మోదీ: కర్ణాటక, హిమాచల్‌లలో ఓటమి తర్వాత బీజేపీ వ్యూహాలు ఎలా మార్చుకుంది?

ఫొటో సోర్స్, T. NARAYAN/BLOOMBERG VIA GETTY IMAGES
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సీన్ 1: జైపూర్‌లోని ఓ కౌంటింగ్ కేంద్రంలో ఆదివారం ఉదయం 9 గంటలకు మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది.
సీన్ 2: అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్ రూం ఖాళీగా ఉంది. ఆఫీస్ మొత్తం చూసినా ఎవరూ లేరు. లోపల ఎవరూ లేరని బయట గేటు దగ్గర ఉన్న వ్యక్తి చెప్పారు.

సీన్ 3: అక్కడికి సమీపంలోనే ఉన్న రాజస్థాన్ బీజేపీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొని ఉంది.
ఆ రెండు పార్టీ కార్యాలయాల దగ్గర వేర్వేరు వాతావరణమున్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ, మరీ మొదటి రౌండ్‌కే అలా ఉండడం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎన్నికల ట్రెండ్స్ కూడా స్పష్టంగా అంచనా వేయలేకపోయినప్పటికీ, వందల మంది బీజేపీ కార్యకర్తలు ఎలా సంబరాలు చేసుకున్నారు?
విజయంతో సంబంధం లేకుండా పండుగ చేసుకునేంత ఉత్సాహంగా కనిపించారు అక్కడి కార్యకర్తలు.
మొదటి రౌండ్‌లోనే ఎవరూ విజయం సాధించలేరు. కానీ బీజేపీ కార్యాలయం దగ్గరున్న నేతలు, కార్యకర్తలు మాత్రం తమ పని తాము చేశామని, 120 సీట్లు పక్కా అని అంచనాలు వేశారు.
ఇప్పటికి కేవలం ఒకటి, రెండు రౌండ్ల లెక్కింపు మాత్రమే జరిగింది, అప్పుడే మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని అక్కడ ఉన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ ఘన్‌శ్యామ్ తివారీని రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత బీబీసీ అడిగింది.
''అంచనాలు అవే చెబుతున్నాయి. బీజేపీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 65 సీట్లకే పరిమితమవుతుంది. మా పార్టీ కనీసం 118 సీట్లు గెలుచుకుంటుందని దిల్లీ పెద్దలకు రిపోర్ట్ కూడా ఇచ్చాను'' అని ఆయన బదులిచ్చారు.
ఎవరేమన్నా విజయం తమదేనన్న నమ్మకం, ఉత్సాహం బీజేపీ కార్యాలయంలో ఉన్న కార్యకర్తల్లో కనిపించింది.
కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని మొదటి నుంచి మీడియా, రాజకీయ విశ్లేషకులు చెబుతూ వచ్చారు.
1990ల నుంచి ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది లేదని గుర్తుచేస్తూ, ఆ ఆనవాయితీ తప్పని ఈసారి అశోక్ గహ్లొత్ నిరూపించబోతున్నారని కూడా కొందరు చెప్పారు.
గడచిన మూడు దశాబ్దాలలో రాజస్థాన్‌లో ఏ పార్టీ కూడా వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది లేదు.

ఓటమి తర్వాత వ్యూహాల్లో మార్పు?
రాజస్థాన్ మాదిరిగానే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ హోరాహోరీ పోరు తప్పదన్న చర్చ జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించబోతోందని కూడా అనుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయని ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ఒక్క రోజు ముందు దిల్లీలో ఒక బీజేపీ నాయకుడు అన్నారు. సరిగ్గా అలాగే జరిగింది.
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఎన్నికల ఫలితాల అనంతరం ఇకపై నరేంద్ర మోదీ పేరుతోనే ఎన్నికలకు వెళ్లాలని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లను ప్రకటించబోవడం లేదన్న సంకేతాలు వచ్చాయి.
''నరేంద్ర మోదీ ముఖంతోనే ఎన్నికలకు వెళ్లాం. ఇతర ముఖాల వల్ల ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపకూడదనే అలా చేశారన్నది నిజం. అదే రుజువైంది. మనం మరొకరి ముఖం తెర మీదకు తెస్తే ఆ వ్యక్తి లోపాలు బయటికొచ్చి, పార్టీకి నష్టం జరిగేది'' అని ఎన్నికల వ్యూహాల నిపుణుడు, బీజేపీ ఎంపీ ఘన్‌శ్యామ్ తివారి అన్నారు.

