యశస్విని, పర్ణిక, లాస్య నందిత, రాగమయి.. తెలంగాణలో ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది మహిళలు ఎవరు?

లాస్య నందిత, పర్ణిక రెడ్డి, యశస్విని రెడ్డి

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, లాస్య నందిత, పర్ణిక రెడ్డి, యశస్విని రెడ్డి

తెలంగాణలోని 119 స్థానాలలో ఈసారి 10 నియోజకవర్గాల ఓటర్లు మహిళలకు పట్టం కట్టారు.

ఈసారి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల నుంచి మొత్తం 33 మంది మహిళలు పోటీ చేయగా అందులో 10 మంది విజయం సాధించారు.

బీజేపీ నుంచి పోటీ చేసిన మహిళలలో ఎవరూ విజయం సాధించనప్పటికీ కాంగ్రెస్ నుంచి అయిదుగురు, బీఆర్ఎస్ నుంచి అయిదుగురు గెలిచారు.

ఈ పది మందిలో ఆరుగురికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండగా నలుగురు మాత్రం తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్క, పెద్దపల్లిలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన దాసరి ఉష వంటి కొందరు మహిళా అభ్యర్థులు చర్చలో ఉన్నప్పటికీ విజయం వరకు రాలేకపోయారు.

తొలిసారి గెలిచిన నలుగురిలో యశస్విని రెడ్డి, లాస్య నందిత, చిట్టెం పర్ణిక రెడ్డి, మట్టా రాగమయి ఉన్నారు.

యశస్విని రెడ్డి

ఫొటో సోర్స్, facebook/yasaswini reddy

ఫొటో క్యాప్షన్, యశస్విని రెడ్డి

యశస్విని రెడ్డి - పాలకుర్తి

పాలకుర్తిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకరరావుపై 47,634 ఓట్ల తేడాతో గెలిచారు. పోలైన ఓట్లలో 1,26,848 ఓట్లను ఆమె సాధించారు.

యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి అమెరికాలో వ్యాపార రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆమెకు భారత పౌరసత్వం రాకపోవడంతో టికెట్ దక్కలేదు.

దీంతో ఆమె కోడలు యశస్విని రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. యశస్విని భర్త రాజమోహన్ రెడ్డి కూడా అమెరికాలోనే ఉంటారు. ఆయనకు కూడా భారత పౌరసత్వం లేదు.

యశస్విని హైదరాబాద్‌లో బీటెక్ చదువుకున్నారు. వివాహమైన తరువాత భర్తతో అమెరికా వెళ్లినప్పటికీ మళ్లీ కొన్నాళ్లుగా తెలంగాణలోనే ఉంటున్నారు.

lasya nanditha

ఫొటో సోర్స్, facebook/lasya nanditha

లాస్య నందిత - సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ)

సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన 36 ఏళ్ల లాస్య నందిత విజయం సాధించారు.

పూర్తిగా అర్బన్ నియోజకవర్గమైన కంటోన్మెంట్‌లో ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత శ్రీగణేశ్‌పై 17,169 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ఇదే నియోజకవర్గంలో విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేశారు. ఆమె మూడో స్థానంలో నిలిచారు.

లాస్య నందిత తండ్రి సాయన్న ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ మరణించారు. తండ్రి మరణంతో ఈసారి ఆమె పోటీలో దిగారు. గతంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న లాస్య నందిత తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

parnika reddy

ఫొటో సోర్స్, parnika reddy/fb

చిట్టెం పర్ణిక రెడ్డి - నారాయణపేట

నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన 30 ఏళ్ల చిట్టెం పర్ణిక రెడ్డి 7,951 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2016లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

2005లో ఆగస్ట్ 15 రోజున జెండా ఆవిష్కరణ చేసిన తరువాత మావోయిస్టులు జరిపిన కాల్పులలో నర్సిరెడ్డి, ఆయన రెండో కుమారుడు వెంకటేశ్వరరెడ్డి చనిపోయారు. పర్ణిక రెడ్డి తండ్రే వెంకటేశ్వరరెడ్డి.

నర్సిరెడ్డి మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికలలో ఆయన పెద్ద కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లోనూ మక్తల్ నుంచి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే, ఆ తరువాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. పర్ణిక రెడ్డికి రామ్మోహన్ రెడ్డి స్వయాన పెద్దనాన్న. ఈ ఎన్నికలలో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయగా పర్ణిక రెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.

రామ్మోహన్ రెడ్డి ఓటమి పాలవగా పర్ణిక విజయం సాధించారు.

