గాజా నుంచి బీబీసీ రిపోర్టర్: 'బతుకుతామన్న ఆశ ఇక చచ్చిపోయింది'

- రచయిత, అద్నాన్ ఎల్-బర్ష్
- హోదా, గాజా నుంచి బీబీసీ అరబిక్ ప్రతినిధి
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంలో నాసర్ ఆస్పత్రి ముందు జీన్స్ ప్యాంట్లు, స్లిప్పర్స్ చెప్పులేసుకున్న యువకులు అంత్యక్రియల ఊరేగింపు తరహాలో నిల్చుని ఉన్నారు.
ఒకరికొకరు ఆనుకుని ఆస్పత్రి బయట నిల్చుని సిద్ధంగా ఉన్నారు. ఏదైనా పిలుపు వినపడగానే అందరూ దగ్గరికి వస్తున్నారు.
ఇంతలో హారన్ మోగిస్తూ, లైట్లు ఫ్లాష్ చేస్తూ ఒక కారు వేగంగా వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక యువకుడిని బయటకు తీసి స్ట్రెచర్‌పై పడుకోబెట్టి హడావిడిగా లోపలికి తీసుకెళ్లారు.
దుమ్ము కొట్టుకుపోయిన మరో కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగి వస్తున్న నాలుగు, ఐదేళ్ల పిల్లాడికీ అక్కడ ఉన్న యువకులు సాయం చేశారు.
దక్షిణ గాజాపై డిసెంబర్ 1 నుంచి ఇజ్రాయెల్ బాంబు దాడులు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి వందలాది మంది చనిపోయారు.
ఏదైనా దాడి జరిగితే ప్రజలు గాయాలపాలవుతున్నారు. అక్కడి నుంచి ఖాళీ చేసేస్తున్నారు.
ఒకవైపు ప్రమాదం, మరోవైపు అత్యవసర పరిస్థితుల మధ్య టెన్షన్‌తో మరో రాత్రి గడచిపోయింది.

ఆ మరుసటి రోజు పట్టణం నడిబొడ్డునలో ఆరుగులు పిల్లల తల్లి అయిన సమాహ్ ఎల్వన్ సాయం కోసం అర్థిస్తున్నారు.
''నేను మొత్తం ప్రపంచానికి, అరబ్ దేశాలకూ ఒకటే చెప్పాలనుకుంటున్నా'' అని ఆమె అన్నారు.
''మేమేం తప్పు చేయలేదు. మేము అమాయకులమని ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నా'' అన్నారామె.
ఆమెకు ఐదుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. తన బిడ్డల దాహం తీర్చేందుకు నీళ్ల కోసం సాయం చేయాలని తన రెండు చేతుల్లోని ఖాళీ వాటర్ బాటిళ్లను ఊపుతూ సమాహ్ వేడుకుంటున్నారు.
''మా బతుకులు పిల్లులు, కుక్కల్లా హీనంగా మారాయి. బహుశా వాటికి కూడా ఆశ్రయం దొరుకుతుందేమో. మాకు అది కూడా లేదు. మేం వీధిన పడ్డాం'' అన్నారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసినప్పటి నుంచి వారి జీవితాలు తల్లకిందులయ్యాయి.

యూరోపియన్ యూనియన్, అమెరికా నిషేధం విధించిన టెర్రరిస్ట్ సంస్థ అయిన హమాస్ జరిపిన దాడిలో 1,200 మందికి పైగా చనిపోయారు. సుమారు 240 మందికి పైగా ప్రజలను హమాస్ బందీలుగా గాజాకి తీసుకెళ్లింది.
ఆ తర్వాత ఇజ్రాయెల్ వరుస బాంబులతో విరుచుకుపడింది. ఉత్తర గాజాపై సైనిక చర్యకు దిగింది.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకూ 15,800 మందికి పైగా సామాన్యులు చనిపోయారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ తెలిపింది.
అనంతరం ఇరువర్గాల మధ్య కుదిరిన ఏడురోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కొందరు బందీలు విడుదలయ్యారు. బదులుగా పాలస్తీనియన్ ఖైదీలు కూడా విడుదలయ్యారు.
కానీ ఇప్పుడు, ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది. నా కుటుంబం సెంట్రల్ గాజాలో ఉంటే, నేను మాత్రం ఒక్కడినే ఖాన్ యూనిస్‌లో ఉన్నాను.
ఇక్కడ మాత్రమే శాటిలైట్ సిగ్నల్స్ అందుతాయి. ఆ ట్రక్కు ఉంచేందుకు ఇదే సురక్షితమైన ప్రదేశం.
నేను జర్నలిస్టును అయినందుకు ఎప్పుడూ గర్వపడతా. కానీ, రోజురోజుకీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. బతకుతామన్న ఆశ ఇక చచ్చిపోయింది.

కొద్దిరోజుల కిందటి వరకూ నా కుటుంబాన్ని చూసుకుని వచ్చేందుకు సెంట్రల్ గాజా వెళ్లేవాడిని. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక రోడ్డును మూసేసింది. మరో రోడ్డు చాలా ప్రమాదకరమైనది.
నాది నార్త్ గాజా. ప్రాణాలు కాపాడుకోవాలంటే సౌత్ గాజా వైపు వెళ్లిపోవాలని దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం చెప్పడంతో కుటుంబంతో సహా పారిపోయి వచ్చా.
ఇప్పుడేమో ఖాన్ యూనిస్‌పై భీకర దాడులు ప్రారంభమయ్యాయని, ఈజిప్ట్ సరిహద్దుల్లోని రఫాకి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నాకు, నా కుటుంబానికి ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ జీవితంపై ఆశలు కోల్పోయింది మాత్రం ఇప్పుడే. బతికి బయటపడగలమనే నమ్మకం పోయింది.
నా కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సురక్షిత ప్రదేశాలకు మారుతూ వస్తున్నాను. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నా.
రఫాకి వెళ్లాలా? అక్కడి నుంచి రిపోర్టింగ్ చేయాలా? అసలు నా కుటుంబం క్షేమంగానే ఉందా? లేదంటే నా కుటుంబం దగ్గరికి తిరిగి వెళ్లిపోవాలా? అనేది తెలియడం లేదు. రోజురోజుకీ పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. అక్కడికి వెళ్లి కనీసం కలిసైనా చనిపోదామని అనిపిస్తోంది.
ఇలాంటి దారుణ పరిస్థితి మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నా.
ఇవి కూడా చదవండి:
- గాజా: అల్-షిఫా హాస్పిటల్లో హమాస్ మిలిటెంట్లు ఉన్నారా... ఇజ్రాయెల్ సైన్యంతో లోపలికి వెళ్ళిన బీబీసీకి అక్కడ ఏం కనిపించింది?
- యూదుల ఊచకోత నుంచి బతికి బయటపడ్డ చిన్నారి జార్జ్ వయసు ఇప్పుడు 92 ఏళ్ళు- ఆ మహా విషాదం ఎలాంటిదో ఆయన మాటల్లోనే...
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఎందుకు ఓటు వేసింది?
- సోవియట్ యుద్ధ విమానం మిగ్-21ను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’ ఎలా దొంగిలించింది?
- రష్యా ఇచ్చిన ఏ బలంతో అమెరికాపై హిజ్బుల్లా కన్నెర్ర చేసింది? ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో హిజ్బుల్లా చేరుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














