విశాఖ: దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణం ఎందుకు ముందుకు కదలడం లేదు... తప్పు కేంద్రానిదా, రాష్ట్రానిదా?

విశాఖపట్నం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఇంకా ఈ రైల్వే జోన్ పనులు ప్రారంభం కాలేదు.

‘‘దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు’’ అని డిసెంబర్ 6న లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.

దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారు? అని లోక్‌సభలో టీడీపీ ఎంపీ కె. రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పారు.

అసలు విశాఖ కేంద్రంగా తలపెట్టిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారం అవుతుందా? దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి ఉందా? కేంద్రం చెప్తున్నది నిజమేనా అనే చర్చ నడుస్తోంది.

కేంద్ర రైల్వే శాఖ

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రం, రాష్ట్రం రెండూ డ్రామాలు ఆడుతున్నాయి

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించినా ఎటువంటి పనులు ప్రారంభం కాకపోవడంతో ఇంకా తూర్పుకోస్తా రైల్వేగానే విశాఖ జోన్ కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా ద‌క్షిణ‌ కోస్తా రైల్వే జోన్ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) ను కేంద్ర రైల్వే బోర్డుకు స‌మ‌ర్పించి 4 ఏళ్ల 2 నెలలు పూర్తయింది. 2019 సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన డీపీఆర్ ను రైల్వే బోర్డుకు అంద‌జేశారు. డీపీఆర్ అంద‌జేసిన 60 రోజుల్లో ప‌నులు ప్రారంభించాల్సి ఉంటుంది.

ఇంత కాలమైనా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం, ఇతర పనులు ప్రారంభం కాకపోవడంపై కేంద్రమంత్రులు, రైల్వే బోర్డు నాన్చుడు ధోరణి కారణమని బీబీసీతో విశాఖ రైల్వే జోన్ సాధన కమిటీ కన్వీనర్ జేవీ సత్యనారాయణ (నాని) అన్నారు. స్థిరమైన కార్యాచరణ ఇప్పటివరకు ప్రకటించలేదని ఆయన ఆరోపించారు.

“విశాఖ కేంద్రంగా ప్రారంభించాల్సిన రైల్వే జోన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయి. ఆ రెండింటికి రైల్వే జోన్ రావడం ఇష్టం లేనట్లుగా ఉంది. జోన్ ప్రారంభించడానికి రాష్ట్రం స్థలం ఇవ్వలేదని ఒకసారి, సహకరించడం లేదని మరోకసారి కేంద్రం చెప్తోంది. జోన్ ప్రారంభించాల్సిన బాధ్యత కేంద్రానిది, రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేసి కేంద్రం నాటకం ఆడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ కేంద్రాన్ని ఒక మాట అనలేదు. రైల్వే జోన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయి” అని బీబీసీతో జేవీ సత్యనారాయణ చెప్పారు.

అసలు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఎందుకు ఇవ్వలేకపోతోంది? రాష్ట్రం ఆ భూమి ఇచ్చేసి రైల్వే జోన్ అంశంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.

రైల్వే జోన్‌కు భూమి ఎందుకు ఇవ్వడం లేదు అనే అంశంపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్

కేంద్రం ఏమంటోంది?

ఏపీ విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్ అంశం అప్పుడప్పుడు కేంద్రం ప్రకటనలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఉపన్యాసాలలో కనిపిస్తుంటుంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశంపై ఇంతకు మించి స్పష్టమైన కార్యాచరణ ఎక్కడ కనిపించలేదు. తాజాగా లోక్‌సభలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన వివరాలు కూడా అలాగే ఉన్నాయని బీబీసీతో ఉత్తరాంధ్ర హక్కుల పోరాట వేదిక అధ్యక్షులు రాము అన్నారు.

“దక్షిణ కోస్తా రైల్వే జోన్ డీపీఆర్ తయారైంది. రూ. 106.89 కోట్లతో జోనల్ కార్యాలయం నిర్మాణ పనులకు మంజూరు చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్లు కేటాయింపులు కూడా చేశాం. ఇందులో భాగంగా భూమి సర్వేతో పాటు జోనల్ ఆఫీస్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాల లేఅవుట్ ప్లాన్ తయారీ బాధ్యత తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు అప్పగించాం. గతంలో ఏపీ ప్రభుత్వం బీఆర్టీఎస్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న రైల్వే భూమికి బదులుగా విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంలో 52.2 ఎకరాల భూమిలో వైజాగ్ రైల్వే జోనల్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదించాం. ఈ భూమిని ఏపీ ప్రభుత్వం అప్పగించాల్సి ఉంది. ఈ భూమిని అప్పగించడంలో ఆలస్యం వల్లే రైల్వే జోన్ ఆలస్యం అవుతోంది” అంటూ రైల్వే మంత్రి చెప్పుకొచ్చారు.

ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే రైల్వే జోన్ అలస్యం అవుతుందని వెల్లడించారు.

రైల్వే జోన్

రైల్వే జోన్ ఏర్పాటు బాధ్యత ఎవరిది?

“భూమి ఇవ్వకపోతే తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రానిది కాదా? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భూమి కోసం ఎదురు చూస్తూ రైల్వే జోన్ నిర్మాణాన్నే ఆపేస్తారా? కేంద్రం భూములు ఇవ్వలేదని విమర్శిస్తుంటే రాష్ట్రం ఆ భూములు ఎందుకు ఇవ్వడం లేదు? కేవలం 52 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుందంటే నమ్మగలమా?” అని బీబీసీతో ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ ట్రెండ్ యూనియన్ లీడర్ చలసాని గాంధీ అన్నారు.

