సీఎం రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఇవే.. ఎడిటర్స్ కామెంట్

- రచయిత, జీఎస్. రామ్మోహన్
- హోదా, బీబీసీ తెలుగు ఎడిటర్
కర్ణాటకలో సిద్ధరామయ్య కాంగ్రెస్‌లో చేరిన ఏడేళ్లకు ముఖ్యమంత్రి అయితే రేవంత్ ఆరేళ్లలోనే సీఎం అయ్యారు.
ఇంతకీ తెలంగాణ రెండో ముఖ్యమంత్రి, లేదా తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లేమిటి? ముఖ్యమంత్రి పదవిని లక్ష్యం చేసుకుని వ్యూహాత్మకంగా, పట్టుదలగా అడుగులు వేసి ఇవాళ ఎవరూ ఊహించని రీతిలో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సవాళ్లను కూడా అదే చతురతతో ఎదుర్కోగలరా? అదే పట్టుదలతో బండి నడిపించగలరా?
ఇంతకీ కొత్త ముఖ్యమంత్రికి ఏఏ సవాళ్లు ఎదురుకావొచ్చు, ఆయన ముందు ఏఏ ఆప్షన్స్ ఉండొచ్చు అనేవి ఇప్పుడు చూద్దాం.
బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు జనంలోకి చొచ్చుకుపోవడం వల్ల అక్కడ వారిని మించి హామీలిచ్చారు. ప్రజల్లో అంచనాలు అమాంతంగా పెంచేశారు. నిలబెట్టుకోవడానికి రేవంత్ ప్రభుత్వం చాలా కష్టపడాల్సి ఉంటుంది.

1) ఇంటిపోరు
కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి అంత సులభం కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎదుర్కొనే మొదటి సమస్య ఇంటిపోరు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా అయితే ఆ రోజు ప్రచారంలో ముందుండి, పార్టీని భుజాల మీద వేసుకుని నడిపించారో.. ఇవాళ రేవంత్ కూడా అలాంటి పాత్ర పోషించారు.
అందువల్లే డిప్యూటీ సీఎం విషయంలోనో, మంత్రుల విషయంలోనో జరిగినంత చర్చ సీఎం విషయంలో లేదు. ఏదో పోటీపడాలి కాబట్టి పోటీపడడం తప్పితే మిగిలిన పోటీదారులెవరికీ గట్టిగా ఆశ ఉండే అవకాశం లేదు. ఆంగ్ల వాడుకలో చెప్పుకుంటే కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సిఎం అనేది రైటింగ్ ఆన్ ది వాల్ అలనాటి వైఎస్ లాగే.
ఈ విషయంలో నాటి వైఎస్‌కు, ఇవాళ్టి రేవంత్ పోలికతో పాటు తేడా కూడా ఉంది. వైఎస్ కాంగ్రెస్ కుటుంబంలోని వ్యక్తి. సుదీర్ఘ అనుబంధమున్న వ్యక్తి. మెట్టుమెట్టు అక్కడే నిర్మించుకుని రెండు దశాబ్దాలు వెయిట్ చేసి మరీ సాధించిన వ్యక్తి.
అయితే, రేవంత్ పరిస్థితి అది కాదు. కొందరి దృష్టిలో ఆయన అవుట్‌సైడర్. కాంగ్రెస్‌లో కెరీర్ ఆరేళ్లే. తెలుగుదేశం అస్తిత్వం తెలంగాణలో ప్రశ్నార్థకమైన వేళ ఇండిపెండెంట్ లాంటి ప్రయత్నం చేసి దాని వల్ల ఫలితముండదని తెలిసి కాంగ్రెస్ తీర్థం తీసుకున్న మనిషి రేవంత్., అదే సమయంలో కాంగ్రెస్‌లో బాధ్యత భుజానేసుకుని కష్టపడేవారు తక్కువై, పదవులు ఆశించేవారు ఎక్కువై లోలోపల లుకలుకలాడుతున్న వేళ రేవంత్లో చురుకుదనం తనకు ఉపయోగపడుతుందని నమ్మిన పార్టీ కాంగ్రెస్. అది ఉభయ కుశలోపరి వ్యవహారం.
కాంగ్రెస్‌లో తక్కువైన 'దూకుడు' అనే వెలితిని పూరించగల నాయకుడిగా ముందుకు దూసుకువచ్చిన నాయకుడు. దూసుకుపోవడమే కాదు, అవసరం అయితే నెట్టుకుని, నెట్టేసి కూడా ముందుకుపోగలగిన స్వభావం రేవంత్‌ది. అది కాంగ్రెస్‌కు సరైన సమయంలో అందివచ్చింది.

