సీరియల్ కిల్లర్ కిష్టప్ప: అడ్డా మీది మహిళా కూలీలే అతడి టార్గెట్, ఏడు మర్డర్లు చేసి ఎలా బయట తిరుగుతున్నాడంటే...

సీరియల్ కిల్లర్ కిష్టప్ప
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆరోజు నవంబర్ 29, బుధవారం. తెలంగాణలోని తాండూరు దగ్గర శాంతి మాల్ చౌరాస్తాలో కూలీల అడ్డాలో నిలుచుని ఉన్నారు 42 ఏళ్ల సర్వాబీ.

కూలీ పని చేసుకునే సర్వాబీ రోజూ పని కోసం ఇక్కడ ఇతర కూలీలతో పాటు నిల్చుంటారు. ఎవరు పిలిస్తే వాళ్ల దగ్గర కూలీ చేసి, డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తారు. తాండూరుకు సరిహద్దుల్లోని కర్ణాటకలోని గుల్బర్గా దగ్గర మద్కల్ గ్రామం వాళ్ల సొంతూరు. కూలీ పనులు దొరుకుతాయని ఇక్కడ ఉంటోంది ఆ కుటుంబం.

బుధవారం పొద్దున కూడా ఎప్పటిలానే పని కోసం శాంతిమాల్ దగ్గర నిల్చున్నప్పుడు అక్కడకు వచ్చాడు 55 ఏళ్ళ కిష్టప్ప. పని కోసం చూస్తున్న సర్వాబీ దగ్గరకు వెళ్లి అంతారం అనే గ్రామం అవతల ఒకచోట కూలీ పని ఉందని, బస్‌లో వెళ్లాలనీ, తనతో పనికి రావాలని పిలిచాడు. అతనితో పాటూ వెళ్లింది సర్వాబీ. పని ఉండే చోటు దూరం కావడంతో భర్తకు ఫోన్ చేసి అంతారం అవతల కూలీ పని కోసం దూరం వెళ్తున్నాను అని చెప్పారు సర్వాబీ.

ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇద్దరూ కలసి జహీరాబాద్ బస్సు ఎక్కారు. దారిలో పెద్దముల్ మండలం తట్టెపల్లి దగ్గర బస్సు దిగి అడవిలోకి నడచుకుంటూ వెళ్లారు.

అడవిలో చాలా దూరం నడిచారు. దాదాపు రెండు గుట్టలు ఎక్కి దిగిన తరువాత, ఎవరూ లేని చోటున ఆమెను చంపేశాడు కిష్టప్ప. సర్వాబీ చీర కొంగును ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.

సర్వాబీ
ఫొటో క్యాప్షన్, దినసరి కూలీ సర్వాబీ

సీసీటీవీ ఫుటేజీతో...

భార్య సాయంత్రం ఇంటికి రాలేదు. అనుమానం వచ్చి వెతికాడు భర్త మొహమ్మద్. దొరకలేదు. మరునాడు కూడా వెతికారు. తెలిసిన వాళ్లను అడిగారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దీంతో డిసెంబరు ఒకటవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమె ఫోన్ లొకేషన్ వెతికే ప్రయత్నం చేసింది కానీ ట్రాక్ కాలేదు. దీంతో తాండూరు పోలీసులు ఆమె రోజూ వారీగా కూలీ కోసం నిల్చునే చోట సీసీ కెమెరాల ఫుటేజ్ వెతికారు. సీసీ ఫుటేజీలో ఆధారాలు దొరికాయి. అక్కడే ఆమె కిష్టప్పతో కనిపించారు. వీడియోలో.. వాళ్లిద్దరూ ఇందిరా చౌక్ వైపు నడవడం కనిపించింది.

