టికెట్‌ కోసం పార్టీలు మారి గెలిచిందెవరు? ఓడిందెవరు?

మైనంపల్లి హనుమంతరావు

ఫొటో సోర్స్, FB/mynampallyh

ఫొటో క్యాప్షన్, మైనంపల్లి హనుమంతరావు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలిచి అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ 60 స్థానాలు దాటి స్పష్టమైన మెజార్టీని సాధించింది.

2018 ఎన్నికల్లో 88 స్థానాలతో విజయఢంకా మోగించి, ఐదేళ్లు పాలన సాగించిన బీఆర్ఎస్(అప్పట్లో టీఆర్‌ఎస్) ఈసారి 39 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే, ఈ ఎన్నికల్లో నేతల పార్టీల మార్పు కూడా ఎన్నికల ఫలితాలపై పెద్ద ప్రభావమే చూపింది. చాలా మంది నేతల తలరాతలను మార్చేసింది.

గత ఎన్నికల తర్వాత మొదలైన నేతల పార్టీ మార్పులు ఎన్నికల ముందు వరకూ కొనసాగాయి. టికెట్లు రావనే భయంతోనో, లేక అధినేతలను మెప్పించలేకనో కానీ ఎన్నికల వేళ చాలా మంది కండువాలు మార్చేశారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల చేరికలు చకచకా జరిగిపోయాయి.

అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు కొందరైతే, హస్తం పార్టీ నుంచి కారు పార్టీలో చేరిన వారు మరికొందరు. బీజేపీలోనూ వలసలు ఉన్నాయి.

ఇంతకూ ఎవరా నేతలు? పార్టీల మార్పు వారి రాజకీయ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది? పార్టీలు మారి గెలిచిందెవరు? ఓడిందెవరు?

సబితా ఇంద్రారెడ్డి

ఫొటో సోర్స్, SabithaIndraReddy/FB

ఫొటో క్యాప్షన్, సబితా ఇంద్రారెడ్డి

పార్టీ మారిన ఆ 14 మంది ఎమ్మెల్యేల పరిస్థితేంటి?

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ తరపున గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌(అప్పట్లో టీఆర్‌ఎస్)లో చేరారు.

మొత్తంగా 14 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వీరిలో ఇద్దరు మాత్రమే తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా గెలుపొందారు.

2018లో కాంగ్రెస్ తరపున గెలిచి, పార్టీ మారిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఆమె ఈ ఎన్నికల్లో 26,320 ఓట్ల తేడాతో సమీప బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌ను ఓడించి విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్) మూడో స్థానానికే పరిమితమయ్యారు.

ఎల్బీ నగర్ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈసారి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థిపై 22,312 ఓట్ల మెజార్టీతో సుధీర్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ గౌడ్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్యేల్లో కొందరు టికెట్ దక్కించుకోలేకపోయారు. మరికొందరు టికెట్ దక్కించుకున్నా విజయాన్ని అందుకోలేకపోయారు.

పైలట్ రోహిత్ రెడ్డి

ఫొటో సోర్స్, PilotRohithReddy/FB

ఫొటో క్యాప్షన్, తాండూర్‌ స్థానానికి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి

ఎన్నికల రేసులో వెనకబడ్డ నేతలు

2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే, ఆయన ఈసారి టికెట్ కూడా దక్కించుకోలేకపోయారు. పార్టీ మారడం సహా వివిధ కారణాలతో ఆత్రం సక్కుపై ప్రజావ్యతిరేకత పెరిగిపోయిందనే కారణంతో పక్కనబెట్టారు. ఆయన స్థానంలో ఈసారి బీఆర్ఎస్ తరపున కోవా లక్ష్మి బరిలో దిగి, విజయం సాధించారు.

గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఈసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. డిసెంబరు 3న వచ్చిన ఫలితాల్లో ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు అక్కడ విజయం సాధించగా, రెండో స్థానంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు నిలిచారు.

పాలేరు నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన కందాళ ఉపేందర్ రెడ్డి, ఈసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ తరపున పోటీచేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఆయన 56,650 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

గతంలో భూపాలపల్లిలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డిని ఈసారి ఓటర్లు ఆమోదించలేదు. బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన ఆయన్ను 52,699 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ తరపున గండ్ర సత్యనారాయణ గెలుపొందారు.

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ మారి, బీఆర్ఎస్ జెండాతో బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి చేతిలో ఆయన 6,583 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన బీరం హర్షవర్థన్ రెడ్డికీ ఈసారి ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో హర్షవర్థన్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఈసారి కాంగ్రెస్ తరపున నిలబడి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి 29,931 ఓట్ల ఆధిక్యంతో గెలవగా, బీరం హర్షవర్థన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.

హరిప్రియా నాయక్

ఫొటో సోర్స్, HariPriyaNayak/FB

ఫొటో క్యాప్షన్, ఇల్లందులో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన హరిప్రియా నాయక్ ఓటమి పాలయ్యారు.

2018లో ఎల్లారెడ్డి నుంచి గెలిచిన జాజాల సురేందర్, ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్‌కు 24,001 ఓట్ల మెజార్టీ వచ్చింది. సురేందర్‌కి రెండో స్థానం దక్కింది.

