ఆర్టికల్ 370 అంటే ఏంటి, దీన్ని రద్దు చేయడంపై అభ్యంతరాలేంటి... సుప్రీం కోర్టు విచారణ ఎలా సాగింది?

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ఉమంగ్ పొద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అయితే ఈ చర్య చట్టబద్ధతపై సోమవారం సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించబోతోంది.

ఇంతకీ, ఈ ఆర్టికల్ రద్దు ఎలా సాధ్యమైంది? తర్వాత ఏం జరిగింది? కోర్టులో ఎవరు, ఎలాంటి వాదనలు వినిపించారు? ఒకసారి తెలుసుకుందాం.

1.ఆర్టికల్ 370 అంటే ఏమిటి?

ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలో ఒక నిబంధన. దీనిద్వారా జమ్మూ కశ్మీర్‌కు భారత రాజ్యాంగం పరిమితంగా వర్తించింది.

భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెప్పే ఆర్టికల్ 1 మినహా, జమ్మూ కశ్మీర్‌కు మరే ఇతర ఆర్టికల్ వర్తించదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది.

రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని, కొన్ని మార్పులతో రాష్ట్రానికి వర్తించేలా చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది.

అయితే, దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. జమ్ము-కశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో, కమ్యూనికేషన్ విషయంలో మాత్రమే పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది.

అయితే, ఈ ఆర్టికల్ సవరణకు కూడా పరిమితులున్నాయి. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ సభ (పరిషత్తు) సమ్మతితో రాష్ట్రపతి మాత్రమే ఈ నిబంధనను సవరించగలరని పేర్కొంది.

జమ్మూ, కశ్మీర్ రాజ్యాంగ సభ 1951లో ఏర్పడిన 75 మంది సభ్యుల సంఘం, ఇది జమ్మూ కశ్మీర్ కోసం రాజ్యాంగాన్ని రూపొందించింది. 'భారత రాజ్యాంగ సభ' భారత రాజ్యాంగాన్ని రూపొందించింది.

రాష్ట్ర రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత అంటే 1956 నవంబర్ నుంచి 'జమ్మూ, కశ్మీర్ రాజ్యాంగ సభ' ఉనికిలో లేదు.

అయితే, కశ్మీర్‌ను భారత్‌‌లో అంతర్భాగం చేయాలనుకున్న బీజేపీకి ఈ ఆర్టికల్ అడ్డంకిగా మారింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35-ఏలను తొలగిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది.

ఈ ఆర్టికల్ 35-Aను 1954లో రాజ్యాంగంలో చేర్చారు. ఇది జమ్మూ ,కశ్మీర్‌లోని శాశ్వత నివాసితులకు ప్రభుత్వ ఉద్యోగం, రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేయడం, నివసించడం కోసం ప్రత్యేక హక్కులను కల్పించింది.

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

2. ఈ ఆర్టికల్ ఎలా రద్దు చేయగలిగారు?

ఈ ఆర్టికల్ రద్దు కోసం కేంద్ర అనుసరించిన చట్టపరమైన ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంది.

2019 ఆగస్టు 5న రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో రాష్ట్ర శాసనసభనే రాష్ట్ర రాజ్యాంగ సభ‌గా సూచిస్తూ పేర్కొంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్‌తో సమానమని కూడా పేర్కొంది. ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఈ సవరణ ఆమోదం పొందినపుడు జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రపతి పాలనలో ఉంది.

2018 జూన్‌లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. అనంతరం రాష్ట్రంలో 6 నెలల పాటు గవర్నర్ పాలన, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు.

సాధారణ పరిస్థితుల్లో, ఈ సవరణ చేయడానికి రాష్ట్రపతికి రాష్ట్ర శాసనసభ సమ్మతి అవసరం అయితే, రాష్ట్రపతి పాలన కారణంగా శాసనసభ సమ్మతి సాధ్యపడలేదు.

ఈ ఉత్తర్వు ఆర్టికల్ 370ని సవరించే అధికారం ఇచ్చింది. మరుసటి రోజు రాష్ట్రపతి మరో ఉత్తర్వు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్మూ కశ్మీర్‌కు వర్తిస్తాయని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించారు.

ఆ తర్వాత ఆగస్టు 9న రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు (జమ్మూకశ్మీర్, లద్ధాఖ్)గా విభజించే చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. జమ్మూకశ్మీర్‌లో శాసనసభ ఉండగా, లద్దాఖ్‌లో మాత్రం లేదు.