ఫొటో సోర్స్, UGC
కొంతమంది అదృష్టం అనే పదం వాడుతూ ఉండొచ్చు. కానీ సరైన సమయంలో సరైన చోట ఉండడం అంటారే, అది సరిగ్గా రేవంత్‌కి అతికినట్టు వర్తిస్తుంది. ఊరికే ఉంటే సరిపోదు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్నీ కుదిరి ఇవాళ రేవంత్ పీఠం ఎక్కారు. మంత్రి పదవి నిర్వహించకుండానే ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు.కాంగ్రెస్‌లో పాతుకుపోయిన హేమాహేమీలను వెనక్కు నెట్టి సీఎం పీఠం సాధించిన నాయకుడు.
పార్టీలో చేరిన ఆరేళ్లకే సీఎం కావడం అనేది అక్కడ పాతుకుపోయిన నాయకులకు రుచించేది కాదు. పరిస్థితులు అలా వచ్చాయి కాబట్టి ఇప్పటికి అంగీకరించినా, భవిష్యత్తులో అదును కోసం ఎదురుచూస్తారు అనడంలో సందేహం అక్కర్లేదు. ఇది రేవంత్ ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి.
కాకపోతే ఇక్కడో చిన్న వెసులుబాటు కూడా ఉంది. అది సంస్థగా కాంగ్రెస్‌లో వచ్చిన మార్పు. గతంలో మాదిరి అసమ్మతిని సహించే స్థితిలో ఈ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం లేదు.
కేంద్రంలో తిరుగులేని ఇందిర లాంటి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రాల్లో బలమైన ఎదురులేని నాయకులు లేకుండా వాళ్లకు పోటీగా ఇద్దరో, ముగ్గురో ఎప్పుడూ పోటీపడుతూ ఉండేవారు. అధిష్టానం కావాలనే ప్రోత్సహించేదా? లేక ఊరికే చూస్తూ సహిస్తూ ఊరుకునేదా? అనే మీమాంసను పక్కనబెడితే, అలాంటి వాతావరణమైతే ఉండేది.

ఫొటో సోర్స్, Anumula Revanth Reddy/fb
సోనియా హయాంలో కూడా అలాంటి వాతావరణం కొంత ఉండినా అది బెడిసి కొట్టింది.
కేంద్రంలో తిరుగులేని నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రాల్లో అలాంటి వాతావరణం చెల్లుతుండొచ్చు. కానీ అక్కడా అంత బలమైన నాయకత్వం లేక రాష్ట్రాల్లోనూ అలాంటి ఇమేజ్ ఉన్నవారు లేకపోతే మొదటికే మోసం అనే ఎరుక కాంగ్రెస్ అధినాయకత్వానికి వచ్చినట్టే అనిపిస్తోంది.
అందువల్ల కొంతకాలంగా రాష్ట్రాల్లో నాయకత్వ సంక్షోభాల్ని, విభేదాల్ని సమర్థంగా నెట్టుకొస్తున్నారు. ఊరికూరికే ముఖ్యమంత్రును మార్చే ఆనవాయితీకి తెరవేశారు. స్థానిక నాయకులకు ఫ్రీడమ్ కూడా ఇస్తున్నట్లే కనిపిస్తోంది. అందువల్ల ఇది రేవంత్ ఇంటిపోరు ఎదుర్కోవడంలో కొంత ఉపయోగపడొచ్చు. పైగా ఆయనది దూసుకుపోయే స్వభావం.