ఎస్సీ రిజర్వుడ్ స్థానం నకిరేకల్ నుంచి గెలిచి, బీఆర్ఎస్‌లో చేరిన చిరుమర్తి లింగయ్యకు ఘోర పరాజయం ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం 68,838 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వీరేశం కూడా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి, పోటీకి దిగారు.

ఎస్టీ రిజర్వుడు స్థానమైన పినపాక నుంచి గత ఎన్నికల్లో గెలిచి, పార్టీ మారిన రేగా కాంతారావుకు ఓటమి తప్పలేదు. ఈసారి బీఆర్ఎస్ తరపున పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు చేతిలో 34,506 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఎస్టీ రిజర్వుడు స్థానమైన ఇల్లందులోనూ ఇదే జరిగింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి, బీఆర్ఎస్‌లో చేరిన హరిప్రియా నాయక్‌‌ ఈసారి బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 57,309 ఓట్ల తేడాతో హరిప్రియపై విజయం సాధించారు.

2018లో సత్తుపల్లి ఎస్సీ రిజర్వుడు సీటు నుంచి టీడీపీ తరపున గెలిచిన సండ్ర వెంకట వీరయ్య ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి చేతిలో 19,440 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

గత ఎన్నికల్లో అశ్వారావుపేటలో టీడీపీ తరపున గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేశారు. విజయం దక్కలేదు. ఈ స్థానం కాంగ్రెస్‌ గెలుచుకుంది. జారె ఆదినారాయణ 28,905 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఫొటో సోర్స్, PONGULETI SRINIVASA REDDY

ఫొటో క్యాప్షన్, పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన పొంగులేటి విజయం సాధించారు.

చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి విజయం

అధికార బీఆర్ఎస్‌ పార్టీలో ఈసారి ఎన్నికల్లో సీటు దక్కక కొందరు, ఇతర అనేక కారణాలతో చివరి నిమిషంలో కండువా మార్చిన నేతల్లో కొందరు విజయం సాధించారు. మరికొందరు విజయతీరాలకు చేరలేకపోయారు.

బీఆర్ఎస్ తనకు టికెట్ ప్రకటించినప్పటికీ తన కుమారుడి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆ పార్టీని వీడి, కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హనుమంతరావుకు ఓటమి ఎదురైంది. కాంగ్రెస్ తరపున మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో 49,530 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అయితే, ఆయన పట్టుబట్టి మరీ కుమారుడి కోసం సాధించుకున్న స్థానంలో మాత్రం విజయం వరించింది. మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందారు.

పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరావుతోపాటు జూపల్లి కృష్ణారావు( కొల్లాపూర్), కసిరెడ్డి నారాయణరెడ్డి( కల్వకుర్తి), మేఘారెడ్డి (వనపర్తి), కూచుకళ్ల రాజేష్ రెడ్డి( నాగర్ కర్నూలు) గెలిచారు.

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా మహబూబ్ నగర్ నుంచి గెలుపొందారు.

బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వారిలో గడ్డం వివేక్( చెన్నూరు), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), రేవూరి ప్రకాశరెడ్డి(పరకాల) నుంచి గెలుపొందారు.

పొంగులేటి, కోమటిరెడ్డి వెంట కాంగ్రెస్ కండువాలు కప్పుకుని, చివరి నిమిషంలో టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న ఇతర నేతల్లో పాయం వెంకటేశ్వర్లు( పినపాక), కోరం కనకయ్య(ఇల్లందు), మందల శామేల్( తుంగతుర్తి), వేముల వీరేశం( నకిరేకల్) గెలుపొందారు.

తెలంగాణ

ఫొటో సోర్స్, facebook

కాంగ్రెస్‌ టికెట్ దక్కినా...

ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్న వారిలో కూడా పలువురు ఓటమి పాలయ్యారు. ఈ జాబితాలో ఏనుగు రవీందర్ రెడ్డి( బాన్సువాడ), విజయకుమార్ రెడ్డి( ఆర్మూరు), చంద్రశేఖర్ (జహీరాబాద్) వంటి మాజీ బీజేపీ నేతలు పరాజయం చవిచూశారు.

బీఆర్ఎస్‌ను వీడి, కాంగ్రెస్ జెండా పట్టినా బండి రమేష్( కూకట్ పల్లి), జగదీశ్వర్ గౌడ్(శేరిలింగంపల్లి), శ్రీహరిరావు( నిర్మల్), విడతల ప్రణవ్( హుజూరాబాద్), శ్యామ్ నాయక్(ఆసిఫాబాద్), రావి శ్రీనివాస్( సిర్పూర్), పురుమల్ల శ్రీనివాస్( కరీంనగర్)‌ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇచ్చినా ఆయా నియోజకవర్గాల ఓటర్ల మన్ననలు పొందలేకపోయారు.

ఏనుగు రవీందర్ రెడ్డి

ఫొటో సోర్స్, EanuguRavindarReddy/FB

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ పార్టీ తరపున బాన్సువాడ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు.

మొత్తంగా ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు మారిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఓటర్ల చేతిలో కంగుతినాల్సి వచ్చింది. వారికి సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్‌ చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది.

అయితే, చివరి నిమిషంలో పార్టీ కండువాలు మార్చిన నేతలు మాత్రం మిశ్రమ ఫలితాలు చవిచూశారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)