రజనీకి ఏం ఉద్యోగం ఇచ్చారు, జీతం ఎంత?

రేవంత్ రెడ్డి, రజని
ఫొటో క్యాప్షన్, రజనీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తొట్టతొలి ఉద్యోగం ఒక దివ్యాంగ మహిళకు దక్కింది.

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తూమరి రజని అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రం అందించారు.

ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదనే రజనీకి ఈ పత్రాలు అందజేశారు.

హైదరాబాద్ నగరం నాంపల్లి దగ్గరలోని బోయిగూడకు చెందిన రజని లయోలా స్కూల్, వనితా కాలేజీల్లో చదివారు. ఓపెన్ యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేశారు.

ఈ అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ ప్రచారం సమయంలో గాంధీ భవన్‌లో రేవంత్‌ రెడ్డిని ఆమె కలిశారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Telangana Congress/fb

ఫొటో క్యాప్షన్, గాంధీభవన్‌లో తనను కలిసిన రజనీకి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు

తనకు ఉద్యోగం లేదన్న ఆవేదనను రేవంత్‌కు చెప్పుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా మొదటి ఉద్యోగం ఆమెకే ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆమె పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు రాసుకుని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పత్రంపై రేవంత్ రెడ్డి సంతకం చేసి ఆమెకు అందించారు.

ఇచ్చిన మాట ప్రకారం, పార్టీ గెలిచిన తరువాత ప్రమాణ స్వీకారోత్సవానికి రజనిని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. దీంతో ఆమెకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు తీసుకురావల్సిందిగా దివ్యాంగుల సంక్షేమ శాఖను ఆదేశించారు.

వీడియో క్యాప్షన్, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తొలి జాబ్ ఆమెకే..

ఆ మేరకు ఉత్తర్వులు సిద్ధం చేసిన అధికారులు ప్రమాణ స్వీకారోత్సవ వేదికపైనే ముఖ్యమంత్రికి అందివ్వగా, ఆయన వాటిపై సంతకం చేసి, రజనికి శాలువా కప్పి, ఆ పత్రాలను ఆమె చేతికిచ్చారు. కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

ఆమెకు తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్ఓసీఏ)లో ప్రాజెక్టు మేనేజర్‌గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పించారు. ఆమెకు నెలకు రూ.50,000 వేతనం అందుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రజని ఉద్యోగంపై చేసింది రెండవ సంతకం కాగా, మొదటి సంతకం ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించిన ఫైలుపై పెట్టారు సీఎం రేవంత్.

ఇవి కూడా చదవండి: