రేవంత్ రెడ్డి: ప్రగతి భవన్ ఇక ప్రజా భవన్‌

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Facebook/Anumula Revanth Reddy

సచివాలయం గేట్లు సామాన్యులకు ఎప్పుడూ తెరిచి ఉంటాయని, ఇక నుంచి ప్రగతి భవన్ ప్రజా భవన్‌గా మారుతుందని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ విజయంపై స్పష్టత వస్తున్న తరుణంలో గాంధీ భవన్‌లో రేవంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఇకపై తెలంగాణలో పరిపాలన గతం కన్నా భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ శిరసావహించాలని, హామీల అమలులో కాంగ్రెస్‌కు సహకరించాలని తాము ఆశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్న రేవంత్, శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాల ఫలితమే ఈ విజయమని, దీన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నామని తెలిపారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Facebook/Anumula Revanth Reddy

ఫొటో క్యాప్షన్, ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి

ఆరు హామీలను నెరవేరుస్తాం

పార్టీని విజయం వైపు నడిపించడంలో సీఎల్పీ భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ లాంటి వారంతా ఎంతో సహకరించారని రేవంత్ అన్నారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చట్ట రూపంలో ఇస్తామన్న హామీలను కూడా నెరవేరుస్తామని రేవంత్ అన్నారు.

‘‘ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీకి కృతజ్ఞత తెలిపే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం అప్పగించి మాపై మరింత బాధ్యతను పెంచారు. జోడో యాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ స్ఫూర్తిని నింపారు. రాహుల్ గాంధీ అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నాం’’ అని రేవంత్ చెప్పారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Facebook/Anumula Revanth Reddy

పార్టీ శ్రేణుల్లో సంబరాలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలపై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది.

గాంధీ భవన్ వద్ద, రేవంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

అంతకుముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇదే స్థాయిలో మెజార్టీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ నేతలు తెలంగాణ విజయాన్ని సంబరంగా చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)