జమ్మూకశ్మీర్: ‘ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే’ - సుప్రీం కోర్టు తీర్పు

ఫొటో సోర్స్, SCREENGRAB/SUPREME COURT OF INDIA
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది.
ఆర్టికల్ 370 అన్నది కశ్మీర్‌లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేసిన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని వ్యాఖ్యానించింది.
ఈ అధికరణంలోని అంశాలు కూడా అది తాత్కాలిక నిబంధన అనే సూచిస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
జమ్ము-కశ్మీర్ అసెంబ్లీకి 2024 సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలను నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తున్నామని సుప్రీం కోర్టు ప్రకటించింది.
కేంద్రం తీసుకునే ప్రతీ నిర్ణయం సవాలు చేయదగినది కాదని, అలా చేయడం వల్ల అస్థిరత, ఆందోళనలు పెరుగుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై వచ్చిన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈరోజు తీర్పును ప్రకటిస్తూ, ఆర్టికల్ 1, ఆర్టికల్ 370ల ప్రకారం జమ్ముకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని వ్యాఖ్యానించింది.
అంతేకాదు, భారతదేశంలో విలీనమైన తరువాత జమ్మూకశ్మీర్ అంతర్గత సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలేవీ లేవని కూడా సుప్రీం కోర్టు ప్రకటించింది.
చీఫ్ జస్టిస్ డీఐ చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈరోజు తీర్పును ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
సీజేఐ ఇంకా ఏమన్నారంటే, ‘‘ఆర్టికల్ 370ని తొలగించే హక్కు రాష్ట్రపతికి ఇప్పటికీ ఉంది. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్ముకశ్మీర్‌కు వర్తిస్తాయి.
ఆర్టికల్ 370(3) ప్రకారం ఆర్టికల్ 370ని రద్దు చేసే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది.
రాష్ట్రంలో అప్పట్లో యుద్ధ వాతావరణం ఉన్నందున తాత్కాలిక ఏర్పాటుగా ఆర్టికల్ 370ని తీసుకొచ్చారు’’ అని చెప్పారు.
ఏళ్లుగా వివిధ ఉత్తర్వుల్లో భారత రాజ్యాంగాన్నివర్తింపచేశారని సుప్రీం గుర్తు చేసింది. ఆర్టికల్ 370 రద్దు ఈ ప్రక్రియలో భాగమే అని వ్యాఖ్యానించింది.
లద్దాఖ్‌ను విభజించాలనే నిర్ణయాన్ని కూడా సమర్థించింది.
ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల ద్వారా జరిగిన హింసను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని జస్టిస్ సంజయ్ కౌల్ సిఫారసు చేశారు.

ఫొటో సోర్స్, ANI
ఆర్టికల్ 370 అంటే ఏమిటి?
ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలో ఒక నిబంధన. దీనిద్వారా జమ్మూ కశ్మీర్‌కు భారత రాజ్యాంగం పరిమితంగా వర్తించింది.
భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెప్పే ఆర్టికల్ 1 మినహా, జమ్మూ కశ్మీర్‌కు మరే ఇతర ఆర్టికల్ వర్తించదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది.
రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని, కొన్ని మార్పులతో రాష్ట్రానికి వర్తించేలా చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది.
అయితే, దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. జమ్ము-కశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో, కమ్యూనికేషన్ విషయంలో మాత్రమే పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది.
అయితే, ఈ ఆర్టికల్ సవరణకు కూడా పరిమితులున్నాయి. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ సభ (పరిషత్తు) సమ్మతితో రాష్ట్రపతి మాత్రమే ఈ నిబంధనను సవరించగలరని పేర్కొంది.
జమ్మూ, కశ్మీర్ రాజ్యాంగ సభ 1951లో ఏర్పడిన 75 మంది సభ్యుల సంఘం, ఇది జమ్మూ కశ్మీర్ కోసం రాజ్యాంగాన్ని రూపొందించింది. 'భారత రాజ్యాంగ సభ' భారత రాజ్యాంగాన్ని రూపొందించింది.
రాష్ట్ర రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత అంటే 1956 నవంబర్ నుంచి 'జమ్మూ, కశ్మీర్ రాజ్యాంగ సభ' ఉనికిలో లేదు.
అయితే, కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేయాలనుకున్న బీజేపీకి ఈ ఆర్టికల్ అడ్డంకిగా మారింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35-ఏలను తొలగిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది.
ఈ ఆర్టికల్ 35-Aను 1954లో రాజ్యాంగంలో చేర్చారు. ఇది జమ్మూ ,కశ్మీర్‌లోని శాశ్వత నివాసితులకు ప్రభుత్వ ఉద్యోగం, రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేయడం, నివసించడం కోసం ప్రత్యేక హక్కులను కల్పించింది.
ఈ ఆర్టికల్‌ను ఎందుకు రద్దు చేశారు? రద్దు తర్వాత ఏం జరిగింది? ఈ కేసు సుప్రీంకోర్టును ఎలా చేరింది? తదితర అంశాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- మహువా మొయిత్రా బహిష్కరణ: ఈ కేసును రమేశ్ బిధూరీ వ్యవహారంతో ఎందుకు ముడిపెడుతున్నారు? డానిష్ అలీ ఆరోపణలేంటి
- బిగ్ బజార్: రిటైల్ కింగ్ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...
- మోనాలిసా నవ్వు వెనుక దాగిన రహస్యం ఏంటో తెలుసా?
- తెలంగాణ ఎన్నికలలో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న మూడు పాటలు
- బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