“విశాఖ డీఆర్ఎం కార్యాలయం పక్కన ఉన్న వైర్‌లెస్ కాలనీలో నిరుడు అక్టోబర్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం శంఖుస్థాపనంటూ 13 ఎకరాల భూమిని కూడా రైల్వే శాఖ సేకరించింది. ఇందులో 8 ఎకరాల్లో రైల్వే జోన్‌కు సంబంధించిన బహుళ అంతస్థుల భవనాలను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే, ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నింటినీ ఎందుకో రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ భూముల కోసమే ఎదురు చూస్తున్నట్లయితే కార్యాలయ నిర్మాణం కోసం ఎందుకు రంగం సిద్ధం చేశారు? కేంద్రం చేయగలదు, కానీ ఇష్టం లేక చేయడం లేదు” అని చలసాని గాంధీ చెప్పారు.

‘‘ఇప్పటి వరకు దేశంలో ఏర్పాటైన ఏ రైల్వేజోన్‌ను కూడా ముందు భూములు, భవనాలు సిద్ధం చేసి ఏర్పాటు చేయలేదు. ఏదో ఒక భవనంలో తొలుత కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని, ఆ తర్వాత తగిన స్థలం, ఇతర కార్యాలయాలు చూసుకుని అక్కడికి వెళ్లారు. హుబ్లీ, బిలాస్పూర్, జబల్ పూర్ వంటి కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేసినప్పుడు ఇలాగే జరిగింది. రెండు, మూడు ప్లాట్లు అద్దెకు తీసుకుని కూడా రైల్వే జోన్ కార్యాలయాన్ని ప్రారంభించవచ్చు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వలేదని, కార్యాలయం లేదని చెప్తూ జోన్ కార్యక్రమాలు ప్రారంభించకపోవడం అన్యాయం’’ అని చలసాని గాంధీ తెలిపారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్

ఫొటో సోర్స్, Getty Images

‘రాష్ట్ర ప్రభుత్వమే కారణం’

కేంద్ర ప్రాజెక్టులను తీసుకురావడంలోనూ, కేంద్రానికి సహకరించడంలోనూ ఏపీ సర్కార్ పూర్తిగా వెనకబడిందని బీబీసీతో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు యుగంధర్ రెడ్డి అన్నారు.

‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డికి కేంద్రంలో మంచి పలుకుబడి ఉంది. కానీ, దాన్ని ఆయన ప్రాజెక్టులు తీసుకురావడంలో, వచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఉపయోగించం లేదు. దానికి ఒక ఉదాహరణే విశాఖ రైల్వేజోన్. ముడసర్లోవ దగ్గర వివాదస్పద భూమిని రైల్వే జోన్ కోసం ఇచ్చారు. దీంతో ఆ భూమిని వద్దని, వేరే చోట ఇవ్వమని కేంద్రం కోరింది. కానీ, ఖరీదైన విశాఖలోని భూములను రైల్వేజోన్‌కు ఇవ్వడం రాష్ట్రానికి ఇష్టం లేనట్లుంది. భూమిని ఇస్తే రైల్వే జోన్ పూర్తి చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వమే చొరవ చూపించనట్లుగా కనిపిస్తోంది’’ అని యుగంధర్ రెడ్డి చెప్పారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఈ అంశంపై మాట్లాడారు. “ముడసర్లోవలో 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం తరపున జీవీఎంసీ అధికారులు రైల్వేకు ఇవ్వాల్సి ఉంది. ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ ఆ భూమిని ఇవ్వడం లేదు. ఆ భూములు రైల్వేకు అప్పగించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. జోన్‌ జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణం” అని జీవీఎల్ ఆరోపించారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్

ఫొటో సోర్స్, Getty Images

‘‘రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వదు’’

ముడసర్లోవలో భూములు రైల్వేకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని టీడీపీ సీనియర్ నాయకుడు పల్లా శ్రీనివాస రావు అన్నారు.

‘‘అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి ఆసక్తి లేదు. గతంలోనే ముడసర్లోవ ప్రాంతంలో వైసీపీ నాయకులు భూములు కొన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ చుట్టూ జీవీఎంసీ చేత పెద్ద ప్రహారీ నిర్మించాలనే ప్రయత్నం చేశారు. అక్కడి భూములను రైల్వేకు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వానికి ఇష్టం లేదు. భూములు ఇస్తే జోనల్‌ కార్యాలయం నిర్మిస్తామని కేంద్రం కోరుతున్న రాష్ట్రం స్పందించడం లేదు. ముడసర్లోవలో భూములు ఇస్తేనే పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి చెప్పడంతో కథ మళ్లీ మొదటికి వచ్చిందన్నారు’’ పల్లా శ్రీనివాసరావు.

బీజేపీ కూడా రైల్వేలను ప్రైవేటీకరణ చేసేందుకు ఆసక్తి చూపుతోందని విశాఖ రైల్వే జోన్ సాధన కమిటీ కన్వనీర్ జేవీ సత్యనారాయణ అన్నారు.

‘‘రైల్వే జోన్ పనులను ప్రారంభించడానికి ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని చూపించి కేంద్రం ముందడుగు వేయట్లేదు. జోన్ పనులు ప్రారంభించాలని అనుకుంటే కేంద్రానికి అదేం పెద్ద పని కాదు. విశాఖ రైల్వే జోన్‌ని రాజకీయంగా వాడుకుంటున్నారు. దానికి రాష్ట్రం కూడా సహకరిస్తోంది” అని విశాఖ రైల్వే జోన్ సాధన కమిటీ కన్వనీర్ జేవీ సత్యనారాయణ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)