ముస్లిం ఓటు చీలడం వల్లే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో 9 శాతానికి పైగా, హైదరాబాద్ లో 35 శాతానికి పైగా ఉంటోన్న ముస్లిం జనాభా గతంలో బీఆర్ఎస్ వైపు నిలబడింది. కానీ ఈసారి ముస్లింల ఓట్లు పెద్ద ఎత్తున చీలాయా?
బీఆర్ఎస్‌కే ఓటు వేయాలని స్వయంగా ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ చెప్పినా తెలంగాణ ముస్లింలు తమ లెక్కలు తాము వేసుకున్నారా?
తాజా ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ఎటు పడ్డాయి..?
వ్యూహాత్మకంగా ఓటేసిన ముస్లింలు
దేశంలో స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ముస్లింలను ప్రత్యేక ఓటు బ్యాంకుగా చూసే లక్షణం ఉంది. అందుకు తగ్గట్టే ఒక ప్రాంతం లేదా రాష్ట్రంలోని ముస్లింలంతా గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేయడమూ కనిపిస్తుంది. కానీ, తెలంగాణలో ముస్లింలు మాత్రం ఈసారి ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య స్పష్టంగా చీలారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి వారు పార్టీల వైపు మొగ్గారని తెలుస్తుంది.
‘‘మేం పోటీలో ఉన్న చోట మాకు ఓటేయండి. మేం పోటీ చేయని చోట బీఆర్ఎస్‌కి ఓటేయండి’’ అన్న ఒవైసీ మాటల్ని హైదరాబాదీ ముస్లింలు కూడా గౌరవించలేదు. కేవలం ఓల్డ్ సిటీ ముస్లింలు మాత్రమే దీన్ని పాటించారు.
ఉదాహరణకు జూబ్లీహిల్స్ ముస్లింలు కాంగ్రెస్‌కి ఓటేస్తే, రాజేంద్ర నగర్, మహేశ్వరంలలో కూడా ముస్లిం ఓట్లు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్‌కి పడ్డట్టు స్థానిక పాత్రికేయులు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండుచోట్ల అతికష్టంగా గట్టెక్కిన ఎంఐఎం..
ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం కంచుకోట అనే పదం చాలా మంది వింటారు. ముఖ్యంగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, మొదటిసారి ఓల్డ్ సిటీలో ఎంఐఎం చాలా కష్టపడాల్సి వచ్చింది.
యాకుత్ పురా నియోజకవర్గంలో ఎంబీటీ పార్టీ అమ్జదుల్లా మీద కేవలం 810 ఓట్లతో గెలిచింది ఎంఐఎం. ఇక నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఫిరోజ్ ఖాన్ మీద కూడా 2,175 ఓట్లతో గెలిచింది.
స్థూలంగా ఎంఐఎం మెజార్టీలు బాగా తగ్గాయి. ఎంఐఎం గెలిచిన ఏడు నియోజకవర్గాల్లో అక్బరుద్దీన్ ఒవైసీ గెలిచిన చాంద్రాయణ గుట్ట మినహా, మిగిలిన ఆరు చోట్లా 2018 కంటే ఎంఐఎంకి ఈసారి తక్కువ మెజార్టీలే వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
జూబ్లీహిల్స్‌లో అజర్ ఓటమి
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌ని ఓడించడానికే ఎంఐఎం అక్కడ అభ్యర్థిని నిలిపిందనే ఆరోపణలు వినిపించాయి. అజారుద్దీన్ వంటి స్టార్ కాంగ్రెస్ తరఫున గెలవడం ఎంఐఎంకి ఇష్టం లేదని కొందరు, అజర్ – అసద్‌ల మధ్య వ్యక్తిగత వైరం ఉందని మరికొందరు భాష్యం చెప్పారు. అయితే, ఓట్లను పరిశీలిస్తే మాత్రం ఇక్కడ ముస్లింలు ఎంఐఎం మాట వినలేదని స్పష్టం అవుతోంది.
ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గణనీయంగా ముస్లిం ఓట్లు ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి సరైన పోటీ ఇవ్వలేకపోయారు. డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇక్కడ అజారుద్దీన్ కి 63 వేలకి పైగా ఓట్లు రాగా, ఎంఐఎం అభ్యర్థికి మాత్రం 7,800 ఓట్లే వచ్చాయి. అందునా ఆ నియోజకవర్గంలోని షేక్ పేట డివిజన్‌లో మాత్రమే ఎంఐఎంకి 4,646 ఓట్లు వచ్చాయి. మిగతా ఏ డివిజన్‌లోనూ ఎంఐఎం అభ్యర్థికి వెయ్యి కంటే ఓట్లు పడలేదు. అదే షేక్ పేటలో అజర్‌కి 11 వేల పైనే ఓట్లు వచ్చాయి. మిగిలిన ముస్లిం జనాభా ఉన్న చోట్ల కూడా అజర్‌కి వచ్చిన ఓట్లలో ఐదో వంతు కంటే తక్కువే ఎంఐఎంకి వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
జమాతే ప్రభావం..
భారతదేశంలో ముస్లిం సమాజానికి, మతపరమైన సంస్థల్లో అతి ముఖ్యమైనది జమాతే ఇస్లామే హింద్. ఈ సంస్థ ప్రత్యక్షంగా రాజకీయాల్లో తలదూర్చదు. అయితే ఎన్నికల ముందు పరోక్షంగా ముస్లింలకు దిశానిర్దేశం చేస్తుంటుంది.
ఈ ఎన్నికల ముందు కూడా జమాతే సంస్థ ఒక జాబితా విడుదల చేసింది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఆ సంస్థ సొంతంగా సర్వే చేసి ఒక జాబితా విడుదల చేసింది. నవంబర్ 21న విడుదల చేసిన ఆ ప్రకటనలో 119 స్థానాల్లో తమ మద్దతు ప్రకటించింది.
కాంగ్రెస్‌కి 69
బీఆర్ఎస్‌కి 41
ఎంఐఎంకి 7
బీఎస్పీకి 1
సీపీఐకి 1 స్థానాల్లో జమాతే సంస్థ మద్దతు ప్రకటించింది.
మద్దతు అంటే అలా ఇలా కాదు.. చాలా స్పష్టంగా నియోజకవర్గాల పేర్లతో సహా ఒక లెటర్ విడుదల చేసింది ఆ సంస్థ. ఎంఐఎం పోటీలో ఉన్న 9 చోట్లలో కేవలం 7 స్థానాల్లోనే వారికి మద్దతిచ్చింది జమాతే సంస్థ. చిత్రంగా ఆ పార్టీ మద్దతిచ్చిన స్థానాల సంఖ్యా, ఫలితాల్లో పార్టీలకు వచ్చిన సీట్లు దగ్గరగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, facebook
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు..
బీఆర్ఎస్ ముస్లింల కోసం తెచ్చిన షాదీ ముబారక్ పథకం, షాదీ ఖానాల నిర్మాణం, రంజాన్ తోఫా వంటివాటిపై ప్రచారం చేసింది. అంతే కాకుండా, ముస్లిం విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున నిర్మించిన గురుకులాల గురించి బీఆర్ఎస్ బాగా ప్రచారం చేసుకుంది.
దేశంలో ఏ ప్రభుత్వమూ మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టనంతగా బీఆర్ఎస్ ముస్లింలకు ఖర్చు పెట్టిందని బీఆర్ఎస్-ఎంఐఎంలు చెబుతూ వచ్చాయి. కేసీఆర్ ముందు నుంచీ ముస్లింలకు సన్నిహితంగా ఉండేవారు. ఎంఐఎం మాట జవదాటకుండా బీఆర్ఎస్ మసులుకుంది.
అటు ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కసరత్తే చేసింది. దాదాపు బీఆర్ఎస్ వైపు మళ్లిపోయిన తెలంగాణ ముస్లింలలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఒక ఆలోచన పుట్టించింది అనవచ్చు.
దేశవ్యాప్తంగా బీజేపీని గట్టిగా ఎదుర్కొనే వారికోసం చూస్తున్న వారికి కాంగ్రెస్ ఈ సారి ఇక్కడ కాస్త భరోసా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ-బీఆర్ఎస్-ఎంఐఎం ఒకటే అని కాంగ్రెస్ చేసిన ప్రచారం వారిని ఆలోచనలో పడేసింది.
