బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ముస్లింలను ఎలా చూపిస్తున్నారంటే...

బాలీవుడ్‌లో ముస్లింలు
    • రచయిత, అనంత్ ప్రకాశ్, దినేశ్ ఉప్రేతి
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

సినిమాలు జీవితానికి అద్దం పడతాయన్న డైలాగ్‌ను మనం చాలాసార్లు వినే ఉంటాం.

మరి కోట్లమంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే బ్లాక్‌బస్టర్ సినిమాలు నిజంగానే సమాజం, వ్యక్తుల్ని ప్రతిబింబిస్తాయా?

ఇది తెలుసుకోవడానికి గత 30 ఏళ్లలో అంటే 1992 నుంచి 2022 మధ్య విడుదలైన దాదాపు 100 సూపర్ హిట్ హిందీ సినిమాలను బీబీసీ విశ్లేషించింది.

ఈ ముప్ఫై ఏళ్లలో ప్రతీ ఏటా ఆదాయపరంగా టాప్‌లో నిలిచిన మూడు సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం.

ఈ గణాంకాల విశ్లేషణను అర్థం చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బాలీవుడ్‌లో ముస్లింలు

బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది?

2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం, భారతదేశ జనాభాలో మతపరమైన మైనారిటీల వాటా దాదాపు 19.3 శాతం. అయితే, ఇతర జీవిత రంగాలలో మాదిరిగానే, మైనారిటీలకు కూడా వారి జనాభా నిష్పత్తిపరంగా సినిమాలలో స్థానం లభించిందా లేదా అన్నది ప్రశ్న. లభిస్తే వారిని ఎలా చూపించారు?

గత 30 ఏళ్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాలలో మైనారిటీ వర్గాలకు చెందిన నటులు ధరించిన పాత్రలు 17.32 శాతం ఉన్నాయి. అయితే, కేవలం తెర మీద కనిపించడంకంటే మైనారిటీలు, మహిళలు లేదా స్వలింగ సంపర్కులను ఎలాంటి పాత్రల్లో చూపించారు, ఆ పాత్రలకు ఎంత స్క్రీన్ టైమ్ ఇచ్చారు అన్నది కూడా ప్రశ్నే.

భారతదేశ జనాభాలో ముస్లింల వాటా దాదాపు 14 శాతం.

గత ముప్పై ఏళ్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ముస్లిం పాత్రల వాటా 12.32 శాతం.

దేశ జనాభాలో క్రైస్తవుల వాటా 2.3 శాతం అయితే సినిమాలలో వీరి పాత్రల వాటా 3.69 శాతం. సిక్కుల వాటా 1.7 శాతం కాగా, చిత్రాలలో ఈ వర్గం ప్రజల వాటా 0.75 శాతం.

ఈ సినిమాలలో హీరోల గురించి చెప్పాలంటే, 114 మందిలో ముస్లింల పాత్రలో కనిపించిన సందర్భాలు ఏడు మాత్రమే ఉన్నాయి. మూడు సూపర్ హిట్ చిత్రాలలో హీరోని సిక్కు మతానికి చెందిన వ్యక్తిగా చూపించారు. ఈ చిత్రాలలో క్రిస్టియన్, పార్సీ క్యారెక్టర్లు ఉన్నా, హీరో పాత్రలు లేవు. గత రెండున్నర దశాబ్దాలుగా సినిమాలను సమీక్షిస్తున్న సినీ విమర్శకుడు సైబల్ ఛటర్జీ దీని గురించి మాట్లాడారు.

‘‘హిందీ సినిమాలలో మైనారిటీ మతానికి సంబంధించిన పాత్రలు లేదా మహిళ పాత్రలను నామమాత్రంగానే ఉపయోగించుకుంటారు. వాళ్లు సినిమాలలో ఎందుకు ఉండరంటే వాళ్లను మన సమాజంలోనే ఒక భాగంగా చూపించాలనుకుంటాం. వాళ్లను రాజకీయంగా సరైన వెలుగులో చూపించినపుడు, రాజకీయంగా సరైన మాటలతో చూపించినప్పుడే వాళ్ల పాత్రలు ఉంటాయి’’ అని సైబల్ ఛటర్జీ అన్నారు.

బాలీవుడ్‌లో ముస్లింలు

మహిళలను ఎలా చూపించారు?

30 ఏళ్లలో సుమారు 100 సూపర్‌ హిట్ చిత్రాలలో, 86 స్త్రీ పాత్రలను హీరోకు ప్రియురాలిగా చూపించారు. అంటే హీరోను ప్రేమించడం, పాటలు పాడటం లేదా ఏదైనా భావోద్వేగ సన్నివేశంలో ఒకసారి కనిపించడమే వారి పని. అయితే ఈ కాలంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. స్త్రీలకు అప్పుడప్పుడు భిన్నమైన పాత్రలు కూడా లభిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఈ సూపర్‌ హిట్ చిత్రాలలో, ముప్పై శాతం మంది మహిళలు ఏదో ఒక రకమైన ఉద్యోగంలో ఉన్నట్లు చూపించారు. ఈ సినిమాలలోని మొత్తం 120 మంది కథానాయికలలో ముస్లిం స్త్రీ పాత్రలు 12, క్రిస్టియన్ పాత్రలు 5, సిక్కు పాత్రలు 1 మాత్రమే అని ఈ విశ్లేషణలో బయటపడింది.

