కుంకుమ పువ్వు: ఈ ఎర్ర బంగారానికి ఏమైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రీతి గుప్తా
- హోదా, ముంబయి
కశ్మీర్ లోయలో మంచు పర్వతాల నడుమ పాంపోర్ పట్టణం కనిపిస్తుంది.
అద్భుతంగా కనిపించే ఈ ప్రాంతం కుంకుమ పువ్వు సాగుకూ కేంద్రంగా కొనసాగుతోంది. భారతీయ వంటకాల్లో ప్రత్యేక స్థానమున్న కుంకుమ పువ్వు ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని ఎర్ర బంగారం (రెడ్ గోల్డ్) అని కూడా పిలుస్తుంటారు.
క్రోకస్ మొక్క నుంచి వచ్చే ఈ కుంకుమ పువ్వు ధర కేజీ 1500 డాలర్లు (రూ.1.25 లక్షలు) వరకూ ఉంటుంది.
అక్టోబరు, నవంబరు నెలల్లో ఇక్కడి క్రోకస్ మొక్కల నుంచి పూలు రావడం మొదలవుతాయి. దీంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఊదా రంగులోకి మారినట్లుగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, శరదృతువులో ఈ పంట కోతకు వస్తుంది. అప్పుడే క్రోకస్ పూల రెక్కల మధ్య నుండే ఎర్రని దారం లాంటి కుంకుమ పువ్వును రైతులు సేకరిస్తారు. వీటిని ఎండబెట్టి మార్కెట్‌లోకి పంపిస్తారు.
భారత్‌లో 90 శాతం కుంకుమ పువ్వు కశ్మీర్ నుంచి వస్తోంది. శతాబ్దాల నుంచీ ఇక్కడ కుంకుమ పువ్వును సాగు చేస్తున్నారు.
మోనిస్ మీర్ కుటుంబం నాలుగు తరాల నుంచీ కుంకుమ పువ్వు వ్యాపారం చేస్తోంది.
ఒక కేజీ కుంకుమ పువ్వు ఉత్పత్తికి 2,00,000 నుంచి 3,00,000 పువ్వులు అవసరం అవుతాయని ఆయన చెప్పారు. బల్బుల ఆకారంలో కనిపించే విత్తనాలు నాటడంతో ఈ పంట మొదలవుతుందని చెప్పారు.
‘‘ఇది చాలా శ్రమతో కూడిన పరిశ్రమ. విత్తనాలు నాటడంతో మొదలుపెట్టిన పువ్వులను సేకరించడం, వీటి నుంచి జాగ్రత్తగా కుంకుమ పువ్వును వేరుచేయడం లాంటి పనులన్నీ నైపుణ్యం కలిగిన కార్మికులు చాలా జాగ్రత్తగా చేస్తుంటారు’’ అని మీర్ చెప్పారు.
అయితే, కొన్ని సంవత్సరాల నుంచీ తమ పొలంలో కుంకుమ పువ్వు దిగుబడి తగ్గిపోతోందని మీర్ అన్నారు. ఒకప్పుడు ఈ సీజన్‌లో మూడు నుంచి ఐదుసార్లు దిగుబడి వచ్చే మొక్కలు, నేడు రెండు నుంచి మూడు సార్లకు తగ్గిపోయిందని చెప్పారు.
దీనికి ప్రధాన కారణాలు వర్షపాతంలో తేడా, పెరుగుతున్న ఉష్ణోగ్రతలేనని ఆయన అన్నారు. చాలా సున్నితంగా ఉండే క్రోకస్ మొక్కలు పొడిబారుతున్న నేలను తట్టుకోలేకపోతున్నాయని అన్నారు.
మరోవైపు కుంకుమ పువ్వును సాగుచేస్తున్న రైతులు కూడా పరిస్థితి నానాటికీ కఠినంగా మారుతోందని అంటున్నారు.
‘‘వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి పొలాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి’’ అని షేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని సాఫ్రన్ రీసెర్చ్ స్టేషన్ చీఫ్, డా. బషీర్ అలీ చెప్పారు.
