తెలంగాణ ప్రగతి భవన్ ముందు కంచె తొలగింపు, అక్కడ ఏం జరుగుతోంది?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపడుతూనే కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తొలగించాలని ఆదేశించారు. స్వయంగా ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం, అదే వేదికపై నుంచే ప్రగతి భవన్ కంచె తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
అంతకుముందే రేవంత్ ఆదేశాలు జారీ చేయడంతో ప్రమాణ స్వీకారం జరిగే సమయానికి గ్రిల్స్ తీసివేత కూడా జరుగుతున్నట్టు ఆయన వేదికపై ప్రకటించారు. ఒకవైపు రేవంత్ ప్రమాణం, మరోవైపు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు కంచె తొలగింపు ఒకేసారి జరిగాయి.
గ్యాస్ కట్టర్లతో ఇనుప గ్రిల్స్‌ను కత్తిరించి, తొలగిస్తున్నారు. దీంతో ఇక్కడ రోడ్డు వెడల్పు అయ్యే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి అధికారిక నివాసం పేరు ఇకపై ప్రగతి భవన్ కాకుండా, జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా మార్చుతున్నట్లు రేవంత్ ప్రకటించారు. గతంలో అంబేడ్కర్ ప్రజా భవన్ అని పేరు పెడతాననీ, తాను ఆ ఇంట్లో నివాసం ఉండబోననీ రేవంత్ ప్రకటించారు.
అయితే, ఇప్పటికే సచివాలయానికి అంబేడ్కర్ పేరు ఉన్నందున ముఖ్యమంత్రి ఇంటికి ఫూలే పేరు పెట్టి ఉండొచ్చని పలువురు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి వైఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో మొదటిసారి అదనపు హంగులు జోడించి, అదనపు భవనాలు, గదులతో పునర్నిర్మించారు. ఆ తరువాత కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ ఇంటికి మారలేదు. అనంతరం ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ఇందులో నివాసమున్నారు.
బేగంపేట ప్రధాన రహదారిపై నుంచి ఎడమ వైపు తిరిగితే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు వస్తుంది. కిరణ్ కిమార్ రెడ్డి కంటే ముందు వరకూ ఆ రోడ్డుపై ఎలాంటి నిర్మాణాలు, కంచెలు ఉండేవి కావు. కేవలం ముఖ్యమంత్రి, లేదా అంతకంటే పెద్ద వారు వెళ్లేప్పుడు ట్రాఫిక్ ఆపేవారు.

కేసీఆర్ హయాంలో కంచె..
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళనలు పెరగడంతో క్యాంప్ ఆఫీసు ముందు మొదటిసారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో బారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అది కూడా తాత్కాలిక ఏర్పాటే తప్ప శాశ్వత నిర్మాణం కాదు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన మొదటి విడతలో కూడా తాత్కాలిక ఏర్పాటే ఉండేది. కాకపోతే క్రమంగా రోడ్డుపై ఒక కారు వెళ్లేంత దూరంలో సన్నని, కాస్త ఎత్తైన కంచెలు ఏర్పాటు చేస్తూ వచ్చారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన మొదటి విడతలో ముఖ్యమంత్రి నివాసానికి భారీ మార్పులు చేశారు. అప్పటి వరకూ ఉన్న రెండు పెద్ద భవనాలకు అదనంగా మరో రెండు పెద్ద భవనాలు నిర్మించారు. అందుకోసం సీఎం ఇంటి వెనుక ఉండే ఐఏఎస్ క్వార్టర్లను కూల్చి స్థలాన్ని పెంచారు.
కేసీఆర్ హయాం కంటే ముందు వరకూ.. రోడ్డుపైకి కనిపించే భవనం కార్యాలయంగా, దాని వెనుక ఉన్న భవనం ఇల్లుగా వాడేవారు. కేసీఆర్ హయాంలో ఈ రెండు భవనాలకూ వెనుక నిర్మించిన మూడవ భవనం ఇంటిగా వాడుతున్నారు.

