ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా బందీలను నగ్నంగా మోకాళ్ళ మీద నడిపిస్తున్న వీడియో బయటకు వచ్చింది... గాజాలో ఏం జరుగుతోంది?

- రచయిత, పాల్ ఆడమ్స్
- హోదా, దౌత్య ప్రతినిధి
ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా పురుషులను అండర్‌వేర్లతో మోకాళ్ళ మీద నడిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దానికి సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది.
ఖాన్ యూనిస్ నగరంతో పాటు ఉత్తర గాజా పరిసరాల్లో పోరాటాలు తీవ్రమవుతున్న తరుణంలో సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపించింది. అందులో డజన్ల కొద్ది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బంధించినట్లుగా కనిపిస్తుంది.
ఈ ఫుటేజీని బీబీసీ ధ్రువీకరించింది. అందులో పాలస్తీనా పురుషులు ఒంటిపై దుస్తులు లేకుండా కేవలం అండర్‌వేర్‌లతో మోకాళ్లపై కూర్చోగా ఇజ్రాయెల్ సైనికులు పహారా కాస్తున్నారు.
గాజా పట్టీకి ఉత్తరాన బీట్ లాహియాలో వీరందరినీ నిర్బంధించినట్లుగా భావిస్తున్నారు.
ఈ వీడియో గురించి ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికార ప్రతినిధిని బీబీసీ ప్రశ్నించింది.
వారాల క్రితం పౌరులందరూ ఖాళీ చేసి వెళ్లిపోయిన ప్రాంతాల్లో నిర్బంధానికి గురైన ఈ వ్యక్తులందర్నీ కనుగొన్నట్లు ఆయన చెప్పారు.
ఆ వీడియోలో పురుషులందరూ ఒక పేమెంట్ మీద వరుసగా మోకాళ్ల మీద కూర్చొని కనిపిస్తున్నారు. వారి బూట్లు, చెప్పులు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
ఇజ్రాయెల్ సైనికులు, సాయుధ వాహనాలు అక్కడ నిలబడి వారికి కాపలా కాస్తున్నాయి.

మిగతా ఫొటోల్లో వారిని మిలిటరీ ట్రక్కుల్లో తరలిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఇజ్రాయెల్ మీడియాలో ఈ బందీలను లొంగిపోయిన హమాస్ ఫైటర్లుగా అభివర్ణిస్తున్నారు.
మరో ఫొటోలో ఆ వ్యక్తుల కళ్లకు గంతలు కట్టి, భారీ ఇసుక గుంతలో మోకాళ్ల మీద కూర్చోబెట్టినట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ ఫొటోను బీబీసీ ధ్రువీకరించలేదు.
ఈ ఫొటోల గురించి ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కానీ, ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగరీ గురువారం మాట్లాడుతూ, ‘‘ఐడీఎఫ్ ఫైటర్లు, షిన్ బెట్ అధికారులు తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వందలాది మందిని నిర్బంధించి విచారించారు’’ అని అన్నారు.
‘‘గత 24 గంటల్లో చాలామంది తమంతట తాముగా మా బలగాల ముందు లొంగిపోయారు’’ అని చెప్పారు.
హమాస్ కంచుకోటలు, పటిష్ట కేంద్రాలుగా భావించే ఉత్తర గాజాలోని జబలియా, షెజయ్యా ప్రాంతాల్లో వారిని పట్టుకున్నట్లు శుక్రవారం ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎలాన్ లెవీ అన్నారు.
‘‘ఈ ప్రాంతాల్లో పట్టుబడిన సైనిక వయస్సు ఉన్న పురుషుల గురించి మేం మాట్లాడుతున్నాం. వారాల క్రితమే ఈ ప్రాంతాల నుంచి సామాన్య ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు భావిస్తున్నాం’’ అని చెప్పారు.
వారిలో హమాస్ తీవ్రవాదులు ఎవరు? ఎవరు కాదు అనే విషయాన్ని తెలుసుకునేందుకు విచారణ జరుపుతామని లెవీ తెలిపారు.
హమాస్‌తో ఇజ్రాయెల్ బలగాలు పోరాడిన ప్రాంతాల్లోనే బందీలుగా పట్టుకున్న ఈ వ్యక్తుల్ని గుర్తించినట్లు ఆయన నొక్కి చెప్పారు.
