లోక్‌సభ నుంచి ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ.. అసలేం జరిగింది?

మహువా మెయిత్రా

ఫొటో సోర్స్, Getty Images

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించారు. పార్లమెంటు ఎథిక్స్ ప్యానల్ సిఫారసును సభ అంగీకరించిందని, దాంతో ఆమెను బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.

కేంద్రంపై ప్రశ్నలు వేసేందుకు ఆమె ఒక వ్యాపారవేత్త నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

అదానీ గ్రూప్ సంస్థలే లక్ష్యంగా ఎంపీ మొయిత్రా ప్రశ్నలు అడుగుతున్నారని, అందుకు ప్రతిఫలంగా ఒక వ్యాపారవేత్త నుంచి ఖరీదైన బహుమతులు, నగదు అందుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.

దూబే ఆరోపణలపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది.

ఆ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమెను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఈ తీర్మానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ నివేదికను సమర్పించాక కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు స్పీకర్ పోడియం సమీపానికి వెళ్లి నివేదిక కాపీలు కావాలంటూ నినాదాలు చేశారు.

టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ ఓటింగ్‌కు ముందు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు.

నివేదిక సమర్పించగానే సభలో గందగరోళం మధ్య స్పీకర్ స్థానంలో కూర్చున్న బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

అనంతరం ఈ విషయంపై చర్చించేందుకు లోక్‌సభ స్పీకర్ అనుమతిచ్చారు. కానీ, చర్చలో పాల్గొని తన వాణిని వినిపించేందుకు మహువా మెయిత్రాను స్పీకర్ అనుమతించలేదు.

తన వాదనను వినిపించడానికి ఆమెకు ఇప్పటికే ప్యానల్ మీటింగ్‌లో అవకాశం లభించిందని స్పీకర్ పేర్కొన్నారు.

అనంతరం మూజువాణీ ఓటింగ్ ద్వారా మహువాను బహిష్కరించాలంటూ నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది.

మహువా మొయిత్రాను బహిష్కరించడాన్ని నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి.

మహువా మెయిత్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహువా మెయిత్రా

మహువా మెయిత్రా ఏమన్నారు?

అన్ని నియమనిబంధనలనూ అతిక్రమించి తనను బహిష్కరించారని మహువా మొయిత్రా అన్నారు. తనను బహిష్కరించాలని చెప్పే అధికారం నైతిక విలువల కమిటీకి లేదని ఆమె అన్నారు.

అదానీని రక్షించేందుకు మోదీ ప్రభుత్వం ఏం చేయలగదనే విషయాన్ని ఈ ‘కంగరూ కోర్టు’లో కనిపించిందన్నారు.

‘‘ఇప్పుడు నా వయసు 49 సంవత్సరాలు. మరో 30 ఏళ్ళపాటు పార్లమెంటు లోపలా, వెలుపలా కూడా మీకు వ్యతిరేకంగా పోరాడగలను’’ అని మహువా మెయిత్రా అన్నారు.

‘‘నేను డబ్బులు తీసుకున్నట్టు గానీ, బహుమతులు తీసుకున్నట్టు గానీ కమిటీ ఆధారాలు చూపించలేకపోయింది. ’’

‘‘కేవలం నేను లోక్‌సభ పోర్టల్‌ లాగిన్ వివరాలను షేర్ చేశాననే విషయంపైనే నన్ను బహిష్కరించమని సిఫార్సు చేశారు. లోక్‌సభ లాగిన్స్ షేర్ చేయడానికి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు. ’’

‘‘ఎథిక్స్ కమిటీ విచారణలో పార్లమెంటు సభ్యులందరం కన్వేయర్ బెల్ట్ లాంటివాళ్లం. అందుకే మేం ప్రజల తరపు. పౌరుల తరపున పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తుతాం అని స్పష్టం చేశాను.’’

‘‘నా నోరు మూయించడం ద్వారా అదానీ విషయాన్ని పక్కదారి పట్టించవచ్చని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ‘కంగారూ’ కోర్టు ఈ ప్రక్రియనంతటిని ఎంతగా దుర్వినియోగం చేసిందో దేశమంతా చూసింది. అదానీ వీరికెంత ముఖ్యమో తెలిసిపోయింది.’’

‘‘ఈ విషయంలో ఓ మహిళా ఎంపీని వేధించి నోరుమూయించడానికి వీరు ఎంతదూరమైనా వెళతారని తెలుస్తోంది. రేపు సీబీఐని కూడా మా ఇంటికి పంపుతారేమో. వీరంతా వచ్చే ఆరు నెలలు నన్నువేధిస్తారు. ఈడీ కానీ, సీబీఐ కానీ దృష్టిసారించని అదానీ 13 వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఏమైందని నేను అడుగుతూనే ఉంటాను’’ అని మెయిత్రా తన బహిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

‘‘ఇది మీ పతనానికి ప్రారంభం. మేం తిరిగొస్తాం. మీ అంతు చూస్తాం’’ అని ఆమె అన్నారు.

మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించడంపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని, మహువాకు అండగా ఉంటామని ఆమె అన్నారు. 495 పేజీల నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించారన్నారు. దానిపై ఎంపీలు మాట్లాడేందుకు కొన్ని నిమిషాల సమయమే ఇచ్చారని చెప్పారు. బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి, ఇతర సభ్యులకు ఆ నివేదికను చదివేందుకు సమయం కూడా ఇవ్వకుండా ఆమోదించారని మమత అన్నారు.

