ఉత్తర భారతం, దక్షిణ భారతం గొడవేంటి, బీజేపీపై ఉత్తరాది పార్టీ ముద్రపడుతోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆదర్శ్ రాథోడ్
- హోదా, బీబీసీ హిందీ
హిందీ బెల్ట్ (హిందీ మాట్లాడే) రాష్ట్రాలలో బీజేపీ గెలిచిన తరువాత మరోసారి ఉత్తర, దక్షిణ భారతమనే చర్చ తెరపైకి వచ్చింది.
ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో గెలిచింది. తెలంగాణలో ఆ పార్టీ 8 సీట్లకే పరిమితమైంది. దీనిపై సామాజిక మాధ్యమాలలో వాదోపవాదాలు సాగుతున్నాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చాకా కొంతమంది వ్యక్తులు, దక్షిణ బారతాల మధ్య విభజన చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఓ జర్నలిస్టు పోస్టు చేసిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ కూడా రీపోస్టు చేశారు.
‘‘ఈ విభజన అజెండా పట్ల జాగ్రత్తగా ఉండాలి. 70 ఏళ్ళ ఈ అలవాటు అంత తొందరగా పోదు’’ అని ప్రధాని మోదీ రాశారు.
దీనికీతోడు డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ పార్లమెంటులో హిందీ బెల్ట్ రాష్ట్రాలలో బీజేపీ గెలుపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ, తరువాత తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI PHOTO/SANSADTV
జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చలో సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ‘‘ గోమూత్ర రాష్ట్రాలుగా పిలిచే హిందీ బెల్ట్ రాష్ట్రాలలోనే బీజేపీ బలంగా ఉందని ఈ దేశ ప్రజలు నమ్ముతున్నారు. అక్కడ మాత్రమే ఆ పార్టీ గెలవగలదు’’ అన్నారు.
అలాగే ‘‘మీరు దక్షిణ భారతంలో అడుగుపెట్టలేరు. మేం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలలో బలంగా ఉన్నాం. అందుకే మీరు వీటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి మీరు పరోక్షంగా అధికారం చెలాయించినా మేమేమీ ఆశ్చర్యపోము. ఎందుకంటే కలలలో కూడా మీరు దక్షిణాది రాష్ట్రాలలో అధికారంలోకి రాలేరు’’ అన్నారు.
జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) చట్టం, జమ్మ కశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా సెంథిల్ కుమార్‌పై విధంగా మాట్లాడారు.
అయితే అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా సెంథిల్ వ్యాఖ్యలను ఖండాంచాయి. డీఎంకే కూడా సెంథిల్ వ్యాఖ్యలకు దూరంగా ఉంది.
దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై స్పందిస్తూ ‘‘ ఉత్తర భారతం వారిని పానీపూరి అమ్మేవారుగానూ, టాయిలెట్లు కట్టేవారంటూ విమర్శ చేసిన డీఎంకే ఎంపీ ‘ఇండి కూటమి’లో భాగస్వామి అయిన ఎంపీ గోమూత్రం గురించి పరిహసిస్తున్నారు’’ అన్నారు.
అయితే సెంథిల్ కుమార్ పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. కానీ బీజేపీ ఈ వ్యాఖ్యలపై ఇంకా కోపంగానే ఉంది. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ఈ వ్యాఖ్యలు ‘సనాతన సంప్రదాయాన్ని, సనాతన వాదులను’ అవమానించడమేనన్నారు.

ఫొటో సోర్స్, ANI
రేవంత్ రెడ్డి బిహారీ వ్యాఖ్యలు
సెంథిల్ కుమార్ వ్యాఖ్యల తీవ్రత చల్లారకముందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి.
ఎన్నికలముందు రేవంత్‌రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన డీఎన్‌ఏ తెలంగాణ అని, కేసీఆర్ (మాజీ ముఖ్యమంత్రి) డీఎన్ఏ బిహార్‌ది అని వ్యాఖ్యానించారు. తన డీఎన్ఏ కేసీఆర్ డీఎన్ఏ కంటే బెటరని చెప్పారు.
దీనిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ ‘‘ఇది ఉత్తర భారతీయులను అవమానించడమే’’ అన్నారు.
‘‘కాంగ్రెస్ ఆలోచనలన్నీ దేశాన్ని విడగొట్టడంపైనే ఉంటాయని, ఇండియా కూటమి ఉత్తర దక్షిణ భారతాల మధ్యన విభేదాలు సృష్టించడానికి చూస్తోంది’’ అని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

ఫొటో సోర్స్, PHOTO BY CREATIVE TOUCH IMAGING LTD./NURPHOTO VIA GETTY IMAGES
ఆత్మగౌరవ సమస్య
ఉత్తర దక్షిణ భారతాలనే విభజనను ఒక ఆత్మగౌరవ సమస్యగా చూపే ప్రయత్నం చేస్తూ రాజకీయాలలో వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు.
ఉత్తర, దక్షిణ భారతం గొడవకు చాలా చరిత్ర ఉంది. ఇటు ఉత్తర భారతంలోనూ, అటు దక్షిణాన ప్రభావం చూపే రాజకీయ పార్టీలు ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నాయి.
ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే విభేదాలను ఎక్కువచేసి చూపుతున్నారని, వాస్తవం మరోలా ఉందని సీనియర్ జర్నలిస్ట్ రాధికా రామసేసన్ చెప్పారు.
‘‘నేను తమిళనాడు నుంచి వచ్చాను. నేను ఎప్పటి నుంచో ఉత్తరభారతంలోనే ఉంటున్నాను. వాస్తవం ఏమిటంటే తూర్పు, ఉత్తర భారతాల నుంచి అనేకమంది దక్షిణ భారతానికి వెళుతుంటారు. అక్కడ ఉద్యోగాలు చేస్తారు. ఆస్తులు కొంటారు. అక్కడే స్థిరపడతారు. వారు ఆయా భాషలను కూడా నేర్చుకుంటారు. ప్రజల మనసుల్లో ఇటువంటి విభజన ఆలోచనలేవీ లేవు. కానీ విభజన పేరుతో రాజకీయాలు మాత్రం జరుగుతున్నాయి’’ అని చెప్పారు.
డీఎంకే పార్లమెంట్ సభ్యుడి వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ డీఎంకే రాజకీయాలు మొదటి నుంచి ఉత్తర భారతంపై వ్యతిరేకతతో నడుస్తున్నాయి. అవి హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించడం కావచ్చు, కేంద్రలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు దక్షిణాదిపై చూసిన చిన్నచూపు కావచ్చు, కేంద్రం దక్షిణాదిపై సవతి తల్లి ప్రేమ చూపుతోందనే ఆరోపణలు ఉన్నాయని రాధిక చెప్పారు.
‘‘ ఈ ఆరోపణల్లో నిజం ఉండవచ్చు. కానీ ఈ తరహా రాజకీయాల వలన నార్త్, సౌత్ విభజనపై డీఎంకే సందేశాలు పుంపుతున్నట్టు కనిపిస్తోంది. కేంద్రం సవతి ప్రేమ చూపుతోందనే భావన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో కూడా ఉండవచ్చు. కానీ ఆయా రాష్ట్రాలలో ఈ విభజన గురించి మాట్లాడరు’’ అంటారు రాధిక.

ఫొటో సోర్స్, @OFFICE_OF_UDHAY
సొంత ఓటు బ్యాంకు కోసమేనా?
రాజకీయపార్టీలు ఓటు బ్యాంకు కోసం ఈ వాదనను ఉపయోగించుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్యన సంస్కృతి, భాష, సంప్రదాయాలలో తేడాలు ఉన్నా, రాజకీయ విభజనరూపంలో ఇది ఎక్కువగా ప్రస్ఫుటమవుతోంది అని సీనియర్ జర్నలిస్టు వినోద్ శర్మ చెప్పారు.
‘‘ ఉదాహరణకు, దక్షిణాది రాష్ట్రాల్లో సనాతన ధర్మం పెద్ద సమస్య కాదు. కానీ దక్షిణాది ప్రజలమైన మనం ఉత్తరాదికి భిన్నమని, భారతీయ జనతా పార్టీ ఉత్తరాది పార్టీ అని, మన ఆచార వ్యవహారాలను అర్థం చేసుకోదనే సందేశం ఇవ్వడానికి ఇక్కడ వారు దాని గురించి మాట్లాడుతున్నారు.’’ అని వినోద్ శర్మ విశ్లేషించారు.
