల్లబ్ ఘోష్
- హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్
మనకు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పరిపూర్ణ సౌర వ్యవస్థని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇది ఎలాంటి ఘర్షణలు, పేలుళ్లు లేకుండా ఏర్పడిందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ సౌర వ్యవస్థలో ఒకే పరిమాణంలోని ఆరు గ్రహాలున్నాయి. 1,200 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సౌర వ్యవస్థలోని గ్రహాల పరిమాణంలో ఎలాంటి మార్పు జరగలేదు.
ఈ సౌర వ్యవస్థలో ఘర్షణలు లేకపోవడం వల్ల ఇలా ఉంది, వాటిపై జీవం ఉండొచ్చా లేదా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇది శాస్త్రవేత్తలకు మంచి అవకాశాన్ని అందిస్తుంది.
ఈ అధ్యయనం సైంటిఫిక్ జర్నల్ నేచర్‌లో ప్రచురితమైంది.
మన సౌరకుటుంబం అనేక విస్ఫోటనాల అనంతరం ఏర్పడింది. గ్రహాలు ఏర్పడగానే అవి ఒకదానికొకటి ఢీకొన్నాయి. వాటి కక్ష్యలకు అంతరాయం కలిగింది. దీంతో భూమి వంటి చిన్న గ్రహాలు బృహస్పతి, శని వంటి భారీ గ్రహాలతో కలిసి తిరుగుతున్నాయి.
గ్రహాంతర జీవుల కోసం జరిగిన అన్వేషణలో ఖగోళ శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న ఈ సౌర వ్యవస్థకు హెచ్‌డీ110067 అని పేరు పెట్టారు.
ఈ గ్రహాలు మన సౌర వ్యవస్థలోని గ్రహాల మాదిరి కాకుండా కలిసి తిరుగుతాయి. ఒక నక్షత్రాన్ని అత్యంత లోపలి గ్రహం మూడుసార్లు చుట్టే సమయంలో, తదుపరి గ్రహం రెండుసార్లు కక్ష్యలో తిరుగుతుంది.

ఫొటో సోర్స్, MARK GARLICK/SCIENCE PHOTO LIBRARY
ఈ గ్రహాలు కదులుతున్న విధానం చాలా కచ్చితమైనది. పరిశోధకులు ఈ గ్రహాల కదలికలను మ్యూజికల్ బిట్‌గా మార్చారు.
ఇది ప్రముఖ మ్యుజీషియన్ ఫిలిప్ గ్లాస్ కంపోజిషన్ మాదిరి ఉంది. ఈ సంగీత సృష్టిలో స్వరాలు, లయలు ఒక్కో గ్రహానికి సరిపోతాయి, అవి కక్ష్యలోకి రావడానికి ఎంత సమయం పడుతుంది, గ్రహాల కదలికలు సంగీతంలోకి ఎలా అనువదించారో తెలుసుకోవడానికి మీరు ఈ ప్రత్యేకమైన మ్యూజికల్ బిట్ విని అర్థం చేసుకోవచ్చు.
'అధ్యయనం చేయడానికి ఇది సరైనది'
హెచ్‌డీ110067ని "పరిపూర్ణ సౌర వ్యవస్థ"గా అభివర్ణించారు షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రాఫెల్ లుక్.
"గ్రహాలు ఎలా ఏర్పడతాయో అధ్యయనం చేయడానికి ఇది సరైనది, ఎందుకంటే మన సౌర వ్యవస్థ మాదిరి అస్తవ్యస్త ప్రారంభాలు లేవు, ఘర్షణలు లేవు" అని రాఫెల్ చెప్పారు.
ఈ నిర్మాణం అందమైనదని, ప్రత్యేకమైనదని యూనివర్శిటీ ఆఫ్ వార్విక్‌కి చెందిన డాక్టర్ మెరీనా లాఫుర్కా-మాక్రో అన్నారు.
"ఇంతకుముందు ఎవరూ చూడని దాన్ని చూడటం చాలా ఉత్సాహంగా ఉంది'' అని మాక్రో బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, WALTER MYERS/SCIENCE PHOTO LIBRARY
ఈ సౌర వ్యవస్థ ఎందుకంత ప్రత్యేకం?
గత 30 ఏళ్లలో ఖగోళ శాస్త్రవేత్తలు వేల సౌర వ్యవస్థలను కనుగొన్నారు. కానీ గ్రహాలు ఎలా ఏర్పడతాయో అధ్యయనం చేయడానికి వాటిలో ఏవీ అంతగా ఉపయోగపడలేదు.
ఖగోళ శాస్త్రవేత్తలకు కావాల్సింది గ్రహాల ఏకరీతి పరిమాణం, సౌర వ్యవస్థలో ఘర్షణలేని స్వభావం.