చివరగా పాత బస్తీ మినహా మిగిలిన ముస్లింలలో సింహ భాగాన్ని తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సఫలమైంది. అందుకు పెద్ద ప్రయత్నమే చేశారు. పెద్దపల్లి వంటి చోట్లకు కూడా ఉత్తరాది నుంచి వచ్చిన కాంగ్రెస్ ముస్లిం నాయకులు హెలికాప్టర్లలో వెళ్లి ప్రచారం చేసి వచ్చారు.
ముస్లింలకు రిజర్వేషన్ అంశాన్ని కూడా కాంగ్రెస్ బాగా హైలెట్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అప్పట్లో రాజశేఖర రెడ్డి 4 శాతం రిజర్వేషన్ ముస్లింలకు కల్పించారు. తరువాత అది సుప్రీం కోర్టులో ఆగిపోయింది. ఆ అంశాన్ని కాంగ్రెస్ బాగా వాడుకోగలిగింది.
‘‘ముస్లిం ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ వైపు వెళ్లాయి అనొచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హైదరాబాద్ ముస్లింలు వేరు, బయట ముస్లింలు వేరు అని ఈ ఎన్నిక తేల్చింది. హైదరాబాద్ బయటి ముస్లింలు ఎంఐఎం కంట్రోల్‌లో లేరు అనేది తేలింది.
తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్‌కి వేశారు. కొన్నిచోట్లే బీఆర్ఎస్‌కి పడ్డాయి. కరీంనగర్ వంటి చోట్ల బీఆర్ఎస్‌కి వేశారు (అక్కడ బండి సంజయ్ ప్రత్యర్థి). మెజార్టీ ముస్లింలు మాత్రం కాంగ్రెస్‌కి వేశారు అని చెప్పవచ్చు. ఇక్కడ ముస్లింల విషయంలో కేసీఆర్ పథకాల కంటే ఎవరు బీజేపీకి దగ్గర, ఎవరు దూరం అనేది ముఖ్యమైనది. బీజేపీ-బీఆర్ఎస్ దగ్గరగా ఉన్నాయి అని ముస్లింలు నమ్మారు’’ అని బీబీసీతో చెప్పారు సీనియర్ జర్నలిస్టు జింకా నాగరాజు.

ఫొటో సోర్స్, Getty Images
అది పూర్తి నిజం కాదు - ఎంఐఎం
‘‘అయితే ముస్లింలు కాంగ్రెస్ వైపు కొంత మొగ్గినా అందరూ గంపగుత్తగా కాంగ్రెస్‌కి వేశారనుకోలేము. అలా చేస్తే ఫలితాలు వేరేలా ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఆ ఫలితాలు కనపడలేదు. చాలా మంది ముస్లింలు పథకాల విషయంలో కేసీఆర్‌కి కృతజ్ఞత చూపారు. షాదీ ముబారక్ పేద ముస్లింలకు చాలా మేలు చేసింది. అటువంటి వారు బీఆర్ఎస్‌కే ఓటు వేశారు’’ అని సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ బీబీసీతో అన్నారు.
అటు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రచారం చేయకపోవడం, అదే సమయంలో అక్కడ బీఆర్ఎస్ ఎక్కువ ప్రచారం చేయడం అనేది మిగిలిన ఓటర్లపై ప్రభావం చూపినట్టే, ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపి ఉండొచ్చని కొందరు విశ్లేషకుల భావన.
అలాగే, అందరు అర్బన్ ఓటర్లలానే ముస్లిం అర్బన్ ఓటర్లు కూడా మార్పుకోరుకోలేదని కొందరు అంటారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల వాదనలు మాత్రం ఎప్పట్లానే భిన్నంగా ఉన్నాయి. ఎవరికి వారు ముస్లింలు తమకే మద్దతు పలికారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
‘‘ముస్లింలు కాంగ్రెస్ వైపు నిలిచారు ఈసారి. షాదీ ముబారక్ వంటివి నామమాత్రం. మైనార్టీలకు ప్రత్యేకంగా ఏం లాభం లేదని వారు నమ్మారు. పైగా రిజర్వేషన్ అంశంలో బీఆర్ఎస్ ఏమీ చేయలేదని తేలింది వారికి. కవిత అరెస్టు కాకపోవడం, జూబ్లీహిల్స్ వంటి చోట్ల ముస్లిం అభ్యర్థిని ముస్లింతోనే దెబ్బతీసి బీఆర్ఎస్‌కి లాభం చేయాలని ఎంఐఎం చూడడం వంటి వాటిని మేం బాగా తీసుకువెళ్లగలిగాం.