దక్షిణ భారత నాయకుల ఇటీవలి ప్రకటనలు, వాటిపై బిజెపి వైఖరి ఈ రెండూ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఉన్నాయని కూడా రాధికా రామశేషన్ అభిప్రాయపడ్డారు.
“తరచుగా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు ఎక్కువ ఆర్థికాభివృద్ధి , అధిక ఆదాయానికి బదులుగా కేంద్రం నుండి మరింత మద్దతును కోరుతాయి. వారి డిమాండ్ సహేతుకమైనది కావచ్చు, కానీ ఉత్తర-దక్షిణ విభజన అంశం మరింత ఉద్వేగభరితంగా ఉంటుంది. డీఎంకే, బీజేపీ రెండూ తమకు ప్రయోజనం కలిగించేందుకే దీనిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాయి."అని ఆమె చెప్పారు.
“ఇటీవలి ఎన్నికల ఫలితాలలో, మూడు రాష్ట్రాల్లో బిజెపి విజయం ఇక్కడ తన ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసినట్టు చూపుతోంది. ఈ పరిస్థితిలో, ఉత్తరాదిలో హిందుత్వను ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ కోరుకుంటుంది, అయితే డిఎంకె కూడా దక్షిణాదిలో తన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటోంది’’ అంటారు.

ఫొటో సోర్స్, PHOTO BY ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
దక్షిణాదిలో ఎందుకీ విభిన్నత?
దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కానీ దీని ప్రభావం కర్నాటకకు మాత్రమే పరిమితమైంది. దక్షిణాదిన కర్నాటకలో మాత్రమే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
అది కూడా గత పదేళ్ళుగా బీజేపీ పేరు తారస్థాయిలో మారుమోగుతున్నప్పుడు ఆ పార్టీ కర్నాటకలో అధికారంలోకి రాగలిగింది. కానీ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్నీ పోగొట్టుకుంది.
అయితే దక్షిణాది రాష్ట్రాలలో ఎన్నికల పరిస్థితులు ఎప్పుడూ ఉత్తరాదికి భిన్నంగా ఉంటాయి.
ఉదాహరణకు 1977లో జరిగిన ఎన్నికలలో హిందీ మాట్లాడే రాష్ట్రాలలో ఘోరంగా దెబ్బతింది. కానీ దక్షిణాది రాష్ట్రాలలో గెలిచింది.
ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. కానీ ఎప్పటి నుంచో దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్, కేరళలో సీపీఎం, పుదుచ్చేరీ అఖిల భారత ఎన్‌ఆర్ కాంగ్రెస్, మొన్నటి దాకా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
భాషకు సంబంధించిన ఐక్యత, సామాజిక ఉద్యమాల ద్వారా ఏర్పడిన చైతన్యం ఉత్తరాది రాష్ట్రాలలో బాగా ప్రభావం చూపుతోంది,
బీజేపీ నేతలు దక్షిణాదిన ఎక్కువగా హిందీలో మాట్లాడితే ఆ పార్టీ ఆకర్షణ తగ్గుతుందని వినోద్ శర్మ అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాలలో భాష చాలా ముఖ్యమైన విషయం. 1960లో హిందీని బలవంతంగా రుద్దారనే విషయంపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇది హింసకు కూడా దారితీసింది.
‘‘ పశ్చిమ బెంగాల్, ఒడిస్సాలలో కూడా బీజేపీ లేవనెత్తే అంశాలు పెద్దగా పనిచేయవు.ఈ పార్టీ వ్యూహాలు బిహార్’లో కూడా ఎదురుదీతున్నాయి. వారి వ్యూహాలు ఉత్తరప్రదేశ్‌లో గుజరాత్‌లో పనిచేస్తున్నాయి. కానీ దక్షిణాదివారికి ఇవి నచ్చడం లేదు’’ అని వినోద్ శర్మ చెప్పారు.