వారు ఉద్దేశపూర్వకంగా మారువేషంలో ఉండి పౌరుల భవనాల నుంచి వీరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఫొటో సోర్స్, al-Araby al-Jadeed
అయితే, క్షేత్రస్థాయిలో ప్రజలు మరోలా చెబుతున్నారు. బీట్ లాహియాలో ఇజ్రాయెల్ ఆర్మీ నిర్బంధించిన గ్రూపులో తన కజిన్లు 10 మంది ఉన్నారని బీబీసీతో మాట్లాడిన ఒక వ్యక్తి చెప్పారు.
తన గురించి, తన కుటుంబం రక్షణ గురించి ఆయన చాలా ఆందోళన చెందుతున్నారు. తన వివరాలు బహిర్గతం చేయడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన మిడిల్ ఈస్ట్‌లో ఉంటారు.
గాజా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు కజిన్లు తనకు ఫోన్ చేసినట్లు ఆయన చెప్పారు. కజిన్లలో 10 మందిని ఐడీఎఫ్ బలగాలు నిర్బంధించాయని ఫోన్‌లో వారు చెప్పినట్లు ఆయన తెలిపారు.
తమ ప్రాంతంలోకి ప్రవేశించిన ఐడీఎఫ్ సైనికులు మైక్రోఫోన్ల ద్వారా ఇళ్లలో, యూఎన్ రిలీఫ్ ఏజెన్సీ స్కూళ్లలో ఉన్నవారికి ఆదేశాలు పంపినట్లు ఫోన్‌లో తన కజిన్లు చెప్పారని ఆయన అన్నారు.
‘‘మహిళలను కమాల్ ఎడ్వన్ హాస్పిటల్‌కు వెళ్లాలని ఐడీఎఫ్ ఆదేశించింది. ఇళ్ల నుంచి పురుషులు బయటకు రాకపోతే మహిళలను కాల్చేస్తామని బెదిరించినట్లు’’ తనతో కజిన్లు చెప్పారని ఆయన బీబీసీకి వివరించారు.
బందీలైన వారిలో ఏడుగురు కజిన్లు తిరిగి ఇంటికి చేరుకున్నారని ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న మిగతా ముగ్గురు ఎలా ఉన్నారో తనకు తెలియదని అన్నారు.
బందీలుగా పట్టుబడిన వారిలో పాలస్తీనా ప్రముఖ జర్నలిస్ట్, అల్ అరబీ అల్ జదీద్ ప్రతినిధి దియా అల్ కహ్లోట్ ఉన్నట్లు గుర్తించారు.
బీట్ లాహియాలో అల్ ఖలోట్‌తో పాటు ఆయన సోదరులు, బంధువులు ఇతర పౌరులను కూడా ఇజ్రాయెల్ బలగాలు నిర్బంధించినట్లు అరబిక్ వార్తా సంస్థ అయిన అల్ అరబీ అల్ జదీద్ ప్రచురించింది.
ఖలోట్ నిర్బంధాన్ని ఆ సంస్థ ఖండించింది. దీన్ని అవమానకర నిర్బంధం అని అభివర్ణించింది.
‘‘దుస్తులు విప్పేయాలని ఇజ్రాయెల్ సైనికులు వారిని బలవంతం చేశారు. వారిని సోదా చేస్తూ అవమానకరంగా ప్రవర్తించారు. తర్వాత గుర్తు తెలియని ప్రాంతాలకు వారిని తరలించారు. జర్నలిస్టులపై ఇజ్రాయెల్ దాడులను ఖండించాలని అంతర్జాతీయ సమూహం, జర్నలిస్ట్ హక్కుల పరిరక్షక సంస్థలను కోరుతున్నాం’’ అని అల్ అరబీ అల్ జదీద్ కోరింది.
కహ్లోట్ నిర్బంధం గురించి ఐడీఎఫ్‌ను బీబీసీ ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి:
- Skin care: కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే భారతీయుల చర్మం కూడా అలా మారుతుందా?
- పాకిస్తాన్: ఇంధనానికి డబ్బుల్లేక ఆగిపోతున్న ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ విమానాలు
- కోరుట్ల: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే
- ‘మీ దయవల్లే బతికున్నా, సార్’.. 9 ఏళ్ల కిందట ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారికి చేతులెత్తి మొక్కిన పేద మహిళ
- తెలంగాణలో బోర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు, నీటిని వాడుకున్నందుకు ఎంత చెల్లించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














