‘దూత’ రివ్యూ: నాగచైతన్య తొలి వెబ్ సిరీస్‌లో అతీంద్రియ శక్తులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయా?

దూత రివ్యూ

ఫొటో సోర్స్, AMAZON VIDEO

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

బాలీవుడ్‌తో పోల్చుకుంటే తెలుగులో స్టార్ కథానాయకులు వెబ్ సిరీస్‌ల‌లో నటించడానికి ముందుకు రావడం తక్కువే. అయితే ఇప్పుడా పరిస్థితి మారుతోంది.

వెంకటేశ్, రానా లాంటి కథానాయకులు ‘రానా నాయుడు’ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు నాగచైనత్య 'దూత' సిరీస్ తో ఓటీటీలో అరంగేట్రం చేశారు. విక్రమ్ కె కుమార్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు.

విక్రమ్ కుమార్ కథల్లో మంచి స్క్రీన్ ప్లే మ్యాజిక్ వుంటుంది. చైతు, విక్రమ్ కుమార్ కలసి చేసిన 'మనం' మూడు తరాల కథతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరు కలసి చేసిన 'దూత’ సిరీస్‌‌పై కూడా సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి.

అతీంద్రియ శక్తుల నేపధ్యంలో రూపొందిన సిరీస్ ఇది. ఇలాంటి కథలని తీర్చిద్దిడ్డంలో విక్రమ్ కుమార్ సిద్ధహస్తుడు. ఆయన తొలి చిత్రం 13బి సూపర్ నేచురల్ నేపథ్యంలో సాగే కథే. ‘మనం’, ‘24’ సినిమాలలో కూడా ఆ ఛాయలు కనిపిస్తాయి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన పూర్తి స్థాయి సూపర్ నాచురల్ కథగా ‘దూత’ చేశారు.

ప్రోమోలు సిరీస్‌పై ఆసక్తిని కలిగించాయి. ఎనిమిది ఎపిసోడ్స్ గల దూత సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైయింది. మరి నాగచైతన్య తొలి వెబ్ సిరీస్‌గా వచ్చిన దూత ప్రేక్షకులకు ఎలా అలరించింది ? విక్రమ్ కుమార్ తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారా?

దూత రివ్యూ

ఫొటో సోర్స్, AMAZON VIDEO

పేపర్ కట్స్‌తో అంతుచిక్కని మరణాలు !

సాగర్‌ వర్మ అవధూరి (నాగచైతన్య) ప్రముఖ జర్నలిస్ట్‌. తనకి సంఘంలో ప్రముఖలతో మంచి పరిచయాలు వుంటాయి. ‘సమాచార్’ ప‌త్రిక‌కు ఎడిట‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తాడు.

సాగర్‌ భార్య ప్రియ( ప్రియా భవానీ శంకర్) కూడా జర్నలిస్టే. తను గర్భవతి కావడంతో ఇంట్లోనే విశ్రాంతిలో వుంటుంది. ఒకరోజు సాగర్ కి ఓ పాత పేపర్ కట్ దొరుకుతుంది. అందులో తన పెంపుడు కుక్క ప్రమాదంలో చనిపోయిందనే సమాచారం ఇచ్చినట్లు ఓ పజిల్ వుంటుంది. అందులో వున్నట్లుగానే సాగర్ పెంచుకున్న కుక్క ప్రమాదంలో చనిపోతుంది.

ఈ ఘటన తర్వాత అలాంటి పేపర్ క్లిప్స్ సాగర్ కి ఎదురుపడుతూనే వుంటాయి. ఆ క్లిప్స్ లో ఉన్నది యధాతథంగా జరుగుతుంది. ఈ క్రమంలో తన కుటుంబం, స్నేహితులు, కావాల్సిన వారు కూడా ప్రమాదంలో వున్నట్లు గ్రహిస్తాడు సాగర్. తర్వాత ఏం జరిగింది ? అసలు ఆ పేపర్ కట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందులో వున్నట్లుగానే ఎలా జరగుుతుంది ? ఈ కథలో అమృత (ప్రాచీ దేశాయ్‌), సీనియర్‌ జర్నలిస్ట్‌ చంద్రమూర్తి (వి.జయ ప్రకాష్‌) డీసీపీ క్రాంతి (పార్వతి తిరువత్తు) ఎలాంటి పాత్రలు పోషించారు. చివరికి ఈ మిస్టరీని సాగర్ చేధించగలిగాడా ? తనని, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా? అనేది మిగతా సిరీస్.