ఫొటో సోర్స్, Anumula Revanth Reddy/fb
2) పథకాల అమలు
రెండో అతిపెద్ద సమస్య పథకాల అమలు. బీఆర్ఎస్‌ను ఓడించడానికి వారిని మించి హామీలిచ్చారు. ఆరు గ్యారంటీలే అధికం అనుకుంటే., యువతను ఆకర్షించడానికి చివరి నిమిషంలో నిరుద్యోగ భృతి, చదువుకునే ఆడపిల్లలకు ఈ-స్కూటర్ల హామీలిచ్చారు.
ఇవన్నీ అమలు చేయడానికి బడ్జెట్ నిధులు సరిపోతాయా? వీటన్నింటినీ అమలు చేస్తే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఉంటాయా అనేది పెద్ద సమస్య. ఆరు గ్యారంటీల అమలుకే దాదాపు 70 వేల కోట్లు ఖర్చుకావొచ్చని అంచనా. ఇక తర్వాత ప్రకటించిన రెండూ అమలు చేయాలంటే ఇంకెంత కావాలో. ఇప్పటికే తెలంగాణ అప్పులు భారీగా ఉన్నాయి. పైగా ఎఫ్ఆర్‌బీఎం పరిధిని దాటి అప్పలు చేయడానికి రాష్ర్టాలు రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నందున వాటిని కట్టడి చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. రాష్ర్టాల అప్పులను కట్టడి చేసే ఆలోచనలో రేవంత్ ఏ మార్గం ఎంచుకుంటారు అనేది సవాల్.
నిర్దిష్టంగా చెప్పుకుంటే రెండు లక్షల వరకూ వ్యవసాయ రుణమాఫీ తొలి సవాల్. భారీగా నిధులు అవసరమవుతాయి. . భవిష్యత్తులోనూ రుణమాఫీలు ఉంటాయని ఆశిస్తే, కట్టేవాళ్ల సంఖ్య తగ్గొచ్చు. బ్యాంకులు ఇక ముందు రుణాలిచ్చేటప్పుటు ఒకటికి, రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది.
రైతు భరోసా పేరుతో రైతు బంధుకిస్తున్న మొత్తాన్ని రూ.15 వేలకు పెంచినప్పటికీ బహుశా అందులో అదనంగా ఖర్చు ఉండకపోవచ్చు. అందులో సీలింగ్ తీసుకొచ్చే అవకాశముంది. ధనికులు, నగరాలు, పట్టణాల చుట్టూ రియల్ ఎస్టేట్ కోసం భూములు కొన్నవాళ్లకు కూడా రైతు బంధు ఎందుకు అవసరమనే విమర్శ చాలాకాలంగా ఉన్నదే.
ఇందులో పెద్ద వ్యతిరేకత కూడా రాకుండా సీలింగ్ పెట్టి ఖర్చు పెరగకుండా చూసుకోవచ్చు. కానీ, కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు? అక్కడ వచ్చే సంక్లిష్టతలను ఎలా ఎదుర్కొంటారు అనేది పరీక్షే. కౌలు రైతుకు మద్దతు అవసరమే కానీ గుర్తింపు సంక్లిష్టమవుతుంది.

మహాలక్ష్మి పథకం అంటే గ్యాస్ బండపై సబ్సిడీ ఇచ్చే పథకం ఎలాగూ పేదమహిళలకే అనొచ్చు.పేద కుటుంబాలకే అనొచ్చు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో బహుశా తెల్లకార్డులను సమీక్షిస్తున్నాం అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో కూడా అంతే. పేద మహిళలకే పరిమితం అన్నా అనొచ్చు. అందులోనూ లగ్జరీ బస్సులను మినహాయించొచ్చు. ఇందులో పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చు.
పేద కుటుంబానికి రెండొందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకోవడానికి పై శ్లాబుల్లో రేట్లు పెంచుతారా ఏం చేస్తారు అనేది తెలీదు. లేకపోతే 24 గంటలు కరెంట్ సరఫరా అవసరమా అనే వాదన కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు కాబట్టి అందులో మార్పులేమైనా ఉంటే ఉండొచ్చు. కాకపోతే కొన్ని యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అనేది ఇప్పటికే దిల్లీలోనూ, కర్నాటకలోనూ అమలవుతున్నది. మోడల్ అయితే ఉంది కాబట్టి కాస్త అటూ ఇటూ సర్దుబాట్లు ఉండొచ్చు. పెన్షన్లు సరేసరి, ఇంతకుముందున్న వాటిని విస్తరించారు.
బహుశా అన్ని పథకాలూ సమర్థంగా అమలు చేయడం కోసమంటూ భవిష్యత్తులో పేదల తెల్లకార్డులపై భారీగానే రివ్యూ చేయొచ్చు.

