మెరాపి అగ్నిపర్వతం ఎగజిమ్మిన పొగ, రాళ్ళ వర్షానికి 22 మంది పర్యాటకులు మృతి, మరో తొమ్మిది మంది గల్లంతు

మెరాపి

ఫొటో సోర్స్, INDONESIA NATIONAL SEARCH AND RESCUE AGENCY

    • రచయిత, కెల్లీ ఎన్‌జీ& అస్టుడెస్ట్రా అజెంగ్రస్త్రీ
    • హోదా, సింగపూర్& జకర్తా

“మొదట పొగతో అంతా నిండిపోయింది. ఆ తరువాత రాళ్ల వర్షం కురిసింది. ఎలాంటి హెచ్చరికా లేదు”

ఇర్వందా తన 17 మంది స్నేహితులతో కలిసి మౌంట్ మెరాపి పర్వతారోహణకు వెళ్లారు. వారి ప్రయాణం తొలుత సరదాగానే మొదలైనా ఆ తరువాతే ఊహించనిది జరిగింది.

ఇండోనేషియాలోని క్రియాశీల అగ్విపర్వతాల్లో ఒకటైన మెరాపి గత ఆదివారం నాడు బద్ధలైంది. ఈ ఘటనలో తన స్నేహితులను చాలామందినే కోల్పోయారు ఇర్వందా.

ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. మరో పది మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది.

మెరాపి అంటే మినాంగ్ భాషలో ‘అగ్ని పర్వతం’ అని అర్థం.

మృతులలో ఇర్వందా బృందంలోని 12 మంది ఉన్నారు. ఇర్వందా, అతని స్నేహితుడు ముహమ్మద్ ఫద్లీలు గాయపడ్డారు. వారు బీబీసీతో ఆ ప్రమాదం గురించి వివరించారు.

“సరదా కోసం అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం” అని ఇర్వందా తమ ప్రణాళిక గురించి చెప్పారు.

నెల ముందుగానే తన స్నేహితులతో కలిసి పర్వతారోహణ చేద్దామని అనుకున్నారు. వారిలో ఏడుగురు తొలిసారి పర్వతారోహణ చేస్తుండగా, మిగిలినవారికి ఆ అనుభవం ఉంది.

అంతా పదాంగ్ నగరంలో ఉండటం, మెరాపి పర్వతం వారికి దగ్గర ప్రాంతం కావడంతో అక్కడికే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఇర్వందా చెప్పారు.

పశ్చిమ సుమత్రా దీవిలో ఉండే ఈ మౌంట్ మెరాపి ఎత్తు 9,485 అడుగులు. ఇండోనేషియాలోని 127 అగ్నిపర్వతాల్లో ఒకటైన పర్వతం అత్యంత క్రియాశీల అగ్ని పర్వతాల్లో ఒకటి.

అగ్నిపర్వతం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇండోనేషియాలోని క్రియాశీల అగ్నిపర్వతాల్లో మౌంట్ మెరాపి ఒకటి

క్షణాల్లో జరిగిపోయింది..

గత శుక్రవారం ఇర్వందా స్నేహితుల బృందం బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు.

మరునాడు తమ ప్రయాణానికి వారు సన్నాహాలు చేసుకున్నారు.

శనివారం రాత్రి అక్కడి టుగు అబెల్ మాన్యుమెంట్ దగ్గర శిబిరం ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకున్నారు.

1996లో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనంలో మరణించిన టుగు అబెల్ సంస్మరణార్థం ఆ పేరు పెట్టారు.

శనివారం ఇర్వందా బృందం శిఖరానికి చేరుకునే సమయానికి భారీ వర్షం కురిసింది.

వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ తమలో ఉత్సాహం తగ్గలేదని ఇర్వందా చెప్పారు.

అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం సూర్యోదయంతో అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించిన ఇర్వందా బృందం సూర్యాస్తమయం వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయినప్పటికీ, త్వరగానే కిందకి చేరుకోవడానికి ప్రయాణమయ్యారు. ఇర్వందా, ముహమ్మద్ ఫద్లీతోపాటు మరో ఇద్దరు మధ్యాహ్నం మూడు గంటలకే ప్రయాణం మొదలుపెట్టారు.

