16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?

- రచయిత, కేటీ మార్క్
- హోదా, బీబీసీ పనోరమా
బ్రిటన్‌లో ఒక ప్రముఖ చర్చి 16 ఏళ్ల కుర్రాడి శరీరం నుంచి ‘దుష్ట శక్తులను’ వదిలిస్తున్నట్లుగా చెబుతూ చేసే ప్రయత్నాలను రహస్యంగా బీబీసీ రికార్డు చేసింది.
ఈ వీడియోలో ఆ కుర్రాడి శరీరం నుంచి ‘దెయ్యాన్ని’ వదిలించడానికని చెబుతూ ‘స్ట్రాంగ్ ప్రేయర్స్’గా పిలిచే ప్రార్థనలను ‘యూనివర్సల్ చర్చ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్’ (యూసీకేజీ) పాస్టర్ చేస్తూ కనిపించారు.
మరోవైపు స్వలింగ సంపర్కుడినైన తనను సాధారణ పురుషుడిలా మార్చేందుకు 13 ఏళ్ల వయసులో తనపైనా ‘స్ట్రాంగ్ ప్రేయర్స్’ను ప్రయత్నించినట్లు ఈ చర్చిలో మాజీ సభ్యుడైన ఒక ‘గే’ చెప్పారు.
అయితే, 18 ఏళ్లలోపు వారికి ‘స్ట్రాంగ్ ప్రేయర్స్’ చేయబోమని యూసీకేజీ చెబుతోంది. ‘కన్వర్షన్ థెరపీ’లను కూడా చేయబోమని అంటోంది.
అయితే బీబీసీ పనోరమా ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలింది?
దుష్టశక్తులను తరిమికొట్టడం ద్వారా మానసిక సమస్యలకు పరిష్కారం చూపుతామని చర్చి చెబుతోంది.
మూర్ఛ వ్యాధిని కూడా ‘ఆధ్మాత్మిక సమస్య’గా ఇక్కడి పాస్టర్ చెబుతున్నారు.

యూసీకేజీకి ప్రపంచ వ్యాప్తంగా బ్రాంచ్‌లు ఉన్నాయి. ‘చారిటీ’గా రిజిస్టరైన ఈ సంస్థకు బ్రిటన్‌లో 35 బ్రాంచ్‌లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా తమకు 10,000 మంది సభ్యులు ఉన్నారని సంస్థ చెబుతోంది. తమది ఒక క్రిస్టియన్ పెంటెకోస్టల్ చర్చిగా వివరిస్తోంది.
క్రైస్తవుల్లో దుష్ట శక్తులను వదిలిచేందుకు ప్రార్థనలు చేయడం కొత్తేమీ కాదు. కొన్ని చర్చిలు వీటిని విమోచన (డెలివరన్స్) అని పిలుస్తుంటే, మరికొన్ని చర్చిలు వీటిని భూతవైద్యం (ఎక్సార్సిజం)గా చెబుతుంటాయి. అయితే, యూసీకేజీ ఎక్సోర్సిజం అనే పదాన్ని ఉపయోగించదు.
క్రైస్తవుల్లో భిన్న వర్గాలను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్న పెంటెకోస్టల్ బిషప్ డా. జోయి ఆల్డ్రెడ్ మాట్లాడుతూ.. ‘‘ద చర్చి ఆఫ్ ఇంగ్లండ్ కింద చాలా ప్రాంతాల్లో ఎక్సార్సిస్టులు ఉన్నారు. అయితే, వీరు ఎలా పనిచేస్తారు? అనేదే అసలు ప్రశ్న’’ అని చెప్పారు.
యూసీకేజీలో ‘స్ట్రాంగ్ ప్రేయర్స్’ అంటే.. చర్చిలో సభ్యుడైన ఆ వ్యక్తిపై పాస్టర్ చేతులు వేసి, దుష్టశక్తి శరీరం నుంచి వెళ్లిపోవాలని గట్టిగా చెబుతారు. ఆధ్యాత్మిక ప్రక్షాళన (స్పిరిట్యువల్ క్లెన్సింగ్)గా పిలిచే ఈ ప్రార్థనలు ప్రతి వారమూ నిర్వహిస్తామని చర్చి చెబుతోంది.
