ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ను ఎగ్జిట్ పోల్స్ ఎలా పట్టిస్తాయి, ఒక్కోసారి ఎందుకు ఫెయిల్ అవుతాయి?

ఓటు హక్కును వినియోగించుకున్న మహిళలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఓటు హక్కును వినియోగించుకున్న మహిళలు
    • రచయిత, గౌతమి ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎన్నికలు, ఎగ్జిట్ పోల్స్, ఫలితాలు.. అన్నీ ఆటను రక్తి కట్టించేవే. పోలింగ్ ముగియగానే జనమంతా ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకోవడం మనకు తెలిసిన విషయమే. ఈ ఎగ్జిట్ పోల్స్ కొన్ని పార్టీలకు ఊపునిస్తే మరి కొన్ని పార్టీలను టెన్షన్ పెడతాయి.

ఇక తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్నీ కూడా అధికార బీఆర్‌ఎస్ కన్నా కాంగ్రెస్‌కే ఓటరు పట్టం గట్టే అవకాశాలు ఎక్కువని చెప్పాయి.

హ్యాట్రిక్ కొట్టాలని కలలుగన్న బీఆర్‌ఎస్‌ను ఇవి టెన్షన్ పెడితే ఎలాగైనా ఈ సారి గెలిచి చూపించాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్నిచ్చాయి.

సరే అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి ? వీటిని ఎలా నిర్వహిస్తారు? ప్రజలు, నాయకులు ఈ ఎగ్జిట్ పోల్స్ పట్ల ఎందుకంత ఆసక్తి చూపిస్తారు? తాజా ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలకు, అసలు ఫలితాలకు మధ్య ఈసారి లెక్క సరిపోయిందా?

ఎన్నికలలో భాగంగా కొన్ని మీడియా సంస్థలు, మరికొన్ని సర్వే సంస్థలు ప్రీ పోల్స్ , ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటాయి. పోలింగ్ జరగడానికి ముందే నిర్వహించే సర్వేను ప్రీ పోల్స్ అని , పోలింగ్ తర్వాత చేసే సర్వేను ఎగ్జిట్ పోల్స్ అని అంటారు.

ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాక ముందే , పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు గానీ, లేదా పోలింగ్ తేదీకి కాస్త దగ్గరలో కానీ ప్రీ పోల్ సర్వేలను నిర్వహిస్తుంటారు.

ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే ఓటర్లు పోలింగ్ బూత్‌లలో ప్రజలు ఓట్లు వేసి వచ్చాక వారిని నిర్వాహకులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ముందే ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలలో ఈసర్వే నిర్వహిస్తారు.

ఓటర్లు చెప్పే విషయాలను బట్టి ఎక్కువ మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారో లెక్కగడతారు.

ఈ సమాచారాన్ని అనేక పోలింగ్ కేంద్రాల నుంచి సేకరించాక, ఆ మొత్తం సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేస్తారు.

తెలంగాణ ప్రముఖ నేతలు

ఫొటో సోర్స్, FACEBOOK

ఎగ్జిట్ పోల్స్ పట్ల ఎందుకంత ఆసక్తి?

నిజానికి ప్రీ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ సర్వేల పట్ల అటు ప్రజలకు ఇటు నాయకులుకు ఆసక్తి ఎక్కువ.

ఎందుకంటే, ప్రీపోల్ సర్వేతో పోల్చితే ఎగ్జిట్ పోల్స్ ద్వారా జనం నాడి ఎలా ఉందో, గాలి ఎటు వైపు వీస్తుందో ఎంతోకొంత కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం గతంలో జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ , ఎన్నికల ఫలితాలను పరిశీలించి చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తుది ఫలితాలకు దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి.

పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది కనుక నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. దీంతో నాయకులు కూడా ఎగ్జిట్ పోల్స్ వివరాల ద్వారా నాయకులు తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

భారత్‌తో పాటు యూకే , ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, దక్షిణా ఆఫ్రికాలలో కూడా ఓటింగ్ పూర్తవక ముందు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం నిషిద్ధం.

పోలింగ్ పూర్తి కాకుండానే ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తే అది ఇంకా ఓటు వేయాల్సిన వారిని ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయనే ఈ నిషేధం విధించారు.

ఓటింగ్ స్టేషన్

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్

ఆరా, పీపుల్స్ పల్స్, ఇండియా టీవీ-సీఎన్ఎక్స్, టీవీ -9 వర్ష్, చాణక్య సంస్థలు వెల్లడించిన ఈ ఎగ్జిట్ పోల్స్‌ వివరాలు చూస్తే ఈసారి అసలు ఫలితాలకు చాలా దగ్గరగానే ఉన్నాయని చెప్పాలి. ఈ సంస్థలన్నీ కూడా కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని సూచించాయి.

డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలలో 64 స్థానాలలో కాంగ్రెస్ , 39 స్థానాలలో బీఎఆర్‌ఎస్, 8 స్థానాలలో బీజేపీ, 7 స్థానాలలో ఎంఐఎం , ఒక స్థానంలో సీపీఐ విజయం సాధించాయి. అంటే, ఈసారి ఎగ్జిట్ అంచనాలు చాలా వరకు కరెక్టుగానే ఉన్నాయని చెప్పాలి.

తెలంగాణలో మొత్తం స్థానాలు 119
ఫొటో క్యాప్షన్, తెలంగాణలో మొత్తం స్థానాలు 119
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం స్థానాలు 90
ఫొటో క్యాప్షన్, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం స్థానాలు 90

అయితే, ఎగ్జిట్ పోల్స్ లెక్కలను ప్రతిసారీ కరెక్టే అనుకోవచ్చా. అలా అని కూడా చెప్పలేం. ఓ సారి ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే..

ఈ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్‌కి , ఫలితాలకి మధ్య చాలా తేడా కనిపించింది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కోడై కూసినా రియాలిటీలో పూర్తి భిన్నంగా భారతీయ జనాతాపార్టీ విజయ ఢంకా మోగించింది.

ఎగ్జిట్ పోల్స్ ఏ సర్వే కూడా బీజేపీకి 50 సీట్లు వస్తాయని కూడా చెప్పకపోయినా బీజేపీ 54 సీట్లు సాధించింది.

మరోవైపు మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ , కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. కానీ ఇక్కడ కూడా బీజేపీనే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ వివరాలు చూస్తే..

మధ్యప్రదేశ్‌లో మొత్తం స్థానాలు 230
ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్‌లో మొత్తం స్థానాలు 230

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 164 సీట్లు రావచ్చని చాలా వరకు సర్వేలు అంచనా వేయలేకపోయాయి. అయితే ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా మాత్రం కొంత 140 నుంచి 162 వరకు రావచ్చని అంచనా వేసింది.

అటు కాంగ్రెస్‌కు కూడా 68 నుంచి 90 సీట్లు రావచ్చని చెప్పిన ఈ సర్వే చెప్పిన లెక్క కాస్త దగ్గరగానే ఉన్నప్పనటికీ మిగతా సర్వేలు పూర్తి భిన్నమైన సంఖ్యనే చెప్పాయి.

ఇక, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలను కూడా ఓసారి పరిశీలిద్దాం.

ఇండియాటుడే, యాక్సిస్ మై ఇండియా: కాంగ్రెస్ 21 - 33, బీఆర్ఎస్ 79 - 91, ఇతరులు 5 - 10

టీవీ9 ఆరా: కాంగ్రెస్ 25 - 35, బీఆర్ఎస్ 75 - 85, ఇతరులు 9 - 14

టైమ్స్ నౌ, సీఎన్ఎక్స్: కాంగ్రెస్ 37, బీఆర్ఎస్ 66, ఇతరులు 16

న్యూస్ ఎక్స్ నేతా: కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 57, ఇతరులు 16

రిపబ్లిక్ సీఓటర్: కాంగ్రెస్ 47 - 59, బీఆర్ఎస్ 48 - 60, ఇతరులు 1 – 18 గా ఉన్నాయి.

ఓటు హక్కు వినియోగించుకున్న బాలిక

ఫొటో సోర్స్, UGC

అయితే, 2018 తెలంగాణ ఫలితాలు ఇలా ఉన్నాయి.

బీఆర్ఎస్: 88

కాంగ్రెస్ + : 21

బీజేపీ 1

ఎంఐఎం 7

ఇతరులు 2

2018 ఎగ్జిట్ పోల్స్‌ను, ఫలితాలను సరిపోల్చినపుడు ఇండియా టు డే అంచనాలు ఫలితాలకు చాలా దగ్గరగా కనిపించాయి.

పీపుల్స్ పల్స్, ఇండియా టీవీ, టీవీ 9 భారత్ వర్ష్, చాణక్య స్ట్రాటజీస్, ఆరా వంటి ఎన్నో సర్వే సంస్థలు ఎన్నికల సమయంలో ప్రజా నాడి తెలుసుకునేందుకు ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నప్పటికీ అవి వెల్లడించే ఫలితాలు అన్నీ ప్రతిసారీ రియాలిటీకి దగ్గరగా ఉంటాయని అనుకోలేం.

ఎందుకంటే ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు సమయాలలో , విభిన్న రంగాల వ్యక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలో ఒక్కోసారి వారి అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది.

అయితే, ఎన్నికల విజయాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఒక అంచనాను మాత్రం ఇస్తాయనడంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)