తెలంగాణ విజయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నసమయంలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభించారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఈ పాదయాత్ర సాగింది.
వర్గాలుగా విడగొట్టిన దేశాన్ని ‘ప్రేమ దుకాణాలు’ (మొహబ్బత్ కే దుకాణ్) తెరిచి ఒకతాటిపై తేవడం ‘భారత్ జోడ్’ లక్ష్యం అని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది.
కర్ణాటక మీదుగా తెలంగాణలోకి ప్రవేశించిన ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 2022 అక్టోబర్ 23 నుండి నవంబర్ 7 వరకు 12 రోజుల పాటు పాదయాత్ర చేశారు. (24,25,26 దీపావళి కారణంగా యాత్రకు విరామం ఇచ్చారు.)
17 అసెంబ్లీ స్థానాల పరిధిలో 375 కిలోమీటర్లు కొనసాగిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లను గెలిచింది?

ఫొటో సోర్స్, BharatJodoYatra
తెలంగాణలో భారత్ జోడో
తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు దఫాలు ప్రతిపక్ష స్థానానికే పరిమితం అయింది.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 64 సీట్లలో విజయం సాధించి మొదటిసారి అధికారంలోకి వస్తోంది.
తెలంగాణ ఏర్పడ్డ పదేళ్ల తర్వాత అధికారానికి దగ్గరైన కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర ఎంత వరకు తోడ్పడిందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, P.Srinivas
భారత్ జోడో యాత్ర జరిగిన 17 శాసనసభ స్థానాల్లో ఫలితాలను చూస్తే.. 8 స్థానాలు.. మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, ఆందోల్, నారాయణఖేడ్, జుక్కల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
నాంపల్లి, పటాన్ చెరు, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, కూకట్ పల్లి స్థానాల్లో రెండో స్థానంలో నిలవగా.. రాజేంద్రనగర్, బహదూర్ పుర, చార్మినార్, గోషామహల్‌లో మూడో స్థానంలో నిలిచింది.
యాత్ర జరిగిన స్థానాల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని కాంగ్రెస్ విజయానికి భారత్ జోడో యాత్ర ఒక్కటే కారణం కాదని, కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ,స్థానిక అంశాలు తోడయ్యాయన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
‘’భారత్ జోడో యాత్ర ప్రభావం నేరుగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉందని అనుకోవడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కనీసం 40 స్థానాల్లో సరైన అభ్యర్థులు లేని పరిస్థితి నుండి అధికారం చేపట్టేంత వరకు కర్ణాటక విజయం ప్రేరణ అయ్యింది’’ అని తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్, మాజీ ఐఎఎస్ అధికారి ఆకునూరు మురళీ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, P.Srinivas
మిశ్రమ ఫలితాలు
వివిధ వర్గాలతో సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లు, ప్రధానమైన ప్రాంతాల్లో సభలు ఇలా భారత్ జోడో యాత్ర సాగింది. యాత్ర సాగిన నియోజకవర్గాల్లో పార్టీకి ఫలితాలు మిశ్రమంగా వచ్చాయనే చెప్పాలి.
తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రవేశించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీట్లు ఎక్కువగా వచ్చాయి. ఆ జిల్లాలో మొత్తం 14 స్థానాల్లో 12 కాంగ్రెస్ గెలిచింది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు రాలేదు.
“ఈ విజయం క్రెడిట్ మొత్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రదే అనలేం. నిజంగా అంత ప్రభావమే ఉంటే కాంగ్రెస్‌కు ఇంకా మెరుగైన సంఖ్యలో సీట్లు రావాల్సి ఉంది. నిజానికి యాత్ర సాగిన సమయంలో వచ్చిన మునుగోడు ఉపఎన్నికలపై ఏమాత్రం ప్రభావం లేదు. అయితే, కాంగ్రెస్ విజయానికి దోహదపడ్డ చాలా కారణాల్లో రాహుల్ యాత్ర ఒక కారణం మాత్రమే’’ అని రాజకీయ పరిశీలకులు పాల్వాయి రాఘవేంద్ర రెడ్డి బీబీసీతో అన్నారు.
