శ్వేతపత్రం విడుదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు.. ఇంతకూ శ్వేతపత్రం అంటే ఏంటి?

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం సాయంత్రం తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.
ఈ క్యాబినెట్‌లో విద్యుత్‌శాఖపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి, త్వరలోనే విద్యుత్ శాఖ లావాదేవీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితమే ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి రాజీనామా చేసిన డి. ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని, శుక్రవారం జరిగే సమీక్షకు హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఈ సమావేశం అనంతరం క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు మీడియాకు తెలియజేశారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, “2014 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖ పరిధిలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఖర్చులు, ప్రజలకు ఏ మేరకు ప్రయోజనాలు అందాయనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించాం” అని చెప్పారు.
దీనితోపాటు విద్యుత్ శాఖలో ప్రణాళిక బద్ధమైన నిర్ణయాలు జరగలేదని అన్నారు. విద్యుత్ శాఖలో జరిగిన లావాదేవీలపై కూడా శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇలా శ్వేతపత్రం గురించి మనం తరచూ వింటూనే ఉంటాం.
పలు సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కొన్ని అంశాల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేయడం, ప్రభుత్వమే ఫలానా అంశంపై శ్వేతపత్రం విడుదల చేస్తుండటం మనం చూస్తుంటాం.
ఇంతకీ ఈ శ్వేత పత్రం అంటే ఏమిటి? ఇందులో ఏముంటాయి?

ఫొటో సోర్స్, LEGISLATURE.TELANGANA.GOV.IN
శ్వేతపత్రం అంటే?
ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై విడుదల చేసే సాధికారిక నివేదికను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రం అంటారు. అంటే, ఒక అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రభుత్వ అధికారిక సమాచారంతో రూపొందించిన వాస్తవ నివేదికే శ్వేతపత్రం.
అంతేకాదు, ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం తన విధానాలను తెలియపరుస్తూనే, అభిప్రాయాలను ఆహ్వానించడం కూడా శ్వేతపత్రం ద్వారా చేయవచ్చు.
అలాగే, ఒక బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టడానికి ముందు దాని వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజలకు సమాచారం అందించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడు మొదలైంది?
శ్వేతపత్రం అనే పదాన్ని మొదటిసారిగా బ్రిటన్ ప్రభుత్వం ఉపయోగించింది.
చర్చిల్ ప్రభుత్వం 1922లో విడుదల చేసిన ఒక నివేదికను తొలిసారిగా శ్వేతపత్రం అని పిలిచారని చెబుతుంటారు.
యూదులపై పాలస్తీనా హింసపై ఆ దేశంలోని తొలి బ్రిటీష్ హైకమిషనర్ సర్ హెర్‌బర్ట్ శామ్యూల్ రూపొందించిన ముసాయిదా పత్రాన్ని తొలి శ్వేతపత్రం (చర్చిల్ మోమోరాండం)గా పేర్కొంటారు.
బ్రిటన్ పార్లమెంట్ నిర్వచనం ప్రకారం 'ప్రభుత్వ విధానాలను, చట్టపరమైన ప్రతిపాదనలను, బిల్లు రూపం దాల్చడానికి ముందు జరిగే వ్యవహారాలను, ఒక్కోసారి ప్రజల అభిప్రాయలను సేకరించే ప్రభుత్వ నివేదకను శ్వేతపత్రంగా పేర్కొంటారు'
బ్రిటన్ నుంచి ఈ శ్వేతపత్రం భావనను తీసుకొని భారత్, కెనడా, అమెరికాలతో పాటు అనేక దేశాలు తమ పాలనలో భాగం చేసుకున్నాయి.
గ్రీన్ పేపర్..
కొన్ని దేశాల్లో శ్వేతపత్రంతో పాటు గ్రీన్ పేపర్ విధానం కూడా అమలులో ఉంది.
వివిధ అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రానికి ముందు గ్రీన్ పేపర్‌ను విడుదల చేస్తుంది.
ఒక అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు, చర్చల సారాంశం, సలహాలు ఇతర విషయాలపై ప్రభుత్వం విడుదల చేసే సూత్రప్రాయి నివేదికను గ్రీన్ పేపర్‌గా పిలుస్తారు.
శ్వేతపత్రాల వల్ల ప్రభుత్వ విధాన నిర్ణయాలు, అంశాల గురించి ప్రజలు తెలుసుకోగలగుతున్నారు.
అలాగే, ప్రభుత్వ పనితీరును అవగాహన చేసుకొని సూచనలు చేసే అవకాశం కలుగుతోంది.
ఇవి కూడా చదవండి..
- తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పూర్తి జాబితా.. 119 స్థానాలలో ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే
- తెలంగాణ ఎన్నికలు: పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎందరు, యువ ఓటర్ల సంఖ్య ఎంత... మీరు తెలుసుకోవాల్సిన 9 ఆసక్తికర అంశాలు
- తెలంగాణలో పోలింగ్ శాతం ఎందుకు తగ్గింది? పల్లెలు, పట్టణాల మధ్య అంత తేడాకు కారణమేంటి?
- తెలంగాణ ఎన్నికలలో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న మూడు పాటలు
- నిజామాబాద్ అర్బన్: పోలింగ్‌కు ముందు అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా పడతాయా? చట్టం ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