‘‘ కర్నాటకను మినహాయిస్తే బీజేపీ దక్షిణాదిలో ఎక్కడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడానికి కారణం ఉత్తర భారతంలోని బీజేపీ లేవనెత్తే సమస్యలు దక్షిణాదిలో పనిచేయవు. కర్నాటలో బీజేపీ హిందూత్వ ప్రభావం అంతో ఇంతో చూపించి ఉండవచ్చు. కానీ మతం విషయంలో ఉత్తరాది వారితో పోల్చుకున్నప్పుడు దక్షిణాది వారు భిన్నంగా వ్యవహరిస్తారు’’ అని చెప్పారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో విద్యాస్థాయి మెరుగ్గా ఉంది. వీరు ఏ విషయాన్నైనా చర్చిస్తారు, విశ్లేషిస్తారు అని వినోదశ్ శర్మ తెలిపారు.
సామాజికాభివృద్ధి, చైతన్యం

ఫొటో సోర్స్, DHILEEPAN RAMAKRISHNAN
1940లో జస్టిస్ పార్టీకి చెందిన ఈవీ రామస్వామి పెరియార్ మద్రాసు ప్రెసెడెన్సీ,పరిసరప్రాంతాలను కలిపి ద్రవిడనాడును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మొదట్లో ఈ డిమాండ్ తమిళం మాట్లాడే వారికి మాత్రమే పరిమితమై ఉంది. కానీ తరువాత కాలంలో నేటి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, ఒడిస్సా ను కూడా ద్రవిడనాడులో చేర్చారు.
‘ఆత్మ గౌరవ ఉద్యమాన్ని’ మొదలుపెట్టినవారిలో పెరియార్ ఒకరు. తమిళనాడులోని డీఎంకే, ఏఐడీఎంకే వంటి రాజకీయ పార్టీలు ఈ ఉద్యమం నుంచి పుట్టినవే.
సీనియర్ జర్నలిస్టు రాధిక రామసేసన్ మాట్లాడుతూ ‘‘ కర్నాటక రాజు వడియార్ బ్రాహ్మణులను పైకి తీసుకురావడానికి రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ సమయంలో తమిళనాడులో జస్టిస్ పార్టీ, పెరియార్ ఉద్యమం తీవ్ర ప్రభావం చూపాయి’’ అన్నారు.
ఈ సంస్కరణలు, ఉద్యమాల వలన మతం, కులం అనేవి దక్షిణభారతంలో పెద్ద ప్రభావాన్ని చూపవు. కానీ ఉత్తర భారతంలో ఇవి బాగా వేళ్ళూనుకుపోయి ఉన్నాయి.
దక్షిణ భారత దేశ రాజకీయాలలో అగ్రవర్ణాల ఆధిపత్యం తగ్గింది. అణగారిన కులాల ముందుకు వస్తున్నాయి. ప్రతి రంగంలో వారు తమ ప్రతిభ చూపుతున్నారంటారు రాధిక.
‘‘ తెలంగాణలో ఓబీసీలు ఆదిపత్యం చూపుతున్నారు. కొన్ని ప్రాంతాలో వెనుకబడిన కులాలు కూడా. ఆంధప్రదేశ్‌లో రెడ్ల ఆధిపత్యం ఉంది. తమిళనాడులో ఓబీసీలు, కర్నాటకలో కొంతవరకు వెనుకబడిన వర్గాలుగానే పరగిణించే లింగాయత్‌లు ఆధిపత్యం చూపుతున్నారు. వీటన్నింటిలో భ్రాహ్మాణుల ప్రాముఖ్యం ఏమీ లేదు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
స్వాతంత్య్రం అనంతరం దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇద్దరే ప్రధానులయ్యారు. వారిలో ఒకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పీవీ నరసింహారావు కాగా, కర్నాటక నుంచి దేవేగౌడ మరొకరు.
కేంద్రంలో తమకు తక్కవ ప్రాతినిధ్యం కల్పించడంపై దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తున్నాయి.
2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన పెరుగుతోందని బీబీసీ తెలుగు సర్వీస్ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ చెప్పారు.
