మహువా మొయిత్రా బహిష్కరణ: ఈ కేసును రమేశ్ బిధూరీ వ్యవహారంతో ఎందుకు ముడిపెడుతున్నారు? దానిష్ అలీ ఆరోపణలేంటి

మహువా మొయిత్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహువా మొయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తూ, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది.
    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన పార్లమెంట్‌లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు కున్వర్ దానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అధికార బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి.

రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు కూడా తొలుత ప్రసారమయ్యాయి. ఆ తరువాత రికార్డుల నుంచి తొలగించారు.

ఎంపీ దానిష్ అలీ ఈ అంశంపై పార్లమెంట్ ప్రివిలెజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అయితే, కమిటీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని బీబీసీతో ఆయన అన్నారు.

ఈ ఫిర్యాదుపై గురువారం (డిసెంబర్ 7వ తేదీ) ప్రివిలెజ్ కమిటీ విచారణ జరిపింది. అయితే, తన వ్యాఖ్యల పట్ల రమేశ్ బిధూరి విచారం వ్యక్తం చేసినట్లు మీడియా కథనాలు ప్రసారం చేసింది. దీనిని బీబీసీ ఇంకా ధ్రువీకరించలేదు.

మరోవైపు ఈ కథనం రాస్తున్న సమయంలో దానిష్ అలీపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇదిలా ఉంటే, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంట్‌ నుంచి బహిష్కరించారు.

పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం మొయిత్రా బహిష్కరణపై నిర్ణయం తీసుకున్నారు.

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు ఎంపీ మహువా మొయిత్రా. తొలి నుంచి ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చారామె.

దీనిపై ఎంపీ నిషికాంత్ దూబే పార్లమెంటరీ కమిటీకి మహువా మొయిత్రాపై ఫిర్యాదు చేశారు.

అనంతరం జరిగిన పరిణామాల ఫలితంగా, శుక్రవారం మహువా మొయిత్రాను పార్లమెంట్‌ నుంచి బహిష్కరిస్తూ, ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మహువా మొయిత్రా బహిష్కరణ

ఫొటో సోర్స్, ANI

మహువా మొయిత్రా బహిష్కరణ అనంతరం బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, “ప్రశ్నలు అడిగేందుకు మహువా డబ్బులు తీసుకున్నారా? అన్న విషయంపై ఆమెను కమిటీ ప్రశ్నించింది. ఆమె బహుమతులు తీసుకున్నట్లుగా చెప్పారు. ఇంతకు మించి ఇంకేం ఆధారం కావాలి?” అని ప్రశ్నించారు.

అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి ప్రతిపక్షాలు.

ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తే, అంతా నిబంధనలను అనుసరించే జరిగిందని ప్రభుత్వం చెప్తోంది.

పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సుఖంత్ మాట్లాడుతూ, “మహువా ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఒకవేళ ఆమె చెప్పాల్సినది ఏమైనా ఉంటే, అక్కడే చెప్పేవారు” అని స్పందించారు.

అసలు ఏం జరిగింది?

అక్టోబర్ 14వ తేదీన మహువా మొయిత్రా స్నేహితులు, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ ఆమెపై ఆరోపణలు చేస్తూ, సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆ ప్రతిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపారు.

ఫిర్యాదు అనంతరం నిషికాంత్ దూబే స్పీకర్‌కు లేఖ రాశారు. అందులో మహువాను వెంటనే పార్లమెంట్‌ నుంచి బహిష్కరించాలని కోరారు.

వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త హీరానందాని నుంచి మహువా మొయిత్రా లంచం తీసుకున్నారని ఆరోపించారు.

దానిష్ అలీ

డానిష్ అలీ ఏమన్నారు

మహువా మొయిత్రా వివాదం అక్టోబర్ రెండో వారంలో మొదలైంది. డిసెంబర్ 8వ తేదీన చర్యలు తీసుకున్నారు.

