ఆంధ్రప్రదేశ్: మిగ్‌జాం తుపాను దెబ్బకు వేల కోట్ల నష్టం, నీట మునిగిన లక్షల ఎకరాల పంట

తడిచిన వరిపనలను చూపుతున్న రైతు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తడిచిన వరిపనలను చూపుతున్న రైతు
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాడు, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మిగ్‌జాం తుపాను బీభత్సం సృష్టించింది. ఈ పెను తుపాను తీరం దాటక ముందు, దాటిన తర్వాత అదే రీతిలో విరుచుకుపడింది.

ఏపీలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని జిల్లాల్లో తుపాను ప్రభావం చూపింది. లక్షల ఎకరాల పంటలు నాశనమయ్యాయి. వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వందలాది గ్రామాలు జలమయమయ్యాయి. పదుల సంఖ్యలో రోడ్లు తెగిపోయాయి. విధి నిర్వహణలో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

తుపాను నష్టం ఏ స్థాయిలో ఉందనే దానిపై ప్రభుత్వం అంచనా వేస్తోంది. వివిధ శాఖలు తమ పరిధిలో జరిగిన నష్టాన్ని నివేదించేందుకు క్షేత్రస్థాయిలో లెక్కలు తీస్తున్నాయి. రైతులకు ఈసారి అపార నష్టం వాటిల్లింది.

వర్షాలు ఆలస్యంగా రావడంతో ఈసారి సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది. దాంతో, సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి తుపాను ముంచుకొచ్చింది. పంట వర్షార్పణం కావడంతో రైతులు విషాదంలో మునిగిపోయారు.

 బోల్తా పడిన ట్రాక్టర్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తుపాను తాకిడికి బోల్తా పడిన ట్రాక్టర్

తిరుపతి నుంచి మొదలై...

నవంబర్ నెలాఖరుకే తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల పరిధిలో వర్షాలు మొదలయ్యాయి. నాలుగైదు రోజుల పాటు కురిసిన వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా డిసెంబర్ 3 నుంచి రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆ జిల్లాలు అతలాకుతలమయ్యాయి.

తిరుమలలోని డ్యాములన్నీ నిండిపోయాయి. జలపాతాల నుంచి వరద ప్రవాహం సాగింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాకపోకలు స్తంభించాయి. రైలు, రోడ్డు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. సూళ్లురుపేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించింది. రేణిగుంట విమానాశ్రయంలో సర్వీసులన్నీ నిలిపివేశారు.

డిసెంబర్ 5న మిగ్‌జాం తుపాన్ చీరాల- బాపట్ల మధ్యలో తీరం దాటింది. ఆ సమయంలో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులకు పంటలు నాశనమయ్యాయి.

తుపాను తీరం దాటిన తర్వాత విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో కుంభవృష్టి కురిసింది. 5వ తేదీ రాత్రి నుంచి మొదలైన ఈదురుగాలులు, వర్షం కారణంగా ఆయా జిల్లాల పరిధిలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఈదురుగాలులకు హోర్డింగ్స్ విరిగిపడ్డాయి. చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి.

విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 6వ తేదీ నాడు కూడా వర్షాలు కొనసాగాయి. తుపాను బలహీనపడి వాయుగుండంగా మారినప్పటికీ వర్షం జోరు కొనసాగింది.

తడిసిన ధాన్యం

ఫొటో సోర్స్, UGC

రైతులకు అపార నష్టం

ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయంలో ఈసారి తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. నవంబర్ నెలాఖరుకే తుపాను హెచ్చరికలు చేసినప్పటికీ కొన్ని చోట్ల ఆశించినంత వేగంగా ధాన్యసేకరణ ప్రక్రియ జరగలేదు. దీంతో, రైతుల పంట తడిసిముద్దయ్యింది.

ఈదురుగాలుల కారణంగా చేలల్లో ఉన్న పంట నెలకొరిగి, నీట మునిగింది. కోసిన పంట ధాన్యం రాశుల్లో ఉండగా వర్షపు నీటికి తడిసిముద్దయ్యింది. బస్తాలలో నిల్వ ఉంచిన ధాన్యం కూడా కొన్ని చోట్ల వరదల్లో చిక్కుకుపోయింది. దీంతో రైతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

నీట మునిగిన పంట చేను

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నీట మునిగిన పంట చేను

రైతులతో పాటు అరటి సహా వివిధ ఉద్యాన, వాణిజ్య పంటల సాగుదారులకు కూడా నష్టం వాటిల్లిందని రైతు సంఘాల నేతలు చెప్పారు.