నిషికాంత్ దూబే

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మొయిత్రాపై నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు

అసలేం జరిగింది?

బీజేపీ ఎంపీ దూబే అక్టోబర్ 15న లోక్‌సభ స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. అందులో న్యాయవాది జై అనంత్ దెహద్రాయ్ చెప్పిన సమాచారాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

అదానీ గ్రూప్‌, ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రశ్నలు వేసేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి ఎంపీ మహువా మొయిత్రా లంచాలు తీసుకున్నారనేందుకు ఆమె తన మాజీ ప్రియుడిగా పేర్కొన్న దెహద్రాయ్ బలమైన సాక్ష్యాలు అందించారని దూబే అందులో పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి అదానీ సన్నిహితులని, వారి మధ్య ఉన్న రాజకీయ సంబంధాలతోనే అదానీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను అటు అదానీ, ఇటు బీజేపీ కూడా కొట్టిపారేస్తున్నాయి.

లోక్‌సభలో ఇప్పటి వరకూ ఎంపీ మొయిత్రా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూప్ లక్ష్యంగానే అడిగారని, అందుకోసం హీరానందానీ నుంచి మొయిత్రా రెండు కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని దూబే ఆరోపించారు.

ఈ ఆరోపణలను మొయిత్రా ఖండించారు. అంతేకాదు ఎంపీ దూబే, న్యాయవాది దెహద్రాయ్, పలు మీడియా సంస్థలపై దిల్లీ హైకోర్టులో ఆమె పరువు నష్టం కేసులు వేశారు.

హీరానందాని గ్రూప్ కూడా ఆ ఆరోపణలను ఖండించింది. అయితే, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి అక్టోబర్ 20న హీరానందానీ ప్రమాణ పత్రం సమర్పించినట్లు మీడియాలో కథనాలొచ్చాయి.

''ఫేమస్ అయ్యేందుకే అదానీని, ఆయన గ్రూపు సంస్థలను ఎంపీ మొయిత్రా లక్ష్యంగా చేసుకున్నారు'' అని హీరానందానీ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు కథనాలు తెలిపాయి.

అంతేకాకుండా, మొయిత్రా పార్లమెంట్ లాగిన్ వివరాలు తనకు చెప్పారని, వాటితో ''అవసరమైతే ఆమె అడిగినట్టుగా తానే నేరుగా ప్రశ్నలను అడగొచ్చు'' అని హీరానందానీ చెప్పినట్లు తెలిపాయి.

దీనిపై స్పందించిన ఎంపీ మొయిత్రా ట్విటర్‌లో ఒక పత్రికా ప్రకటనను పోస్ట్ చేస్తూ.. ఆ అఫిడవిట్ ప్రామాణికతను ప్రశ్నించారు.

"అఫిడవిట్ తెల్ల కాగితంపై ఉంది, అది అధికారిక లెటర్‌హెడ్ కాదు, నోటరీ కూడా కాదు. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన/విద్యావంతులైన వ్యాపారవేత్తలలో ఒకరు తన తలపై తుపాకీని ఉంచకపోతే, తెల్ల కాగితం వంటి ఇలాంటి లేఖపై ఎందుకు సంతకం చేస్తారు?" అని మొయిత్రా ప్రశ్నించారు.

"దర్శన్ హీరానందనీకి సీబీఐ, ఎథిక్స్ కమిటీ లేదా మరే దర్యాప్తు సంస్థా సమన్లు పంపలేదు. అలాంటపుడు ఆయన ఈ అఫిడవిట్‌ ఎవరికి ఇచ్చారు?" ఆమె అడిగారు.

''అదానీ గ్రూప్, దాని చైర్మన్ గౌతమ్ అదానీ ప్రతిష్టను, ప్రయోజనాలను దెబ్బతీసేందుకు 2018 నుంచి ఇలా చేస్తున్నారని దేహద్రాయ్ ఫిర్యాదు తెలియజేస్తోంది" అని దూబే ఆరోపణలు చేసిన మరుసటి రోజు అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు ఆరోపించారు.

మహువా మెయిత్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహువా మెయిత్రా

మహువా మొయిత్రా రాజకీయ ప్రయాణం

మహువా మొయిత్రా 2010లో టీఎంసీలో చేరడానికి ముందు బ్యాంకర్‌గా పనిచేశారు. ఆమె ప్రారంభ రాజకీయ జీవితం రాష్ట్ర స్థాయిలోనే ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

ఆ ఎన్నికల్లో మొయిత్రా 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పార్లమెంట్‌లో చేసిన తొలి ప్రసంగంలోనే మొయిత్రా పలువురి దృష్టిని ఆకర్షించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశం "ఫాసిజం సంకేతాలను" చూస్తోందని ఆమె ఆరోపించారు.

ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. మద్దతుదారులు ఆమెను ప్రశంసించారు. 'జనాల్లో ఆమె భయాన్ని పుట్టిస్తున్నారు' అని విమర్శకులు ఆరోపించారు.

మొయిత్రా అప్పటి నుంచి టీఎంసీ పార్టీ ముఖచిత్రంగా మారారు. ఆ పార్టీలో ఇప్పటికే బలమైన మహిళా నాయకురాలు (మమతా బెనర్జీ) ఉన్నారు.

2021లో పార్టీలో అంతర్గత పోరుపై మొయిత్రాను మమత బహిరంగంగా విమర్శించారు కూడా.

వీడియో క్యాప్షన్, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి ఎందుకు బహిష్కరించారు?

ఇవి కూడా చదవండి: