సీఎం రేవంత్ రెడ్డి తొలి కేబినెట్ భేటీలో ఏం చర్చించారంటే..

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు.
సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో తీసుకున్నచర్చించిన విషయాలను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రులు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మంత్రులు ఏం చెప్పారంటే..
‘‘కేబినెట్ భేటీలో ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం.
2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్రంలో అన్ని శాఖల పరిధిలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఖర్చెంత చేశారు, ఎందుకు చేశారు, వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంత చేరువయ్యాయనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించాం'' అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చామన్నారు.
''ప్రధానంగా రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశాలను వెంటనే అమలు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.
డిసెంబర్ 9న రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో రేపు సమావేశం కానున్నారు.
విద్యుత్‌కు సంబంధించిన అంశాల్లో గత ప్రభుత్వం ప్రణాళికలు లేకుండా చేసిన కార్యక్రమాలను ప్రభుత్వం పరిశీలించనుంది. రేపు విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం జరగనుంది.
విద్యుత్ విషయంలో ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు జరగలేదు'' అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన మేరకు 200 యూనిట్ల లోపు వినియోగానికి సంబంధించి బిల్లులు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్‌లో నిర్ణయించారు.
డిసెంబర్ 9న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది. సీనియర్ శాసన సభ్యుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.
అనంతరం స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉండనుంది.
''ఉచిత బస్సు రవాణా, రెండోది రాజీవ్ ఆరోగ్య శ్రీ పది లక్షల వరకూ పెంపు కార్యక్రమాలను సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9న ప్రారంభించేందుకు నిర్ణయించాం.
తుపాను ప్రభావంపై కూడా కేబినెట్‌లో చర్చించాం. నివేదికలు వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటాం. ప్రాథమిక అంచనాలు రూపొందించి, అందుకు తగినట్టుగా చర్యలు తీసుకుంటాం'' అన్నారు మంత్రి.
రైతు రుణ మాఫీ అమలు చేస్తారా?
రైతు రుణమాఫీ అమలు చేస్తారా లేదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు.
‘‘ప్రభుత్వ పరంగా ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అన్ని హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాటన్నింటిపై పూర్తి వివరాలు వచ్చిన అనంతరం హామీలు అన్నింటినీ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని మంత్రి అన్నారు.
కేబినెట్ భేటీలో ప్రధానంగా ఆరు గ్యారంటీలపైనే చర్చ జరిగిందని తెలిపారు.
మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు శ్రీధర్ బాబు.
రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అభయమిస్తుందని, 24 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
మంత్రులకు శాఖలు ఇంకా ఖరారు చేయలేదని, మీడియాలో వస్తున్నవి వాస్తవం కాదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలు ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులు చూపిస్తే సరిపోతుందని అన్నారు.
ఈ ఉచిత ప్రయాణ కార్యక్రమం మొదలైన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చే అంశాలను పరిగణనలోకి తీసుకుని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.

సీఎంగా రేవంత్ రెడ్డి తొలిరోజు ఏం చేశారు?
- రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి చట్టం చేసేలా ఫైల్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించి తెప్పించుకున్నారు.
- గాంధీభవన్‌లో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్న నిరుద్యోగి రజనీకి ఉద్యోగ నియామక పత్రాలు కూడా సిద్ధం చేయించి తెప్పించారు రేవంత్.
- ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెను కూడా తీసేయాలని ప్రమాణ స్వీకారానికి ముందే రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
- మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రమాణ స్వీకారం చేశారు. అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన అనంతరం గవర్నర్, ప్రమాణ స్వీకారానికి హాజరైన అతిథులను సాదరంగా సాగనంపారు.
- అనంతరం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
- ఆ తర్వాత అక్కడి నుంచి తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు. వేదపండితులు, కుటుంబ సభ్యుల మధ్య సచివాలయంలోని తన బ్లాక్‌లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
- సాయంత్రం 5 గంటలకు తొలి క్యాబినెట్ భేటీ జరిగింది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులంతా క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు.
- సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ఉన్న ఇనుప కంచె తొలగింపు పనులు చురుగ్గా జరిగాయి. రోడ్డుపై ఉన్న ఇనుప గేట్ల నిర్మాణాలను తొలగించారు.
- రేపటి ప్రజాదర్బార్‌కు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా దర్బార్ జరిగేది. సామాన్యులు ఎవరైనా సీఎం నివాసానికి వచ్చి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చే అవకాశం ఉండేది.
- అదే తరహాలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
- రేపు ఉదయం 10 గంటలకు ప్రజాదర్బార్ జరగనుంది. అందుకు సంబంధించి సమాచార, ప్రసార శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.