అప్పట్లో 8 ఏళ్ల బాలిక విక్టోరియా క్లైంబీని ఓ జంట చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో యూసీకేజీ పేరు వార్తల్లో మార్మోగింది.
2000లో ఆ హత్యకు వారం రోజులు ముందుగా విక్టోరియాను ఆ జంట చర్చికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే ఆ బాలిక శరీరంపై చిత్ర హింసలకు గురించేసిన గుర్తులు స్పష్టంగా కనిపించేవి.
ఆ బాలికకు దెయ్యం పట్టి ఉండొచ్చని, అందుకే ‘స్ట్రాంగ్ ప్రేయర్స్’ అవసరమని భావించానని అప్పట్లో ఒక పాస్టర్ చెప్పారు. అయితే, ప్రార్థనలు మొదలయ్యే ముందే విక్టోరియాను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆమె బంధువుకు సూచించానని వివరించారు.
అయితే, బాలిక హత్య అనంతరం సిద్ధంచేసిన రిపోర్టులో మాత్రం విక్టోరియా పరిస్థితిని పాస్టర్ అర్థం చేసుకోలేదని, పోలీసులకు సమాచారం అందించడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొన్నారు. అసలు ఈ చర్చిలో పిల్లలకు భద్రత కల్పించడంలో సహకరించే ‘చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ’ లేదని కూడా రిపోర్టులో ప్రస్తావించారు.
విమర్శల నడుమ పిల్లలకు భద్రత కల్పించే ఓ పాలసీని అనుసరిస్తున్నట్లు చర్చి పేర్కొంది.
18 ఏళ్లలోపు వయసున్న ఎవరిపైనా స్ట్రాంగ్ ప్రేయర్స్ చేయబోమని, అసలు బాలల సమక్షంలో ఇలాంటి ప్రార్థనలు చేయబోమని కూడా చర్చి చెప్పింది.

ఫొటో సోర్స్, యూసీకేజీ
బీబీసీ రహస్యంగా రికార్డు చేసిన వీడియోలో వయసుల వారీగా అక్కడున్నవారిని పాస్టర్ మొదట విభజిస్తూ కనిపించారు.
ఈ వీడియోలో 16 ఏళ్ల కుర్రాడిపై ‘స్ట్రాంగ్ ప్రేయర్స్’ చేస్తున్నట్లుగా ఓ పాస్టర్ కనిపిస్తున్నారు. ‘‘దేవుడా, నీ అగ్నితో ఈ శరీరంలో దాగున్న దుష్టశక్తిని దహించివేయు’’ అని పాస్టర్ చెబుతూ కనిపించారు.
ఆ సమయంలో ఆ కుర్రాడి తలను పాస్టర్ గట్టిగా పట్టుకుని ‘ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపో’ అని దుష్టశక్తికి చెప్పినట్లుగా వినిపిస్తోంది.
ఈ వీడియోను ప్రభుత్వ ‘చైల్డ్ సేఫ్‌గార్డింగ్ రివ్యూ పానెల్’ చైర్మన్ జెన్నీ డేవిస్‌కు బీబీసీ చూపించింది.
‘‘రెండు దశాబ్దాల క్రితం నాటి విక్టోరియా హత్య నుంచి అసలు వీరు ఏం పాఠాలు నేర్చుకున్నారో అర్థం కావడం లేదు’’ అని ఆమె అన్నారు.
‘‘కొత్త పాలసీలు తీసుకొస్తున్నారు. కానీ, వాటిని అమలు చేయడం లేదు. అలాంటప్పుడు వాటిని తీసుకురావడం ఎందుకు’’ అని ఆమె ప్రశ్నించారు.
అయితే, తాజా వీడియో నేపథ్యంలో.. ‘‘డెలివెరెన్స్ ప్రేయర్స్‌ను 19 ఏళ్ల లోపు వయసున్న వారిపై చేయబోం’’ అని యూసీకేజీ ఒక ప్రకటన విడుదల చేసింది. పిల్లల భద్రత విషయంలో తీసుకొచ్చిన సేఫ్‌గార్డింగ్ పాలసీని ఉల్లంఘించారనే వార్తలను ఖండించింది.