ఆ వ్యక్తి గురించి ఆరా తీసిన పోలీసులు తాండూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టప్పగా గుర్తించారు. డిసెంబరు 7వ తేదీ అతన్ని తీసుకువచ్చిన పోలీసులు విచారణ చేశారు. నేరం ఒప్పుకున్నాడు. సర్వాబీని చంపిన తరువాత ఆమె కాళ్ల పట్టీలు, ఆమె దగ్గరున్న వెయ్యి రూపాయలు, సెల్ ఫోను తీసుకున్నట్టు ‌‍ఒప్పుకున్నాడు. వాటిని తన ఇంట్లో దాచి పెట్టగా వాటిని పోలీసులు రికవర్ చేశారు.

అతన్ని విచారించే సమయంలో, అతని బ్యాగ్రౌండ్ ఆరా తీసే సమయంలో షాకింగ్ విషయాలు తెలిశాయి తాండూరు పోలీసులకు. ఎందుకంటే ఇది కిష్టప్పకు ఏడవ హత్య. అంతకుముందు అతను ఆరుగురిని హత్య చేశాడు.

తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి, తాండూరు డీఎస్సీ శేఖర్ గౌడ్
ఫొటో క్యాప్షన్, తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి, తాండూరు డీఎస్సీ శేఖర్ గౌడ్

కూలీ మహిళలే టార్గెట్

కిష్టప్పకు తాగి తిరగడమే పని. హత్య చేసేప్పుడు తాను కూడా కూలీ లాగా అడ్డా మీద నిల్చుంటాడు. తరువాత ఎవర్ని చంపాలో ఎంచుకుని వారి దగ్గరకు వెళ్లి మాట్లాడతాడు. అడ్డా మీద కూలీ పని కోసం ఎదురు చూసే మహిళలే లక్ష్యంగా హత్యలు చేస్తాడు. పని ఉంది తనతో రావాలని చెప్పి వాళ్లను తీసుకుని వెళ్తాడు. ఎవరూ లేని చోటుకు తీసుకువెళ్లి వాళ్ల దగ్గర ఉన్న ఆభరణాలు, డబ్బులు తీసుకుని హత్య చేస్తాడు. తరువాత ఏమీ తెలియనట్టు వచ్చేస్తాడు.

కిష్టప్పపై వికారాబాద్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, యాలాల్ స్టేషన్లో 1 కేసు, తాండూరులో ఒక కేసు.. మొత్తంగా 6 మర్డర్ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. తాజా మర్డర్ ఏడవది. గతంలో చంపిన ఆరుగురూ ఆడవారే.

ఇన్నిసార్లూ అతను పోలీసులకు దొరకలేదా? అంటే దొరికాడు. ఇప్పటి వరకూ మొత్తం ఐదుసార్లు అతన్ని జైలుకు పంపారు పోలీసులు. కానీ, ప్రతిసారీ సరైన సాక్ష్యాలు లేక బయటకు వస్తూనే ఉన్నాడు. గతంలో ఆరు మర్డర్ కేసుల్లో ఐదు కేసులు కోర్టులో కొట్టేశారు. మరొక కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. అంతేకాదు, తాజా హత్యకు ముందు కూడా రెండేళ్లు జైల్లో ఉండి, రెండు నెలల క్రితమే విడుదల అయ్యాడు.

ఈ ఏడే కాకుండా అసలు కేసు నమోదు కానివి మరో రెండు మూడు హత్యలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘‘ఇతను ఎక్కడ దొరికినా నేరం ఒప్పుకోడు. ఈ కేసులో సీసీటీవీ సాక్ష్యాలతో దొరికాడు కాబట్టి ఒప్పుకున్నాడు’’ అని మీడియాకు చెప్పారు పోలీసులు.

ఇతనిపై హత్యా నేరం నమోదైందని తెలిసిన తరువాత భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

సీరియల్ కిల్లర్ కిష్టప్ప

‘సైకో లక్షణాలు’

‘‘అతను హత్య చేయడానికి పెద్ద కారణాలు కనిపించడం లేదు. తాను హత్య చేసే మహిళల దగ్గర పెద్ద ఎత్తున నగలు, డబ్బు ఉండే అవకాశం లేదు. అవి చాలా చిన్న మొత్తాలు. అత్యాచారం చేసిన ఆనవాళ్లు కూడా లేవు. చూడబోతే ఇతని ప్రవర్తన సైకోలాగా ఉంది’’ అని అభిప్రాయపడ్డారు తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్.

