కాదల్ ది కోర్: సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో గే పాత్రలో ఎందుకు నటించారు?

ఫొటో సోర్స్, MAMMOOTTY KAMPANY
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, కొచ్చి
ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన మలయాళం సినిమా ‘కాదల్: ది కోర్’ టీజర్ యూట్యూబ్‌లో విడుదలైనప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ టీజర్ సినిమాలో ఉన్న ప్రధానాంశం ఏమటో చూపించింది. మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో స్వలింగ సంపర్కుడి(గే) పాత్రను పోషించడం ఆయన అభిమానులు, విమర్శకులకు చర్చనీయాంశంగా మారింది.
కాదల్: ది కోర్ టీజర్ విడుదలకు ముందే ఖతార్, కువైట్ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చింది.
కానీ, సుమారు 50 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో పనిచేస్తూ, మూడు జాతీయ స్థాయి సినిమా అవార్డులు గెలుచుకుని, ప్రజల నుంచి ఎనలేని అభిమానాన్ని చూరగొన్న ఏ హీరో కూడా ఇలాంటి పాత్రను ఇప్పటివరకు చేయలేదు.
పితృస్వామ్యం గురించి చెబుతూ 2021లో ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ను రూపొందించిన జియో బేబీనే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.
జియో బేబీ ఈ మూవీకి దర్శకత్వం వహించారని తెలియగానే అభిమానుల్లో, ఫాలోవర్స్ ఈ మూవీపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.

ఫొటో సోర్స్, MAMMOOTTY KAMPANY
సంప్రదాయ వివాహ పద్ధతిలో ఉన్న ఒక స్వలింగ సంపర్కుడి జీవితం ఎలా ఉంటుందో ఈ సినిమా సమాజానికి తెలియజేస్తుంది.
మాథ్యూ (మమ్ముట్టి) అనే ఒక వ్యక్తి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటాడు. ఆయన భార్య ఒమనా(జ్యోతిక) విడాకులకు దరఖాస్తు చేయడంతో అంతా తలకిందులవుతుంది. తన భర్త గే అనే కారణాన్ని చెబుతూ ఆమె విడాకులకు దరఖాస్తు చేస్తారు.
తన కుటుంబంలో, సమాజంలో ఈ కేసు ఎలాంటి ప్రభావాన్ని చూపిందో సినిమాలో చూపిస్తారు.
‘‘ఎల్‌జీబీటీక్యూ కమ్యూనితో కలిసి జీవించడం గురించి సినిమా తీయాలనుకున్నాను. మన కుటుంబాల్లో ఇదెలా చూస్తారో ప్రజలకు తెలియజేయాలనుకున్నా’’ అని దర్శకుడు బేబీ బీబీసీతో చెప్పారు.
మమ్ముట్టి లాంటి నటుడు ఈ సినిమాలో నటించడమే కాకుండా.. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
‘‘సినిమా కాన్సెప్ట్‌ను ఆయన వెంటనే అర్థం చేసుకున్నారు. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు’’ బేబీ తెలిపారు.
నవంబర్ 23న విడుదలైన ఈ సినిమాకు రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌గా వచ్చాయి. థియేటర్లు కూడా హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి.
కానీ, కాదల్ పోస్టర్లు, ట్రైలర్‌ను మమ్ముట్టి అకౌంట్లపై షేర్ చేస్తూ.. ఈ సినిమాను బహిష్కరించాలని కొందరు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు.
అంతేకాక, ఈ పాత్రలో నటించిన మమ్ముట్టిని విమర్శిస్తూ.. ఎల్‌జీబీటీ వ్యతిరేక గ్రూప్‌ల నుంచి కామెంట్లను కూడా ఆహ్వానిస్తున్నారు.
స్వలింగ సంపర్కం చూపించడమంటే యువత బుర్రలను పాడు చేయడమేనని పేర్కొంటూ ముస్లిం పెద్దలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు.
కొందరి నుంచి వస్తోన్న ఈ వ్యతిరేకత మమ్ముట్టికి, సినీ నిర్మాతలకు ఊహించని ఎదురు దెబ్బ అని కేరళ క్వీర్ ప్రైడ్ నిర్వాహకులు అథుల్ పీవీ అన్నారు.