‘ఆ చర్చికి వెళ్లాలంటే భయమేసే స్థాయికి...’
గత కొన్ని నెలలుగా 40 మంది మాజీ యూసీకేజీ సభ్యులతో బీబీసీ పనోరమా మాట్లాడింది.
లండన్ స్ట్రాట్‌ఫోర్డ్ బ్రాంచ్‌లో 19 ఏళ్ల వయసున్నప్పుడు షేరన్ చేరారు.
తను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని అక్కడి పాస్టర్‌కు ఆమె చెప్పారు. అయితే, వైద్యుల దగ్గరకు వెళ్లాలని ఏనాడూ ఆయన సూచించలేదని ఆమె అన్నారు.
ఆమెపై కూడా ‘స్ట్రాంగ్ ప్రేయర్స్’ చేశారు. మానసిక సమస్యలతో బాధపడేవారిపై స్ట్రాంగ్ ప్రేయర్స్ చేయకూడదనే నిబంధనలను ఉల్లంఘించారని ఆమె చెప్పారు.
‘‘అసలు ఆ చర్చికి వెళ్లాలంటే భయమేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. ఎందుకంటే ఎప్పుడూ వారు లక్ష్యంగా చేసుకునే వారిలో నేనూ ఉండేదాన్ని’’ అని ఆమె అన్నారు.
అయితే, స్ట్రాంగ్ ప్రేయర్స్‌లో ఎవరినీ లక్ష్యంగా చేసుకోబోమని, భయపెట్టబోమని చర్చి చెబుతోంది. ఎవరికైనా మానసిక సమస్యలు ఉంటే వైద్యుల సాయం తీసుకోవాలని కూడా వారికి సూచిస్తామని వివరిస్తోంది.
యూసీకేజీ మాజీ సభ్యుడు మార్క్‌తోనూ బీబీసీ మాట్లాడింది.
‘‘13 ఏళ్ల వయసులో నన్ను స్వలింగ సంపర్కుడి నుంచి సాధారణ పురుషుడిగా మార్చేందుకు స్ట్రాంగ్ ప్రేయర్స్ చేశారు’’ అని ఆయన చెప్పారు.
‘‘నేను గేనని తెలుసుకున్నప్పుడు, దీనికి దుష్టశక్తే కారణమని వారు అన్నారు. దుష్టశక్తులను వదిలించే శుక్రవారం ప్రార్థనలకు తప్పకుండా హాజరుకావాలని నాకు సూచించారు’’ అని చెప్పారు.
నాలుగేళ్లకుపైనే ప్రతి వారం తనకు ప్రార్థనలు నిర్వహించారని మార్క్ చెప్పారు. మహిళలపై ప్రేమ కలుగుతుందనే భావన తనలో కలుగుతున్నట్లు వారు చెప్పేవారని అన్నారు. ‘‘అసలు నాకు నిద్ర పట్టేది కాదు. నాపై నాకే అసహ్యం వేసేలా చేసేవారు’’ అని ఆయన అన్నారు.
అయితే, అలాంటి కన్వర్షన్ థెరపీలను తాము చేయమని యూసీకేజీ బీబీసీతో చెప్పింది.
‘‘సెక్సువాలిటీ లేదా జెండర్ అలైన్‌మెంట్ కోసం మేం స్ట్రాంగ్ ప్రేయర్స్ నిర్వహించబోం. అన్ని వర్గాల వారికీ మేం చర్చిల్లో స్వాగతం పలుకుతాం’’ అని వివరించింది.
బీబీసీ రికార్డు చేసిన స్ట్రాంగ్ ప్రేయర్స్ వీడియోలో బిషప్ జేమ్స్ మార్క్వెస్ మాట్లాడుతూ.. ‘‘దుష్టశక్తులు ఆవహించడంతో కొన్ని మానసిక సమస్యలు కూడా వస్తాయి. కొన్ని అనారోగ్యాలు ఆధ్యాత్మిక సమస్యల వల్లే వస్తాయి’’ అని చెప్పారు.
అండర్ కవర్ రిపోర్టర్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘‘డిప్రెషన్ కూడా ఆధ్యాత్మిక సమస్యే. దీని వెనుక కూడా దుష్టశక్తే ఉంటుంది’’ అని అన్నారు.