మహిళా పాత్రలు, గణాంకాలపై ఛటర్జీ మాట్లాడారు. “ఈ విశ్లేషణలో మనం మహిళా పాత్రల సంఖ్యను లెక్కించాం. కానీ, ఈ సంఖ్యలకు పెద్దగా అర్థం లేదు. ఇది నిజమైన సమాజానికి ప్రతిబింబం కాదు. ఎందుకంటే నలభై ఏళ్ల కిందటితో పోలిస్తే ఈ రోజు మహిళలు మరింత సాధికారత సాధించారు. కానీ, సినిమాలలో ఇది ప్రతిఫలించదు. సినిమాలలో స్త్రీల పాత్రలు ఉంటున్నాయి కానీ, వాళ్లకు నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమే ఇస్తున్నాం’’ అన్నారు.

ఛటర్జీ ఇంకా ఏమన్నారంటే, ‘‘సినిమాల్లో మహిళలను బలమైన పాత్రలలో చూపించాలనే ఉద్దేశంతో పురుషులు చేసే ప్రతిపనిని వారూ చేస్తున్నట్లు చూపుతారు. అంటే మహిళలు కూడా పురుషులను తిట్టినట్లు, సిగరెట్లు తాగినట్లు, మద్యం సేవించినట్లు చూపడం లాంటివి. అయితే ఇది మహిళలను బలమైన పాత్రలలో చూపించడం కాదు, కేవలం మగవాళ్ళని అనుకరించడం మాత్రమే" అని అన్నారాయన.

‘వీరే ది వెడ్డింగ్’ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఛటర్జీ ఇలా అంటారు: “వీరే ది వెడ్డింగ్ చిత్రంలో స్త్రీ పాత్రలు తమను తాము సంతృప్తి పరుచుకుంటూ కనిపిస్తాయి. ఇది చాలా పెద్ద విషయమని అంటున్నారు. హిందీ సినిమాల్లో ఎప్పుడూ అలా చూపించ లేదు కాబట్టి ఇది పెద్ద విషయమే. కానీ, ఇది మన ఆలోచనా విధానాన్ని, ప్రేక్షకుల అభిప్రాయాన్ని ఏమాత్రం మార్చదు. సినిమా హాలులో దీనిని కామెడీగా చూస్తారు. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు నవ్వుకోవడం నాకు గుర్తుంది’’ అన్నారు.

బాలీవుడ్‌లో ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

స్వలింగ సంపర్కులను ఎలా చూపిస్తున్నారు?

ఈ 95 చిత్రాలలో స్వలింగ సంపర్క వర్గానికి చెందిన రెండు పాత్రలు మాత్రమే ఉన్నట్లు బీబీసీ విశ్లేషణలో తేలింది. ‘‘బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి అనేక ఇతర చిత్రాల వరకు, స్వలింగ సంపర్కుల పాత్రలను తెరపై ఎగతాళి చేయడమే కనిపిస్తుంది. 'దోస్తానా' సినిమా దీనికి పెద్ద ఉదాహరణ. ఇందులో లైంగికంగా మైనారిటీలైన వారికి పాజిటివ్ ఇమేజ్ ఇవ్వకుండా, వారిని ఒక రకంగా అపహాస్యం చేసారు’’ అని ఛటర్జీ అభిప్రాయపడ్డారు.

కరణ్ జోహార్ చిత్రం 'కల్ హో నా హో' లో షారుక్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మధ్య కొన్ని దృశ్యాల్లో స్వలింగ సంపర్కం చుట్టూ హాస్య సన్నివేశాలను సృష్టించారు. ఈ ఎనాలిసిస్‌లో బ్లాక్ బస్టర్ చిత్రాలను మాత్రమే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఈ చిత్రాలు ఎక్కువ మంది చెంతకు చేరడమే. ఇలాంటి సినిమాలు హిట్ కావడం వల్ల, వీటిపై సమాజంలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. అంతే కాకుండా ఇవి ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఈ సినిమాలు వాటి కథ, చిత్రీకరణ అంశాలలో సంచలనాన్ని సృష్టించి, ప్రజాదరణ పొందాయి.

ఫిల్మ్ జర్నలిస్ట్ తనుల్ ఠాకూర్ ఇలా అంటారు:

‘‘తమ సినిమాలు సమాజాన్ని ప్రతిఫలిస్తాయని బాలీవుడ్ తనను తాను ఎంత సమర్థించుకున్నా, ఈ సినిమాలను చూసినపుడు అవి ఏ వర్గానికి చెందిన కథలను, ఆలోచనలను, అంశాలను సృశిస్తున్నాయి అన్నది ముఖ్యం. ఆ ఆదాయాన్ని ఆర్జిస్తున్న చిత్రాలు ఎవరి కథలను చూపిస్తున్నాయి, ఎవరి కథలను వినిపిస్తున్నాయి?’’

ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కూడా ఈ అంశంపై బీబీసీతో సుదీర్ఘంగా చర్చించారు. ఆయన ఇలా అంటారు -

‘‘ఏదైనా ఒక సినిమా, ఒక వర్గానికి చెందిన వారిని ప్రతికూల కోణంలో చూపించినట్లయితే, అవి దర్శకుల మానసిక స్థితిని కూడా వెల్లడిస్తాయి.’’