‘‘ప్రజలు అభిమానించే నటుడు మమ్ముట్టి. ఈ పాత్రను ఎంపిక చేసుకునేటప్పుడు, ఈ పాత్రలో నటించేటప్పుడు, సినిమాను రూపొందించేటప్పుడు ఆయన ఎంత ఆలోచించి ఉంటారు’’ అని అథుల్ అన్నారు.
పెళ్లయిన స్వలింగ సంపర్కుడి అనుభవం ఎంతో సున్నితంగా చూపించడాన్ని రాష్ట్రంలోని ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన చాలా మంది ఆదరిస్తున్నారు.
‘‘ఈ సినిమా విమర్శలకు మించినదే కాదు. ఇది ఒక ధైర్యమైన అడుగు’’ అని ఈ కమ్యూనిటీకి చెందిన సంస్థ క్వీరిథమ్ వ్యవస్థాపకుడు ప్రిజిత్ పీకే అన్నారు.
అభివృద్ధిలో ముందుండే, దేశంలో అత్యధిక అక్షరాస్యత రేటున్న రాష్ట్రమైనప్పటికీ, కేరళలో చాలా ప్రాంతాల్లో ఇంకా పితృస్వామ్యం, సంప్రదాయ విశ్వాసాలు ఉన్నాయి.
శక్తిమంతమైన, చైతన్యవంతమైన చిత్ర పరిశ్రమకు పెట్టింది పేరు కేరళ. ప్రతి సంవత్సరం నిర్వహించే సినిమా ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఫొటో సోర్స్, LAL JOSE
ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీని చూపించే సున్నితమైన సినిమాలు చాలా తక్కువని సినిమాల్లో లింగ ప్రాతినిధ్యంపై ఎంతో కాలంగా పనిచేస్తున్న విద్యా నిపుణురాలు రోష్ని ప్రభాకరన్ అన్నారు.
కానీ, 1970 నుంచే మలయాళం చిత్ర పరిశ్రమలో క్వీర్ పాత్రలు కనిపిస్తున్నాయి. 2005లో వచ్చిన చంటు పొత్తు సినిమా కూడా అలాంటిదే. అదే కేరళలో ప్రధాన చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తొలి క్వీర్ సినిమా.
ఈ సినిమా ఆడ లక్షణాలున్న పురుషుడు చివరికి బలమైన మగాడిగా మారినట్లు చూపిస్తుంది. ప్రమాదకరమైన అపోహలను ఈ సినిమా ప్రచారం చేసిందని కేరళలోని ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ కార్యకర్తల, సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
దర్శకుడు ఈ పాత్ర గే కాదని చెప్పినప్పటికీ విమర్శలు మాత్రం ఆగలేదు. సినిమా పేరు చంటుపొత్తునే ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల మనోభవాలను దెబ్బతీసిందని కార్యకర్తలు అన్నారు. చంటుపొత్తు అంటే రెడ్ బిందీ అని అర్థం. రెడ్ బిందీ అంటే నుదుటిన ఎర్ర రంగులో పెట్టుకునే బొట్టు.
‘చంటుపొత్తు ప్రభావం పూర్తిగా ప్రతికూలంగా ఉంది’’ అని అథుల్ అన్నారు. క్వీర్ ప్రజలు ఇలానే ఉంటారనే అపోహను ఇది ప్రజల్లోకి తీసుకెళ్లిందనే విమర్శలున్నాయి.
ఇటీవల కాలంలో కేరళలోని ప్రముఖ సినీనటులు తెరపై స్వలింగ సంపర్క పాత్రలు పోషిస్తున్నారు. 2019లో విడుదలైన నివిన్ పౌలీ నటించిన సినిమా మూథన్ సినీ ఫెస్టివల్స్‌లో పెద్ద ఎత్తున మన్ననలను అందుకుంది.
