అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?

అన్నా మణి

ఫొటో సోర్స్, WORLD METEOROLOGICAL ORGANIZATION

ఫొటో క్యాప్షన్, మరో శాస్త్రవేత్తతో అన్నా మణి
    • రచయిత, చెరీలాన్ మొలాన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబై

వాతావరణ మార్పు అనే మాట ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడానికంటే ముందే ఒక భారతీయ మహిళా శాస్త్రవేత్త ప్రజలు ప్రకృతిని మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడే పరికరాలను తయారు చేయడంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎన్నో అడ్డంకులను కూడా ఎదుర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల పేర్లలో అన్నా మణి పేరు కూడా ఉంటుంది. కానీ, భారత్‌లో ఇంకా ఆమె గురించి చాలా మందికి తెలియదు.

ఒకప్పటి రాజ సంస్థానమైన, ప్రస్తుతం కేరళలోని ట్రావెన్‌కోర్‌లో అన్నా మణి 1918లో జన్మించారు.

వాతావరణాన్ని కొలిచేందుకు స్వదేశీ పరికరాలు తయారు చేయడంలో భారత్‌కు అన్నా మణి ఎంతో సాయం చేశారు. ఈ పరికరాలతో అప్పుడే స్వాతంత్య్రం పొందిన భారత్‌ను స్వావలంబన దిశగా పయనింప జేసి, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించారు.

ఓజోన్ పొరను పరిశీలించడానికి శాస్త్రవేత్తలు పడుతున్న ఇబ్బందులను గమనించి దీనిని సులభతరం చేసే ఓజోన్ సాండ్ అనే పరికరాన్ని ఆమె 1964లో రూపొందించారు.

ఈ పరికరాన్ని బెలూన్ ద్వారా ఆకాశంలోకి పంపించి, భూఉపరితలానికి పైన 35 కి.మీల(22 మైళ్ల) వరకు ఉండే ఓజోన్‌ పొరను కొలవనున్నారు.

అన్నా మణి రూపొందించిన ఓజోన్‌సాండ్ పరికరాన్ని 1980ల్లో అంటార్కిటాకు వెళ్లేందుకు తరచూ వాడేవారు. దక్షిణ ధ్రువంపై ఉన్న ఓజోన్ పొరలో అతిపెద్ద రంధ్రం ఉందని 1985లో భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫార్మాన్ ప్రపంచాన్ని హెచ్చరించారు. ఆ సమయంలో అన్నా మణి రూపొందించిన పరికరంతోనే డేటాను సేకరించి ఫార్మాన్ కనుగొన్న దాన్ని భారతీయ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.

గ్రీన్ టెక్నాలజీస్‌ను దీర్ఘకాలం వాడేందుకు భారత్‌కు గట్టి పునాదిని మణి అందించారు. తర్వాత ఈ టెక్నాలజీస్ భారత్‌కు అత్యంత అవసరమయ్యాయి.

1980, 90లలో పవన శక్తిని అధ్యయనం చేసేందుకు 150 స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటి కోసం కొంతమందిని దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పంపించారు.

పవన శక్తిపై అధ్యయనం చేసేందుకు అవసరమైన స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఆమె బృందంతో కలిసి కొందరు శాస్త్రవేత్తలూ మారుమూల ప్రాంతాలకు వెళ్లారు.

పవన శక్తిపై చేసిన పరిశోధనల్లో కనుగొన్న అంశాలతో దేశవ్యాప్తంగా పలు పవన ఇంధన స్థావరాలు ఏర్పడ్డాయని అన్నా మణిపై వాతావరణ శాస్త్రవేత్త సీఆర్ శ్రీధరన్ రాసిన రీసెర్చ్ పేపర్‌లో పేర్కొన్నారు.

మహిళలను చదివించడమే గొప్ప అన్నట్లుగా ఉన్న రోజుల్లో, అన్నా మణి ఉన్నత చదువులు చదివి, తనకెంతో ఇష్టమైన వాతావరణ శాస్త్రాన్ని చదివారు. ఎన్నో కష్టాలను అధిగమించి శాస్త్రవేత్తగా మారారు.

ఈ శాస్త్రంలో లోతైన పరిజ్ఞానం పెంచుకోవాలని ఆమె తపించేవారు. చిన్న వయసులోనే ఎవరూ ఎంచుకోని కష్టమైన మార్గంలో ఆమె ప్రయాణించారు.

అన్నా మణి పుట్టింది సంపన్న కుటుంబమే. ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఆమె ఏడవ వారు. వీరిలో ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.