నాగచైతన్య

ఫొటో సోర్స్, Twitter/Amazonprime

విక్రమ్ కుమార్ మ్యాజిక్ ఉందా ?

విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే దిట్ట. మూడుతరాల కథని ప్రేక్షకులకు ఎలాంటి గందరగోళానికి గురి కానివ్వకుండా చాలా ఆసక్తికరంగా ‘మనం’ లో చూపించారు. ఆయన ‘24’ సినిమా కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని తనదైన శైలిలో తెరకెక్కించారు.

అయితే సినిమాలకు వెబ్ సిరీస్ లకు చాల స్పష్టమైన తేడా వుంది. వెబ్ సిరీస్‌కి వచ్చేసరికి ప్రతి ఎపిసోడ్‌లో ఒక ఆసక్తికరమైన ఆరంభం, విరామం, ముగింపు వుండాలి. అప్పుడే తర్వాత ఎపిసోడ్‌పై ప్రేక్షకుడి ఆసక్తి పెరుగుతుంది.

విక్రమ్ కుమార్ వెబ్ సిరీస్ కిటుకుని కూడా చాలా చక్కగా పట్టుకున్నారు. 8 ఎపిసోడ్‌‌ల ఈ సిరీస్‌ని ఎక్కడా విసుగు రానివ్వకుండా, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తించేలా తీర్చిదిద్దంలో మంచి పని తీరు కనబరిచారు.

దూత రివ్యూ

ఫొటో సోర్స్, AMAZON VIDEO

‘దూత’ సిరీస్ ఎలా సాగింది?

వెబ్ సిరీస్‌కి మొదటి ఎపిసోడ్, అందులోనూ మొదటి సన్నివేశం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇలాంటి సూపర్ నేచురల్ థ్రిల్లర్స్...తొలి ఎపిసోడ్‌లోనే ప్రేక్షకులకు తర్వాత ఏమిటనే సస్పెన్స్ క్రియేట్ చేయాలి. ఈ విషయంలో దూత కథనం నడిచిన తీరు థ్రిల్లర్స్‌ని ఇష్టపడే ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగా వెళుతుంది.

తొలి సన్నివేశంలోనే సాగర్ పాత్ర తీసుకునే నిర్ణయం ప్రేక్షకులని సిరీస్ లో కూర్చోబెడుతుంది. ఈ ఎపిసోడ్‌లోనే దూత ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాడు దర్శకుడు. సాగర్‌కి పేపర్ కట్ దొరకడం, అందులో వున్నట్లునే ఘటనలు జరగడంతో దూతలోని సూపర్ నేచురల్ సస్పెన్స్ మొదలైపోతుంది.

మొదటి నాలుగు ఎపిసోడ్లు సాగర్‌కి దొరుకుతున్న పేపర్ కట్స్, కొన్ని మిస్టరీ చావుల కోణంలో నడుస్తుంది. నిజానికి ఇలా ఒకే పాయింట్ పై వున్నప్పుడు ప్రేక్షకుడు కాస్త విసుగు ఫీలవ్వాలి. కానీ ఇందులో అలా జరగదు. కారణం.. దర్శకుడు ఇందులో కొని పాత్రలని, అ పాత్రల స్వభావాన్ని పూర్తిగా కాకుండా కొద్దికొద్దిగా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాడు.

అమృత (ప్రాచీ దేశాయ్‌) పాత్ర, మరోవైపు క్రాంతి (పార్వతి తిరువత్తు) చేసే నేర పరిశోధన ఆసక్తికరమైన మలుపు తీసుకొస్తాయి. దీంతో అన్నీ పాత్రలపై ఆసక్తి, అనుమానం పెరుగుతూ అసలు ఏం జరుగుతోంది? ఈ చావుల వెనుక వున్నది ఎవరు? పేపర్ కట్స్‌తో ఈ చావులు ఎలా సాధ్యపడుతున్నాయనే ఉత్కంఠతతో సిరీస్‌ని కొనసాగిస్తారు.

