తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, revanth_anumula
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
లాల్ బహదూర్ స్టేడియంలో భారీగా తరలివచ్చిన ప్రజల మధ్యన గవర్నర్ తమిళసై వీరందరితోనూ ప్రమాణ స్వీకారం చేయించారు.
తరువాత ఆరు గ్యారంటీల అమలు ఫైలుపై సీఎంగా రేవంత్ రెడ్డి తొలిసంతకం చేశారు.
తరువాత తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు రజినీ అనే నిరుద్యోగికి ఉద్యోగం
కల్పిస్తూ రెండో ఫైలుపై సంతకం చేశారు.

ఫొటో సోర్స్, FACE BOOK
కొత్తగా కొలువుదీరిన తెలంగాణ మంత్రివర్గంలో మల్లు భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది.
ఒక దశలో ఈయన ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్‌తో పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటూ ఆయన కూడా ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో తెలంగాణలో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క 2009 నుంచి వరుసగా గెలుస్తున్నారు.

ఫొటో సోర్స్, FACE BOOK
పెద్దగా చర్చల్లో లేని కొత్త నాయకుడిని తెలంగాణ స్పీకర్‌గా ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ. ఎవరూ ఊహించని విధంగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆ పదవి చేపట్టబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా దళిత నేత స్పీకర్ కాబోతున్నారు.
59 ఏళ్ల గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మర్పల్లి కలాన్‌కు చెందిన వ్యక్తి. ఆయన తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు.
మర్పల్లి మండల పరిషత్ అధ్యక్షులుగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఈయన 2008లో జరిగిన ఉప ఎన్నికలో వికారాబాద్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికలు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి విడతలోనే మంత్రిగా పనిచేసే అవకాశం ప్రసాద్ కుమార్‌కు దక్కింది. 2012 నుంచి 2014 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. పలు పార్టీ పదవుల్లో పనిచేశారు. ఎస్సీ మాల వర్గానికి చెందిన ప్రసాద్, మితభాషి.. వివాదరహితుడిగా పేరుంది.
దీంతో ప్రస్తుతం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు దళితులకు మూడు కీలక పదవులు ఇచ్చినట్లు అయ్యింది.
మాల వర్గం నుంచి భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కగా, మాదిగ వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహకు మంత్రి పదవి దక్కింది.

ఫొటో సోర్స్, FACE BOOK
ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు కోసం పోటీపడిన తెలంగాణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు.
కాంగ్రెస్ పార్టీలో అత్యంత సుదీర్ఘ కాలం పనిచేసిన నాయకుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు.
హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు.
ప్రస్తుతం ఆయన నల్లగొండ ఎంపీగానూ ఉన్నారు.

ఫొటో సోర్స్, FACE BOOK
భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.
గతంలో నాలుగు సార్లు వరుసగా నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో భువనగిరి ఎంపీగా గెలిచారు.
తాజాగా నల్లగొండ నుంచి మరోసారి గెలిచి ఇప్పుడు మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగానూ పనిచేశారు.

ఫొటో సోర్స్, FACE BOOK
ధన్సర అనసూయ అలియాస్ సీతక్క.
నక్సల్స్ నేపథ్యం నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆదివాసీల సేవలో ముందుంటారు.
ఇటీవల తెలంగాణను అతలాకుతలం చేసిన భారీవర్షాల వేళ దారీతెన్నూ లేని ప్రాంతాలలో ఆదివాసీలను చేరుకోవడానికి సీతక్క చేసిన ప్రయాణం అందరి మన్ననలు పొందారు.
ములుగు నుంచి వరుసగా రెండోసారి ఎన్నికైన సీతక్క, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

ఫొటో సోర్స్, FACE BOOK
దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నుంచి పోటీ చేసి గెలిచారు.
ఆయన తండ్రి దుద్దిళ్ళ శ్రీపాదరావు హత్య తరువాత రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు, 2014 ఎన్నికలలో మినహా మంథని నుంచి వరుసగా గెలుస్తున్నారు.
ఈయన తండ్రి శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్‌గా పనిచేశారు.
శ్రీధర్ బాబు ఇప్పుడు తెలంగాణ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. మంథని నుంచి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, FACE BOOK
దామోదర రాజనర్సింహ 1989 నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆందోల్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు.
మధ్యలో రెండుసార్లు ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈయన వైఎస్, రోశయ్య మంత్రి వర్గాలలో పనిచేశారు. తరువాత 2011లో ఉపముఖ్యమంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, FACE BOOK
ఖమ్మం జిల్లా రాజకీయాలలో తుమ్మల నాగేశ్వర రావు ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తుమ్మలకు టీడీపీతో విడదీయరాని అనుబంధం ఉంది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో జరిగిన ఎన్నికలలో ఆయన ఖమ్మం నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు.
తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేసి ఓడిపోయారు.
ఇటీవలే ఆయన బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందారు.

ఫొటో సోర్స్, FACE BOOK
పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో పార్లమెంటులో గట్టిగా కొట్లాడారు.
తరువాత 2014, 2109 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగిన ఆయనకు నిరాశే ఎదురైంది.
తాజా ఎన్నికలలో హుస్నాబాద్ నుంచి పోటీచేసి గెలిచారు. ఇప్పడు రేవంత్ మంత్రి వర్గంలో స్థానం లభించింది.

ఫొటో సోర్స్, FACE BOOK
పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొన్ని నెలల కిందటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మాజీ ఎంపీ.
ఈయన 2014 ఎన్నికలలో ఖమ్మం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు. తరువాత టీఆర్ఎస్‌లో చేరారు.
తాజా ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఈయన పాలేరు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తీసుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో పదవీ పొందారు.

ఫొటో సోర్స్, FACE BOOK
కొండా సురేఖ వరంగల్ రాజకీయాలలో కీలక నేతగా ఉన్నారు. 1995 నుంచి రాజకీయాలలో ఉన్నారు.
ఈమె 2009లో వైఎస్సార్ ప్రభుత్వంలో స్త్రీశిశు సంక్షేమశాఖా మంత్రిగా పనిచేశారు.
2014లో టీఆర్‌ఎస్‌లో చేరి వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
2018లో కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేశారు. పరకాలలో ఆమె ఓడిపోయారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ తరపున వరంగల్ తూర్పు నుంచి గెలిచి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.

ఫొటో సోర్స్, FACE BOOK
కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. 1999 నుంచి ఈయన రాజకీయాలలో ఉన్నారు.
2004లో కొల్లాపూర్ సీటును పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌కు కేటాయించడంతో జూపల్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేశారు.
తరువాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొందారు. తరువాత బీఆర్ఎస్‌లో చూశారు.
అయితే, 2018లో జూపల్లి ఓడిపోయారు. ఈయనపై గెలిచిన బీరం హర్షవర్థన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో జూపల్లి కొన్ని నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు.
ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందారు.
ఇవి కూడా చదవండి..
- తెలంగాణ ఎన్నికలలో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న మూడు పాటలు
- బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..
- పోలింగ్‌కు ముందు అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా పడతాయా? చట్టం ఏం చెబుతోంది?
- తెలంగాణలో సోషల్ మీడియా ప్రచారం గీత దాటుతోందా... బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ యాడ్స్‌పై నిషేధం ఎందుకు?
- కేసీఆర్ ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల పాత్ర ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















