మిగ్‌జాం తుపాను: ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో భారీ వర్షాలు, చెన్నైలో నీట మునిగిన ఇళ్లు

మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిగ్‌జాం తుపాను వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా మారుతోందని, ఇది సోమవారం రాత్రి 9 గంటల సమయానికి నెల్లూరుకు 80 కి.మీ., బాపట్లకు 210 కి.మీ., మచిలీపట్నానికి 250 కి.మీ. దూరంలో ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజంగ్ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు.
మంగళవారం ఉదయానికి నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా మారి, తీరం దాటే అవకాశం ఉన్నట్లు వివరించారు. తీరం దాటిన తరువాత క్రమంగా బలహీనపడుతుందన్నారు.
రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రేపు కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు చేపల వేటకు వెల్లరాదని సూచించారు.
సోమవారం ఏపీలోని నెల్లూరు జిల్లా కట్టువపల్లెలో 158 మి.మీ వర్షపాతం, తిరుపతి జిల్లా చిలకూరులో 132 మి.మీ., ఇరుగుళంలో 127 మి.మీ., నాయుడుపేటలో 124 మి.మీ., కావ్వీలో 123 మి.మీ., శ్రీకాళహస్తిలో 122 మి.మీ. అధిక వర్షపాతం నమోదైందని అంబేద్కర్ తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడులో ఐదుగురు మృతి
తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి భారీ వానలు పడుతున్నాయి. ఈ వర్షాలకు తమిళనాడులో ఐదుగురు మృతిచెందారని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
తుపాను మంగళవారం తీరం దాటే అవకాశం ఉన్నందున తమిళనాడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా డిసెంబర్ 5న చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలలో సెలవు ప్రకటించింది.

ఫొటో సోర్స్, X.COM/CHENNAIPOLICE_
చెన్నై వీధులు జలమయం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై, దాని శివారు ప్రాంతాలు పలు చోట్ల జలమయమయ్యాయి.
చెన్నైలోని అనేక వీధులు జలమయమయ్యాయి. రవాణా స్తంభించిపోయింది.

ఫొటో సోర్స్, X.COM/CHENNAICORP
చెన్నై పోలీసు విభాగం, అగ్నిమాపక శాఖ, విపత్తు పునరుద్ధరణ విభాగం సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.
భారీగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడులో దాదాపు 30,00,000 మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
పెరుంగళత్తూరు సమీపంలో రోడ్డుపై మొసలి నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఉన్న వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీబీసీ ఈ వీడియోను ధృవీకరించలేకపోయింది.
నదులు, చెరువులు ఉప్పొంగడంతో జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయని ఓ అధికారి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- యశస్విని, పర్ణిక, లాస్య నందిత, రాగమయి.. తెలంగాణలో ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది మహిళలు ఎవరు?
- తెలంగాణ ఎన్నికలు: బీఆర్ఎస్ ఒక్కసారీ గెలవని 17 నియోజకవర్గాలు
- బర్రెలక్క: తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యకు ప్రతినిధి ఈమేనా...
- తెలంగాణ ఎన్నికలు: పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎందరు, యువ ఓటర్ల సంఖ్య ఎంత... మీరు తెలుసుకోవాల్సిన 9 ఆసక్తికర అంశాలు
- తెలంగాణ ఎన్నికలలో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న మూడు పాటలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








