సునీల్ కనుగోలు: కాంగ్రెస్ ఈయన మాట విని ఉంటే మిగిలిన రాష్ట్రాల్లోనూ అద్భుతాలు సృష్టించేదా?

సునీల్ కనుగోలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సునీల్ కనుగోలు
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కాంగ్రెస్ ప్రధాన వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచనలే కారణమని చెబుతున్నారు.

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజాగ్రహాన్ని కూడా సునీల్ గుర్తించారు. దానికి అనుగుణంగానే పార్టీ అక్కడ ఐదు హామీలను ముందుకు తెచ్చింది. అది ఎన్నికల్లో విజయానికి ఎనలేని సాయం చేసింది.

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వంపై వీస్తున్న వ్యతిరేక పవనాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అనుసరించిన వ్యూహాలనే అమలు చేశారు.

అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే సునీల్ కనుగోలు వ్యూహం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను అధికారం నుంచి దించేందుకు ఉపయోగపడింది. కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌‌ విషయంలో ఆయన ఇచ్చిన సలహాలను పట్టించుకోకపోవడంతో పార్టీ భారీ నష్టాన్ని కూడా భరించాల్సి వచ్చింది.

''తెలంగాణలోనూ సునీల్ అదరగొట్టారు. ఆయన వ్యూహాలు బాగా పనిచేశాయి. అయితే, పార్టీ అధ్యక్షుడికీ, వారికీ మధ్య సమన్వయం కుదరాలి. వారి నుంచి వచ్చిన సమాచారాన్ని అనుసరిస్తూ పని చేసుకుంటూ పోవాలి'' అని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ డీకే శివకుమార్ పాల్గొన్నారు.

డీకే శివకుమార్

ఫొటో సోర్స్, ARIJIT SEN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డీకే శివకుమార్

2014 ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచార వ్యూహాలు చూసుకున్న ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో సునీల్ కూడా ఉన్నారు.

ఆ ఎన్నికల్లో గెలిచి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన 2019 లోక్‌ సభ ఎన్నికల సమయంలో డీఎంకే తరపున పనిచేశారు. ఆ తర్వాత 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కోసం పనిచేశారు.

బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రెండేళ్ల కిందట తమ పార్టీ ప్రచార వ్యూహాల బాధ్యతలు చూసుకోవాలని సునీల్ కనుగోలుని కోరారు. అయితే, ఆ ప్రతిపాదనలు ముందుకెళ్లలేదు. ఆ తర్వాత సునీల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రచార వ్యూహాల రూపకల్పన బృందానికి ఆయన నేతృత్వం వహించారు.

‘‘ఆయన తన పని తాను చేసుకుపోతారు. ప్రజాభిప్రాయాలు, వారి సమస్యలపై అధ్యయనం చేసి పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తారు. అందులో ఆయనకు చాలా అనుభవం ఉంది. క్షేత్రస్థాయిలో విషయాలను ఆయన గుర్తించగలరు'' అని పేరు చెప్పేందుకు ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు.

హంగూఆర్భాటాలు లేకుండా తన పని తాను చేసుకుపోతారని సునీల్ గురించి చాలామంది చెబుతున్నారు.

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా నిర్వహించిన ప్రచారమే సునీల్ కనుగోలు పనితనానికి ఉదాహరణగా పేర్కొంటున్నారు.

రాష్ట్రంలోని 40 శాతం కాంట్రాక్టు పనుల్లో అవినీతి జరిగిందని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఆ ఆరోపణల ఆధారంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు.

పేటీఎం తరహాలో 'పే సీఎం' అంటూ క్యూఆర్ కోడ్‌లతో కూడిన పోస్టర్లు కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలిశాయి. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, తమ పార్టీ కోసం పనిచేయాలని కేసీఆర్ కూడా సునీల్ కనుగోలును కోరారు

వ్యూహరచన ఎలా?

ఎన్నికలకు ముందు కర్ణాటకలో సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వేల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల్లో ఏయే అంశాలపై వ్యతిరేకత ఉందనే విషయాలను గుర్తించారు.

ఆ అంశాలపై సునీల్ బృందం వార్‌ రూమ్‌లో చర్చించింది. ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన శశికాంత్ సెంథిల్ ఈ వార్ రూమ్ వ్యవహారాలు పర్యవేక్షించేవారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఈ రెండు బృందాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించేవారు. అలా వార్ రూమ్ అధ్యయనాల అనంతరం ప్రధానంగా ఐదు విషయాలను గుర్తించారు. అలా కాంగ్రెస్ ఐదు హామీలు పురుడుపోసుకున్నాయి.

200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి కుటుంబంలోని మహిళకూ నెలకు రూ.2 వేలు, అన్న భాగ్య యోజన కింద ఐదు కిలోల ఉచిత బియ్యం, డిగ్రీ పూర్తి చేసిన రెండేళ్ల తర్వాత నుంచి నిరుద్యోగులకు ప్రత్యేక అలవెన్స్ హామీలు రూపుదిద్దుకున్నాయి.