‘‘ఇదివరకటిలా ఇక్కడ వర్షాలు, హిమపాతం ఒక పద్ధతి ప్రకారం కురవడంలేదు. ఇవి ఎప్పుడు కురుస్తాయో చెప్పడం కష్టం అవుతోంది. పదేళ్ల క్రితం మంచి దిగుబడిని ఇచ్చే పొలాలు ఇప్పుడు నిస్సారంగా మారుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
మరోవైపు కశ్మీర్‌లో కుంకుమ పువ్వు సాగుచేస్తున్న భూములు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి.
1996లో ఇక్కడ 5,700 హెక్టార్లలో కుంకుమ పువ్వు సాగుచేసేవారు. 2020 నాటికి ఇది 1,120 హెక్టార్లకు తగ్గిపోయింది.
మారుతున్న వాతావరణ పరిస్థితులతోపాటు విస్తరిస్తున్నజనావాసాలు, నీటి పారుదల సౌకర్యాల లేమి, రైతులకు శిక్షణ లేకపోవడంతో కుంకుమ పువ్వు దిగుబడి తగ్గిపోతోందని మీర్ అంటున్నారు.
మళ్లీ కుంకుమ పువ్వు సాగుకు ప్రాణం పోసేందుకు వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే కుంకుమ పువ్వు మొక్కల కోసం డా.అలీ ప్రయత్నిస్తున్నారు.
దీని కోసం ‘మ్యుటేషన్ బ్రీడింగ్’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనిలో భాగంగా మొక్కల డీఎన్ఏను రేడియేషన్‌కు గురిచేస్తున్నారు. దీనివల్ల వచ్చే జన్యు మ్యుటేషన్లతో భిన్నరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొనేలా కుంకుమ పువ్వు మొక్కలు మారుతాయని ఆశిస్తున్నారు.
ఈ పరిశోధనల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని డాక్టర్ అలీ అంటున్నారు.
మరోవైపు మరింత దిగుబడి ఎలా సాధించాలి? అనే అంశంపై రైతులకు ఆయన సలహాలు కూడా ఇస్తుంటారు. ఉదాహరణకు పొలాల్లో మధ్యమధ్యలో బాదం మొక్కలను నాటాలని ఆయన సూచిస్తున్నారు. దీని వల్ల నీడతోపాటు మట్టి ఉష్ణోగ్రత కూడా తగ్గుతుందని ఆయన చెబుతున్నారు.
మరికొందరు మాత్రం సరికొత్త విధానాల్లో కుంకుమ పువ్వు ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, SAMEER YARDI
పాంపోర్‌కు 1,400 మైళ్ల దక్షిణాన పుణెలో శైలేశ్ మోదక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు.
మంచి జీతం వచ్చేటప్పటికీ, ఆ ఉద్యోగం విషయంలో మోదక్ అసంతృప్తితో ఉండేవారు. 2016లో ఆ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశారు.
‘‘సొంతంగా ఏదైనా చేయాలని అనుకునేవాడిని. అలా మొదట తేనెటీగల పెంపకం మొదలుపెట్టాను. అది అంత మంచి ఫలితాలను ఇవ్వలేదు’’ అని ఆయన చెప్పారు.
‘‘నాతోపాటు పనిచేసే చాలా మందికి తేనెటీగలు కుట్టేసేవి. రవాణా కూడా కష్టం అయ్యేది’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, SAMEER YARDI
అందుకే ఆయన కుంకుమ పువ్వు ఉత్పత్తికి మారారు. షిప్పింగ్ కంటైనర్లో విజయవంతంగా ఆయన కుంకుమ పువ్వును సాగుచేస్తున్నారు.
క్రోకస్ మొక్కలకు అనువైన వాతావరణ పరిస్థితిని సృష్టించేందుకు కంటైనర్లలో ఎయిర్ కండీషనింగ్, సర్క్యులేషన్ సిస్టమ్‌లను ఏర్పాటుచేశారు. లోపలి ఉష్ణోగ్రత, తేమ, కార్బన్ డైఆక్సైడ్, కాంతి స్థాయిలను గుర్తించేందు సెన్సర్‌లను ఏర్పాటుచేశారు.