రాజస్థాన్‌తో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించినట్లు ఘన్‌శ్యామ్ చెప్పారు. ''కేవలం రాజస్థాన్‌లోనే కాదు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోనూ మోదీ ముఖంతోనే ఎన్నికలకు వెళ్లాం. అదే మాకు కలిసొచ్చింది'' అన్నారాయన.
బీజేపీ కేవలం తమ పరాజయాల నుంచే కాకుండా, విజయాల నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటోందని విశ్లేషకులు అంటున్నారు.
అందుకు ఒక ఉదాహరణ ఇచ్చారు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు త్రిభువన్.
''బీజేపీ గెలుపోటముల నుంచి చాలా నేర్చుకుంటోందని అనుకుంటున్నా. రాజస్థాన్‌లో బీజేపీ పనితీరు చూశా. 1990లో 120 సీట్లతో రాజస్థాన్‌లో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీ వరుసగా ఎలా అధికారంలోకి వస్తుందో తెలుసుకోవడానికి బీజేపీ అక్కడికి ఒక బృందాన్ని పంపించింది. అలాంటి వాటి నుంచి నేర్చుకోవాలనే తపన కనిపించింది'' అని ఆయన అన్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ గెలుపోటముల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నించడం లేదా అనే విషయంపై త్రిభువన్ మాట్లాడుతూ, ''కాంగ్రెస్ అలాంటివేమీ చేయదు. ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసినా పెద్ద జూదం ఆడాల్సి వస్తుంది. అవును. ఈ పార్టీ గెలుపు తర్వాత ఓటమిని తెచ్చిపెడుతుందని కొందరు అంటున్నారు'' అని సమాధానమిచ్చారు.
హిమాచల్, కర్ణాటకలో బీజేపీ ఓటమితో బీజేపీవాళ్లు చాలా పాఠాలు నేర్చుకున్నారని త్రిభువన్ అన్నారు.
''పార్టీలో ప్రక్షాళన చేశారు. పార్టీ ప్రణాళికలు, నేతల వ్యవహారశైలిపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తెరపైకి తీసుకురాలేదు. కమలం గుర్తును మాత్రమే తీసుకొచ్చారు. అలాగే, రాజస్థాన్‌లో అశోక్ గహ్లొత్‌కి పేరుందని వాళ్లకి తెలుసు. రాష్ట్రంలో కొన్ని పథకాలు నడుస్తున్నాయని కూడా తెలుసు. అందుకే వాళ్లు గహ్లొత్‌కి, మోదీకి మధ్య పోటీగా మార్చేశారు'' అన్నారు.

ఎన్నికల నిర్వహణ, సంఘ్ పరివార్ పాత్ర
ఎన్నికల ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.
వివిధ ప్రాంతాల్లో వేర్వేరు ఎన్నికలు, వేర్వేరు కారణాల వల్ల బీజేపీ విజయం సాధించి ఉండొచ్చు. అలాగే, ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల ఆధారంగా ప్రజల అభీష్టాలు కూడా మారుతూ ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి మోదీయే కారణం. అయితే, బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలంగా ఉండడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చిందని రైట్ వింగ్ థింకర్ సువ్రోక్మల్ దత్తా అభిప్రాయపడ్డారు.
ఓటర్లను ఏకం చేసేందుకు పార్టీ శ్రేణులు, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి పనిచేశాయి.
''ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను 2024 లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా చూస్తున్నారు. అందుకే బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించి ఓటు వేసేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చేలా చేసేందుకు సంఘ్ పరివార్ సమూహమంతా కదిలింది. బీజేపీ కార్యకర్తలంతా మూకుమ్మడిగా పని చేశారు. క్షేత్రస్థాయిలో బీజేపీ బూత్ మేనేజ్‌మెంట్‌తో కాంగ్రెస్ పోటీపడలేకపోయింది" అని ఆయన అన్నారు.
ఎన్నికల ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో వేర్వేరు ఎన్నికలు, వేర్వేరు కారణాల వల్ల బీజేపీ విజయం సాధించి ఉండొచ్చు. అలాగే, ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల ఆధారంగా ప్రజల అభీష్టాలు కూడా మారుతూ ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి మోదీయే కారణం. అయితే, బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలంగా ఉండడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చిందని రైట్ వింగ్ థింకర్ సువ్రోక్మల్ దత్తా అభిప్రాయపడ్డారు.
ఓటర్లను ఏకం చేసేందుకు పార్టీ శ్రేణులు, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి పనిచేశాయి.
''ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను 2024 లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా చూస్తున్నారు. అందుకే బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించి ఓటు వేసేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చేలా చేసేందుకు సంఘ్ పరివార్ సమూహమంతా కదిలింది. బీజేపీ కార్యకర్తలంతా మూకుమ్మడిగా పని చేశారు. క్షేత్రస్థాయిలో బీజేపీ బూత్ మేనేజ్‌మెంట్‌తో కాంగ్రెస్ పోటీపడలేకపోయింది" అని ఆయన అన్నారు.