కాంగ్రెస్‌పై సానుకూలత కంటే కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇంకెంత కాలం అని సామాన్య ఓటర్లలో కలిగిన భావన కాంగ్రెస్ విజయానికి ఎక్కువగా దోహదపడ్డాయని ఆయన అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక రాహుల్ గాంధీ యాత్ర ప్రత్యక్ష, పరోక్ష పాత్ర పోషించిందని, భారత్ జోడో కు కొనసాగింపుగా జరిగిన ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రల ద్వారా జోష్ అలాగే కొనసాగిందని ఆ పార్టీకి చెందిన కొంతమంది అభిప్రాయపడ్డారు.
‘’భారత్ జోడోలో భాగంగా రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, యువత ఇలా వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశాల ఫలితంగానే పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించింది. మేనిఫెస్టోలో వారికి పరిష్కారాలు ఉన్నందు వల్ల ప్రజల్లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై నమ్మకం, విశ్వాసం కలిగింది. అదే 64 ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చింది’’ అని తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్ అన్నారు.
హైదరాబాద్‌లో బీజేపీవల్ల ఓట్లు చీలిపోయాయన్న వెంకట్, గ్రామీణ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని హామీలు ఇచ్చినందు వల్ల పట్టణ ప్రాంతాలకన్నా పల్లెల్లో ఓట్లు ఎక్కువగా వచ్చాయని వెంకట్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు సాధించేవారిమేమోనని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, BharatJodoYatra
పరోక్ష ప్రభావం
యాత్ర జరగని స్థానాల్లో భారత్ జోడో పరోక్ష ప్రభావం చూపిందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
‘భారత్ జోడో’ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు కనెక్ట్ అయ్యింది. యాత్ర జరగని సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ మంచి ఫలితాలు వచ్చాయి. దూర ప్రాంతాల నుండి యాత్ర జరుగుతున్న ప్రదేశాలకు కార్యకర్తలు తరలివెళ్లారు. వరంగల్ డిక్లరేషన్ ప్రభావం రైతులపై పడింది’’ అని ఏఐసీసీ ఆదివాసీ విభాగం జాతీయ కోఆర్టినేటర్ కోట్నాక తిరుపతి బీబీసీతో అన్నారు.
పార్టీ పరంగా కాంగ్రెస్‌కు ఊపు తేవడంలో యాత్ర పనిచేసిందని, గతంలో తెలంగాణలో పార్టీకి సంస్థాగత ఓటర్లుగా ఉన్న దళితులు, మైనార్టీ ఓటర్లను దగ్గర చేసిందన్న అభిప్రాయం ఉంది. రాహుల్ గాంధీ యాత్ర వల్లే తెలంగాణలో నేరుగా పార్టీకి విజయం దక్కకపోయినా, ఎంతో కొంత ఉపయోగపడిందన్న అంశంలో సందేహం లేదని ఎక్కువ మంది నిపుణుల మాట.
అదే సందర్భంలో రాహుల్ గాంధీ ఇమేజీని భారత్ జోడో పెంచిందన్న అభిప్రాయాలున్నాయి.
‘’ తెలంగాణ కాంగ్రెస్ పునరుజ్జీవనానికి భారత్ జోడో యాత్ర తోడ్పడింది. యాత్రకు ప్రజల నుండి వచ్చిన స్పందన రాబోయే పరిస్థితులను అంచనా వేసేందుకు తోడ్పడింది. ఆయన నాయకత్వ సామర్థ్యాలపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను భారత్ జోడో దూరం చేసింది.’’ అని భారత్ జోడోను విస్తృతంగా కవర్ చేసిన ఆదిలాబాద్ జిల్లా డెక్కన్ క్రానికల్ సీనియర్ జర్నలిస్టు పిల్లలమర్రి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- టికెట్ కోసం పార్టీలు మారి గెలిచిందెవరు? ఓడిందెవరు?
- ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ను ఎగ్జిట్ పోల్స్ ఎలా పట్టిస్తాయి, ఒక్కోసారి ఎందుకు ఫెయిల్ అవుతాయి?
- ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా, ఆమోదించిన గవర్నర్
- తెలంగాణ ఎన్నికలు: పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎందరు, యువ ఓటర్ల సంఖ్య ఎంత... మీరు తెలుసుకోవాల్సిన 9 ఆసక్తికర అంశాలు
- తెలంగాణ ఎన్నికలు: బీఆర్ఎస్ ఒక్కసారీ గెలవని 17 నియోజకవర్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