‘‘ పునర్విభజన కోసం విధించిన నిబంధనలపై దక్షిణ భారత నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేదు. కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు’’ అని ఆయన చెప్పారు.
‘‘ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలు ఒక విధంగా శిక్షకు గురైనట్టవుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల సీట్లను మరింత తగ్గించడం వలన వారి ప్రాతినిధ్యం బలహీనపడుతుంది. కేంద్రంతో బేరసారాలాడే శక్తిని అవి కోల్పోతాయి’’ అని రామ్మోహన్ విశ్లేషించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల రేటు వేగంగా పడిపోయింది.
‘‘దీనికితోడు కేంద్రం నుంచి ఆర్థిక సహకారంపై కూడా మరో ఆందోళన ఉందని, దక్షిణాది రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి పెద్దమొత్తం లభిస్తుంటుంది, కానీ ఇందుకు ప్రతిగా కేంద్రం నుంచి తమకు అరాకొరా ఆర్థిక సాయం మాత్రమే అందుతోందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులలో చాలామంది చెపుతున్నమాట’’ అని రామ్మోహన్ వివరించారు.
తెలంగాణలో కే. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఇదే విషయాన్ని ఫిర్యాదు చేశారు. దీంతోపాటు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రం నుంచి మరిన్ని నిధులను డిమాండ్ చేస్తూ ‘‘ ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాయని’’ అన్నారు.

ఫొటో సోర్స్, FB/EPSTAMILNADU
దక్షిణాదిలో బీజేపీ విజయం సాధ్యమేనా?
దక్షిణాదిలో గెలవాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కానీ ఇక్కడ ఆ పార్టీ ప్రాంతీయపార్టీలతో పొత్తుపైనే ఆ పార్టీ ఆధారపడుతోంది.
2024 ఎన్నికలలో కూడా బీజేపీ పొత్తులపై ఆధారపడక తప్పదని సీనియర్ జర్నలిస్ట్ రాధిక రామసేసన్ చెప్పారు. ఇండియా కూటమి ఉన్నా లేకపోయినా, దక్షిణాదిన బీజేపీ ప్రభావంలో పెద్దగా మార్పు ఉండదని ఆమె చెప్పారు.
‘‘ ఉత్తర భారతంలో చూపే ప్రభావాన్ని బీజేపీ దక్షిణాదిలో చూపలేదు. తెలంగాణలో ఈసారి బీజేపీ ఓట్ల శాతం పెరిగినా బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటేనే అక్కడ కూడా కాంగ్రెస్ కు పోటీ ఇవ్వగలదు’’ అని రాధిక రామసేసన్ చెప్పారు.
తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి సహా మొత్తం 130 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. లోక్‌సభ మొత్తం 543 స్థానాలలో ఇది నాలుగోవంతు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు దక్షిణాది నుంచి బీజేపీ కేవలం 21 సీట్లు మాత్రమే (15 శాతం) గెలిచింది. దేశం మొత్తం మీద బీజేపీ సాధించిన సీట్లలో ఆ పార్టీ దక్షిణాది నుంచి గెలిచిన సీట్ల శాతం కేవలం ఏడు శాతమే.
2019లో కూడా బీజేపీ రికార్డు స్థాయిలో లోక్‌సభ సీట్లు సాధించినా, కర్నాటకలో మాత్రమే చెప్పుకోదగ్గ సీట్లు పొందింది. ఇక్కడ మొత్తం 28 సీట్లకు గాను 25 స్థానాలు గెలిచింది. దీని తరువాత తమిళనాడులో ఒక సీటు గెలుచుకుంది. తెలంగాణలో 4 స్థానాలు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్, కేరళలలో ఆ పార్టీ ఖాతా తెరవలేదు.
అదే సమయంలో ఇండియా కూటమిపై రాధికా రామసేసన్ మాట్లాడుతూ ఈ కూటమిలోని పార్టీలు దక్షిణాదిలో సీట్లు సాధిస్తాయని, కానీ ముందు అవి అనేక వైరుధ్యాలను అధిగమించాల్సి ఉంటుందని చెప్పారు.