బాలీవుడ్‌లో ముస్లింలు

ముప్పై ఏళ్లలో ముస్లిం పాత్రలు ఎలా ఉన్నాయి

భారతదేశంలో అతి పెద్ద మతపరమైన మైనారిటీలైన ముస్లిం సమాజాన్ని భారతీయ చిత్రాల్లో చిత్రీకరిస్తూ వచ్చిన విధానం స్వాతంత్య్రం తర్వాత మారుతూ వచ్చింది. హిందీ చిత్రసీమలో ముస్లిం పాత్రలపై, 'రీడింగ్ ది ముస్లిం ఆన్ సెల్యులాయిడ్: బాలీవుడ్, రిప్రజెంటేషన్ అండ్ పాలిటిక్స్' అనే పుస్తకాన్ని రచించిన ప్రొఫెసర్ డాక్టర్ రోషిణి సేన్ గుప్తా ఇలా అన్నారు.

“నలభై - అరవైల మధ్య కాలంలో ముస్లిం పాత్రలు తెర మీద చాలా బలంగా కనిపించాయి. వాటిని ముస్లిం సోషల్స్ అని పిలిచేవాళ్లు. వీటిలో, మొఘల్ సామ్రాజ్యపు వైభవాన్ని ప్రదర్శించడం నుంచి మారుతున్న భారత దేశంలోని సవాళ్లతో పోరాడుతున్న సమాజంలోని ఉన్నత ముస్లిం కుటుంబాల కథల వరకు చూపించారు’’ అని అన్నారు.

‘‘దీని తరువాత, 1960 నుంచి 1980 మధ్య ఇరవై సంవత్సరాల్లో, ముస్లింలు అట్టడుగున కనిపిస్తారు. ఉదాహరణకు, 'కూలీ'లో ఇక్బాల్ ఖాన్‌గా అమితాబ్ బచ్చన్ రైల్వే స్టేషన్‌లో మొత్తం ప్రపంచాన్ని మోస్తున్నట్లు కనిపిస్తారు. తొంభైల ప్రారంభంలో, రోజా సినిమా వచ్చింది. ఇందులో మొదటిసారిగా ఒక ముస్లిం పాత్ర కొత్తగా, హింసాత్మకమైన ఉగ్రవాదిగా కనిపించింది. దీనిలో ముస్లింలకు విదేశీ శక్తులతో సంబంధం ఉన్నట్లు చూపించారు.

విదేశీ శక్తి అంటే పాకిస్తాన్ అని అర్థం. ఈ చిత్రంలో ఆ రకంగా కథనాన్ని ప్రారంభించి, ముస్లిం పాత్రలను విలన్లుగా ప్రదర్శించడం ప్రారంభించారు.

రోజా తర్వాత, 1999లో అమీర్ ఖాన్ చిత్రం 'సర్ఫరోష్' వచ్చింది. ఇది బహుశా తీవ్రవాాదం నేపథ్యంలో పాకిస్తాన్‌ను ప్రస్తావించిన మొదటి సూపర్ హిట్ చిత్రం.

దీని తరువాత, 'గదర్ - ఏక్ ప్రేమ్ కథ' నుంచి 'మా తుఝే సలామ్' వంటి అనేక చిత్రాలు వచ్చాయి, ఇందులో భారతదేశం, పాకిస్తాన్ మధ్య శత్రుత్వం చుట్టూ విభిన్న రకాలుగా అల్లిన కథలు ఉన్నాయి.

హిందీ చిత్రాల చరిత్రను, వర్తమానాన్ని విశ్లేషించే సినీ విమర్శకుడు అజయ్ బ్రహ్మాట్జ్, ఇది తొంభైలలోని రాజకీయ గందరగోళంతో ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు.

‘‘రోజా సినిమాలో కనిపించే విద్వేషం అడ్వాణీ రథ యాత్రతో ప్రారంభమైంది. ఈ రథయాత్ర ఒక ముస్లిం వ్యతిరేక వాతావరణాన్ని నెలకొల్పింది. రాముని ధనస్సు, బాణాలు ఆయన భుజం మీది నుంచి చేతుల్లోకి వచ్చాయి.’’

‘‘రాముడు ఆగ్రహంగా ఉండటం రామాయణంలో ఒక సందర్భంలో మాత్రమే జరిగింది. తనకు దారి ఇవ్వనందుకు సముద్రాన్ని సవాలు చేస్తాడు. అయితే, వాళ్లకు కోపంగా ఉన్న రాముడే నచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో విద్వేషాలు సినిమాల నుంచి సమాజానికి పాకాయి. రోజా సినిమా ఏం చెబుతుందంటే, టెర్రరిస్టులు పఠానీ సూట్ వేసుకుంటారు. టెర్రరిస్టు తలపాగా ధరిస్తాడు. టెర్రరిస్టు గడ్డంతో ఉంటాడు. అతని కంటికి సుర్మా ఉంటుంది. రోజా తర్వాత అలాంటి సినిమాలు వెల్లువెత్తాయి. దానికి రాజకీయాలు కూడా తోడయ్యాయి.’’

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కాలంలో విడుదలైన చాలా చిత్రాలలో ఏదో ఒక విధంగా దేశ భక్తిని జోడించే ప్రయత్నం జరిగింది. ఒక చిత్రంలోని ఒక సీన్‌లో భారత జెండా కనిపిస్తుంది. మరో సినిమాలో దేశం బయట నివసిస్తున్న వారు తాము స్వదేశానికి దూరమయ్యామనే భావన కనిపిస్తుంది. మరో చిత్రంలో స్పోర్ట్స్ మ్యాచ్ సందర్భంగా దేశభక్తి వెల్లివిరియడం కనిపిస్తుంది. రోజా, సర్ఫరోష్ వంటి సినిమాలు విడుదలైన రెండు దశాబ్దాలలో, మతపరమైన మైనారిటీ పాత్రలను తెరపై ఎలా చిత్రీకరించారు అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న.

