పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం: ‘నా కుటుంబం ఒక్కపూట భోజనానికి రూ.1500 కావాలి’

ఫొటో సోర్స్, AMEL GHANI/BBC
ఇంట్లో ఏడుగురు కుటుంబ సభ్యుల కడుపు ఎలా నింపాలా అనే ఆలోచనతోనే దినసరి కార్మికుడిగా బతికే అషి మాసీకి తెల్లారుతుంటుంది.
‘‘రేప్పొద్దున ఇంత అన్నం దొరికేందుకు దారి చూపమని దేవుడిని ప్రార్థిస్తుంటా’’ అని మాసీ బీబీసీకి చెప్పారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌లోని మొత్తం బట్టల మిల్లుల్లో మూడోవంతు అంటే సుమారు 1600 మిల్లులు మూతపడ్డాయి.
దీనివలన ఏడులక్షలమంది కార్మికుల ఉద్యోగాలు పోయాయి. ఇలాంటి లక్షలమందిలో 45 ఏళ్ళ మాసీ కూడా ఒకరు.
గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్స్‌కు బట్టలు సరఫరా చేసే ఒక ఫ్యాక్టరీలో మాసీ పనిచేస్తున్నారు. ఇప్పడీ ఫ్యాక్టరీ మూతపడింది. దీంతో ఆయన చిన్న చిన్న చేతి పనులు చేయడంతోపాటు ఆటోరిక్షా నడుపుతున్నారు.
లాహోర్‌లోని యోహానాబాద్‌లోగల పారిశ్రామికవాడలోని సింగిల్ రూమ్ అపార్ట్‌మెంట్‌లో మసకవెలుతురుతో మాసీ, ఆయన భార్య షమీమ్ కూర్చుని ఉన్నారు. పాకిస్తాన్‌లో పెరుగుతున్న జీవన వ్యయాలు తమని, తమ ఐదుగురు పిల్లలను ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో ఆయన వివరించారు.
ఈ జంట ఎక్కువ పనిగంటలు చేసి తమ ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారుల కడుపు నింపుతున్నారు. ఈ పిల్లలెవరూ బడికి వెళ్లడం లేదు.
‘‘ప్రతిరోజూ 500 పాకిస్తానీ రూపాయలతో ఎలాగో నెట్టుకొచ్చేవారం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ఒక్క పూట భోజనం కోసం 1500 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది’’ అని మాసీ చెప్పారు.
‘‘మేం సంపాదించేది మా బిడ్డలకు ఒక్కపూట తిండి పెట్టడానికే సరిపోవడం లేదు. ఇంక వారిని బడికి ఎలా పంపగలం?’’ అని మాసీ భార్య చెప్పారు.
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభ తాకిడితో రోజు గడవని లక్షలాదిమందిలో మాసీ కూడా ఒకరు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంధన ధరలు భారీగా పెంపు
పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ పొందాల్సి ఉంది. దీనికి అదనంగా పాకిస్తాన్ ఆర్థిక మంత్రి షంషాద్ అక్తర్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మరిన్ని నిధులు కోరినట్టు బ్లూమ్’బర్గ్ నివేదిక తెలిపింది.
ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరుగుదల మధ్య ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది.
గ్యాస్ ధరలను అమాంతం పెంచినవి తగ్గించకపోతే పరిశ్రమలను మూసివేస్తామని కరాచీలోని పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇప్పటికే దేశంలో నిత్యావసరాలు, ఇంధన ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అదనపు ఆదాయం సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) షరతుల కారణంగా ఇంధన సబ్సిడీలను ప్రభుత్వం దశలవారీగా తగ్గించడంతో సామాన్యుల కష్టాలు పెరిగాయి.
జూన్‌లో 38శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం నవంబర్‌లో 29శాతానికి దిగివచ్చింది. ఇటీవల కాలంలో గోధుమ పిండి, బియ్యం ధరలు రెండింతలు అయిపోవడాన్ని ‘ ఆర్థిక వినాశనం’ గా పాకిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ అభివర్ణించారు.
