మిగ్‌జాం: తీరం దాటిన తీవ్ర తుపాను.. ఏపీ, తెలంగాణలకు భారీ వర్ష సూచన

ఫొటో సోర్స్, UGC
మిగ్‌జాం తుపాను బాపట్ల సమీపంలో తీరం దాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
రాబోయే 24 గంటల పాటు ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. మరి కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఈ రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
నేడు, రేపు రెండు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రోటోకాల్స్ కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు.
భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు.
మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య తుపాను తీరం దాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు.
తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని ఆయన తెలిపారు. ఈ తీవ్ర తుపాను రాగల రెండు గంటల్లో తుపానుగా బలహీనపడనుందన్నారు.
తుపాను తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ సూచించారు.

ఫొటో సోర్స్, I&PR
కాలువలు పరిశీలించిన మంత్రి కాకాణి గోవర్ధన్
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని పులతీగల పాడు వద్ద కనుపురు కాలువ తెగి పంట పొలాలు మునిగాయి.
వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి హరి కిరణ్, జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ పొలాలను పరిశీలించారు.

ఫొటో సోర్స్, I&PR
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో మిగ్‌జాం తుపాను తీరాన్ని తాకింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు రెండు గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారుగా 30 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. దీంతో పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగి, భద్రతా ఏర్పాట్లు చేసింది.
తుపాను తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడుతుంది. అయినప్పటికీ రాబోయే 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. మరి కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

తుపాను తాకిడికి ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావంతో అపార నష్టం సంభవించింది.
ఇతర అన్ని జిల్లాలోనూ వర్షం తాకిడి కనిపిస్తోంది. రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు చేరి అనేకమంది తీవ్రంగా సతమతమవుతున్నారు.
సోమవారం అర్ధరాత్రి నుంచి తుపాను తీవ్రత మరింతగా పెరిగింది. నెల్లూరు బాపట్ల మధ్యలో తీరం దాటే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, ఆయా జిల్లాల పరిధిలో ఇది మరింత ఉదృతంగా కనిపిస్తోంది.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మిగ్‌జాం తీవ్ర తుపానుగా కేంద్రీకృతమైనట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణశాఖ నివేదిక తెలిపింది.
బాధితులకు సదుపాయాలు కల్పించండి: సీఎం జగన్
తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు.
తుపాను పరిస్థితులపై ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని అధికారులు తెలిపారు. చీరాల బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వివరించారు.
తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తంగా చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశించారు. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు.
విశాఖలో విమానాలు రద్దు
తుపాను ప్రభావంతో విశాఖ నుంచి 23 విమానాలు రద్దు చేశారు. విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్ట్ డైరక్టర్ ప్రకటించారు. మొత్తం 23 విమానాలు రద్దు చేసినట్టు తెలిపారు. అయితే విమానాశ్రయ కార్యకలాపాలు యధావిధిగా సాగుతయాన్నారు. అత్యవసర సర్వీసులు, మళ్లింపు కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుందన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత విమానాల రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయన్నారు.
పలు రైళ్ళు రద్దు
మిగ్‌జాం తుపాను ధాటికి పలు రైళ్ళ రాకపోకలు రద్దయ్యాయి. ఆ వివరాలను కింద చూడండి.

ఫొటో సోర్స్, IR
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, IMD
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, IMD
ప్రస్తుతానికి చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 120 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో తుపాన్ కదులుతోంది.
తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
మంగళవారం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ నుండి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ నెల్లూరు జిల్లాల్లో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు.

రవాణాకు బ్రేక్
గడిచిన 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల పైబడిన వర్షపాతం నమోదయింది. వాగులు పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తుపాను కారణంగా 150 రైళ్లను రద్దు చేశారు. అనేక విమాన సర్వీసులకు కూడా ఆటంకం ఏర్పడింది. రోడ్డు రవాణా తీవ్ర ప్రభావానికి గురైంది...జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో సూళ్లూరుపేట వద్ద రాకపోకలు నిలిపివేశారు.
గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాదిగా కరెంటు స్తంభాలు నేలకొరిగినట్టు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
వేల హెక్టార్లు పంట నష్టం జరిగింది. సుమారుగా 98 వేల హెక్టార్లలో వరి పంట కోతకు సిద్ధమైన దశలో నేలకొరిగినట్టుగా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మరో 30 వేల హెక్టార్లలో పంట కోసిన తర్వాత, పొలంలో ఉండగా నీటిపాలైనట్టు చెబుతున్నారు. రైతులకు తుపాన్ అపార నష్టాన్ని మిగిల్చింది.
ఒక్క నెల్లూరు జిల్లాలోని 98 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరువేల మందిని తరలించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా తుపాను తీవ్ర రూపం దాల్చిన తర్వాత ఈ తాకిడి పెరిగింది.
తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటికే ఎన్.డి.ఆర్ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా అనేకమందిని పునరావస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
చెన్నైలో చిక్కులెన్నో

ఫొటో సోర్స్, REUTERS
మిగ్‌జాం తుపాను కారణంగా చెన్నై వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అనేక కార్లు నీట మునిగాయి. చెట్లు కూలిపోయాయి. చెన్నై విమానాశ్రయంలోకి భారీగా నీరు చేరడంతో సోమవారం విమానాశ్రయాన్ని మూసివేశారు.
ఇళ్ళు కూలడం వలన, విద్యుత్ షాక్ కారణంగా ఆరుగురు చనిపోయినట్టు చెన్నై పోలీసులు చెప్పారు. చెంగల్పట్టు జిల్లాలో గోడకూలి ఇద్దరు మృతి చెందినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్‌అలర్ట్ జారీచేసింది.
చెన్నై పరిసర ప్రాంతాలలోని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు మూతపడినట్టు రాయిటర్స్ తెలిపింది.
పంజాబ్, హరియాణా, చండీగడ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్ ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కమ్మే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి :
- మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?
- వెదురుతో భవనాలను ఎందుకు నిర్మిస్తున్నారు? దీని ప్రత్యేకత ఏంటి?
- ‘దూత’ రివ్యూ: నాగచైతన్య తొలి వెబ్ సిరీస్లో అతీంద్రియ శక్తులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయా?
- కైలాస: 'నిత్యానంద దేశం'తో ఒప్పందం కుదుర్చుకున్న పరాగ్వే అధికారిపై వేటు, అసలేం జరిగిందంటే..
- కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన ఘనుడు... కామారెడ్డి ప్రజలు జైకొట్టిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