బాలీవుడ్‌లో ముస్లింలు

తెరపై కనిపించే ముస్లిం ఎప్పుడెప్పుడు, ఎలా మారిపోయాడు?

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విడుదలైన సినిమాల కంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో విడుదలైన సినిమాలలో మైనారిటీ పాత్రల సంఖ్య ఎక్కువగా ఉందని బీబీసీ ఈ విశ్లేషణలో తేలింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశభక్తి, చరిత్ర నేపథ్యం ఉన్న సినిమాల సంఖ్య పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.

గణాంకాలను విశ్లేషిస్తే, 2000 నుంచి 2004 వరకు వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో దేశభక్తి ఇతివృత్తంగా నిర్మించిన ఏడు సినిమాలు బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచాయని బీబీసీ గుర్తించింది.

అదే సమయంలో 2005 నుంచి 2009 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో దేశభక్తి నేపథ్యంలో తీసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ కాగా, ఆ తర్వాత 2010 నుంచి 2014 వరకు దేశభక్తి నేపథ్యంలో తీసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మైనారిటీ పాత్రల సంఖ్య పెరుగుతున్న కాలంలోనే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ముస్లింలను హింసాత్మకంగా, క్రూరంగా చూపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

దేశభక్తి, చారిత్రక సంఘర్షణల నేపథ్యంలో సాగే చిత్రాలలో ఎక్కువగా బ్రిటిష్, ముస్లిం పాత్రలను శత్రువులుగా చూపించడం వల్ల ఇలా జరుగుతోందని కొందరు భావించారు.

గణాంకాల పరంగా మైనారిటీ పాత్రల సంఖ్య పెరిగినా, వారిని తరచుగా విలన్లుగానే చిత్రీకరించారు.

'లగాన్', 'RRR' వంటి చిత్రాలలో క్రైస్తవ పాత్రల సంఖ్య మిగతా చిత్రాలలో కంటే ఎక్కువగా ఉంది. కానీ, వాటిని కూడా చాలా వరకు విలన్‌లుగానే చూపారు.

అదే సమయంలో గదర్- ఏక్ ప్రేమ్ కథ, బాజీరావ్ మస్తానీ, సూర్యవంశీ, పద్మావత్ వంటి చిత్రాలల్లో మిగతా సినిమాల కంటే ముస్లిం పాత్రలు ఎక్కువగా ఉన్నా, వాటిలో నెగెటివ్ పాత్రలే ఎక్కువ.

బాలీవుడ్‌లో ముస్లింలు

ముస్లిం పాలకులను క్రూరులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా?

గత కొన్నేళ్లుగా చారిత్రక సంఘర్షణలపై సినిమాల సంఖ్య బాగా పెరిగింది. ఇది సంజయ్ లీలా భన్సాలీ చిత్రం బాజీరావ్ మస్తానీతో ప్రారంభమైంది.

ఇంతకు ముందు చారిత్రక సంఘర్షణలపై సినిమాలు తీయలేదని కాదు. షారుఖ్ ఖాన్ చిత్రం అశోక 2001 సంవత్సరంలో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద బాజీరావ్ మస్తానీ అంతటి విజయాన్ని అందుకోలేకపోయింది.

ఆ తర్వాత బాజీరావ్ మస్తానీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని చారిత్రక సంఘర్షణలపై ఒక దాని తర్వాత ఒకటిగా ఎన్నో సినిమాలు వచ్చాయి.

వీటిలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కానీ వీటిలో ముస్లిం పాలకులను భయంకరంగా, అత్యంత క్రూరంగా చూపడం వల్ల ఈ సినిమాలపై విమర్శలు వచ్చాయి.

పద్మావత్, తాన్హాజీ, పానిపట్ వంటి సినిమాలపై ఈ తరహా విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో, పద్మావత్, తాన్హాజీ విడుదలైన సంవత్సరంలో, మొదటి మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలలో నిలిచాయి.

వీటి మీద వచ్చిన అతి పెద్ద విమర్శ ఏంటంటే, ఈ సినిమాలలో అల్లావుద్దీన్ ఖిల్జీ, అహ్మద్ షా అబ్దాలీ వంటి చారిత్రక ముస్లిం పాత్రలను రాక్షసులుగా చూపించారు. అటువంటి చిత్రీకరణను విమర్శిస్తూ శ్యామ్ బెనగల్ ఇలా అన్నారు:

‘‘పద్మావత్ కథ నిజానికి ఒక ప్రేమ కథ. కానీ దీనిలో ఖిల్జీ పాత్రను చాలా చెడ్డగా చూపించారు. ఇలా చూపించడం తప్పని నేను అనేకసార్లు చెప్పాను. ఇలాంటి అపరిపక్వ చిత్రీకరణకు కారణం మనకున్న దురభిప్రాయం మాత్రమే. మీరు అనుభవాల స్థానంలో దురభిప్రాయాలను తీసుకుంటే, అన్నీ విషతుల్యంగా మారతాయి.’’ అన్నారు.

పద్మావత్ చిత్రంలో ప్రధాన పాత్ర అల్లావుద్దీన్ ఖిల్జీని చూపించిన విధానాన్ని కూడా సైబల్ ఛటర్జీ ప్రశ్నించారు.

పద్మావత్

ఫొటో సోర్స్, VIACOM18

‘‘పద్మావత్ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర మాంసాన్ని పీక్కు తింటున్నట్లు చూపించారు. మాంసాన్ని అందరూ తింటారు. కానీ, సినిమాలో దీనిని ఎంత ఘోరంగా చూపించారంటే, అతనేదో రాక్షసుడు అన్నట్లుగా చిత్రీకరించారు. ఇదంతా కావాలని చేసింది.’’

