నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి రాహుల్ గాంధీ ఇమేజ్‌ను దెబ్బతీసిందా? 2024లో మోదీని ఆయన ఢీకొట్టగలరా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, మహమ్మద్ షాహీద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘కాంగ్రెస్ సమస్య నాకు అర్థమైంది. విఫలమైన ఉత్పత్తినే ఏళ్ళతరబడి మళ్ళీ మళ్ళీ ఆవిష్కరిస్తూ వస్తోంది. ప్రతిసారీ వారు విఫలమైనప్పుడల్లా ఓటర్ల పట్ల వారి ద్వేషభావం కూడా ఆకాశాన్ని తాకుతోంది’’
పై మాటలను ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఆగస్టు 10న రాహుల్ గాంధీని ఉద్దేశించి చేశారు. అప్పట్లో ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2019 ఎన్నికలలో ఆ పార్టీ పరాజయాన్ని ఎత్తిచూపడానికి ఆయన ఇలా వ్యాఖ్యానించారు.
మరోపక్క అనేక రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది.
ఈ జాబితాలో ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత కరిష్మాను ప్రజలు ఆశించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ప్రచారం చేసినా ఉపయోగం లేకపోయింది.
రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా లేరు. కానీ పార్టీ మొత్తం గాంధీ కుటుంబం చుట్టూనే తిరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్‌లలో అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లో ఘోరంగా ఓడిపోయింది. అదే సమయంలో మిజోరంలో ఒకే ఒక సీటుకు పరిమితమైంది.
అయితే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఓడించి చరిత్రాత్మక విజయాన్ని కాంగ్రెస్ సాధించింది.
ఇప్పుడు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని గాంధీ కుటుంబ ఓటమిగా చూడాలా? లేక రాహుల్ గాంధీ ఓటమిగా చూడాలా?

ఫొటో సోర్స్, ANI
బీజేపీ ముఖచిత్రంగా మోదీ, మరి కాంగ్రెస్‌కు..?
రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో ముందుంటే, కేంద్ర మంత్రులు ఆయన వెనుక ఉన్నారు.
అదే కాంగ్రెస్ విషయానికొస్తే, ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ప్రచారంలో ముందుంటే, రాహుల్ వారి వెనుక ఉన్నారు. రాజస్థాన్‌లో రాహుల్ చాలా తక్కువగా ప్రచారం చేశారు. కానీ తెలంగాణలో మాత్రం ఎక్కువగా చేశారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదాలను తెలంగాణలో తప్ప మిగిలిన రాష్ట్రాలలో ఆ పార్టీ నేతలు విరివిగా వినియోగించలేదు.
ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్ బఘేల్, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ తమ ప్రభుత్వ విజయాలనే ప్రచారం చేశారు.
మధ్యప్రదేశ్‌లో మాజీ సీఎం కమల్‌నాథ్ మొత్తం ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. తెలంగాణలో ఎన్నికల బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భుజాన మోశారు.
దీన్నిబట్టి వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు ఆయా నాయకులు నేతృత్వం వహించినప్పుడు ఈ ఓటమికి రాహుల్ గాంధీ బాధ్యత వహించాలా? కాంగ్రెస్ కార్యకలాపాలను కవర్ చేసే పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పాత్రికేయుడు మాట్లాడుతూ- కాంగ్రెస్ ఓడిపోయిందంటే దానర్థం ప్రజలు గాంధీ కుటుంబం నాయకత్వంపై విశ్వాసం పెట్టుకోలేదన్నట్టుగా అర్థం చేసుకోవాలని చెప్పారు.
‘‘కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఎన్నికలలో సమానంగా ప్రచారం చేశారు. అందువల్లే ఇది బఘేల్, గహ్లోత్, కమల్ నాథ్ ఓటమి. జాతీయ స్థాయిలో ఇది గాంధీ కుటుంబ ఓటమి, రాహుల్ గాంధీ ఓటమి కూడా’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, ANI
ఓటమికి స్థానిక నేతలే కారణమా?
సీనియర్ రాజకీయ విశ్లేషకురాలు నీరజా చౌదరి మాట్లాడుతూ- ఈ అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ గాంధీని పెద్దగా ముందుకు తీసుకురాలేదని, ఆయనకు అంతగా ఆకర్షణ లేదని చెప్పారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అక్కడి స్థానిక నాయకులు పోటీ చేశారు. ఛత్తీస్‌గడ్‌లో ప్రజలు చాలా మంది స్థానికంగా పోటీచేస్తున్న అభ్యర్థులపై కోపంగా ఉన్నారు. కానీ వారు భూపేష్ బఘేల్‌ను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. దీన్నిబట్టి ఛత్తీస్‌గఢ్ విషయం అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ గెలిచి ఉంటే అక్కడ ఎవరు ముఖ్యమంత్రులు అయ్యేవారు’’ అని నీరజ ప్రశ్నించారు.