తన ఎనిమిదవ పుట్టిన రోజుకు తల్లిదండ్రులు వారసత్వంగా వచ్చే ఖరీదైన చెవిదిద్దులను ఆమెకు బహుకరిస్తే....అవి తనకు వద్దని, ఎన్‌సైక్లోపీడియా కొనివ్వాలని ఆమె కోరారట.

తన అక్క చెల్లెళ్ల మాదిరిగా పెళ్లి చేసుకుని కుటుంబ జీవితంలోకి వెళ్లడానికి బదులు ఉన్నత చదువులు చదవాలని అన్నా మణి కోరుకున్నారు.

‘‘ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని కుటుంబం పూర్తిగా వ్యతిరేకించలేదు, అలాగనీ ప్రోత్సహించలేదు కూడా’’ అని అన్నా మణిపై రాసిన శాస్త్రవేత్త అభా సుర్ చెప్పారు.

కానీ, వాతావరణ శాస్త్రవేత్తగా అన్నా మణి సాగించిన ఈ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఆమె కుటుంబంలో ఉన్నత విద్యను చదువుకునేందుకు కేవలం అబ్బాయిలకు మాత్రమే ప్రోత్సాహం ఉండేది.

డాక్టర్ కావాలనుకున్నా అది సాధ్యం కాలేదు. తర్వాత తనకు ఎంతో ఇష్టమైన ఫిజిక్స్ చదవాలనుకున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు.

విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్ పొందడానికి ముందు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని నోబెల్ పురస్కార గ్రహీత సీవీ రామన్ ల్యాబోరేటరీలో డైమండ్ లక్షణాలపై అధ్యయనం చేశారు.

అన్నా మణి

ఫొటో సోర్స్, RAMAN RESEARCH INSTITUTE

ఫొటో క్యాప్షన్, అన్నా మణి

ఈ ఉపకార వేతనం ఆమెకు విదేశాల్లో భౌతిక శాస్త్రం చదివేందుకు మాత్రమే కాక, ఆ సమయంలో భారత్‌కు అవసరమైన వాతావరణ పరికరాలలో నిపుణత సాధించేందుకు కూడా ఉపయోగించుకోవాలనుకున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని యూకేకి వెళ్లినట్లు శ్రీధరన్ తాను రాసిన రీసెర్చ్ పేపర్‌లో చెప్పారు.

యూకేకి వెళ్లిన తర్వాత మూడు సంవత్సరాల పాటు వాతావరణ పరికరాలకు సంబంధించిన ప్రతి విషయం అంటే వాటిని ఎలా రూపొందిస్తారు, ఎలా పరీక్షిస్తారు, కచ్చితత్వాన్ని కొలిచేందుకు ఆ పరికరాన్ని ఎలా వాడతారు, వాటి ప్రామాణికత ఇలా అన్ని విషయాలపై అధ్యయనం చేశారు.

బ్రిటీష్ పాలనా సంకెళ్ల నుంచి భారత్ స్వాతంత్య్రం పొందిన ఏడాది తర్వాత 1948లో ఆమె స్వదేశానికి వచ్చారు. వాతావరణ విభాగంలో చేరారు.

విదేశాల్లో పొందిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి, వాతావరణాన్ని కొలిచే పరికరాలను భారత్ సొంతంగా రూపొందించేందుకు సాయపడ్డారు అన్నా మణి.

అప్పటి వరకు భారత్ ఈ పరికరాలను బ్రిటన్ నుంచి, యూరప్‌లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది.

వర్షపాతం, ఉష్ణోగ్రతలు కొలవడం నుంచి వాతావరణ పీడనాన్ని కొలిచే వరకు ఉపయోగించే 100కు పైగా పరికరాలను రూపొందించడంపై ఆమె వర్క్‌షాపు నిర్వహించారు.

అత్యంత నాణ్యత, కచ్చితమైన ఫలితాలను ఇచ్చే పరికరాలను రూపొందించేందుకు అన్నా మణి అన్ని ప్రయత్నాలు చేశారు.

‘‘అసలు పరికరాలు లేకపోవడం కంటే తప్పుడు పరికరాలు ఉండటమే అత్యంత ప్రమాదకరం అని నేను నమ్ముతాను’’ అని 1991లో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నా మణి అన్నారు.

రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌

ఫొటో సోర్స్, RAMAN RESEARCH INSTITUTE

ఫొటో క్యాప్షన్, 1980లో రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో మణికి వీడ్కోలు పార్టీ, మూడేళ్ల పాటు ఆ ఇన్‌స్టిట్యూట్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

సోలార్ రేడియేషన్‌ను కొలించేందుకు అవసరమైన పరికరాలను డెవలప్ చేయడంలో మణి కీలక పాత్ర పోషించారు.