2018 లో విడుదలైన పద్మావత్ చిత్రం మొదటి సన్నివేశం నుంచి, అలావుద్దీన్ ఖిల్జీ, రతన్ రావల్ సింగ్‌లను చూపించిన విధానంలోనే వైరుధ్యం కనిపిస్తుంది.

ఖిల్జీ నల్లటి దుస్తులు ధరించిన అనాగరికమైన, క్రూరమైన వ్యక్తిగా కనిపిస్తుండగా, రతన్ రావల్ సింగ్ తెల్లని బట్టలు ధరించిన గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడు.

రతన్ రావల్‌ను చాలా సందర్భాలలో తెల్లని వెలుతురులో చూపించగా, ఖిల్జీని చీకటిలో చూపించారు.

ఖిల్జీ, రతన్ రావల్ సింగ్ ఇద్దరూ వివాహం చేసుకున్నప్పటికీ, ఇతర మహిళల దగ్గరకు వెళతారు.

ఖిల్జీ ఒక మహిళతో చీకట్లో సరసాలాడుతుంటాడు. అదే సమయంలో, రతన్ రావల్ సింగ్, దీపికా పదుకొణెల సాన్నిహిత్యాన్ని చాలా మృదువైన హావభావాల ద్వారా చూపిస్తారు.

'మసాన్' వంటి ప్రముఖ చిత్రాల దర్శకుడు నీరజ్ ఘేవన్ ఈ తరహా చిత్రీకరణను కావాలని చేసిన ప్రయత్నంగా చెబుతారు.

‘‘దీన్నంతా కావాలని చేస్తారు. మీరు రంగులను ఎన్నుకున్న విధానాన్ని చూడండి. ప్రొడక్షన్ డిజైన్‌ను చూస్తే అది చాలా మటుకు నల్లగా కనిపిస్తుంది.

ఈ పాత్రను ఎక్కువగా చీకటిలో చిత్రించారు. ఈ పాత్రను లో యాంగిల్‌లో చూపించడం వల్ల అది రాక్షసంగా కనిపిస్తుంది. అదే హీరో పాత్రను తగినంత వెలుగులో, ఐ లెవల్‌లో చిత్రీకరించారు.’’ అన్నారాయన.

తానాజీ

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

శ్యామ్ బెనగల్, సైబల్ ఛటర్జీ, నీరజ్ ఘేవన్‌లు దేని గురించి చెబుతున్నారో అది పద్మావత్‌లోనే కాకుండా 2020 చిత్రం 'తన్హాజీ – ది అన్‌సంగ్ హీరో'లో కూడా కనిపిస్తుంది.

సినిమాలో ప్రధాన పాత్ర అయిన తాన్హాజీ తెల్లని బట్టలు ధరించి దేవుణ్ని ఆరాధించే, ఫ్యామిలీ మ్యాన్‌గా చూపించారు.

అదే సమయంలో, ఉదయ్‌భన్ సింగ్ రాథోడ్ ఔరంగజేబు కమాండర్ అయినందున ఖిల్జీ లాగా నల్లటి దుస్తులు ధరించి మాంసాన్ని పీక్కుతినే వ్యక్తిగా చూపించారు. ఈ విషయంలో సైబల్ ఛటర్జీ నీరజ్‌తో ఏకీభవించారు.

“ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. చిత్ర నిర్మాత తన కాస్ట్యూమ్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్‌ని ఆ పాత్రను చాలా దుష్టుడిలా కనిపించే విధంగా చూపించమని అడుగుతాడు. మనం స్టైలిస్ట్ ఫిల్మ్ మేకర్స్ అని పిలుచుకునే వారు కూడా అలాంటి పనులు చేస్తారు. కానీ వాళ్లు ఇది తమకు తెలీకుండా చేస్తున్నారంటే నేను అంగీకరించను. దీని వెనుక ఒక తెలివైన వ్యూహం ఉంది’’ అన్నారు సైబల్ ఛటర్జీ.

అయితే, ఇదంతా ఈ రెండు సినిమాలకే పరిమితమా? బీబీసీ తన విశ్లేషణలో చేర్చిన అనేక సినిమాలలో హిందూ, ముస్లిం చారిత్రక పాత్రలను నైతిక హిందూ రాజు, అనైతిక ముస్లిం రాజు అనే విధంగానే చిత్రించారు.

ఇలాంటి సినిమాలకు తాన్హాజీ గొప్ప ఉదాహరణ. ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో, తాన్హాజీ, శివాజీకి మద్దతుగా మొఘల్ సామ్రాజ్యంలోని నమ్మకమైన గ్రామస్తులను ఒప్పించే ప్రయత్నంలో ఇలా అంటాడు, “చనిపోయిన వారిని మోసుకెళుతూ శ్రీరాముడి పేరును కూడా పైకి ఉచ్ఛరించలేరు. మీరు ఇంకా ఎన్నిసార్లు చస్తారు?.’’ అని ప్రశ్నిస్తాడు.

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో హిందువులు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళుతున్నప్పుడు 'రామ్ నామ్ సత్య హై' అని చెబుతారు. ఎక్కడా జై శ్రీరామ్ నినాదాలు చేయరు. ఈ సినిమాలో శివాజీ జెండాలో హిందూ మతానికి సంబంధించిన అతి ముఖ్యమైన చిహ్నం 'ఓం'ను కూడా ఉపయోగించారు. వివాదం తలెత్తడంతో దానిని తొలగించారు.