అంతకు ముందే, అంటే సెప్టెంబర్ 21వ తేదీనే దానిష్ అలీపై ఎంపీ రమేశ్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ అంశంపై విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

బీబీసీతో దానిష్ అలీ మాట్లాడుతూ, “ఇంతవరకు నా విషయంలో జరిగిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీజేపీ ఎంపీ అన్నట్లు మహువా తన లాగిన్ పాస్‌వర్డ్ వివరాలను వేరే వారికి ఇవ్వడం నిబంధనలను ఉల్లంఘించడమే అని చెప్తున్నారు మరి, అధికార బీజేపీ ఎంపీ పార్లమెంట్‌లో కేవలం నాపై మాత్రమే కాదు, మొత్తం ఒక కమ్యూనిటీపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది పార్లమెంట్ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదా? అని ప్రశ్నించారు.

డబ్బులు, బహుమతులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడగడంపై ఒక ఎంపీ మీద చర్యలు తీసుకున్నప్పుడు, ఓ పార్లమెంటు సభ్యుడు సభలో తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై ఎందుకు చర్యలు తీసుకోరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

గురువారం ప్రివిలెజ్ కమిటీ ఈ అంశంపై విచారణ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, “తరువాత ఏం జరుగుతుందో, ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి” అన్నారు.

మహువా మొయిత్రాను పార్లమెంట్‌ నుంచి బహిష్కరించడం అన్యాయమని దానిష్ అలీ అన్నారు.

“పార్లమెంటరీ కమిటీ లేదా పార్లమెంట్‌లో మెజారిటీ ఉందని దాని ఆధారంగా ఉరి తీయడం కూడా సాధ్యమేనని భావించరాదు. ఈ రోజు పార్లమెంట్‌లో జరిగిన దానిపట్ల మహాత్మా గాంధీ, అంబేద్కర్‌ల ఆత్మలు రోదిస్తుంటాయి. పార్లమెంట్‌లో గళం వినిపించే ప్రతిపక్ష ఎంపీని ఇలా పార్లమెంట్ నుంచి బహిష్కరించే రోజు వస్తుందని వారు కూడా ఊహించి ఉండరు. లోతైన దర్యాప్తు జరపకుండా, పరిశీలన లేకుండా కేవలం ఓ ఫిర్యాదు, బీజేపీ ఎంపీ అఫిడవిట్‌ల ఆధారంగా మహువా పార్లమెంట్ సభ్యత్వాన్నే రద్దు చేశారు. ఈ అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి కేసు కూడా పెట్టలేదు, పైగా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలను నిరూపించ లేదు. ఇది చాలా తప్పు” అన్నారు.

డానిష్ అలీ ప్రశ్న?

తన ఫిర్యాదుపై అలీ స్పందిస్తూ, “నా అంశంలో రాజ్యాంగ పరంగా ఎలాంటి అడ్డంకులూ లేనప్పటికీ, ఎలాంటి చర్యా తీసుకోకపోవడం చూస్తుంటే, ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేనట్లు కనిపిస్తోంది. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. నేను ఎథిక్స్ కమిటీలో ఉన్నాను. మహువాకు వేసిన అభ్యంతరకర ప్రశ్నలను నిరసిస్తూ, మా ఐదుగురు పార్లమెంటు సభ్యులం వాకౌట్ చేశాం” అని చెప్పారు.

“ఒక మహిళా ఎంపీని అగౌరవపరిచినందుకు మేం నిరసన తెలిపితే, మా ప్రవర్తన సరిగా లేదని పార్లమెంటరీ కమిటీ మాపై వ్యతిరేకంగా సిఫారసు చేసింది. అంటే, ఒక మహిళా ఎంపీకి అవమానం ఎదురవుతున్నప్పుడు ఆమెకు మద్దతు ఇచ్చినందుకే మా ప్రవర్తన సరిగా లేదన్నారు. మరి, రమేశ్ బిధూరి బహిరంగంగా ఒక పార్లమెంట్ సభ్యుడిపై, అతడి కమ్యూనిటిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, అది మాత్రం బీజేపీ ప్రకారం సరైన ప్రవర్తన. అధికార పార్టీ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనం” అన్నారు.

రమేశ్ బిధూరిపై చర్యలు తీసుకునే ఉద్దేశం బీజేపీ ప్రభుత్వానికి లేదని దానిష్ అలీ అన్నారు.

“ఒకవేళ రమేశ్ బిధూరిపై చర్యలు తీసుకోవాలనుకుంటే, ఈపాటికే ఆ పని చేసేవారు. ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేనట్లుంది. రమేశ్ బిధూరిని పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అందుకోసం నేను పోరాటం చేస్తునే ఉంటాను” అన్నారు.