అప్పటి వరకూ ఇంటికి వాడిన భవనాన్ని కార్యాలయంగా మార్చారు. రోడ్డుపై ఉన్న భవనం సిబ్బందికి కేటాయించారు. ఇది కాకుండా మీడియా సమావేశాల కోసం ఒక పెద్ద హాల్ తరహా భవనం నిర్మించారు. ఆ భవనమే ఇప్పుడు రోడ్డుకు ఎదురుగా కనిపిస్తుంది.
2016లో కొత్త భవనాల నిర్మాణం పూర్తయిన తరువాత, దానికి ప్రగతి భవన్ అని పేరు పెట్టారు కేసీఆర్. ఆ క్రమంలోనే రోడ్డుపై ఉన్న కంచెల ఎత్తు పెరిగింది. దాదాపు రెండు కార్లు వెళ్లేలా రోడ్డు వదిలి శాశ్వత నిర్మాణంగా కంచె ఏర్పాటు చేశారు. ఆ తరువాత వర్షం పడకుండా దానిపై షెడ్డు వేశారు. దీంతో బేగంపేట ప్రధాన రహదారిపై ఆ మేరకు వాహనాలకు రోడ్డు తగ్గింది.
గతంలో ఎడమవైపునకు తిరిగేప్పుడు పోలీసులు చెకింగ్ చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ కంచె దగ్గర నుంచే పోలీసులు చెక్ చేస్తున్నారు.
వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ కూల్చివేత ద్వారా ఒక సందేశం పంపించారు రేవంత్ రెడ్డి.

ఫొటో సోర్స్, Revanth reddy
కంచె తొలగింపునకు రేవంత్ ఆదేశాలు
గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఉదయాన్నే ప్రజలతో ప్రత్యక్షంగా కలిసేవారు. దాన్నే ప్రజా దర్బార్ అని కూడా అనేవారు. అంటే, ఎవరైనా ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా తమ సమస్యను ఒక కాగితంపై రాసుకుని వెళ్లి నేరుగా సీఎంకి అందించొచ్చు.
అయితే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ వ్యవస్థను ఆపేశారు. దానిపై అనేక మంది ప్రశ్నించినప్పటికీ ఆ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ సమర్థించింది.
‘‘ముఖ్యమంత్రి వరకూ నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన అవసరం ఉండే సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. అసలు సమస్య ముఖ్యమంత్రి వరకూ వెళ్తుంది అంటేనే, దాని అర్థం వ్యవస్థ విఫలం అయినట్టు’’ అని వ్యాఖ్యానించారు కేటీఆర్. అప్పట్లో ప్రగతి భవన్ అంత భారీగా నిర్మించడంపై ప్రతిపక్షాలు విమర్శలకు కేసీఆర్ అసెంబ్లీలో స్పందించారు కూడా.
ఇన్నాళ్లకు తిరిగి మళ్లీ ప్రజా దర్బార్ ప్రారంభించబోతున్నట్టు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచే ప్రజా దర్బార్ ఉంటుందని ఆయన వేదికపైనే ప్రకటించారు. సీఎం ఇంటి గేట్లు సామాన్యుల కోసం తెరుచుకున్నట్లు ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- యశస్విని, పర్ణిక, లాస్య నందిత, రాగమయి.. తెలంగాణలో ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది మహిళలు ఎవరు?
- టికెట్ కోసం పార్టీలు మారి గెలిచిందెవరు? ఓడిందెవరు?
- ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ను ఎగ్జిట్ పోల్స్ ఎలా పట్టిస్తాయి, ఒక్కోసారి ఎందుకు ఫెయిల్ అవుతాయి?
- కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌లను ఓడించి సంచలనం సృష్టించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి
- సునీల్ కనుగోలు: తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక పనిచేసిన ఈ వ్యూహకర్త ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