‘‘మూర్ఛ అనేది ఒక అనారోగ్యమని మనకు తెలుసు. కానీ, దీనికి కారణమయ్యేది కూడా దుష్టశక్తే. అందుకే ఇదొక ఆధ్మాత్మిక సమస్య అని మనం అర్థం చేసుకోవాలి’’ అని ఆయన అన్నారు.
అయితే, వైద్యులను సంప్రదించడం, వైద్య చికిత్సలకు ప్రత్యామ్నాయంగా ‘స్ట్రాంగ్ ప్రేయర్స్’ను తాము నిర్వహించబోమని యూసీకేజీ చెబుతోంది.
చర్చిని వదిలిపెట్టడం చాలా కష్టం అయ్యేలా చేస్తారని కొందరు మాజీ సభ్యులు బీబీసీతో చెప్పారు.
ఇలా యూసీకేజీని వదిలిపెట్టిన రేచల్ ప్రస్తుతం ఆ సంస్థతో పొంచివున్న ప్రమాదాలపై ప్రజలను హెచ్చరిస్తున్నారు.
‘చర్చిని వదిలిపెడితే, దుష్టశక్తి మళ్లీ ఆవహిస్తుందనేవారు’
‘‘నీకు అక్కడకు కూర్చొనే అసిస్టెంట్ గుర్తున్నారా? అని అడిగేవారు. చర్చిని వదిలిపెట్టడం వల్లే ఆమెకు విడాకులు అయ్యాయి. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది’’ అని వారు హెచ్చరించేవారని రేచల్ చెప్పారు.
ద్విచక్రవాహన ప్రమాదంలో మరణించిన ఒక మాజీ సభ్యుడి వీడియోను తనకు చూపిస్తూ బెదిరించేవారని షారన్ కూడా అన్నారు.
‘‘చర్చిని వదిలిపెడితే, నీకు అదే జరుగుతుంది.. దుష్టశక్తి మళ్లీ నిన్ను ఆవహిస్తుందని చెప్పేవారు’’ అని ఆమె అన్నారు.
బీబీసీ రహస్యంగా చిత్రీకరించిన వీడియోలో యూసీకేజీ బిషప్ అల్వరో లీమా తన ఫాలోయర్లతో మాట్లాడుతూ.. ‘‘ఒకసారి నేను చర్చికు రావడం ఆపేశాను. దీంతో మా అమ్మకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది’’ అని చెప్పారు.
‘‘నేను మళ్లీ చర్చికి రావడంతో ఆమె ఆరోగ్యం కుదుటపడింది’’అని ఆయన అన్నారు.
అయితే, ఎవరినీ తాము బెదిరించబోమని, తమ దగ్గరకు వచ్చేవారంతా స్వచ్ఛందంగానే వస్తారని బీబీసీతో యూసీకేజీ చెప్పింది.
ప్రస్తుతం తమ దగ్గరకు వస్తున్న చాలా మంది తాము చేస్తున్న మంచి పనుల గురించి ప్రశంసిస్తుంటారని యూసీకేజీ చెప్పింది. అయితే, బీబీసీతో మాట్లాడిన చాలా మంది మాజీ సభ్యులు మళ్లీ యూసీకేజీకి వెళ్లబోమని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీం కోర్టు తీర్పు... ఈ కేసు ఎలా మొదలైంది, ఈ నాలుగేళ్ళలో ఏం జరిగింది?
- గాజాలో ఆకలితో అలమటిస్తున్న జనం, సగం మందికి ఆహారం లేదన్న ఐక్యరాజ్యసమితి
- శ్రీకాకుళం: గార ఎస్బీఐ బ్రాంచి నుంచి 7 కిలోల బంగారం ఎలా మాయమైంది, తనఖా పెట్టిన బంగారం పోతే కస్టమర్లు ఏం చేయాలి?
- ఈ ఏడాది ప్రపంచంలో అత్యుత్తమ పర్యటక గ్రామాలు ఇవేనని ఎందుకు ప్రకటించారంటే...
- World War II : హిమాలయాల్లో కూలిన 600 అమెరికా యుద్ధ విమానాల శకలాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