బాలీవుడ్‌లో ముస్లింలు

మంచి, చెడు పాత్రల్లో ముస్లింలు

తీవ్రవాద నేపథ్యం ఉన్న అనేక చిత్రాలను కూడా బీబీసీ విశ్లేషించింది. వీటిలో భారతీయ ముస్లింలను మంచివారిగానూ, చెడ్డవారిగానూ చూపించిన సందర్భాలున్నాయి. 2021లో విడుదలైన 'సూర్యవంశీ' సినిమాలో ఇది కనిపిస్తుంది.

ఈ సినిమాలో ఒక మాజీ పోలీసును గడ్డం లేని మంచి ముస్లింగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ పాత్ర కొడుకు కూడా పోలీసు ఉద్యోగం చేస్తుంటాడు. ఆ వ్యక్తి రిటైర్ అయ్యాక కూడా పోలీసులకు సహాయం చేస్తుంటాడు.

అదే సమయంలో పొడవాటి గడ్డంతో ఉన్న వ్యక్తిని చెడ్డ ముస్లింగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ పాత్రకు పొడవాటి గడ్డం ఉంటుంది కానీ మీసాలు ఉండవు. అతని నుదిటిపై నమాజు చేయడం వల్ల ఏర్పడే నల్లటి గుర్తు ఉంటుంది.

గతంలో, మిషన్ కాశ్మీర్, హీరో- ది లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై, రాజీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో ముస్లిం పాత్రలు మంచి, చెడ్డవీ రెండూ కనిపిస్తాయి. సమాజంలో ఒక నిర్దిష్ట వర్గంపై ఉన్న దురభిప్రాయాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు సినిమాలలో కూడా చేస్తున్నారా?

దీనిపై శ్యామ్‌ బెనగల్‌ మాట్లాడారు: ‘‘సినిమా చాలా శక్తిమంతమైన మాధ్యమం. సినిమాల ద్వారా సమాజానికి హాని కలిగించే సందేశాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సమాజం భిన్నత్వంతో నిండి ఉంది. మీరు తోటి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు చాలా సాధారణ పద్ధతిలో వ్యవహరించాలి. ఎలాంటి పక్షపాత ధోరణి ఉండకూడదు. మీ పనిలో పక్షపాత ధోరణి ప్రతిబింబిస్తే, అది ఇబ్బందికరంగా మారుతుంది. ఒక వ్యక్తిలో ఉన్న దురభిప్రాయాలను మీరు బలపరిస్తే, అతను మిమ్మల్ని ఇష్టపడతాడు. మనందరిలో పక్షపాత ధోరణి ఉంటుంది. కానీ, మనం వాటిని ఎప్పుడూ ఆచరణలో పెట్టం. పక్షపాత ధోరణిని ఆచరణలో పెట్టడం మంచిది కాదు.’’

సినిమా నిర్మాతలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘‘మీరు మాస్ మీడియాలో పనిచేస్తున్నప్పుడు, దేశానికి, ప్రపంచానికి చేరువయ్యే వార్తలు రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీలోని పక్షపాత ధోరణి గురించి జాగ్రత్తగా ఉండాలి. మీలో ఏమైనా పక్షపాత ధోరణి ఉందా అన్నది మీకు మీరే గమనించుకోవాలి’’ అన్నారు.

బాలీవుడ్‌లో ముస్లింలు

అయితే, ఇదంతా మారుతున్న రాజకీయాలు, రైట్ వింగ్‌ ప్రభుత్వంగా చెప్పే మోదీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందా? ఈ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం- లేదు అని చెప్పవచ్చు. చాలా కాలంగా, బాలీవుడ్ తన సినిమాల విజయానికి ఫార్ములాల టూల్‌ కిట్‌పై ఆధారపడుతోంది.

దేశభక్తి, జాతీయవాదం కూడా ఈ టూల్‌ కిట్‌లో ఒక భాగం. “మనం హిందీ సినిమాల్లో మతపరమైన మైనారిటీ పాత్రల గురించి, ముఖ్యంగా ముస్లింల గురించి చెప్పుకోవాలంటే, ముస్లిం పాత్ర పోలీసు స్టేషన్‌లో సాధారణ కానిస్టేబుల్ లేదా ఇన్‌స్పెక్టర్‌గా ఉంటుంది.

అతను తన దేశభక్తిని నిరూపించుకోవడానికి ఇతరులకన్నా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. చివరికి చనిపోవడం ద్వారా ముస్లిం ఇన్‌స్పెక్టర్ తన దేశభక్తిని నిరూపించుకోవాలి.’’ అని ఛటర్జీ వ్యాఖ్యానించారు.

ముప్పై నలభై ఏళ్ల కిందట పార్సీ కమ్యూనిటీపై 'ఖట్టా-మీఠా'వంటి సినిమాలు తీసారు. క్రిస్టియన్‌ పాత్రలతో జూలీ సినిమా తీశారు.

ముస్లిం జీవన శైలికి సంబంధించి చాలా గొప్పచిత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు, 'మేరే హుజూర్', 'మేరే మెహబూబ్', 'పాకీజా', 'ఉమ్రావ్ జాన్', ఇంకా 'నికాహ్'లాంటివి అనేకం ఉన్నాయి.

అయితే, అప్పట్లో ఈ సినిమాలను ప్రత్యేకమైన సినిమాలుగా పరిగణించ లేదు. ప్రధాన స్రవంతి సినిమాలుగానే భావించారు. కానీ నేడు వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తోంది.