దేశవ్యాప్తంగా రేడియేషన్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. భారత్‌లో పునరుత్పాదకత ఇంధన వనరులను అన్వేషించే ప్రాజెక్ట్ దిశగా కూడా ఆమె కృషి చేశారు.

‘‘అత్యంత కచ్చితత్వంతో పని చేసే సాధనాల విషయంలో అప్పటి వరకు పశ్చిమ దేశాలదే గుత్తాధిపత్యం. ఆ దేశాలు చాలా వరకు డిజైన్ పారామీటర్లను రహస్యంగా ఉంచేవి. ఫండమెంటల్స్‌ నుంచి ప్రారంభించి పూర్తి టెక్నాలజీని సొంతంగా రూపొందించుకోవాల్సి ఉండేది’’ అని శ్రీధరన్ చెప్పారు.

అన్నా మణి వృత్తిపరంగా ఉన్నత స్థాయిలను చేరుకున్నప్పటికీ, ఆమె ఎన్నోసార్లు లింగ వివక్షను ఎదుర్కొన్నారు.

అన్నా మణి మెంటార్ సీవీ రామన్ ల్యాబ్‌లో చాలా కొద్దిమంది మహిళలు మాత్రమే పనిచేసే వారు. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. ల్యాబ్‌లో పనిచేసేందుకు మహిళలపై ఆంక్షలు పెట్టే వారు. ఈ విషయాన్ని మణిపై అభా సుర్ రాసిన పుస్తకం ‘డిస్పర్సెడ్ రేడియన్స్: క్యాస్ట్, జెండర్, అండ్ మోడ్రన్ సైన్స్ ఇన్ ఇండియా’ అన్న పుస్తకంలో రాశారు.

చాలా వరకు అన్నా మణి, మరో మహిళా విద్యార్థిని తమ సహోద్యోగులకు దూరంగా ల్యాబ్‌లో పనిచేసే వారు. ల్యాబ్‌లో సుహృద్భావ వాతావరణంలో ఉండేందుకు, శాస్త్రీయ చర్చల్లో పాల్గొనేందుకు వీరికి అవకాశం ఉండేది కాదు.

పురుష సహోద్యోగుల నుంచి మణి వివక్షను ఎదుర్కొన్నారు. పరికరాలను హ్యాండిల్ చేసే విషయంలో, ఏదైనా ప్రయోగంలో చిన్న తప్పు దొర్లితే అది స్త్రీల అసమర్థత అంటూ సహోద్యోగులు విమర్శించేవారని మణి వెల్లడించినట్లు అభా సుర్ తన పుస్తకంలో రాశారు.

1960 తొలినాళ్లల్లో అంతర్జాతీయ హిందూ మహాసముద్ర యాత్రలో భాగమయ్యేందుకు మణికి అవకాశం వచ్చింది. ఈ యాత్రలో భాగంగా, మారుతున్న కాలాలను అధ్యయనం చేసేందుకు పలు పరికరాలతో రెండు నౌకలు హిందూ మహాసముద్రంలోకి వెళ్లాయి. అయితే, ఈ డేటాను సేకరించేందుకు ఆమె నౌకలలో హిందూ మహాసముద్రంలోకి వెళ్లలేదు.

‘‘హిందూ మహాసముద్రంలో మారుతున్న కాలాలను అధ్యయనం చేసేందుకు వెళ్లాలని నాకు అనిపించింది. కానీ, ఆ సమయంలో భారతీయ నౌకాదళం షిప్‌లలోకి మహిళలను అనుమతించేది కాదు’’ అని 1991లో ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నా మణి చెప్పారు.

తన తరంలోని ఇతర మహిళల మాదిరి పితృస్వామ్య విధానాలకు తనను బాధితురాలిగా మార్చుకునేందుకు మణి తిరస్కరించారు.

తన వృత్తిపరమైన ఆకాంక్షలకు జెండర్‌ ఎప్పుడూ అడ్డంకిగా మారనీయలేదు అన్నా మణి. ‘‘మహిళ అనే కారణంతో నేను ఏదో కోల్పోతున్నా లేదా గౌరవం పొందుతున్నా అనే భావనను నేనెప్పుడూ దరిచేరనీయలేదు’’ అని అభా సుర్‌కు అన్నా మణి చెప్పారు.

కేరళలోని తిరువనంతపురం నగరంలో అన్నా మణి 2001లో మరణించారు. ఆమె పెళ్లి చేసుకోలేదు. పెళ్లి కాలేదని ఆమె ఎప్పుడూ బాధపడలేదు. వినూత్న అధ్యయనాలు, జీవితం అంతా కూడా తర్వాత తరం వారికి సమాచారాన్ని అందించేందుకు అంకితం చేసి, వారికి స్ఫూర్తిగా నిలిచారు అన్నా మణి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)