‘‘రాజస్థాన్‌లో ప్రజలు అశోక్ గహ్లోత్ గురించే మాట్లడేవారు. వారెప్పుడు రాహుల్ గాంధీని ప్రస్తావించలేదు. తెలంగాణలో రాహుల్ గాంధీ ఎక్కువ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ విధంగా చూసినప్పుడు ఇది రాహుల్ గాంధీ ఓటమి కాదు.ఇది ఆయా రాష్ట్రాల నేతల ఓటమి. ఆయనేమీ ఈ ఎన్నికలలో పెద్దగా ముందంజ వేసిందీ లేదు’’ అని ఆమె విశ్లేషించారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నిశితంగా గమనించే సీనియర్ రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్, పార్టీలో పెద్ద నేతలకు విజయాల ఘనతను కట్టబెట్టడమనే భావనను పార్టీలు సృష్టిస్తుంటాయని చెప్పారు.
ఈసారి నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆయా రాష్ట్రాల నేతలే కారణమని, రాహుల్, ప్రియాంక కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని ఆయన తెలిపారు. అందుకే ఇవి రాహుల్ గాంధీకి సంబంధించిన ఎన్నికలు కావంటాను అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
భారత్ జోడో యాత్ర ప్రభావమెంత?
రాహుల్ గాంధీ నిరుడు సెప్టెంబరులో కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు. దాదాపు 137 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ మీదుగా సాగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జోడో యాత్ర కారణంగా ఈ గెలుపు ఘనతను రాహుల్‌కు ఆపాదించారు.
తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలిచింది. మరి జోడో యాత్ర మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా కూడా సాగింది. కానీ అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది.
భారత్ జోడో యాత్ర ఉత్తర భారతంపై ఎలాంటి ప్రభావమూ చూపలేదా? దీనిపై నీరజా చౌదరి మాట్లాడుతూ- జోడో యాత్ర కారణంగా ప్రజలు రాహుల్ గాంధీని చూసే దృక్పథం మారిందని, ఆయనను ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారని, ఆయనలో నిజాయతీ ఉందని నమ్మారు. కానీ ఆయన్ను ప్రధాని మోదీకి పోటీదారుగా మాత్రం పరిగణించలేదు అని విశ్లేషించారు.
మీరెవరైనా యువకుడిని రాహుల్ గాంధీ నరేంద్ర మోదీకి పోటీ ఇవ్వగలరా అని అడగండి, వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు. ‘‘ఈ యువత భారత్ జోడో యాత్రను ప్రశంసిస్తారు, కానీ వారు రాహుల్ గాంధీని ఇష్టపడటం లేదు. వారు ఆయన్నో సమర్థవంతమైన నేతగా చూడటం లేదు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘దీనికితోడు కాంగ్రెస్ కూడా భారత్ జోడో యాత్రను ఎక్కువ చేసి చూపిస్తోంది. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ విజయం స్థానిక నాయకత్వం వల్లే సాధ్యమైంది’’ అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, BHARAT JODO/ FB
కులగణన, ద్వేషం మార్కెట్లో ప్రేమ దుకాణం
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో రాహుల్ గాంధీ ప్రసంగం దాదాపు ఒకేరకంగా సాగింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలను పొగడటం, అధికారంలోకి తిరిగి వస్తే కులగణన చేపడతామని చెప్పారు.
కానీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఆయన రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలను విమర్శించారు.
తెలంగాణలో కూడా రాహుల్ ఇదే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపైనా, ప్రధాని మోదీపైనా విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అనేక ప్రయోజనాలు అందిస్తామని వాగ్దానం చేశారు.
ఈ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ కులగణన చేస్తామంటూ చేసిన వాగ్దానాన్ని స్థానిక నాయకులు పెద్దగా ప్రచారంలోకి తీసుకురాలేదు.
స్థానిక నేతలందరూ కూడా కుల సమీకరణాలు, స్థానిక అంశాల ఆధారంగా ఓట్లు పొందాలని చూశారు.
వీటితోపాటు రాహుల్ గాంధీ, ‘‘ నేను ద్వేషమనే మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తాను’’ అనే పాత నినాదాన్ని కూడా పదేపదే వల్లె వేశారు. అయితే కులగణన వాగ్దానం పనిచేయలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
దీంతోపాటు రాహుల్ గాంధీ మత, విద్వేష రాజకీయాల గురించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు లేవనెత్తారు. దీనిపై రషీద్ కిద్వాయ్ స్పందిస్తూ రాహుల్ గాంధీ కచ్చితంగా సైద్ధాంతిక ఓటమి పాలయ్యారని చెప్పారు.
‘‘ఆయన ప్రేమ దుకాణం తెరుస్తానని చెప్పిన విషయం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విఫలమైంది. ఇందుకు కారణాలేమిటో కాంగ్రెస్ అన్వేషించాలి. సాంస్కృతిక జాతీయవాదం విషయానికొచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలందరూ తలో విధంగా మాట్లాడతారు. కానీ బీజేపీ, నరేంద్ర మోదీ విషయాన్ని నేరుగా మాట్లాడతారు’’ అని రషీద్ విశ్లేషించారు.