దూతలో అసలు కథ, చావులు వెనుక వున్న మిస్టరీ ఐదో ఎపిసోడ్ లో ప్రారంభం అవుతుంది. ఒక యూట్యూబర్ చేసే ఘోస్ట్ స్టోరీలతో దూత కథ కాసేపు హారర్ వైపు మళ్ళుతుంది. అయితే దర్శకుడు చాలా తెవివిగా ప్రేక్షకులని ఆ పాయింట్‌లో కాసేపు ఎంగే‌జ్ చేసి వుంచి మళ్ళీ సూపర్ నేచురల్ వైపు తిప్పారు.

ఈ క్రమంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆసక్తికరంగానే వుంటుంది. దూతలో మూల కథ అంతా ఈ ఫ్లాష్ బ్యాక్‌లోనే వుంది. అయితే ఆ కథ 60ల‌లో జరగడానికి కారణం ఏమిటో‌గాని ఈ ఎపిసోడ్ చాలా నిదానంగా నడుస్తుంది. అక్కడ వున్న ఎత్తుగడలు కూడా పాతతరం నాటివిగానే వుంటాయి.

ఫ్లాష్ బ్యాక్ పూర్తయిన వెంటనే మళ్ళీ కథ పరుగులుపెడుతుంది. ఈ కథకు ఇచ్చిన ముగింపు కూడా మెప్పిస్తుంది.

దూత రివ్యూ

ఫొటో సోర్స్, AMAZON VIDEO

నాగచైతన్యను మెచ్చుకోవాల్సిందే :

నాగచైతన్య కి ఇది మొదటి వెబ్ సిరీస్. చాలా మంచి ఎంపిక. వెబ్ సిరీస్‌లు కమర్షియల్ ఎలిమెంట్స్‌కంటే కంటెంట్ మీదే నడుస్తాయి. చైతు కూడా ఆ కంటెంట్‌నే బలంగా నమ్మాడు. నిజానికి ఇందులో హీరోజయం లేదు. ఎలివేషన్స్ లేవు. కేవలం ఒక మంచి సిరిస్, ప్రేక్షకులని ఎంగేజ్ చేసే కంటెంట్ చేయాలని ‘దూత’ చేశాడని ఈ సిరిస్ చూసినప్పుడు అర్ధమవుతుంది.

సాగర్ పాత్ర దాదాపు సిరీస్ అంతా వుంటుంది. ఆ పాత్రతోనే సిరీస్ నడుస్తుంది. ఈ పాత్రలో ఒదిగిపోయాడు చైతు. ఈ సిరిస్ మొత్తం సాగర్ పాత్ర ఒక సస్పెన్స్ ని వెదుక్కుంటూ వెళుతుంది. ప్రేక్షకుడు కూడా సాగర్ పాత్రతో ప్రయాణిస్తూ అదే సస్పెన్స్ ని ఆస్వాదిస్తాడు. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో చైతు నటన మరింత ఆకట్టుకునేలా వుంటుంది. ఈ పాత్ర‌లోనూ చాలా కోణాలున్నాయి. పాజిటివ్‌గా మొద‌లుపెట్టిన పాత్ర‌లో రక‌ర‌కాల రంగులు క‌నిపిస్తుంటాయి. ప‌రిస్థితులు ఆ పాత్ర‌ని ఎంత దూరానికి తీసుకెళ్తున్నాయో కదా అనే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో కలిగించాడు ద‌ర్శ‌కుడు.

కీలకంగా సాగిన మూడు స్త్రీ పాత్రలు

సాధారణంగా వెబ్ సిరీస్‌లలో స్త్రీ పాత్రలని చాలా వరకూ గ్లామరస్‌గానూ హింసని గ్లోరిఫై చేయడానికి వాడుతుంటారు. దూతలో మాత్రం కథలో చాలా ప్రాముఖ్యత గల స్త్రీ పాత్రలు కనిపిస్తాయి. ప్రియ పాత్రలో చేసిన ప్రియా భవానీశంకర్ మొదట్లో సాధారణ గృహిణిగా కనిపించినప్పటికీ చివర్లో ఈ డ్రామా మొత్తంతో అమెది కూడా చాలా కీలకం పాత్ర అనే భావన కలిగించారు.

అలాగే అమృత పాత్రలో చేసిన ప్రాచీ దేశాయ్ ఆకట్టుకున్నారు. ఆ పాత్రలో భిన్నమైన కోణాలు వుంటాయి. మరో ముఖ్యమైన పాత్ర క్రాంతి. పార్వతి తిరువొత్తుకు ఇదే మొదటి తెలుగు సిరీస్. చాలా హుందాగా ఆ పాత్రని తీర్చిదిద్దారు. క్రైమ్ ని పరిశోధించడంలో మంచి తెలివిని కనబరిచే పాత్ర అది.