ఎందుకంటే వాటిని పోల్చడం, వ్యత్యాసం పరిశీలించడం సులభం. అవి ఎలా వచ్చాయి, ఎలా అభివృద్ధి చెందాయో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
ఈ సౌర వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కూడా ఉంది. ఇది గ్రహాల జీవ సంకేతాల కోసం వెతికే పని సులభం చేస్తుంది.
ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఆరు కొత్త గ్రహాలను "సబ్-నెప్ట్యూన్స్" అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రహాలు భూమి కంటే పెద్దవి, నెప్ట్యూన్ కంటే చిన్నవి (ఇది భూమి కంటే 4 రెట్లు వెడల్పుగా ఉంటుంది).
కొత్తగా కనుగొన్న ఈ ఆరు గ్రహాలు భూమి కంటే రెండు, మూడు రెట్లు పెద్దవి. ఈ సెప్టెంబర్ నెలలో వేరే నక్షత్ర వ్యవస్థలోని కే2-18బీ గ్రహానికి సంబంధించి ఒక కొత్త ఆవిష్కరణ కనుగొన్నారు.
భూమిపై ఉండే జీవం ఉత్పత్తి చేసే వాయువుతో కూడిన వాతావరణం ఆ గ్రహంపై ఉందని కనుగొన్నప్పటి నుంచి కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి పెరిగింది. ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని బయో సిగ్నేచర్ అని పిలుస్తారు.

ఫొటో సోర్స్, NASA
ఎప్పటిలోగా ఫలితాలు రావొచ్చు?
మన సౌర వ్యవస్థలో సబ్-నెప్ట్యూన్లు లేనప్పటికీ, వాటిని గెలాక్సీలో అత్యంత సాధారణ రకం గ్రహాలుగా పరిగణిస్తారు.
ఖగోళ శాస్త్రవేత్తలకు వీటి గురించి చాలా తక్కువ తెలుసు. ఆ గ్రహాలు రాయి, వాయువు లేదా నీటితో తయారయ్యాయా, అవి జీవి మనుగడకు ఉపయోగపడుతాయా అనేవి తెలియదు.
ఇవన్నీ కనుగొనడం ఈ రంగంలో అత్యంత ఉత్సాహకర విషయాలలో ఒకటని డాక్టర్ రాఫెల్ చెప్పారు. HD110067 ఆవిష్కరణ ఈ ప్రశ్నలన్నింటికీ తొందర్లోనే సమాధానం ఇవ్వడానికి తమ బృందానికి సరైన అవకాశాన్ని ఇస్తుందన్నారు. పదేళ్లలోపు దీనిపై సమాధానం చెబుతామని ఆయన బీబీసీతో అన్నారు.
"మాకు గ్రహాలు తెలుసు, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసు, కొంచెం సమయం కావాలి, కానీ అది జరుగుతుంది" అని రాఫెల్ తెలిపారు.
శాస్త్రవేత్తల బృందం తదుపరి రౌండ్ పరిశీలనల్లో ఈ సబ్-నెప్ట్యూన్‌లలో జీవం ఉండటానికి సరిపోలే వాతావరణాలున్నాయని తేలితే, అలాంటి గ్రహాల సంఖ్య ఇంకా పెరుగుతుంది.
ఈ ఆరు కొత్త గ్రహాలలో ఒకదానిపై బయోసిగ్నేచర్‌లను కనుగొనే ప్రయత్నం ఇప్పుడు కొనసాగుతోంది.
మెరుగైన సామర్థ్యాలు, కొత్త టెలిస్కోప్‌ల బ్యాటరీతో, ఆ క్షణం కోసం మనం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదని చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
నాసా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఈఎస్ఎస్), ఈఎస్ఏ క్యారెక్టరైజేషన్ ఎక్సోప్లానెట్ శాటిలైట్ (Cheops) ఉపయోగించి ఈ గ్రహాలను కనుగొన్నారు.
ఇవి కూడా చదవండి:
- కైలాస: 'నిత్యానంద దేశం'తో ఒప్పందం కుదుర్చుకున్న పరాగ్వే అధికారిపై వేటు, అసలేం జరిగిందంటే...
- హిట్లర్ పర్సనల్ లైఫ్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన 'వీడియో'
- చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
- నాజీల క్యాంప్ గార్డుగా పని చేసి, వేల హత్యలకు బాధ్యుడైన 101 ఏళ్ళ వృద్ధుడికి అయిదేళ్ళ జైలు శిక్ష
- హిట్లర్‌కు సన్నిహితులైన గోబెల్స్ దంపతులు తమ ఆరుగురు పిల్లలతో పాటు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