కొద్ది సేపటికి ఉన్నట్టుండి భూమి కంపించడం మొదలైందని ఇర్వందా చెప్పారు.

“అంతా బూడిద కమ్ముకుంది. నేను నా నోటికి అడ్డుపెట్టుకున్నాను. వేగంగా కిందకు దిగడానికి ప్రయత్నించాం. దారిలో నా స్నేహితుడు బీమాను గుర్తించి, అతడికి సాయం చేశాను. ఇద్దరం కలిసి త్వరగా కిందకు దిగడానికి ప్రయత్నించాం” అని చెప్పారు.

మౌంట్ మెరాపి
ఫొటో క్యాప్షన్, విస్ఫోటన సమయంలో రాళ్లు మీదపడి గాయపడిన ముహమ్మద్ ఫద్లీ

రాళ్ల వర్షం కురిసింది..

“ఆకాశం నుంచి పడుతున్న రాళ్ల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాను. ఒక రాయి తగిలి నా వేలు విరిగింది. మరో రాయి నా కాలికి తగిలి, కాలు కూడా ఫ్రాక్చర్ అయింది” అని ఫద్లీ చెప్పారు.

“నడవడానికి చాలా కష్టపడ్డాను. కిందకు దిగేందుకు ప్రయత్నించాను. దాక్కునేందుకు అనువైన ప్రదేశాలను వెతుకుతూ, వాటి కింద తలదాచుకుని, ఆకాశం నుంచి పడుతోన్న రాళ్ల నుంచి తప్పించుకుంటూ కిందకు వెళ్లేందుకు ప్రయత్నించాం” అని చెప్పారు.

ఈ బృందం ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ కిందకు చేరేందుకు ప్రయత్నించారు. గాయాలు తగిలినా, వెనకాడలేదు. కేవలం తమను కాపాడుకోవడం మాత్రమే కాదు, పైన చిక్కుకుపోయిన వారి పట్ల బాధ్యతతో వ్యవహరించారు.

“మేమే పైన చిక్కుకుపోయిన వారికి ఆశ. మేం మాత్రమే కిందకు చేరుకున్నాం. వెంటనే, సెర్చ్, రెస్క్యూ టీంలకు విస్ఫోటనం గురించి సమాచారం ఇచ్చి, పర్వతంపైనే చిక్కుకుపోయిన వారి ప్రాణాలను రక్షించాలని నిర్ణయించుకున్నాం” అని ఫద్లీ చెప్పారు.

వీరంతా మరో వ్యక్తితో కలిసి నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీకి సమాచారం ఇచ్చారు. వారు ఇచ్చిన సూచనలను అనుసరించి ముందుకు సాగారు.

దారిలో మరో ఇద్దరు మహిళా హైకర్లకు కూడా సాయం చేశారు.

మెరాపి అగ్నిపర్వతం

ఫొటో సోర్స్, Getty Images

'పరిగెత్తండి.. మెరాపి బద్ధలైంది..'

విస్ఫోటనానికి కొద్దిసేపటి ముందే మరో బృందంతో కలిసి మెరాపి పర్వతం నుంచి కిందకు వచ్చారు ముహమ్మద్ ఇక్బాల్. ఆ సమయంలో ఒక్కసారిగా వినిపించిన కోతుల అరుపులు విని ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు.

“ఉన్నట్లుండి కోతులు పిచ్చి పిచ్చిగా అరవడం వినిపించింది. ఆ తరువాత ఒక మహిళా రైతు మా ముందు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఆమె మాతో, ‘పరిగెత్తండి ..మౌంట్ మెరాపి బద్ధలైంది.. పరిగెత్తండి’ అంటూ అరిచింది అని చెప్పారు.