యుక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి తరువాత ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీనికి తోడు పాకిస్తాన్‌లో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగా 1600 బట్టల మిల్లులు మూతపడ్డాయి.
ఏప్రిల్ 2022లో ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి దించేసిన తరువాత రాజకీయ సంక్షోభం తలెత్తింది.
నెలల తరబడి నిరసనలు కొనసాగి ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకంగా పరిణమించాయి. వచ్చే ఏడాది ఎన్నికల వరకు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌ను పరిపాలిస్తోంది.
గత ఏడాది విరుచుకుపడ్డ వరదల కారణంగా 1700 మందికిపైగా ప్రజలు మరణించారు. వ్యవసాయ భూములు భారీగా ముంపునకు గురయ్యాయి.
దీనివలన కలిగిన నష్టాన్ని ప్రపంచబ్యాంకు 30 బిలియన్ డాలర్లుగా ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది.
షరియా చట్టాలను అమలు చేయాలంటూ ఇస్లామిక్ మిలిటెంట్ల ఆత్మాహుతి దాడులు, వరుసదాడులతో పాకిస్తాన్ భద్రతా సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటోంది.
పాకిస్తాన్‌లోని విభిన్నమైన భౌగోళికత, యువత ఎక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులకు ఈ దేశం ఆకట్టకునేలా కనిపిస్తోంది.
ప్రత్యేకించి కార్మికులు భారీ ఎత్తున అవసరమయ్యే వస్త్రాలు, ఆటోమొబైల్ రంగాలకు పాకిస్తాన్ కేంద్రంగా ఉంది.
అయితే ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి తోడు పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్’తో దశాబ్దల తరబడి కొనసాగుతున్న ఘర్షణ దేశాన్ని ప్రభావితం చేస్తోంది.
లక్షలాదిమంది అఫ్గాన్ శరణార్థులు పాకిస్తాన్ సరిహద్దులు దాటి వెళుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వంటగ్యాస్ ధరల పెంపు
‘‘పాకిస్తాన్ పై ప్రపంచ దృక్పథం అంత బాగాలేదు. శాంతిభద్రతలు సమస్యాత్మకమనే పేరు ఉంది. ఇక్కడ వ్యాపారం చేయడం అంత శ్రేయస్కరం కాదనే భావన ఉంది’’ అని ఇస్మాయిల్ చెప్పారు.
రుణాలు చెల్లించాల్సి ఉండగా, దిగుమతి బిల్లలు భారీగా పేరుకుపోతుండటంతో పాకిస్తాన్ వద్ద ఉన్న విదేశీ నిల్వలు ఈ ఏడాది మొదట్లో 300 కోట్ల డాలర్లకంటే దిగువకు పడిపోయాయి. ఇది ఒక్క నెల దిగుమతి బిల్లలు చెల్లించడానికి కూడా సరిపోదు.
అంతర్జాతీయ ద్రవ్యనిధితో పలుదఫాలుగా జరిగిన చర్చల ఫలితంగా 3 బిలియన్ డాలర్ల అత్యవసర నిధులు పొందేందుకు జులైలో అంగీకారం కుదిరింది.
పాకిస్తాన్ మిత్రదేశాలైన చైనా, సౌదీ అరేబియా, యూఏఈ కూడా పాకిస్తాన్ విదేశీ నగదు నిల్వలు తరిగిపోకుండా ఉండేందుకు తలో చేయి వేస్తున్నాయి.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో రుణం తీసుకునే కార్యక్రమానికి ముందు అక్టోబరులో ప్రభుత్వ రంగంలోని గ్యాస్ కంపెనీల నష్టాలను తగ్గించేందుకు తాత్కాలిక ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను, పారిశ్రామిక ఇంధన ధరలను పెంచారు.

ఫొటో సోర్స్, HELLENIC COAST GUARD
ఉపాధి కోసం సాహసం
సామాన్యులు గ్యాస్‌పై పెట్టే పది రూపాయలు ఖర్చు నుంచి 400 రూపాయలకు పెరిగింది.