ఇవ్వన్నీ సరే, మరి నిరుద్యోగ భృతి ఏ ప్రాతిపదికన ఇస్తారు? ఎలా గుర్తిస్తారు? ఇది అంత సులభమైన విషయం కాదు. యువత కేసిఆర్ ప్రభుత్వం మీద అసహనంతో ఉన్నది అనే విషయాన్ని గుర్తించి చివరి నిముషంలో ఈ అస్ర్తం విసిరారు.
నిజంగానే యువతలో నిరుద్యోగుల్లో చాలా ఆశలు పెంచారు. క్యాలెండర్ డేట్లు ప్రకటిస్తామన్నారు. నిర్దిష్టంగ అంకెలతో చెప్పారు. యువత ఎదురుచూస్తూ ఉంటుంది. ఇందులో అటూ ఇటూ అయితే వాళ్ల ఆగ్రహం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అలాగే ఇవాళ నిరుద్యోగంతో పాటే పెద్ద సమస్యగా ఉన్నది చిరుద్యోగం. కాలేజీ ఫీజుల కోసమో, ట్యూషన్ల కోసమో, కోచింగుల కోసమో, కుటుంబం గడవడానికి వేడ్నీళ్లకు చన్నీళ్లు అన్నట్టుగానో చాలా మంది యువత చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారు.
గిగ్ ఎకానమీ అని పిల్చుకునే జొమాటో, స్విగ్గీ తరహా కావొచ్చు. ఓలా, ఉబెర్ కావొచ్చు. ఇలా చాలా ఉన్నాయి. వారందరినీ నిరుద్యోగులుగా గుర్తిస్తారా? లేదా? వంటి సంక్లిష్టతలు చాలా ఉన్నాయి. ఉద్యోగం అనేదానికి ఎలాంటి నిర్వచనం ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరమైన అంశం.
తొలిదశలో ఉదారంగా ఉన్నట్టు చూపించాలని ప్రభుత్వానికి ఉండొచ్చు. కానీ, ఉందని చూపించుకోవడానికి ఏ మార్గం అవలంబిస్తారనేది కీలకం.
ఇక 18 యేళ్లు దాటిన చదువుకునే యువతులకు స్కూటర్లు కూడా అంతే. ఈ రెండూ ఈ ప్రభుత్వానికి సవాల్‌గా మారబోతున్నాయి.

3) హైదరాబాద్ ఇమేజ్
తెలంగాణ ప్రగతిలో కీలకపాత్ర హైదరాబాద్‌ది. ఇమేజ్‌లో కూడా. హైదరాబాద్ మీదే ఫోకస్ పెడతారా? గ్రామాలను పట్టించుకోరా? లాంటి విమర్శలు అప్పుడప్పుడూ రావొచ్చు కానీ, అంతిమంగా తెలంగాణ ఆదాయంలో, ఎదుగుదలలో గుండెకాయ అది. కొంత ఫోకస్ తప్పదు.
బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ వరకూ మంచి ఇమేజే ఉంది. కేటీఆర్ హైదరాబద్ ఇమేజ్ పాడుకాకుండా ముందంజ వేసేలా చేశారని పేరుంది. అలాగే ప్రాంతీయ ఉద్వేగాలు, ఉద్రికత్తలు ఎక్కడా రాకుండా గ్లోబల్ ఇమేజ్ మెయిన్టెయిన్ చేశారనే పేరు ఉంది. పెట్టుబడుల ప్రవాహం కూడా అలాగే ఉంది.
ఇప్పుడు కనుక ఇతరత్రా హామీల బరువుకు హైదరాబాద్ మీద ఫోకస్ తగ్గతే, అది ఇమేజ్‌కు దెబ్బ అవుతుంది. హైదరాబాద్ తెలంగాణ పాలకుల ఇమేజ్‌లో ప్రధాన పాత్ర కచ్చితంగా పోషిస్తుంది.
ఇప్పటికైతే రేవంత్ రెడ్డి అండర్ గ్రౌండ్ రోడ్ల గురించి, ఆ చివరి నుంచి ఈ చివరికి సులభంగా ప్రయాణం చేయగల టెక్నాలజీ గురించి మాట్లాడుతూ వచ్చారు. అలాంటి హైటెక్ కలలకు కొత్త బడ్జెట్లో చోటెంతో చూడాలి.