‘‘ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా కథనం వన్‌సైడ్ పార్షియాలిటీతో నిండిపోయింది. దీనికి గత తొమ్మిదేళ్ల కాలం మాత్రమే బాధ్యురాలు కాదు. ఇది అంతకు ముందు నుంచీ జరుగుతోంది.” అన్నారు ఛటర్జీ.

తొంభైల ప్రారంభం, చివర్లో విడుదలైన సినిమాలు ఆనాటి సమాజంలో, రాజకీయాల్లో వచ్చిన మార్పులకు అద్దం పడతాయని సినీ దర్శకుడు అవినాష్ దాస్ అభిప్రాయపడ్డారు.

రోజా సినిమా రాగానే పొరుగు దేశం నుంచి ఆరోపణలు మొదలయ్యాయి. కశ్మీర్‌ సమస్య రగిలింది. గదర్ సినిమా వచ్చినప్పుడు, భారతదేశంలో హిందూ-పాకిస్తాన్, హిందూ-ముస్లిం సమస్యలను క్యాష్ చేసుకున్న ప్రభుత్వం అధికారంలో ఉంది.

బాలీవుడ్‌లో ముస్లింలు

బాలీవుడ్ ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తోంది?

ఈ ప్రశ్నకు ఒక సమాధానం అంటూ లేదు. ఒకటేంటంటే, అలాంటి సినిమాలు వసూళ్ల పరంగా లాభదాయకంగా ఉన్నాయి. బాలీవుడ్‌లో ఎక్కువ అమ్ముడుపోయే సినిమా కథలనే ఎక్కువగా తయారు చేస్తారు. సినిమా జర్నలిస్ట్ లతా ఝా తన ‘బాలీవుడ్-బాక్స్ ఆఫీస్ అండ్ బియాండ్’ పుస్తకంలో ఈ విషయాన్ని వివరించారు.

లతా ఝా తన పుస్తకంలో ఇలా రాసారు. “2014 నుంచి 2019 మధ్య వచ్చిన బాలీవుడ్ సినిమాలలో 37 చిత్రాల ప్రధాన ఇతివృత్తం దేశభక్తి, జాతీయవాదం. ఇందులో 24 సినిమాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాలలో ఉరి దాడి ఆధారంగా 2016 లో విడుదలైన 'ఉరి - ది సర్జికల్ స్ట్రైక్', సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'బజరంగీ భాయిజాన్' వరుసగా రూ.200 కోట్లు, రూ.190 కోట్లకు పైగా వసూలు చేసి మెగా చిత్రాలుగా నిలిచాయి.

ఈ సినిమాలలో చాలా వరకు అక్షయ్ కుమార్ కథానాయకుడి పాత్ర పోషించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహంలు చెరో నాలుగు సినిమాలలో హీరోగా నటించారు.

అయితే, దీనికి సినీ దర్శకులు, నిర్మాతలు మాత్రమే బాధ్యత వహించలేరని అవినాష్ దాస్ అభిప్రాయపడ్డారు.

“సినిమా దర్శకులలో ఒక వర్గం వారు సినిమా తీయడానికి ప్రధాన కారణం దాని కలెక్షన్లు. కాగా రెండో వర్గం సినిమా దర్శకులకు వాస్తవాలను చెప్పడానికి సినిమా తీస్తారు. కానీ ఇప్పుడు రెండో విభాగానికి చెందిన సినిమా దర్శకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వారి సినిమాలు బ్లాక్ బస్టర్లు కూడా కావు. లేదంటే వారు పెద్ద పెద్ద స్టార్లతో ఇమడలేకపోతున్నారు.

తారల అండ ఉన్న దర్శకులు ఇలాంటి సోషియో పొలిటికల్ సినిమాలు తీయడం లేదు. పెద్దస్టార్లు కూడా రాజకీయాలకు దూరంగా ఉండటం దీనికి ఒక కారణం. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాతలు వివాదాలకు దూరంగా ఉంటూ మధ్యేమార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. మరి అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారా?

బాలీవుడ్‌లో ముస్లింలు

2019 సంవత్సరంలో విడుదలైన సినిమా ‘ఉరి-ది సర్జికల్ స్ట్రైక్’. దానిలోని కొన్ని ప్రత్యేకమైన డైలాగ్‌ల కారణంగా ఈ సినిమాకు మంచి పేరొచ్చింది.

యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ గణాంకాలను బీబీసీ అధ్యయనం చేసినప్పుడు, యూట్యూబ్‌లో కూడా ప్రేక్షకులు ఈ డైలాగ్‌లను పదే పదే విన్నారని తేలింది.

ఈ ట్రైలర్‌లో, విక్కీ కౌశల్ పాత్ర మేజర్ విహాన్ సింగ్ షేర్‌గిల్ సర్జికల్ స్ట్రైక్‌కి వెళ్లే ముందు తన పారాట్రూపర్‌లతో- ‘‘రక్తానికి రక్తంతో ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. భారత సైన్యం ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు. కానీ మనం రక్తంతో దీన్ని ముగించాలి. హౌ ఈజ్ ది జోష్, హౌ ఈజ్ ది జోష్’’ అంటాడు.

‘‘వారికి కశ్మీర్ కావాలి. మనకు వాళ్ల తలలు కావాలి. మీ 72 మంది కన్యలకు నమస్కారాలు చెప్పండి. పండగ చేసుకోవడానికి రెడీగా ఉండమని చెప్పండి. మేం ఇవాళ చాలామంది గెస్టులను పంపబోతున్నాం’’ అంటూ సాగే ఈ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో 2.9 కోట్ల మందికి పైగా వీక్షించారు.