‘‘మా కరెంట్ చార్జీలు రెండింతలయ్యాయి. పెరిగిపోతున్న ఉత్పత్తి ఖర్చులను భరించలేక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. వేలాదిమంది ఉపాధి కోల్పోతున్నారు’’ అని పాకిస్తాన్ టెక్స్‌టైల్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు కమ్రాన్ అర్షాద్ బీబీసీకి చెప్పారు.
పాకిస్తాన్‌లో ముదిరిన ఆర్థిక సంక్షోభం, ఉపాధి లేకపోవడంతో అనేకమంది అక్రమ మార్గాలలో దేశం వదిలిపోతున్నారు. వీరిలో చాలామంది కిక్కిరిసిపోయిన పడవలలో సముద్రాలపై అత్యంత ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు.
జూన్‌లో దక్షిణ గ్రీసులో కిక్కిరిసిపోయిన ఓ ట్రాలర్ బోల్తాపడి వందలాదిమంది పాకిస్తానీయులు మృతి చెందారు.
‘‘పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలలో నమ్మకం కోల్పోయింది. ఆర్థిక వాతావరణం అత్యంత భయంకరంగా ఉంది. అందుకే ప్రజలు దేశం వదిలిపోవడానికి సాహసిస్తున్నారు’’ అని యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా సాబ్రిన్ బెర్గ్ చెప్పారు.
ఒక దశాబ్దం క్రితం, పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో ఇస్లామిక్ మిలిటెంట్లతో పోరాడుతున్నప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో చైనా తప్ప మిగిలిన పెట్టుబడిదారులందరూ జాగ్రత్తగా ఉన్నారు .
కానీ చైనా మాత్రం ఆర్థిక వ్యవస్థలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులను కురిపించింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద, 2015లో ప్రారంభమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో చైనా 60 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడుతోంది.
ఇది అరేబియా సముద్రంలోని పాకిస్తాన్ పోర్ట్ ఆఫ్ గ్వాదర్‌ను చైనా వాయువ్య ప్రాంతం జిన్‌జియాంగ్‌తో కలుపుతుంది.
చైనా చేస్తున్న ఈ అతిపెద్ద విదేశీ పెట్టుబడితో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సహాయ పడుతుందని భావిస్తున్నారు.
అయితే ఈ పెట్టుబడులు చైనీస్ రుణాలను తిరిగి చెల్లించేందుకు సరిపడా ఆదాయాన్ని సృష్టించగలవా అని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం పాకిస్తాన్, చైనాకు దాదాపు 30 బిలియన్ డాలర్లు బకాయిపడింది.
"చైనీస్ పెట్టుబడి ఆశాజనకంగా ఉంది. కానీ మేము అరువు తెచ్చుకున్న నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం. దీనివలన మా బాధ్యత మరింత పెరిగింది. చైనాకు రుణాలను తిరిగి చెల్లిస్తాం." అని ప్రొఫెసర్ బేగ్ అన్నారు.
చైనాలాంటి ఉక్కు సోదరుడి మద్దతుతోపాటు ఫిబ్రవరిలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- మిగ్జాం తుపాను: ఆంధ్రా తీరంలో కల్లోలం, నేడు బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం
- యశస్విని, పర్ణిక, లాస్య నందిత, రాగమయి.. తెలంగాణలో ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది మహిళలు ఎవరు?
- కైలాస: 'నిత్యానంద దేశం'తో ఒప్పందం కుదుర్చుకున్న పరాగ్వే అధికారిపై వేటు, అసలేం జరిగిందంటే..
- అంగవైకల్యం ఉన్న ఆమె ఒక సెక్స్ వర్కర్‌ను ఎందుకు బుక్ చేసుకున్నారంటే....
- ‘దూత’ రివ్యూ: నాగచైతన్య తొలి వెబ్ సిరీస్‌లో అతీంద్రియ శక్తులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