కానీ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం బాగా ఇబ్బంది పడిందని ప్రభాకరన్ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మరోవైపు 2013లో వచ్చిన పృథ్విరాజ్ సుకుమారన్ ముంబై పోలీసు సినిమా కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. కేవలం షేమ్, హోమోఫోబియాపై దృష్టిపెడుతూ సమస్యాత్మక అంశాలను తెరకెక్కించినట్లు విమర్శలు వచ్చాయి.
ఆ భావంలో తీసుకుంటే మాత్రం కాదల్ పూర్తిగా భిన్నమైంది. ‘‘ఒక స్వలింగ సంపర్కుడు సంప్రదాయ వివాహం నుంచి బయటికి వచ్చే కష్టమైన ప్రక్రియను మలయాళం సినిమాల్లో మనెప్పుడూ చూడలేదు’’ అని ప్రభాకరన్ అన్నారు.
చరిత్రలో క్వీర్ ప్రజల పట్ల వ్యవహరించిన తీరుకు, మలయాళం సినిమాల్లో ఉన్న అపోహలకు క్షమపణగా కాదల్ ఉందని ప్రిజిత్ అన్నారు.
కేరళ నాలెడ్జ్ ఎకానమీ మిషన్‌లో డైవర్సిటీ, ఇంక్లూజన్ మేనేజర్‌గా ఆయన పనిచేస్తున్నారు.
కసబా అనే సినిమాలో మహిళలను కించపరించే డైలాగులు ఉన్నాయనే కారణంతో ఆ రాష్ట్ర మహిళా కమిషన్ మమ్ముట్టిపై సీరియస్ అయింది. మమ్ముట్టి లాంటి ఒక నటుడు ఇలాంటి డైలాగులను చెబితే ప్రజలు నిజంగానే ఇలా చేయొచ్చని భావించే ప్రమాదకరమైన ప్రవర్తనగా మారతాయని కమిషన్ వ్యక్తం చేసింది.
మమ్ముట్టి ఇటీవల కాలంలో తన సొంత బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తూ తన పరపతిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. వాణిజ్యపరంగా విజయం సాధించాలనే పరిమితుల నుంచి బయటికి వచ్చి, వినూత్నమైన కథలతో ప్రయోగాలు చేస్తున్నారు.
‘‘మలయాళంలో వచ్చే ప్రతి కొత్త సినిమా కూడా కొత్త నటులు, కొత్త అంశాలు, కొత్త సినిమాలతో ప్రజల ఆసక్తుల మేరకు ప్రయోగాత్మకంగా ఉంటున్నాయి’’ అని ఇటీవల ఇంటర్వ్యూలో మమ్ముట్టి చెప్పారు.
‘‘అందుకే భారతీయ చిత్రపరిశ్రమ మలయాళం సినిమావైపు చూస్తుంది. ఈ ప్రయాణంలో నా సినిమాలు కూడా భాగం కావాలనుంటున్నా’’ అని అన్నారు.
‘‘మన సమాజంలో ఇలాంటి పురుషులు చాలా మంది ఉంటారు’’ అనే కథనాన్ని కాదల్ ప్రతిబింబిస్తుందని ప్రిజిత్ చెప్పారు.
మన ఇళ్లలో కూడా ఇలాంటి మనుషులున్నారని తెలియజేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి:
- సీరియల్ కిల్లర్ కిష్టప్ప: అడ్డా మీది మహిళా కూలీలే అతడి టార్గెట్, ఏడు మర్డర్లు చేసి ఎలా బయట తిరుగుతున్నాడంటే...
- సింగపూర్ పిల్లలు మ్యాథ్స్‌లో చాలా షార్ప్, ఎందుకంటే...
- ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా బందీలను నగ్నంగా మోకాళ్ళ మీద నడిపిస్తున్న వీడియో బయటకు వచ్చింది... గాజాలో ఏం జరుగుతోంది?
- లోక్‌సభ నుంచి ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ.. అసలేం జరిగింది?
- తెలంగాణ: శ్వేతపత్రం విడుదలకు ఆదేశాలిచ్చిన కొత్త సర్కార్... ఇంతకీ శ్వేతపత్రం అంటే ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