ఈ సినిమాలో సర్జికల్ స్ట్రైక్‌కు ముందు, విహాన్ షేర్‌గిల్ తన పారాట్రూపర్‌లతో ఇలా అంటాడు: “సెప్టెంబర్ 28 అర్థరాత్రి, ఉరీలో అమరులైన సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీకు అవకాశం ఇవ్వబోతున్నాను. పిరికిపందల్లాగా తీవ్రవాదులు నిరాయుధులైన మన సోదరులను నిద్రలోనే చంపారు. ఆ క్రూరత్వానికి తిరుగులేని సమాధానం ఇవ్వాలి. వాళ్ల శిరచ్ఛేదం చేసే అవకాశం ఇవ్వబోతున్నాను. మీరు ఈ మిషన్ కోసం సిద్ధంగా ఉన్నారా? ప్రతీకారం కోసం మీ రక్తం మరుగుతోందా?” అని అంటాడు.

బాలీవుడ్‌లో ముస్లింలు

భారత సైన్యంలోని స్పెషల్ ఫోర్సులే కాదు, ప్రపంచంలోని ఏ స్పెషల్ ఫోర్సు కూడా ఇటువంటి మిషన్లలో భావోద్వేగాలతో ఉన్న సైనికులను పాల్గొననివ్వవు.

ఎందుకంటే ఒక మిషన్ సమయంలో, ఒక సైనికుడు భావోద్వేగానికి గురయితే అతను తన ప్రాణాలతో పాటు తన సహచరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తాడు.

ఈ మిషన్లన్నీ చాలా 'ఆబ్జెక్టివ్ అండ్ ప్రెసిషన్ ఫోకస్డ్'గా ఉంటాయి. అంటే సినిమాలో విహాన్ షేర్‌గిల్ క్యారెక్టర్ ఈ డైలాగులను తన పారా ట్రూపర్స్‌తో చెబుతున్నాడా లేక సినిమా హాల్‌లో కూర్చున్న ప్రేక్షకులకు చెబుతున్నాడా? అనిపిస్తుంది.

ప్రముఖ రచయిత, సామాజిక మనస్తత్వవేత్త ఆశిష్ నంది ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

“మీరు గమనించిన విషయం సరైనదే. యుద్ధరంగంలో ఇలాంటివి జరగవు. ఒక రకంగా చెప్పాలంటే గుణపాఠం చెప్పడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్లేవారే నిజమైన భారతీయులు, మిగిలిన వారు కాదంటూ ఒకవర్గం ప్రజలను సమీకరించే ప్రయత్నం ఇది.’’ అని ఆశిష్ నంది అన్నారు.

సినిమాల్లో మూస పాత్రల చిత్రణపై కూడా నంది కొన్ని వ్యాఖ్యలు చేశారు.

“ప్రేమ కంటే ద్వేషం అనే భావోద్వేగానికే వ్యక్తులను ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంది. శృంగారం, ప్రేమ హీరో, హీరోయిన్‌ల మధ్య మాత్రమే జరుగుతుంది. కానీ, ద్వేషం అనేది సామూహిక భావోద్వేగం. డైరెక్ట్‌గా బయటకు రావాలంటే సెన్సార్ బోర్డ్ ఆమోదం లభించదు.

కాబట్టి ఇలా మారువేషంలో బయటకు వస్తుంది. యుద్ధంపై తీసిన ఏ సినిమాలోనూ యుద్ధానికి వ్యతిరేకత కనిపించదు. 'ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్' వంటి ప్రసిద్ధ యాంటీ వార్ సినిమాలు భారతదేశంలో కనిపించవు. జపాన్‌లో కూడా యుద్ధానికి వ్యతిరేకంగా సినిమాలు తీశారు.’’ మరి ఇది ఆందోళన కలిగించే అంశమా?

ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని శ్యామ్ బెనగల్, ఆశిష్ నంది అభిప్రాయపడ్డారు. “ఒకప్పుడు సిక్కు కమ్యూనిటీపై జోకులు వేసేవారు. కానీ అది క్రమంగా తగ్గడం మొదలైంది. జోకులు తగ్గడంతో పాటు సిక్కు సమాజం ఆర్థికంగా బలపడింది. అటువంటి పరిస్థితిలో, ఒక సమాజం ఆర్థిక స్థితి మరింత బలంగా మారినప్పుడు, దానిని చూపించే విధానం కూడా మెరుగుపడుతుంది. ఆర్థికంగా బలమైన సమాజాలు తమ వర్గాన్ని బలంగా ఉంచుకోగలవు.’’ అని శ్యామ్ బెనగల్ అన్నారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే, “నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, ఈ విషయాల గురించి ఎవరూ ఎక్కువగా ఆలోచించకూడదు. ఎందుకంటే పక్షపాత ధోరణి ఎప్పుడూ ఉంటుంది. సినిమా నిర్మాతలు ఈ అభిప్రాయాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుని డబ్బు సంపాదించవచ్చు. సామాజిక శాంతికి భంగం కలిగించని విషయాల పట్ల ప్రజలు ఆందోళన చెందకూడదు?’’ ఇది కొంత కాలం పాటు ఉండే ట్రెండ్ అని ఆశిష్ నంది కూడా అభిప్రాయపడ్డారు. బహుశా సమాజ ధోరణిలో వచ్చే మార్పులతో సినిమా దృక్పథం, వాటిని తీసే విధానం కూడా మారవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)