మహువా మొయిత్రా: పార్లమెంటు సభ్యత్వాన్ని ఏ కారణాలతో రద్దు చేయవచ్చు?

మహువా మొయిత్రా

ఫొటో సోర్స్, ANI/Getty Images

పార్లమెంట్ సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయడమో లేదా మరణించడమో జరిగితే సభలో ఆ స్థానం ఖాళీ అవుతుంది. అయితే, ఇతర కారణాల వల్ల కూడా వివిధ సభల సభ్యులు తమ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

'నగదు తీసుకుంటూ ప్రశ్నలు అడిగిన' కేసులో ఎథిక్స్ కమిటీ సిఫారసు మేరకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వాన్ని లో‌క్‌సభ రద్దు చేసింది.

భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ఆయన కంపెనీలు లక్ష్యంగా మహువా లంచం తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలడిగారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేసిన అనంతరం విచారణ జరిపి, ఈ చర్య తీసుకున్నారు.

అయితే, ఈ ఆరోపణలను మహువా ఖండించారు, ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై చర్య తీసుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తానని మహువా చెప్పారు.

ఇదే మాదిరి భారత పార్లమెంట్ చరిత్రలో వివిధ సమయాల్లో వివిధ కారణాల వల్ల రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల సభ్యత్వం రద్దయింది. ఎమ్మెల్యేలపై కూడా పలుమార్లు అనర్హత వేటు పడింది.

ఇలాంటివి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్, ప్రజా ప్రాతినిధ్యానికి సంబంధించిన చట్టాలు, పార్లమెంటరీ నిబంధనల ప్రకారం జరుగుతాయి.

లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను స్పీకర్ లేదా చైర్మన్ ఏ కారణాలతో అనర్హులుగా ప్రకటిస్తారు?, వాటి నియమ నిబంధనలేంటి అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం. చాలావరకు ఇవే అసెంబ్లీ సభ్యులకు కూడా వర్తిస్తాయి.

పార్లమెంట్

ఫొటో సోర్స్, Getty Images

1. రెండు సభల్లో సభ్యత్వం

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 ప్రకారం ఒక వ్యక్తి ఉభయ సభల్లోనూ సభ్యుడిగా కొనసాగకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అలా చేయడంలో విఫలమైతే వారిపై అనర్హత వేటు వేయవచ్చు. అంతేకాదు ఒక సభ్యుడు పార్లమెంటు, శాసనసభ రెండింటిలోనూ సభ్యుడు కాలేరు.

నిర్ణీత సమయంలోపు రెండు సభ్యత్వాలలో ఒకదానికి రాజీనామా చేయకపోతే, వారి పార్లమెంటు సభ్యత్వం తొలగిస్తారు.

2. ముందస్తు నోటీసు లేకుండా గైర్హాజరైతే

పార్లమెంటులోని సభ్యుడు సభకు అనుమతి లేకుండా 60 రోజుల పాటు గైర్హాజరైతే, ఆ వ్యక్తి స్థానం ఖాళీగా అయినట్లు ప్రకటించవచ్చు.

అంటే ఎంపీ సభ్యత్వం రద్దవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 ప్రకారం సెషన్‌ను 4 రోజులకు మించి వాయిదా వేసిన లేదా ప్రోరోగ్ చేసిన రోజులను ఈ 60 రోజుల్లో లెక్కించరు.

పార్లమెంట్

ఫొటో సోర్స్, ANI

3. లాభదాయకమైన పదవి

కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం (చట్టం ద్వారా పార్లమెంట్ మినహాయింపు పొందిన కార్యాలయం కాకుండా)లో ఏదైనా లాభదాయక పదవిలో ఉంటే, వారి సభ్యత్వం రద్దు చేస్తారు. కేంద్రం లేదా రాష్ట్ర మంత్రి పదవి ఈ లాభదాయక కేటగిరీలోకి రావు.

అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఎ) ప్రకారం ఎంపీలు, శాసనసభలోని ఆర్టికల్ 191(1)(ఎ) ప్రకారం శాసనసభ సభ్యులు జీతం, అలవెన్సులు లేదా ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను అందించే ఇతర పదవుల్లో ఉండటం నిషేధం.

2018 జనవరిలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు, 20 మంది దిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై ఈ కారణంతోనే అనర్హత వేటు వేశారు.

4. మానసిక అనారోగ్యం లేదా దివాళా తీయడం

ఒక ఎంపీ మానసిక అస్వస్థతకు గురైతే, వారి సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు.

అదేవిధంగా ఒక ఎంపీ దివాళా తీసినట్లు ప్రకటించి, ఏ కోర్టు నుంచి ఉపశమనం పొందకపోతే, వారి సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు.

ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

5. పౌరసత్వం లేకపోవడం

ఒక వ్యక్తి భారతదేశ పౌరుడు కాకపోతే లేదా ఇతర దేశ పౌరసత్వాన్ని పొందినట్లయితే వారి సభ్యత్వం రద్దు చేస్తారు.

ఇది కాకుండా మరేదైనా దేశం పట్ల విధేయత చూపితే సభ్యత్వం కూడా పోతుందని ఆర్టికల్ 102 చెబుతోంది.

ఉత్తరాఖండ్
ఫొటో క్యాప్షన్, 2016లో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఉత్తరాఖండ్‌లో 9 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు.

6. పార్టీ మారడం

రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, పదో షెడ్యూల్ ప్రకారం ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయవచ్చు. ఈ షెడ్యూల్‌ను ఫిరాయింపు నిరోధక చట్టం అని కూడా అంటారు.