‘‘ఇప్పటి వరకూ అతను చేసిన హత్యల్లో సరైన సాక్ష్యాలు దొరకలేదు. కానీ ఈసారి అలాకాదు. సీసీటీవీ ఫుటేజీతో సహా సరైన సాక్ష్యాలతో అతన్ని పట్టుకున్నాం. హత్య జరిగిన చోటును తనే స్వయంగా తీసుకు వెళ్లి మాకు చూపించాడు. ఈసారి కచ్చితంగా శిక్ష పడేలా చూస్తాం. గతంలో అతను చేసిన నేరాల తీవ్రత దృష్ట్యా కేసు తొందరగా విచారించి తొందరగా శిక్ష పడేలా కోర్టు వారిని కోరతాం’’ అని మీడియాతో అన్నారు డీఎస్పీ.

అయితే ఇటువంటి హత్యలు ఎందుకు చేస్తారు, దానికి దారి తీసే మానసిక పరిస్థితుల గురించి బీబీసీతో మాట్లాడారు సైకియాట్రిస్ట్ డా. వేమన నిశాంత్. ‘‘దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు. చిన్ననాటి ట్రామా, అవతలి జెండర్‌పై ద్వేషం వంటివి. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి చేయడం వల్ల వచ్చే థ్రిల్ కూడా కారణం కావచ్చు. అలాగే గతంలో అనేకసార్లు అతను విడుదల అవడం వల్ల ఏం చేసినా దొరకబోము, తప్పించుకోవచ్చు అనే ధైర్యం కూడా దానికి తోడు అవుతుండొచ్చు. అలాగే మహిళలనే ఎందుకు చంపాడు అనడానికి కూడా రెండు కారణాలు ఉండొచ్చు. మొదటిది వాళ్ళు ఈయన కంటే తక్కువ బలంతో ఉండడం వల్ల.. రెండోది మహిళలపై ద్వేషం కలిగేలా గతంలో జరిగిన ఘటనలు ఏవైనా కూడా అతన్ని ఇలా ప్రేరేపించవచ్చు. లేదా మహిళలను డామినేట్ చేయాలనే కోరిక కూడా కావచ్చు ’’ అని అభిప్రాయపడ్డారాయన.

ఇటువంటి పనులు చేసే వారిని సాధారణంగా గుర్తించడం అంత తేలిక కాదంటున్నారు డాక్టర్లు.

‘‘ఎలాంటి మనుషుల్లో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది గుర్తించడం చాలా కష్టం. తోటివారి పట్ల సానుభూతి లేకపోవడం, సమాజ నిబంధనలపై అయిష్టత, కుటుంబంలో జరిగిన ఘటనల నేపథ్యం, చిన్ననాటి భయానక అనుభవాలు, చిన్ననాటి హింసాత్మక ప్రవృత్తి, పశ్చాత్తాపం లేకపోవడం వీటికి కారణాలు. కాబట్టి వాటిని బయటకు గుర్తించడం సులభం కాదు’’ అన్నారు డాక్టర్ నిశాంత్.

‘‘ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అలాగే ముప్పు ఉన్న వారికి, రిస్క్ ఉన్న వారికి అవగాహన కల్పించవచ్చు. ఇటువంటి ప్రవృత్తి ఉన్న వారికి రిహాబిలిటేషన్ ద్వారా మిగిలిన సమాజం నుంచి కాస్త వేరుగా ఉంచవచ్చు. సైకాలజీ పరంగా అటువంటి చాలా కేసులపై అధ్యయనం జరిగింది కానీ, వారిని మార్చగలిగిన పద్ధతులు అయితే దొరకలేదు’ అన్నారు డా. నిశాంత్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)