ఇక గ్రేటర్ హైదరాబాద్ ముస్లింలు చాలా మంది అర్బన్ ఓటర్స్ కాబట్టి మార్పు కోరుకోలేదు. అందువల్లనే మాకు తక్కువ వచ్చాయి. అదే సమయంలో గ్రేటర్‌లో పెరిగిన కాంగ్రెస్ ఓటు షేర్‌లో ముస్లింల ఓట్లూ ఉన్నాయి’’ అని బీబీసీతో అన్నారు కాంగ్రెస్ నాయకులు, కేకేసీ తెలంగాణ చైర్మన్ కౌసల్ సమీర్.
అయితే, ఆ వాదనతో విభేదిస్తోంది ఎంఐఎం. ‘‘అది పూర్తి నిజం కాదు. రాష్ట్రంలోని ముస్లిం జనాభాలో సగం ఇక్కడే గ్రేటర్‌లో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఒక్క సీటూ సంపాదించలేకపోయింది. బీజేపీని ఢీకొని కాంగ్రెస్ గెలవలేదని ముస్లింలు గ్రహించారు. తాజా మూడు రాష్ట్రాల ఫలితాలు అందుకు నిదర్శనం.
మెజార్టీ బీఆర్ఎస్‌కి వేశారు. దాదాపు 60 శాతం బీఆర్ఎస్‌కే వేశారని మాకు రిపోర్టులు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఉండేవారు, కొన్ని చిన్న స్థాయి పలుకుబడి లేని సంస్థలు వేరే పార్టీకి ఓట్లేయమని చెప్పినా ముస్లింలు వినలేదు. కొందరు, ఒక సెక్షన్ మాత్రమే కాంగ్రెస్ వైపు వెళ్లారు.
బీజేపీ-ఒవైసీ ఒక్కటే అన్న ప్రచారంపై మేం కూడా రేవంత్ రెడ్డి సంఘ్ బ్యాగ్రౌండ్ గురించి ప్రచారం చేశాం. స్థూలంగా ప్రజలు మార్పు కోరుకున్నారు’’ అని బీబీసీతో అన్నారు ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ.

బీజేపీకి లాభించిన చీలిక..
కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య ముస్లిం ఓట్ల చీలిక బీజేపీకి బాగా లాభించింది. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, ఆదిలాబాద్ స్థానాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఇలాంటి స్థానాల్లో ముస్లిం ఓట్లు రెండు వైపులా పడేసరికి, బీజేపీకి పడ్డ ఓట్ల సంఖ్య పెరిగింది అనే భావన కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా బీఆర్‌ఎస్ - బీజేపీ కుమ్మక్కయ్యానే ప్రచారం కాంగ్రెస్‌కు కొంత లాభించిందని. ఆ మేరకు ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లాయని ఫలితాల తీరు చూస్తే అర్థం అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- నిమిషా ప్రియ: భారత నర్సుకు యెమెన్‌లో మరణశిక్ష, బ్లడ్ మనీతో బయటపడగలరా?
- ఉద్యోగానికి దరఖాస్తు చేసేటప్పుడు ‘ఎక్స్పెక్టెడ్ శాలరీ’ ఎలా అడగాలి? కంపెనీ ప్రతిపాదించే ‘శాలరీ రేంజ్’ను ఎలా అర్థం చేసుకోవాలి?
- సునీల్ కనుగోలు: కాంగ్రెస్ ఈయన మాట విని ఉంటే మిగిలిన రాష్ట్రాల్లోనూ అద్భుతాలు సృష్టించేదా?
- మిగ్జాం: ప్రపంచంలో అత్యంత తీవ్రమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
- మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్: ఈ మూడు రాష్ట్రాలనూ బీజేపీ ఎలా గెల్చుకోగలిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