‘‘ కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ జగన్మోహన్‌రెడ్డి తో పొత్తు పెట్టుకోలేదు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందా? టీడీపీ, కాంగ్రెస్ దీర్ఘకాలంగా ప్రత్యర్థులగా ఉన్నందున వాటి ఓట్ల బదిలీ అంత సాఫీగా ఎలా సాగుతుంది?’’ అని విశ్లేషించారు.
కేరళలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ వామపక్షాలతో చేతులు కలపడం ఈ రాష్ట్రంలో జరిగే పనికాదన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఇండియా కూటమి ఐక్యత ఆయా పార్టీల అవసరం
రాహుల్ గాంధీ కేరళలలోని వాయనాడ్ కు వచ్చి పోటీ చేయడంకంటే ఉత్తర భారతంలో బీజేపీపై పోటీ చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇటీవల సూచించారు.
దీంతోపాటు ఇండియా కూటమిలో లుకలుకలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు డిసెంబరు 6న ఇండియా కూటమి భాగస్వాముల సమావేశంలో దిల్లీలో జరగాల్సి ఉంది. భాగస్వాములతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఈ సమావేశానికి పిలుపునివ్వడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై కూటమిలోని పక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి.
డీఎంకే నాయకుల హిందూత్వ వ్యతిరేక ప్రకటనలతోపాటు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బిహర్ డీఎన్ఏ’ కామెంట్లపై ఇండియా కూటమిలోని మిగిలిన అభ్యంతరం తెలిపాయి.
ఇటువంటి పరిస్థితులలో ఈ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడటం అంత తేలిక కాకపోవచ్చు. సీట్ల పంపకం ఎలా జరుగుతుంది? దీనిపై సీనియర్ జర్నలిస్టు వినోద్ శర్మ మాట్లాడుతూ‘‘ ఇండియా కూటమిలోని పార్టీలు ఐక్యంగా ఉంటేనే ఆ కూటమి మనుగడ సాధించగలగుతుంది’’ అన్నారు.
‘‘ రాష్ట్రాలలో ఈ పార్టీలన్నీ ఒకదానితో ఒకటి కొట్లాడుతున్నాయి. ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నాయి. కానీ ఇండియా కూటమిని జాతీయ దృక్పథంతో చూడాల్సి ఉంది. మనం కనుక భారత రాజకీయాలను తేరిపారా చూస్తే ఈ వైరుధ్యాలేమీ కొత్తకావు. విభేధాలు ఉన్నప్పటికీ వారు ఐక్యంగా ముందుకు వచ్చిన ఘనత బీజేపీ ఆధిపత్య విధానాలకు చెందుతుంది అన్నారు.
‘‘ భారత రాజకీయాల నుంచి పోటీని తొలగించి ఏకపార్టీ అధికారంలో ఉండే విధానాన్ని తీసుకురావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. కానీ పోటీ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ లాంటిది. అది ప్రజలకు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. బీజేపీ గెలుపు కొనసాగితే, అన్ని పార్టీలు, నాయకులను ఆ పార్టీ లక్ష్యంగా చేసుకుంటుంది. అందుకే ఆ పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాల్సి ఉంటుంది’’ అని వినోద్ శర్మ విశ్లేషించారు.
అయితే ఇండియా కూటమి దేశంలో మిగిలిన ప్రాంతాలలో బాగా పోరాడినా, దక్షిణ భారతంలో మాత్రమే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా ఇండియా కూటమి ప్రయోజనం పొందగలదని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ: శ్వేతపత్రం విడుదలకు ఆదేశాలిచ్చిన కొత్త సర్కార్.. ఇంతకీ శ్వేతపత్రం అంటే ఏంటి?
- సీఎం రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఇవే.. ఎడిటర్స్ కామెంట్
- రజనీకి ఏం ఉద్యోగం ఇచ్చారు, జీతం ఎంత?
- ఒంట్లోని రోగాల గురించి చిగుళ్లు ఏం చెబుతాయి?
- విశాఖ: దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణం ఎందుకు ముందుకు కదలడం లేదు... తప్పు కేంద్రానిదా, రాష్ట్రానిదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