ఇందులో భాగంగా ఒక ఎంపీ, ఎన్నికైన పార్టీ సభ్యత్వాన్ని వదిలేస్తే వారి 'సభ సభ్యత్వం' రద్దు చేయవచ్చు. అయితే, దీనికి మినహాయింపు ఉంది.

కనీసం మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు విలీనానికి అనుకూలంగా ఉన్నట్లయితే, ఒక రాజకీయ పార్టీ మరో పార్టీతో విలీనమవుతుంది. ఈ పరిస్థితిలో పార్టీ మారిన సభ్యుల సభ్యత్వాన్ని కొనసాగిస్తారు.

2016లో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఉత్తరాఖండ్‌లో 9 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. అనంతరం రాష్ట్రపతి పాలన విధించారు.

7. పార్టీ ఆదేశాల ఉల్లంఘన

పార్టీ జారీ చేసిన విప్‌ను ఎంపీ గౌరవించాలనే నిబంధన పదో షెడ్యూల్‌లోనే ఉంది.

ఏదైనా సమస్యపై ఓటు వేసేటప్పుడు ఏ ఎంపీ అయినా తన పార్టీ ఆదేశాలను పాటించకపోతే లేదా ఓటింగ్‌కు గైర్హాజరైతే, వారి సభ్యత్వం రద్దు చేయవచ్చు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షవిధించింది.

8. జైలు శిక్ష పడితే

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎంపీకి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలుశిక్ష పడితే వారి సభ్యత్వం రద్దు చేస్తారు.

అయితే, శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తే, అనర్హత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విషయంలోనూ ఇదే జరిగింది.

ఇందిరాగాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ

9. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని ఇతర నిబంధనలు

ఒక సభ్యుడు ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు లేదా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు రుజువైతే వారి సభ్యత్వాన్ని రద్దుచేయవచ్చు.

ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేశారు.

ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం, కింది కారణాల వల్ల సభ్యత్వం రద్దు చేయవచ్చు:

  • తప్పుడు సర్టిఫికెట్ల ఆధారంగా రిజర్వ్‌డ్ స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేయడం.
  • రెండు వర్గాల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేయడం.
  • ఎన్నికలను ప్రభావితం చేయడం.
  • లంచం తీసుకోవడం.
  • అత్యాచారం లేదా తీవ్రమైన నేరాలు.
  • మత సామరస్యానికి భంగం కలిగించడం.
  • అంటరానితనం.
  • నిషేధిత వస్తువుల దిగుమతి-ఎగుమతి.
  • నిషేధిత రసాయనాలు, మందుల కొనుగోలు, అమ్మకం.
  • తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొనడం.
  • రెండేళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష.
పార్లమెంట్

ఫొటో సోర్స్, Getty Images

10. పార్లమెంట్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన

పార్లమెంటు ఉభయ సభలలో ఎథిక్స్ కమిటీలు ఉన్నాయి, ఇవి ఎంపీల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులను పరిశోధిస్తాయి.

ఎథిక్స్ కమిటీ రాజ్యసభలో 1997 నుంచి, లోక్‌సభలో 2000 నుంచి పని చేస్తోంది.

రాజ్యసభలోని 'ప్రవర్తన నియమాలు, పార్లమెంటరీ మర్యాద'లో ఎంపీలకు పలు సూచనలు చేశారు.

  • మీ విధులను నిర్వర్తించండి.
  • ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు.
  • బిల్లులు తదితరాల కోసం ఎటువంటి రుసుములు లేదా ఇతర ప్రయోజనాలు పొందవద్దు.
  • మీ విశ్వసనీయతను కాపాడుకోండి.
  • ఏ మతాన్ని కించపరిచేలా మాట్లాడవద్దు.
  • లౌకిక విలువలను కాపాడుకోవాలి.
  • సభ్యుడిగా ప్రజా జీవితంలో నైతికత, విలువలు పాటించండి.

సభ లోపలైనా, బయటైనా సభ్యుల దురుసు ప్రవర్తనపై శిక్షించే హక్కు సభకు ఉందని రాజ్యసభ నిబంధనలు చెబుతున్నాయి.

ఈ సందర్భంలో సభ హెచ్చరిక, మందలింపు, తొలగింపు, సస్పెన్షన్, జైలు శిక్ష, బహిష్కరణ కూడా చేయవచ్చు.

అదేవిధంగా సభ్యుల 'అనైతిక' ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులను విచారించి లోక్‌సభ స్పీకర్‌కు సిఫార్సులు పంపే అధికారం లోక్‌సభ ఎథిక్స్ కమిటీకి ఉంది.

ఈ కమిటీకి నిబంధనలను రూపొందించి, వాటిని ఎప్పటికప్పుడు సవరించే హక్కు కూడా ఉంది. అదే ఎథిక్స్ కమిటీ సిఫార్సు ఆధారంగా మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వం కూడా రద్దు చేశారు.

శుక్రవారం ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం లోక్‌సభ నుంచి బహిష్కరించారు.

బహిష్కరించాలని సిఫార్సు చేసే హక్కు ఎథిక్స్ కమిటీకి లేదని మహువా మొయిత్రా వాదిస్తున్నారు. లోక్‌సభ నిర్ణయం సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గతంలో చాలామంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఇలాగే కోర్టును ఆశ్రయించారు. కొన్ని కేసుల్లో వారి పదవులను కోర్టు పునరుద్దరించాలని తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)