పర్ణిక రెడ్డి మేనత్త డీకే అరుణ కూడా రాజకీయాలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ పనిచేసిన ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు.

matta ragamayee

ఫొటో సోర్స్, fb/matta ragamayee

మట్టా రాగమయి - సత్తుపల్లి

సత్తుపల్లి(ఎస్సీ) నియోజకవర్గంలో 52 ఏళ్ల మట్టా రాగమయి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 19,440 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ఎంబీబీఎస్ చదివిన రాగమయి ఎమ్మెల్యేగా గెలవడం ఇదే తొలిసారి.

వైద్యురాలిగా సత్తుపల్లి ప్రజలకు పరిచయమైన ఆమె భర్త దయానంద్ సత్తుపల్లిలో కౌన్సిలర్‌గా ఉన్నారు.

సత్తుపల్లిలో గత మూడుసార్లుగా గెలుస్తూ వస్తున్న సండ్ర వెంకటవీరయ్యపై ఆమె విజయం సాధించారు. 2018 ఎన్నికలలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు.

ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన రాగమయి చేతిలో 19,440 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ముగ్గురు మాజీ మంత్రులు

తొలిసారి ఎన్నికైన ఈ నలుగురితో పాటు మరో ఆరుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు.

వీరిలో కొందరికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవమూ ఉంది.

Konda Surekha

ఫొటో సోర్స్, facebook/konda surekha

కొండా సురేఖ - వరంగల్ ఈస్ట్

వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో 15,652 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ నేత కొండా సురేఖ గెలిచారు. గతంలో శాయంపేట, పరకాల, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలిచిన కొండా సురేఖకు ఇది నాలుగో విజయం.

సురేఖ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

ప్రస్తుత ఎన్నికలలో ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావుపై 15,652 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

sabitha indra reddy

ఫొటో సోర్స్, facebook/sabitha indra reddy

సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం

మహేశ్వరంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్‌పై 26,187 ఓట్ల తేడాతో గెలిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఆమె నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి గెలిచిన ఆమె 2019లో బీఆర్ఎస్‌లో చేరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రిగా ఆమెకు గుర్తింపు ఉంది.

సబిత గనుల శాఖ మంత్రిగానూ పనిచేశారు. 2019లో బీఆర్ఎస్‌లో చేరిన తరువాత కేసీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

Sunitha Laxma Reddy

ఫొటో సోర్స్, Sunitha Laxma Reddy

సునీత లక్ష్మారెడ్డి - నర్సాపూర్

నర్సాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వాకిటి సునీత లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ఆవుల రాజిరెడ్డిపై 8,855 ఓట్ల తేడాతో గెలిచారు.

1999, 2004, 2009లలో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.

2014, 2018లలో నర్సాపూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2014లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

2019లో బీఆర్ఎస్‌లో చేరిన ఆమె ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు.

padmavathi reddy

ఫొటో సోర్స్, facebook/uttam padmavathi

నలమాడ పద్మావతి రెడ్డి - కోదాడ

కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నలమాడ పద్మావతి రెడ్డి 58,172 ఓట్ల భారీ ఆధిక్యంతో తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్‌పై గెలిచారు.

పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈఎన్నికలలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచారు.

2014లో తొలిసారి కోదాడ నుంచి గెలిచిన ఆమె 2018లో ఓటమి పాలయ్యారు. అనంతరం ప్రస్తుత ఎన్నికలలో రెండోసారి విజయం సాధించారు.

2018లో హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తరువాత 2019లో ఎంపీగా పోటీ చేసి గెలవడంతో హుజూర్‌నగర్ స్థానం ఖాళీ అయింది. అప్పుడు హుజూర్‌నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో పద్మావతి పోటీ చేశారు. అయితే, ఆ ఉప ఎన్నికలో ఆమె ఓడిపోయారు.

ఇప్పుడు పద్మావతి, ఉత్తమ్ ఇద్దరూ గెలవడంతో అసెంబ్లీలో భార్యాభర్తలిద్దరూ సభ్యులుగా కొనసాగనున్నారు.

Danasari Seethakka

ఫొటో సోర్స్, Danasari Seethakka/fb

సీతక్క - ములుగు

ములుగు(ఎస్టీ) నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీతక్క విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

2009లో టీడీపీ నుంచి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె గెలిచారు.

మావోయిస్ట్ నేపథ్యం ఉన్న సీతక్క కోవిడ్ మహమ్మారి సమయంలో తన నియోజకవర్గంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కాలినడకన వెళ్లి సరకులు అందించి వార్తల్లో నిలిచారు.

Kova Laxmi

ఫొటో సోర్స్, fb/Kova Laxmi Zp Chairperson-Asifabad

కోవా లక్ష్మి - ఆసిఫాబాద్

ఆసిఫాబాద్(ఎస్టీ) నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోవా లక్ష్మి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆజ్మీరా శ్యామ్‌పై 22,799 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ఇంతకుముందు 2014లో గెలిచిన ఆమె 2018లో ఓడిపోయారు.

ఆమె కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గానూ పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)