మొక్కలను మట్టికి బదులుగా తేమ, పోషకాలతో నింపిన కంటైనర్లలో పెంచుతున్నారు. మరోవైపు ఈ విషయాలన్నీ మొబైల్ సాయంతో నియంత్రించే సాఫ్ట్‌వేర్‌ను కూడా మోదక్ అభివృద్ధి చేశారు.
‘‘వ్యవసాయంతో అతిపెద్ద సమస్య ఏమిటంటే, ఇది విపరీతంగా వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం మారితే, పంట నాశనం అవుతుంది. అందుకే మట్టిలేకుండా హైడ్రోపోనిక్స్ టెక్నాలజీని నేను ఉపయోగిస్తున్నాను’’ అని ఆయన చెప్పారు.
గత ఏడాది కంటైనర్‌లో సగ భాగాన్ని ఆయన కుంకుమ పువ్వుకు కేటాయించారు. దీంతో 700 కేజీల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది మొత్తం కంటైనర్లో కుంకుమ పువ్వు పెంచుతున్నారు.
‘‘మేమింకా ప్రయోగ దశలోనే ఉన్నాం. కుంకుమ పువ్వు మెరుగ్గా పెరిగే పర్యావరణాన్ని ఎలా సృష్టించాలో మేం నేర్చుకుంటున్నాం’’ అని మోదక్ చెప్పారు.
మళ్లీ పాంపోర్ పట్టణానికి వస్తే, ఇంటి లోపల మొక్కలను పెంచే వ్యవస్థపై డాక్టర్ అలీ కృషిచేశారు.
దీనిలో భాగంగా భూమిలో మొలకెత్తిన విత్తనాలను మూడు నెలలపాటు ఇంటిలోనే పెంచి, దిగుబడికి ముందుగా పొలాల్లో నాటే విధానాన్ని ఆయన అభివృద్ధి చేశారు.
‘‘అసలు ప్లాస్టిక్ ట్రేలలో కుంకుమ పువ్వు ఎలా అభివృద్ధి చేయొచ్చని మొదట్లో చాలా సందేహాలు ఉండేవి’’ అని కశ్మీరీ రైతు అబ్దుల్ మజీద్ వానీ చెప్పారు.
‘‘అయితే, ఈ విధానం విజయవంతం అవుతోంది. దీనిలో దిగుబడి కూడా నాణ్యంగా ఉంటోంది. సాధారణ పద్ధతి కంటే మెరుగ్గా ఉంటోంది’’ అని ఆయన అన్నారు.
అయితే, దీని కోసం అదనంగా శ్రమించాల్సి ఉంటుందని, దీన్ని అంతగా నమ్మలేమని కొందరు అంటున్నారు.
2021, 2022లో ఇంటి లోపల కుంకుమ పువ్వు మొక్కలను పెంచేందుకు రైతు ఇర్షాద్ అహ్మద్ ప్రయత్నించారు. అయితే, రెండుసార్లు పంట దెబ్బతింది. ‘‘నాకు తెలిసినంత వరకూ దీనితో సమయం వృథా’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
- నేపాల్‌లో తొలి స్వలింగ సంపర్కుల పెళ్ళి రిజిస్ట్రేషన్
- LGBT లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్... ఈ పదాలకు అర్థం ఏంటి?
- పాకిస్తాన్ నుంచి మనుషుల అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? బీబీసీ అండర్ కవర్ రిపోర్టర్‌తో స్మగ్లర్ ఆజం చెప్పిన సీక్రెట్స్...
- రష్యా నుంచి అర్జెంటీనాకు చేరుకుంటున్న వేలమంది గర్భిణులు, అరెస్టు చేస్తున్న పోలీసులు, ఎందుకు?
- ఇలా పోపట్: 50 ఏళ్లుగా భారత్ లో ఉంటున్నా, ప్రపంచంలో ఏ దేశానికీ చెందని మహిళ ఈమె
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