"రాష్ట్రంలో ఒక్క రైతాంగానికే రూ. 7 వేల కోట్ల నష్టం జరిగింది. ఈసారి వరి సాగు చేసిన పంటలో కేవలం 20 శాతం మాత్రమే ఒడ్డుకు చేరింది. మిగిలిన 80 శాతం దాదాపు తుపానుకు దెబ్బతింది. రైతులందరిన్నీ ప్రభుత్వం ఆదుకోవాలి. మళ్లీ రబీ పంట వేసుకోవడానికి ఎకరానికి కనీసం 30 వేల రూపాయల ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి. పంట నష్టపోయిన వారందరికీ ఎకరానికి రూ. 20 వేల పరిహారం చెల్లించాలి" అంటూ తెలుగు రైతు నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.

అరటి, ప్రత్తి, పొగాకు, వేరుశనగ రైతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారని ఆయన తెలిపారు. రైతులను ఆదుకోవడానికి తక్షణమే సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

వరదధాటికి తెగిపోయిన రోడ్లు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వరదధాటికి తెగిపోయిన రోడ్లు

దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం

రాష్ట్రవ్యాప్తంగా తుపాను ఈదురుగాలులకు వేలాది చెట్లు నేలకొరిగాయి. వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. అనేక జిల్లాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణ కోసం సంబంధిత సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడం, తెగిపోయిన లైన్లు సరిచేయడంలో నిమగ్నమై ఉన్నారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించగలిగామని, ట్రాఫిక్ సమస్య రాకుండా చూశామని ఏపీ విప్తతుల నిర్వహణ శాఖ అధికారి పీవీ సునీల్ కుమార్ అన్నారు.

భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

60 చోట్ల రోడ్లు కోతకు గురైనట్టు ఆర్ అండ్ బీ అధికారులు చెప్పారు. 90 చోట్ల రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహించిందని తెలిపారు. మొత్తంగా 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

పంట నష్టం అంచనాల్లో యంత్రాంగం

ఫొటో సోర్స్, UGC

'మానవతా దృక్పథంతో నడుచుకోవాలి' -కలెక్టర్లను ఆదేశించిన జగన్

తుపాను ప్రభావం, వరద నష్టం అంచనాలపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 100కి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 15 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

"బాధితులకు ఎటువంటి సమస్య రాకుండా చూడాలి. మానవతా దృక్పథంతో సహాయం అందించాలి. విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరగాలి. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారులు వరకూ వరద సహాయక చర్యల్లో ఉండాలి. నష్టపరిహారం అంచనాలు సిద్ధం చేయాలి. కడపలో నేలకూలిన చెట్లు తొలగిస్తూ మృత్యువాత పడిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం. రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం. సామాన్య ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి" అంటూ సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు.

ఇళ్లు కూలిన వారికి రూ. 10 వేలు, వరదల్లో చిక్కుకున్న వారికి రూ.2500 చొప్పున తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. పంట నష్ట పరిహారం అంచనాలు రాగానే బాధితులు అందర్నీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

మిగ్‌జాం తుపాను ధాటికి దెబ్బతిన్న ఓ ఇల్లు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మిగ్‌జాం తుపాను ధాటికి దెబ్బతిన్న ఓ ఇల్లు

సన్నాహాలు లేవు, సహాయం లేదు

ప్రభుత్వ తీరుని విపక్షాలు తప్పుబడుతున్నాయి. తుపాను హెచ్చరికలు పది రోజుల క్రితమే వచ్చినప్పటికీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం సిద్ధం కాలేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ నష్టం చవిచూడాల్సి వచ్చిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా అనేక మంది తమ పంటను వర్షార్పణం చేసుకోవాల్సి వచ్చిందని విమర్శించారు.

తుపాను బాధితులకు సహాయం అందించడంలో నిర్లక్ష్యం వీడాలని ఆయన కోరారు.

ప్రభుత్వ సిబ్బందితో పాటుగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)