చెట్లకూ వృద్ధాప్య పింఛన్, ఏ చెట్టుకు ఎంత ఇస్తారు, ఎలా తీసుకోవాలి....

చెట్లకు పింఛన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, కమల్ సైనీ
    • హోదా, బీబీసీ కోసం

మీరు వృద్ధులకు పింఛన్ల గురించి వినుంటారు, రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ల గురించి వినుంటారు. కానీ వయసు పైబడిన పాత చెట్లకు కూడా పింఛన్ ఇస్తారని మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా?

చెట్లకు పెన్షన్ ఏంటని మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు హరియాణా ప్రభుత్వం ఇలాంటి కొత్త పథకంతో ముందుకొచ్చింది. ఈ స్కీమ్ కింద 75 ఏళ్లు దాటిన చెట్లకు పెన్షన్ ఇవ్వనుంది.

ఈ పథకం పేరు 'ప్రాణ్ వాయు దేవతా యోజన'. పాత చెట్ల జాగ్రత్తగా చూసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం.

75 ఏళ్లు పైబడిన చెట్లన్నింటికీ ఈ పథకం వర్తిస్తుందని అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

''ముఖ్యమంత్రి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. హరియాణా ఆవిర్భావ దినోత్సవం రోజున దీన్ని ప్రారంభించారు. ఏవైనా సంస్థలు, పంచాయతీలు, ప్రైవేట్ ప్రదేశాలు, ఇలా ఎక్కడ ఉన్నప్పటికీ, 75 ఏళ్లకు మించిన చెట్లకు ఈ పథకం వర్తిస్తుంది. 75 ఏళ్లకు పైగా వయసున్న చెట్లకు హరియాణా ప్రభుత్వం నెలకు రూ.2,750లు చెల్లించనుంది'' అని ఆయన చెప్పారు.

చెట్లకు పింఛన్

ఫొటో సోర్స్, KAMAL SAINI

ఫొటో క్యాప్షన్, గ్రామస్తులు చెట్లకు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు

ఏయే చెట్లకు వర్తిస్తుంది?

అలాంటి చెట్లు ఉన్నాయో గుర్తించేందుకు హరియాణాలో ఒక సర్వే నిర్వహించారు.

వాటితో పాటు, తమ స్థలాల్లో అలాంటి చెట్టు ఉండి, వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న వారు కూడా ఈ చెట్ల పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

''రాష్ట్రంలోని 3,810 చెట్లకు ఈ పెన్షన్ అందించనున్నారు. వాటిలో 112 చెట్లకు పెన్షన్ ఇవ్వనున్నారు'' అని జై కుమార్ చెప్పారు.

''అలాగే కర్నాల్ జిల్లా నుంచి 200 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 50 శాతం చెట్లు పంచాయతీ స్థలాల్లోనే ఉన్నాయి'' అన్నారు.

వాటితో పాటు కురుక్షేత్రలో అలాంటి చెట్లు మరో 68 ఉన్నాయి.

ప్రభుత్వం నుంచి కొంత ప్రోత్సాహం అందిస్తే అలాంటి పాత చెట్లపై మరింత శ్రద్ధ తీసుకుంటారని, అదే ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనమని జై కుమార్ అన్నారు.

చెట్లకు పింఛన్

ఫొటో సోర్స్, KAMAL SAINI

చెట్ల వయసు ధ్రువీకరణ

పంచాయతీ సర్పంచులు, గ్రామపెద్దలతో పాటు అటవీ శాఖ అధికారుల సాయంతో చెట్ల వయసు నిర్ధరిస్తారని అధికారులు తెలిపారు.

ఈ పథకంపై ప్రజల్లోనూ మంచి స్పందన కనిపిస్తోంది.

''ఈ చెట్లు మా పూర్వీకులతో సమానం. 1947లో ఇండియా-పాకిస్తాన్ విభజనకు ముందు నుంచీ ఈ చెట్టు మా గ్రామంలో ఉంది'' అని శామ్‌గఢ్ గ్రామస్తుడొకరు చెప్పారు.

''విదేశాల్లో 500 ఏళ్ల నాటి చెట్టు కూడా ఉందని విన్నాం. ఇప్పుడు మన దేశంలో కూడా అదే చూస్తాం. చెట్లను కాపాడాలి. అవి మనకు గర్వకారణం'' అన్నారు.