4) అనుభవ లేమి
రేవంత్ చురుకుదనం, దూకుడు ఉన్న నేతే కానీ క్లీన్ ఇమేజ్ అయితే లేదు. ఓటుకు నోటు ఎపిసోడ్ చూసి ఉన్నాం. కాబట్టి ఎక్కడ ఎలా చిక్కుతారా? అని అటు ప్రత్యర్థులు, ఇటు సొంతపార్టీలోని అసమ్మతి వాదులు ఎదురుచూస్తూ ఉంటారు.
ఇక్కడ అలనాటి వైఎస్‌కు, ఇవాళ్టి రేవంత్‌కు ఒక తేడా ఉంది. వైఎస్ పార్టీలో ఎదుగుతూ వచ్చి ఎదురులేని స్థానానికి చేరుకున్న నేత. రేవంత్ అలా కాదు. బయటి నుంచి వచ్చిన వెంటనే కాలం కలిసివచ్చి, తనకు వచ్చిన అవకావాన్ని ఉపయోగించుకుని స్వల్ప కాలంలోనే సీఎం పీఠమెక్కిన నేత.
అటు పాలనాపరంగా కానీ, ఇటు పార్టీలో కానీ అలనాడు వైఎస్‌కు ఉన్మంత పట్టు ఉండే అవకాశం లేదు. అనుభవలేమిని ఉపయోగించుకోవడానికి అందరూ ఎదురుచూస్తుంటారు. ఇది రేవంత్‌కు పెద్ద సవాలే.
ప్రత్యర్థులు, పార్టీలోని అసమ్మతి వాదులతో పాటు కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో పాగా కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా అదును కోసం చూస్తూనే ఉంటుంది. కాంగ్రెస్‌కు పార్టీ పరంగా ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా తెలంగాణ పాలకుల మీద ఉండొచ్చు కర్నాటకతో పాటుగా అనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట.

5) ప్రజాస్వామ్యం.. ప్రశ్నించే స్వేచ్ఛ
లాస్ట్ బట్ నాట్ లీస్ట్. కెసిఆర్ ఆయన ప్రభుత్వంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ప్రజాస్వామ్యం, ప్రశ్నించే స్వేచ్ఛ. ధర్నాచౌక్ ఎత్తివేసిన ఉదంతం నుంచి చివరి వరకూ అది చర్చల్లో నలుగుతూనే ఉంది. ఉద్యమ పార్టీ అయిఉండి ప్రశ్నను అసహనంగా చూడడం, పార్టీని తెలంగాణకు పర్యాయపదంగా మార్చి మన రాజ్యం వచ్చాక కూడా ఆందోళనలు ఎందుకు అని డిస్మిసివ్ స్వరంతో మాట్లాడడం వంటివి పాలనా తీరు మీద వ్యవహారశైలిమీద చాలామందిలో అసహనాన్ని కలిగించాయి. ప్రస్తుత ప్రభుత్వమైనా పౌరసమాజంలో అత్యంత విలువైన ప్రశ్నించే స్వేచ్చకు చోటు కల్పిస్తుందా అనే ప్రశ్న ముఖ్యమైనది.
స్థూలంగా చూస్తే బీఆర్ఎస్ ఓడిపోయి ఉండొచ్చు కానీ, కాస్త అటూ ఇటూ అయినా కేసీఆర్‌పై సింపతీ పెరుగుతుంది. మరోవైపు బీజేపీ సందు దొరుకుతుందా అని చూస్తూ ఉంటుంది. ఇక సొంత పార్టీలోని వారు సరేసరి. రేవంత్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీని విజయపథంలో నడిపించగలిగితే పార్టీ వరకూ అంతర్గతంగా ఒక సమస్యను రేవంత్ ఫరిష్కరించుకోవచ్చు. ఆమేరకు రేవంత్ ఇమేజ్ పెరిగే అవకాశముండొచ్చు. మిగిలిన ఆర్థిక సామాజిక విషయాలు లోతైనవి, దీర్ఘకాలికమైనవి. విజన్‌తో ముడిపడినవి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పూర్తి జాబితా.. 119 స్థానాలలో ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే
- తెలంగాణ ఎన్నికలు: పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎందరు, యువ ఓటర్ల సంఖ్య ఎంత... మీరు తెలుసుకోవాల్సిన 9 ఆసక్తికర అంశాలు
- తెలంగాణలో పోలింగ్ శాతం ఎందుకు తగ్గింది? పల్లెలు, పట్టణాల మధ్య అంత తేడాకు కారణమేంటి?
- తెలంగాణ ఎన్నికలలో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న మూడు పాటలు
- నిజామాబాద్ అర్బన్: పోలింగ్‌కు ముందు అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా పడతాయా? చట్టం ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