లోతుగా అధ్యయనం చేసిన అనంతరం ఈ ఐదు హామీలు బయటికొచ్చాయి. అనంతరం ఈ హామీలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో నేతలకు వివరించడం కూడా వార్ రూమ్ బాధ్యతే.

తెలంగాణలోనూ అలాగే చేసినట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. మీడియాకు అధికారికంగా వెల్లడించే అనుమతులు తనకు లేవని ఆయన అన్నారు.

‘‘క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి ఏ అభ్యర్థి అయితే ఎలా ఉంటుంది, ప్రచారం ఎలా సాగుతోందనే విషయాలను సునీల్ సూచనలు చేసేవారు. అలా కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించాం'' అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్

ఫొటో సోర్స్, TELANGANA CONGRESS

ఫొటో క్యాప్షన్, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను కొట్టలేరని చెప్పేవారు. అయితే, ఆ హామీలకు బదులుగా కాంగ్రెస్ కూడా కొన్ని హామీలు ఇచ్చింది.

''మా ప్రభుత్వం ప్రజలకిచ్చిన చాలా హామీలను నెరవేర్చింది. అయితే, రైతు బంధు డబ్బులు భారీగా భూములున్న వారికి కూడా ఇస్తున్నారని రైతులు భావించారు. అది ఎక్కువ మందిలో ఈర్ష్యకు కారణమైంది. అలాగే హామీలను క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేయలేకపోవడం కూడా కారణమే'' అని ఒక బీఆర్ఎస్ నేత చెప్పారు. తన పేరు బయటికి చెప్పకూడదని ఆయన షరతు పెట్టారు.

బీఆర్‌ఎస్ హామీలకు దీటుగా కాంగ్రెస్ స్ట్రాటజిక్ టీం ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చింది.

'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500, కేవలం రూ.500లకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అర్హులైన మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, పది గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదు వంటి హామీలు ఇచ్చింది.

'రైతు భరోసా' కింద ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్, 'గృహ జ్యోతి' కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 'ఇందిరమ్మ ఇండ్లు' కింద భూమి కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, 'వృద్ధులకు' రూ.4 వేల పెన్షన్, పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ హామీలు ఇచ్చింది.

అలాగే, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

'యువ వికాసం' కింద ప్రతి విద్యార్థికీ రూ.5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డులు, ప్రతి జిల్లాలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటువంటి హామీలు ఇచ్చింది.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, ANI

మిగిలిన రాష్ట్రాల విషయంలో ఏం జరిగింది?

సునీల్ కనుగోలు బృందం మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోనూ ఇలాంటి సర్వేలను నిర్వహించింది. అయితే, వారి సూచనలను అగ్రనేతలు పట్టించుకోలేదు.

''బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు చాలా అవకాశాలున్నప్పటికీ కాంగ్రెస్‌లో మధ్య సమన్వయం కొరవడింది. మధ్యప్రదేశ్‌‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా కేవలం ఒకే ఒక్క నాయకుడు నిర్ణయాలు తీసుకున్నారు. రాజస్థాన్‌లో పరిస్థితి అలాగే ఉందని చెప్పా'' అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

అదే సమయంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ వ్యూహాలు అంత ప్రభావవంతంగా ఎందుకు లేవు, అక్కడ గత నాలుగు దఫాలుగా బీజేపీ అధికారంలో ఉందని డీకే శివకుమార్‌ని అడిగినప్పుడు, ''మధ్యప్రదేశ్ వ్యవహారాల గురించి నాకు తెలియదు'' అని సమాధానమిచ్చారు.

''ఛత్తీస్‌గఢ్‌లో చేయించిన సర్వే ఆధారంగా గిరిజనుల మద్దతు ఉన్న పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలని సూచించారు. అదో కొత్త పార్టీ. ఆ పార్టీ అధినేత గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అవసరమైతే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. అయినా గిరిజన ప్రాంతాల్లో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది'' అని కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, చాలా ఏళ్ల కిందటే ఏఐసీసీ కార్యవర్గంలో చోటు సంపాదించుకున్న నాయకుడొకరు బీబీసీతో చెప్పారు. తన పేరు గోప్యంగా ఉంచాలని ఆయన షరతు పెట్టారు.

సునీల్ పెద్దగా బయటకు వచ్చేందుకు ఇష్టపడరు. ఆదివారం బీబీసీ ఆయనకు కాల్ చేసినప్పుడు మీటింగ్‌కి వెళ్తున్నా, నేను తర్వాత చేస్తానని చెప్పారు. ఒకవేళ ఆయన కాల్ చేస్తే ఈ కథనాన్ని మరిన్ని వివరాలతో అప్డేట్ చేస్తాం.

కర్ణాటకలోని బళ్లారికి చెందిన సునీల్ చెన్నైలో చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అనంతరం ఆయన కొంతకాలం ఆయన మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ మెక్‌కిన్సెయ్‌లో కూడా పనిచేశారు.

వీడియో క్యాప్షన్, సీఎంగా రేవంత్ ప్రకటనకు ముందు దిల్లీలో ఉత్తమ్, శ్రీధర్ బాబులు ఏమన్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)