కర్ఫ్యూ

ఫొటో సోర్స్, Getty Images

3. ఆ తర్వాత ఏం జరిగింది?

ఆగస్టు 5 నుంచి జమ్మూకశ్మీర్‌లో లాక్‌డౌన్ విధించారు. కర్ఫ్యూ అమలు చేశారు. టెలిఫోన్, ఇంటర్నెట్‌ సర్వీసులు నిలిపివేశారు.

రాజకీయ నాయకులు సహా వేలాది మందిని అరెస్టు చేశారు, కొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు.

కొన్ని నెలల తర్వాత అంటే 2020 జనవరిలో 2జీ ఇంటర్నెట్, 2021 ఫిబ్రవరిలో 4జీ ఇంటర్నెట్ పునరుద్ధరించారు. అయితే, ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

2019 ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి రిఫర్ చేసింది. 2023 ఆగస్టు నుంచి ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలను కోర్టు వినడం ప్రారంభించింది.

4. ఈ కేసులో పిటిషనర్లు ఎవరు?

ఈ కేసులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లలో పౌర సమాజ సంస్థలు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఇతర కార్యకర్తలు ఉన్నారు.

వీరిలో జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు, ఎంపీ మొహమ్మద్ అక్బర్ లోన్, జమ్మూ కశ్మీర్ మాజీ సంభాషణకర్త (ఇంటర్‌లోక్యూటర్) రాధా కుమార్ తదితరులు ఉన్నారు.

5. కోర్టులో పిటిషనర్లు ఏం వాదించారు?

ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని కొట్టివేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు.

''ఆర్టికల్ 370 శాశ్వత నిబంధన. దానిలో ఏదైనా మార్పు చేయాలంటే 1956లో రద్దయిన రాష్ట్ర రాజ్యాంగ సభ సమ్మతి అవసరం.రద్దు అనేది ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్‌ (విలీన ఒప్పందం)కు వ్యతిరేకంగా జరిగింది'' అని పిటిషనర్లు వాదించారు

ఇది ప్రజల అభీష్టానికి విరుద్ధంగా సాగిన రాజకీయ చర్య అన్నారు. రాజ్యాంగ సభను శాసనసభతో భర్తీ చేయలేమని వారు కోర్టుకు తెలిపారు.

రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు ఈ సవరణ జరగకూడదన్నారు.

సవరణను ఆమోదించేటప్పుడు శాసనసభ స్థానాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్‌తో భర్తీ చేసి, ఆర్టికల్ 370ని తొలగించారని కోర్టుకు విన్నవించారు.

అంతేకాకుండా రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే అధికారం కేంద్రానికి లేదని పిటిషనర్లు వాదించారు. ఇది రాష్ట్ర స్వయంప్రతిపత్తిని తగ్గిస్తుందని, ఫెడరలిజంపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం కేంద్రం నియంత్రణలో ఉంటుందని పిటిషనర్లు గుర్తుచేశారు.

న్యాయస్థానం

ఫొటో సోర్స్, Getty Images

6. ఆర్టికల్ 370 రద్దును కోర్టులో కేంద్రం ఎలా సమర్ధించుకుంది?

ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని కేంద్రం సుప్రీంకోర్టులో వాదించింది.

రాజ్యాంగ సభ రద్దు అయినందున, శాసనసభ ఆ స్థానాన్ని పొందాలి, లేకుంటే నిబంధనను ఎప్పటికీ సవరించలేరంది. ఈ మార్పు జమ్మూ కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో విలీనం చేసిందని కేంద్రం పేర్కొంది. భారత రాజ్యాంగం పూర్తిగా వర్తించనందున రాష్ట్ర నివాసితులపై వివక్ష ఉందని కేంద్రం వాదించింది.

రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోదించిన ఉత్తర్వులు రాష్ట్ర శాసనసభ ఉత్తర్వులకు సమానమని ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి, రాష్ట్రపతి పాలనలో హోదాను మార్చడం చట్టవిరుద్ధం కాదని తెలిపింది.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఉన్నాయని కూడా కేంద్రం వాదించింది.

ఇది రాష్ట్రం పేర్లు, ప్రాంతం, సరిహద్దులను మార్చగలదని, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించగలదని తెలిపింది.

శాంతిభద్రతలు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని చెప్పింది.

ప్రత్యేక హోదాను తొలగించడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి, పర్యాటకం, శాంతిభద్రతలు పెంపొందాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అందువల్ల, ఇది ప్రయోజనకరమైన చర్య అని కోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)