చైనా వెల్లుల్లి అంటే అమెరికా ఎందుకు భయపడుతోంది?

వెల్లుల్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏటా 5 లక్షల కేజీల వెల్లుల్లిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది అమెరికా
    • రచయిత, థియో లెగ్గెట్
    • హోదా, బిజినెస్ కరస్పాండెంట్, బీబీసీ న్యూస్

చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వెల్లుల్లి కారణంగా జాతీయ భద్రతకు ముప్పు వచ్చే అవకాశం ఉందని, దీనిపై విచారణ జరపాలంటూ అమెరికా సెనెటర్ ఒకరు ప్రభుత్వానికి లేఖ రాశారు.

రిపబ్లిక్ పార్టీకి చెందిన రిక్ స్కాట్ ఈ మేరకు కామర్స్ సెక్రటరీకి రాసిన లేఖ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వెల్లుల్లి సురక్షితం కాదని, చైనా వెల్లుల్లి సాగులో అపరిశుభ్రమైన సాగు పద్ధతులను అనుసరిస్తోందని ప్రస్తావించారు.

అమెరికాకు తాజా, శీతల పద్ధతుల్లో నిల్వచేసిన వెల్లుల్లిని ఎగుమతి చేస్తున్న చైనాకు అమెరికా మార్కెట్‌లో సింహభాగం మార్కెట్‌ వాటా ఉంది.

అయితే, ఈ ట్రేడింగ్‌పై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది.

చైనా ఉత్పత్తి ధర కంటే తక్కువ ధరకు అమెరికాకు విక్రయిస్తూ డంపింగ్ కు పాల్పడుతోందని అమెరికా ఆరోపిస్తోంది.

1990లలో చైనా దిగుమతులను కట్టడి చేసేందుకు భారీ పన్నులను విధించింది అమెరికా ప్రభుత్వం. దీని ద్వారా దేశీయ ఉత్పత్తిదారులు మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు అవకాశం కల్పించింది.

2019లో ట్రంప్ దేశ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఈ పన్నులను మరింత పెంచారు.

లేఖలో ఏం రాశారు?

సెనెటర్ స్కాట్ ప్రభుత్వానికి రాసిన లేఖలో వెల్లుల్లి దిగుమతుల విషయంలో ఉన్న వివాదాలను ప్రస్తావించడంతోపాటు, విదేశాల్లో వెల్లుల్లి సాగులో అవలంబిస్తున్న పద్ధతుల్లో పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

"విదేశాల్లో, ముఖ్యంగా చైనాలో ఉత్పత్తి అవుతోన్న వెల్లుల్లి నాణ్యతలో లోపం ప్రజారోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది" అని రాశారు.

అంతేకాకుండా, వ్యర్థాలతో వెల్లుల్లి సాగుకు సంబంధించి ఆన్‌లైన్‌లో చాలా వీడియోలు, డాక్యుమెంటరీలు అందుబాటులో ఉన్నాయని ప్రస్తావించారు.

అమెరికా చట్టాల్లో ఉన్న దిగుమతులు దేశ భద్రతపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయన్న అంశంపై విచారణ జరిపేందుకు పొందుపరిచిన చట్టం ప్రకారం కామర్స్ డిపార్ట్‌మెంట్ దీనిపై స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

అంతేకాకుండా, వెల్లుల్లి సాగు, నాణ్యతతోపాటు వెల్లుల్లి రకాలపై కూడా లేఖలో వివరంగా ప్రస్తావించారు.

తాజా, నిల్వచేసిన వెల్లుల్లి, రెబ్బలుగా నిల్వచేసిన వెల్లులి..ఇలా అన్ని రకాల వెల్లుల్లి నాణ్యతపై పరిశీలన జరపాలని లేఖలో రాశారు

"ఆహార భద్రత అనే అంశం చాలా ముఖ్యమైనది. ఇది జాతీయ భద్రత, ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. విస్మరిస్తే, ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది" అని పేర్కొన్నారు.

అయితే, చైనా వెల్లుల్లి సాగులో వ్యర్థాల వినియోగంపై ఎలాంటి ఆధారాలు లభించలేదని క్యుబెక్‌లోని మెక్‌గిల్ యూనివర్సిటీలోని సైన్స్ అండ్ సొసైటీ తెలిపింది.

"జంతువుల వ్యర్థాలతో పోల్చితే మానవ వ్యర్థాల ఎరువే ఎక్కువగా ఫలితాలనిస్తుంది. మానవ వ్యర్థాలను ఎరువుగా సాగు చేయడమనేది వినడానికి అంతగా బాలేకపోయినా, అనుకున్నదానికంటే, ఎక్కువ సురక్షితం" అని పేర్కొంది.

వెల్లుల్లి మార్కెట్

1990ల నుంచే అమెరికా మార్కెట్‌లో..

అమెరికాకు వెల్లుల్లి ఎగుమతులతో చైనాదే అగ్రభాగం అయినప్పటికీ, దేశీయంగా కొన్ని సంస్థలు కూడా తమవంతు మార్కెట్‌ను ఆక్రమించాయి.

2019లో అప్పటి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చైనా వెల్లుల్లి దిగుమతులపై పన్నులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఫలితంగా దేశీయ వెల్లుల్లి సాగు పుంజుకునేందుకు కాస్త అవకాశం దొరికింది.

1990ల నాటికి చైనా తన ఎగుమతులతో, తక్కువ ధరకే వెల్లుల్లిని సరఫరా చేస్తూ అమెరికా మార్కెట్‌లో వెల్లువలా విస్తరించింది.

ఆ తరువాతి పరిణామాలతో చైనా డంపింగ్‌ (మార్కెట్‌లో మోనోపాలిగా నిలిచేందుకు ఉత్పత్తి కన్నా తక్కువ ధరకే విదేశాల్లో విక్రయించడం)కు పాల్పడుతోందని అమెరికా చేపట్టిన విచారణలో తేలడంతో చర్యలు తీసుకోవడంతోపాటు పన్నులు భారీగా పెంచారు.

అయినప్పటికీ చైనా కొత్త విధానాలను అవలంబిస్తూ, మార్కెట్‌లో తన వాటాను నిలుపుకుంది.

2019లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో అమెరికాలోని వెల్లుల్లి రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)