మహిళా ఓటర్లపై ఫోకస్
విధానాల్లో మార్పులో భాగంగా బీజేపీ మహిళా ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
అది నిజమేనని సంఘ్ పరివార్‌తో సన్నిహితంగా ఉండే సువ్రోక్మల్ దత్తా ధ్రువీకరించారు.
''మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి దోహదం చేసిన ప్రధాన కారణాల్లో మహిళా ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కూడా ఒకటి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఇటీవల కాలంలో చాలా లైంగిక దాడులు జరిగాయి. అవి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేసేలా చేశాయి. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలపై మహిళల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎలాగైనా ప్రభుత్వాలను గద్దెదింపాలని వారు నిర్ణయించుకున్నారు'' అని దత్తా అన్నారు.
''వాటికి తోడు, మధ్యప్రదేశ్‌లో 'లాడ్లీ బహనా' (ప్రియమైన సోదరి) ప్రచారం బాగా నడుస్తోంది. అలాగే, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. అందుకే మహిళలు తమ సోదరుడిని గెలిపించుకోవాలని అనుకున్నారు'' అని చెప్పారు దత్తా.

ఫొటో సోర్స్, ARVIND SAHU
ఎన్నికల్లో విజయంతో సంబరాలు జరుపుకునేందుకు జైపూర్‌లోని బీజేపీ కార్యాలయానికి తరలివచ్చిన వారిలో పురుషులు ఎంతమంది ఉన్నారో, మహిళలు కూడా అంతమందే ఉన్నారు.
కొందరు డ్రమ్స్ వాయిస్తూ డ్యాన్స్‌లు చేస్తున్నారు. మరికొందరు హర్ హర్ మోదీ, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఇంకొంతమంది మహిళలు ఎలాంటి సంకోచం లేకుండా మీడియా ముందు తమ అభిప్రాయాలు చెబుతున్నారు.
మేము గతంతో పోలిస్తే శక్తిమంతంగా తయారైనట్లు అనిపిస్తోందని కొందరు మహిళలు బీబీసీతో చెప్పారు.
''ఈసారి మహిళా ఓటర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాం. రాజస్థాన్‌లో మహిళలు పరదా కప్పుకునే విధానం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇలా సర్వే చేసే వారి ముందు, జర్నలిస్టుల ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అందువల్ల అసలు వాళ్లేమనుకుంటున్నారో తెలిసేది కాదు. మేము వాళ్ల దగ్గరికి వెళ్లి మోదీ సాధించిన విజయాల గురించి వివరించాం. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో అంతమేరకు వెళ్లలేకపోయింది. దీంతో ఆ ఓట్లు మాకే వచ్చాయి'' అని అక్కడ ఉన్న ఒక మహిళ అన్నారు.

‘కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు’
బిహార్ కులగణన తరహాలో ఇతర రాష్ట్రాల్లోనూ కులగణన చేపడతామని ఇచ్చిన హామీ బీజేపీకి ప్రయోజనం కలిగించడంతోపాటు కాంగ్రెస్‌కే హాని చేసిందా?
''కులగణన హామీపై సువ్రోక్మల్ దత్తా మాట్లాడుతూ, ''కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు పాల్పడి పెద్ద తప్పు చేశారు. దాని పర్యవసానాలను పార్టీ భరించాల్సి వచ్చింది. కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు'' అన్నారు.
అయితే, బీజేపీ, కాంగ్రెస్ రెండూ పార్టీ టికెట్లు కేటాయించే సమయంలో అభ్యర్థుల కులాలను పరిగణనలోకి తీసుకున్నాయి. పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో కులాలను పరిగణనలోకి తీసుకున్నాయి కానీ, కాంగ్రెస్ ఇచ్చిన కులగణన హామీపై బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగానే స్పందించలేదని చాలా మంది జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.
జైపూర్‌లో సాయంత్రం వరకూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఎవరూ రాలేదు. సూర్యాస్తమయ సమయానికి బీజేపీ కార్యాలయంలో భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. కార్యాలయం ముందున్న రోడ్డు చాలా వెడల్పుగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ క్రమంగా పెరిగింది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో బందోబస్తు కోసం అక్కడికి చేరుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఓడిపోయినప్పటికీ తమ వ్యూహాలను మార్చుకోవడం ద్వారా మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
- డీప్ ఫేక్ ఎంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటే...
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..
- ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ను ఎగ్జిట్ పోల్స్ ఎలా పట్టిస్తాయి, ఒక్కోసారి ఎందుకు ఫెయిల్ అవుతాయి?
- తెలంగాణ: ఓటమి పాలైన మంత్రులు ఎవరు? ఎంత తేడాతో ఓడిపోయారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