మహువా మొయిత్రా

ఫొటో సోర్స్, Getty Images

డానిష్ అలీ అంశంలో..

నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో 93 మంది లోక్ సభ ఎంపీలు, 48 మంది రాజ్యసభ ఎంపీలు పలు సందర్భాల్లో పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే, బీజేపీ ఎంపీలెవరిపైనా ఎలాంటి సస్పెన్షన్లు జరగలేదు.

పార్లమెంట్ నుంచి మహువా మొయిత్రా బహిష్కరణ ప్రజాస్వామ్యంలో చీకటిరోజు అని సీనియర్ జర్నలిస్ట్ హేమంత్ అత్రీ అన్నారు.

దానిష్ అలీ, మహువా మొయిత్రాల అంశాల్లో ప్రభుత్వం రెండు భిన్న వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు.

“ఎంపీ రమేశ్ బిధూరి అనుచిత వ్యాఖ్యల అంశాన్ని చూస్తే, ఆయన పార్లమెంట్‌లో దానిష్ అలీపై వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. బిధూరి వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి, పార్లమెంట్‌ నియమాలను అతిక్రమించేలా ఉన్నాయి. ఆయన మాట్లాడిన ప్రతి మాటా కెమెరాలో రికార్డైంది. కానీ, ఇంతటి తీవ్రమైన అంశాన్ని, కేవలం క్షమాపణతో సరిపెట్టిన మోదీ సర్కార్ తీరు, ప్రతిపక్షాలపై వివక్ష, ప్రతీకార ధోరణిని చూపిస్తోంది” అన్నారు.

అయితే, దీనిపై పార్లమెంటరీ కమిటీ రమేశ్ బిధూరికి నోటీసు ఇచ్చింది. గురువారం దీనిపై ఆయన్ను ప్రశ్నించింది.

జర్నలిస్ట్ హేమంత్ అత్రీ మాట్లాడుతూ, అదంతా కేవలం ప్రొసీజర్‌ను ఫాలో అవడానికి మాత్రమే చేస్తున్నారని, బిధూరిపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచనే ఉండి ఉంటే, ఈపాటికే ప్రభుత్వం ఆ పని చేసేదని అన్నారు.

మహువా అంశంపై మాట్లాడుతూ, “లాగిన్ పాస్‌వర్డ్‌ను మరొకరితో పంచుకున్నారని మహువాపై ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఇందుకు సంబంధించి ఎలాంటి నియమాలూ లేవు. ఒకవేళ రెండు రోజుల క్రితమే ఇందుకు సంబంధించి నియమాలను జోడించినప్పటికీ, ఆమె ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు” అన్నారు.

వ్యాపారవేత్త హీరానందాని అఫిడవిట్‌ ఆధారంగా మహువాపై ఆరోపణలు చేశారు. కానీ, అఫిడవిట్‌లోనూ మహువా డబ్బులు తీసుకున్నారని హీరానందాని ఎక్కడా చెప్పలేదు. ఎక్కడా డబ్బులు చెల్లించినట్లు పేర్కొనలేదు. అదే నిజమన్నట్లుగా పార్లమెంటరీ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. కానీ, దీనిపై హీరానందానిని ప్రశ్నించలేదు. కమిటీ సిఫారసులో ఈ ఆరోపణలపై విచారణ చేపట్టాలని కూడా చెప్పింది. కేవలం ఆరోపణల ఆధారంగా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

అత్రీ మాట్లాడుతూ, “ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఈ ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిన బాధ్యత ఎథిక్స్ కమిటీపై లేదా? ఒకవేళ బాధ్యత ఉంటే, ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టిందా?” అని ప్రశ్నించారు.

“ఎంపీ దానిష్ అలీ అంశంలో ఆయన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు కెమెరాలో రికార్డయి ఉన్నాయి. పార్లమెంట్‌లో అందరి ముందూ జరిగిన ఘటనపై ఆయన చర్యలు కోరుతున్నారు. అయినప్పటికీ సభ బిధూరి పట్ల ఉదారంగా ఉంది. మహువా విషయంలో ఆరోపణలేవీ నిర్ధరణ కాలేదు. అయినప్పటికీ కఠిన చర్యలు తీసుకున్నారు. ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని సూచిస్తోంది” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)