అదే కాకుండా, ప్రభుత్వ నిర్ణయంతో శామ్‌గఢ్‌ గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఈ చెట్ల నీడన ఉండడాన్ని ఆనందిస్తారు.

చాలా మంది ఈ చెట్ల కింద చిన్న చిన్న దుకాణాలనూ తెరిచారు.

ఈ ఊరి మైదానంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. దాని కింద పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ చెట్టు వయసు దాదాపు 80 ఏళ్లు ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు.

చెట్లకు పింఛన్

ఫొటో సోర్స్, KAMAL SAINI

మతపరంగా ప్రాముఖ్యం ఉన్న చెట్లకు కూడా..

కురుక్షేత్రలో 68 చెట్లను పెన్షన్‌కు ఎంపిక చేశారు. వాటిలో మతపరమైన ప్రాధాన్యం ఉన్న చెట్లు కూడా ఉన్నాయి.

ఇందులో భగవద్గీత బోధనకు సాక్షిగా భావించే చెట్టు కూడా ఉంది.

పురాణాల ప్రకారం అక్కడ ఉన్న చెట్టు 5,000 సంవత్సరాల నాటిదని జ్యోతిసర్ పూజారి సుఖ్‌పా‌ల్ భార్గవ అన్నారు.

"చెట్ల పెంపకానికి ప్రభుత్వం కృషి చేయాలి. చెట్లు చాలా కాలం పచ్చగా ఉంటాయి. వాటిని సరిగ్గా చూసుకుంటే ఇంకా ఎక్కువ కాలం జీవించగలవు" అని ఆయన అన్నారు.

గురుప్రీత్ సింగ్

ఫొటో సోర్స్, KAMAL SAINI

ఫొటో క్యాప్షన్, పంచాయతీ సభ్యుడు గురుప్రీత్ సింగ్

చెట్ల సంరక్షణకు శ్రీకారం

చెట్లకు పెన్షన్ పథకం గురించి తెలిసిన తర్వాత పంచాయతీలు వాటి సంరక్షణకు శ్రీకారం చుట్టాయి.

కర్నాల్‌లోని శామ్‌గఢ్ పంచాయతీ చెట్ల నిర్వహణకు అనువుగా వాటి చుట్టూ కంచెలాంటి నిర్మాణాలు చేపట్టింది. గ్రామంలో అలాంటి చెట్లు ఐదు వరకూ ఉన్నాయని, వాటికి ఆ పథకం వర్తిస్తుందని ఆ గ్రామ పంచాయతీ సభ్యుడు తెలిపారు.

హరియాణా పరిధిలోని గ్రామ పంచాయతీలు ఇతర వృద్ధ వృక్షాలను కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ ఈ స్కీమ్‌కి దరఖాస్తులు చేశాయి.

ప్రభుత్వం ముందుకొచ్చి పింఛన్ మొత్తాన్ని పెంచాలని వారు కోరుతున్నారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తమ గ్రామంలో ఒక చెట్టు ఉందని, ఈ చెట్లను గ్రామస్తులు ఎంతో గౌరవిస్తారని రాంబా గ్రామ పంచాయతీ సభ్యుడు గుర్‌ప్రీత్ సింగ్ చెప్పారు.

పండగలు వచ్చినప్పుడు గ్రామస్తులు ఈ చెట్లకు దీపాలు వెలిగించి పూజలు చేస్తారని అన్నారు.

పాత చెట్లు మన వారసత్వంలో భాగమని, అవి ప్రాణవాయువును అందించే అతిపెద్ద వనరులని అటవీ శాఖ అధికారి జై కుమార్ అన్నారు.

ఇలాంటి చెట్లు మానవ జీవితానికి, పర్యావరణానికి చాలా ముఖ్యమైనవని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా కాలంలో ఆక్సిజన్‌ ​​కొరతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అప్పుడు చెట్ల ప్రాముఖ్యత గురించి తెలిసిందని 48 కేఓఎస్ కమిటీ అధ్యక్షుడు మదన్‌ మోహన్ ఛాబ్రా అన్నారు.

అలాంటి చెట్లను రక్షించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం మంచి పరిణామమన్నారు.

వీడియో క్యాప్షన్, దియా మీర్జాతో బీబీసీ ఇంటర్వ్యూ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)