“మొదట మేం ఆమె మాటలు నమ్మలేదు. మమ్మల్ని ఆటపట్టించేందుకు అలా అంటోందని అనుకున్నాం. మాకెలాంటి విస్ఫోటన శబ్దాలు వినిపించలేదు” అన్నారు.

“అయితే, మేం పర్వతం పాదాల దగ్గరకు చేరుకునే సమయానికి కొంత మంది పరుగులు తీయడం, మరికొంతమంది ఒకేదగ్గరకు చేరడం చూశాం. ఎవరో వేగంగా బైక్‌పై వెళ్లిపోతున్నారు. కొద్దిసేపటికి గానీ ప్రమాదం గురించి తెలియలేదు” అని ఇక్బాల్ చెప్పారు.

“నా మెదడు మొద్దుబారిపోయింది. కొన్ని గంటల ముందు శిఖర ప్రాంతాన ఉన్న క్రేటర్‌కు సమీపంలోనే ఉన్నానేను. అదృష్టం కొద్దీ విస్ఫోటనానికి ముందే నేను కిందకు వచ్చేశాను” అని చెప్పారు.

విస్ఫోటనం జరిగిన సమయంలో 75 మంది హైకర్స్‌లో ఎక్కువ శాతం మందిని కిందకు తీసుకువచ్చామని, గాయపడిన 12 మందికి చికిత్స అందిస్తున్నామని అధికారులు చెప్పారు.

హెచ్చరిక బోర్డులు లేవు..

మౌంట్ మెరాపిపై హెచ్చరిక బోర్డులు, ప్రమాదకరమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలన్న సూచీలు లేవని ఇక్బాల్ అన్నారు.

ఇండోనేషియాలో ఉన్న నాలుగు దశల హెచ్చరికల సూచీలో 2011 నుంచి మెరాపి పర్వతం రెండో-అత్యధిక హెచ్చరిక స్థాయిలో ఉంది.

పర్వత శిఖరానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఎవరినీ అనుమతించరు. అయితే, బీబీసీ మాట్లాడిన హైకర్లలో చాలామందికి దీనిపై స్పష్టత లేదని తెలిసింది.

“మరి, ఎందుకని హైకర్లను మెరాపి పర్వతారోహణకు అనుమతిస్తున్నారు? క్రేటర్ల దగ్గరకు కూడా వెళ్లనిస్తున్నారు?” అని ఇక్బాల్ ప్రశ్నించారు. తాను మొదటిసారే అక్కడికి వెళ్లినా, తనకు ఆ విషయం తెలీదని చెప్పారు ఇక్బాల్.

క్రేటర్ సమీపానికి ఎవరినీ అనుమతించకపోయి ఉంటే, మరణాల సంఖ్య తక్కువగా ఉండేదని నిపుణులు బీబీసీతో చెప్పారు.

వెస్ట్ సుమత్రా నేచురల్ రీసోర్స్ కన్జర్వేషన్ ఏజెన్సీ బాధ్యులు డియాన్ ఇంద్రియాతి మాట్లాడుతూ, అధికారులు హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేశారని, అయితే, హైకర్స్ వాటిని గుర్తించనట్లున్నారని చెప్పారు.

యూపీఎన్ వెటెరన్ యోగ్యకర్తాకు చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఎకో తెగుహ్ పరిపూర్ణ మాట్లాడుతూ, అధికారులు హైకింగ్ అనుమతుల విషయంపై దృష్టి సారించి ఉండాల్సిందని అన్నారు. పర్వతారోహులు కూడా ప్రమాద తీవ్రతను తక్కువ అంచనా వేసినట్లుగా కనిపిస్తోందని అన్నారు.

“జీవించేందుకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. కానీ, నా స్నేహితులు చాలామంది చనిపోయారు. ఆ బాధను ఇప్పుడే మర్చిపోలేను.

నిద్రలో కూడా ఈ విషయం నన్ను బాధిస్తోంది. నేను నా స్నేహితులను కాపాడలేకపోయాను” అని గద్గగ స్వరంతో అన్నారు ఇర్వందా.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)