‘‘రాహుల్ గాంధీ చేస్తున్న తప్పేమిటంటే ఆయన తన భావజాలమేమిటో స్పష్టంగా చెప్పరు. కులగణనపై ఆయన పార్టీలో ఏకాభిప్రాయం లేదు. 2019 ఎన్నికలలో ఆయన ‘చౌకీదార్ చోర్ హై’ అని ఇచ్చిన నినాదాన్ని ఆయన సొంత పార్టీ నేతలే దూరం పెట్టారు’’ అని తెలిపారు.
‘‘స్థానిక నేతలు రాహుల్ గాంధీ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో చెప్పుకోదగ్గ సంఖ్యలో వెనుకబడిన ప్రజలు బీజేపీ పక్షాన ఉన్నారు. కులగణన అంటే ఏమిటో కాంగ్రెస్ పార్టీ వీరికి విడమరిచి చెప్పలేకపోయింది, కాంగ్రెస్ ప్రజలకు నేరుగా ఈ విషయాన్ని చేరువ చేయలేకపోయింది’’ అంటారు రషీద్.
2024లో మోదీని రాహుల్ ఛాలెంజ్ చేయగలరా?
రాహుల్ గాంధీ నాయకత్వ పాత్ర పోషించినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ తక్కువ విజయాలు, ఎక్కువ అపజయాలు చూసింది. మరో ఆరు నెలల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. మరి రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీని ఛాలెంజ్ చేయగలుగుతారా?
దీనిపై రషీద్ మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడు. తన పాత్ర ఏమిటనేది రాహులే నిర్ణయించుకోవాలన్నారు.
‘‘ 2024లో ఇండియా కూటమికి తానే ముఖచిత్రంగా ఉండాలా, లేక ప్రచారానికి పరిమితమవ్వాలా అనేది ఆయనే నిర్ణయించుకోవాలి. ఆయనేం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నావనేది చాలా ముఖ్యం. అదేమిటో కూడా మనకు చెప్పాలి. 2019లో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థా, కాదా అనే విషయంలో బోలెడంత గందగరగోళం నడిచింది’’ అని చెప్పారు.
నీరజా చౌదరి మాట్లాడుతూ- ‘‘తరువాత ఏం చేయాలనే విషయంపై కాంగ్రెస్ సమీక్షించుకోవాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు నరేంద్ర మోదీకి అనుకూలంగా మారుతున్నాయి. 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ఎక్కడా చెప్పలేదు. కాంగ్రెస్ ‘రాహుల్, రాహుల్’ అని పదేపదే చెపుతుంటే ప్రధాని మోదీ ముందుకు వస్తున్నారు’’ అని విశ్లేషించారు.
‘‘ఈ రోజు గురించి మాట్లాడుకుంటే ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సమవుజ్జీ కారు. ఆయన నరేంద్ర మోదీని ఎదుర్కొనలేరు. రేపు ఆయన నరేంద్ర మోదీకి పోటీ అవుతారో లేదో ఇప్పడు చెప్పలేం. నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమిని రాహుల్ ఓటమిగా చెప్పలేం. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కేసీఆర్ అహంకారం వల్ల వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న తీరు బావుంది. ప్రజలు మార్పు కోరుకోగానే వెంటనే కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారు’’ అని నీరజ చెప్పారు.
భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్‌ను మార్చివేసిందని విశ్లేషకులు నమ్ముతున్నారు. ఆయనను ఓ కష్టపడే, సీరియస్ రాజకీయ నాయకుడిగా ఈ యాత్ర మార్చివేసింది అని వారు చెప్పారు. ఆయన మోదీ ప్రభుత్వాన్ని అదానీ వ్యవహారం నుంచి చైనా వ్యవహారం దాకా ఇరకాటంలో పెట్టగలుగుతున్నారు.
ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో గెలిచింది. ఇండియా కూటమి ఏర్పాటైంది. ఈ కూటమి సమావేశంలో ప్రతిపక్ష నేతలు కూడా రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించింది.
దీన్నిబట్టి చూస్తే రాహుల్ గాంధీ స్థాయి క్రమంగా పెరుగుతోంది. కానీ హిందీ బెల్ట్‌లోని అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దెబ్బతింది. ఇది రాహుల్ గాంధీ స్థాయికి పెద్ద దెబ్బ. ఇప్పుడు వారి ప్రణాళికను సరికొత్తగా రచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి:
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?
- ‘అందరూ పడుకున్నాక ఇంటి యజమాని నా దగ్గరకు వచ్చేవాడు’: శరణార్థులపై బ్రిటన్‌లో లైంగిక దోపిడీ
- వెదురుతో భవనాలను ఎందుకు నిర్మిస్తున్నారు? దీని ప్రత్యేకత ఏంటి? అంగవైకల్యం ఉన్న ఆమె ఒక సెక్స్ వర్కర్‌ను ఎందుకు బుక్ చేసుకున్నారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.