అయితే ఇందులో నేర పరిశోధన మాత్రం కొంచెం డిఫరెంట్ గా వుంటుంది. నేరం ఎలా జరిగిందో ప్రేక్షకుడికి తెలుసు. ఆ తెలిసిన నేరాన్ని క్రాంతి ఎలా పసిగట్టిందనేది చూపించారు. ఈ క్రమంలో చాలా వరకూ ఆమె కథకుడి వాయిస్‌ని వినిపిస్తున్నట్లుగా అనిపించినప్పటికీ తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆ చిన్న లోపం కూడా లేకుండా చేయగలిగారు.

ఎస్సై అజయ్‌ ఘోష్‌‌గా రవీంద్ర విజయ్‌, ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే తనికెళ్ల భరణి, పశుపతి, రాజా విజయ్‌, తరుణ్‌ భాస్కర్‌ వారి పాత్రలకు న్యాయం చేశారు.

నాగచైతన్య, విక్రమ్

ఫొటో సోర్స్, Twitter/Amazonprime

ఆ కాస్త హింసా లేక‌పోతే..?

దాదాపు ఈ సిరీస్ అంతా వర్షంలోనే జరుగుతుంది. అది దూతకి ఓ కొత్త ఫ్లేవర్‌ని జత చేసింది. చాలా చక్కని ప్రొడక్షన్ డిజైన్ చేశారు. ప్రేక్షకుడికి కూడా బయట అల్పపీడనం ఉందేమో అనే ఫీలింగ్ కలిగించింది ఆ వర్షం ఎఫెక్ట్. కెమరా పనితనం చాల చక్కగా కుదిరింది.

ఇందులో దెయ్యం ఉందా, లేదా? అనే అనుమానం ప్రేక్ష‌కుల్లో క‌లిగించ‌డంలో స్క్రీన్ ప్లే నేర్పు క‌న‌బ‌డింది. దెయ్యాన్ని చూపించ‌క‌పోయినా.. ఆ భ‌యాన్నీ, ఆ ఫీల్‌నీ కలిగించేలా తీర్చిద్దిన సన్నివేశాల్లో కెమరామేన్, సంగీత దర్శకుడు చాలా చక్కని ప్రతిభ కనబరిచారు.

ఎడిటర్ ఇందులో సస్పెన్ ని చక్కగా పట్టుకున్నాడు. ప్రతి ఎపిసోడ్‌ని ఆసక్తికరంగా కట్ చేయడంలో తన మార్క్ చూపించారు నవీన్ నూలి. లైటింగ్ కలర్ గ్రేడింగ్ అన్నీ ఉన్నత స్థాయిలో వున్నాయి.

నిర్మాత శరత్ మరార్ రాజీపడకుండా సిరీస్‌ని నిర్మించారు. ఒక‌ట్రెండు చోట బూతులు, ఓ బెడ్ రూమ్ సన్నివేశం (క‌థ‌కు అవ‌స‌రం), హింస కుటుంబ స‌మేతంగా ఈ సిరీస్ చూడ్డానికి కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. కానీ స‌న్నివేశంలో ద‌ర్శ‌కుడు ఇంటెన్సిటీ చూపించ‌డానికి ఇంత‌కు మించిన దారి క‌నిపించ‌లేదేమో అనిపిస్తుంది.

చాలా కిష్టమైన కథని సులువుగా చెప్పడం విక్రమ్ కుమార్ స్టయిల్. దూత కూడా ఒకరకంగా క్లిష్టమైన కథే. ఇది రెండు తరాల కథ. జర్నలిజం, పోలీస్ వ్యవస్థ, రాజకీయాలు ఈ అంశాలని రెండు తరాలకు కనెక్ట్ చేసి తనదైన స్క్రీన్ ప్లే లో పొందుపరిచి ప్రేక్షకులని థ్రిల్ చేయడంలో విక్రమ్ కుమార్ విజయం సాధించారు.

వీడియో క్యాప్షన్, పేపరు ముక్కలపై మరణాల మిస్టరీ... నాగచైతన్య వెబ్ సిరీస్‌ 'దూత' ఎలా ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)