ది పోప్స్ ఎక్సార్సిస్ట్: 1.6 లక్షలమందికి భూత వైద్యం చేసిన ఫాదర్ అమోర్త్ గాబ్రియెల్ కథ

ఫొటో సోర్స్, Getty Images
గాబ్రియేల్ అమోర్త్ చిన్నతనంలో ఉండగా తన తల్లిదండ్రులతో కలిసి మోడెనాలోని చర్చిలో ఆదివారం క్యాథలిక్ ప్రార్థనా సమావేశాలకు హాజరయ్యేవారు.
ఈ నగరం ఇటలీ రాజధాని రోమ్ నుంచి 400 కి.మీ.ల దూరంలో ఉంది.
అయితే ఆయన ప్రార్థనపై దృష్టి పెట్టకుండా చిన్నపిల్లల అల్లరితో చర్చి చుట్టూ దాగుడుమూతలు ఆడేందుకు ఆసక్తి చూపేవారు.
అయితే, తన కొడుకు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ భూతవైద్యుల్లో ఒకరు అవుతారని గాబ్రియేల్ అమోర్త్ తల్లికి ఆ సమయంలో తెలియదు.
1,60,000 'భూతవైద్యం'లను నిర్వహించిన ఫాదర్ అమోర్త్ అనేక పుస్తకాలను కూడా రచించారు.
ఆయన గురించి ఒక డాక్యుమెంటరీ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఒక హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాకు కూడా ఆయనే కథాంశం.
రస్సెల్ క్రో నటించిన ‘ది పోప్స్ ఎక్సార్సిస్ట్’ ఈ ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
ఈ చిత్రాన్ని ఫాదర్ అమోర్త్ రెండు పుస్తకాలైన ‘యాన్ ఎక్సార్సిస్ట్ టెల్స్ హిస్ స్టోరీ’, ‘యాన్ ఎక్సార్సిస్ట్: న్యూ స్టోరీస్’ ఆధారంగా రూపొందించారు.
అమోర్త్ 2016లో 91 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల వ్యాధితో కన్నుమూశారు.

ఫొటో సోర్స్, Getty Images
'భూత వైద్యుడిని కావాలనుకోలేదు'
గాబ్రియేల్ అమోర్త్ 1925 మే 1న జన్మించారు. యుక్తవయసులో ఉండగా రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలకు వ్యతిరేకంగా యుద్ధంలో పోరాడారు.
యుద్ధం జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఆయనకు పతకం కూడా లభించింది.
న్యాయశాస్త్రం, జర్నలిజంలో పట్టభద్రుడయ్యాక క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. అయితే, అందులో కొద్దికాలం పాటే కొనసాగారు.
ఆయన అప్పటికే తన కోసం ఒక మతపరమైన మిషన్‌ను నెలకొల్పారు.
ఫాదర్ అమోర్త్ 1954లో ప్రబోధకుడిగా నియమితులయ్యారు. 32 సంవత్సరాల తర్వాత భూతవైద్యం చేయడం ప్రారంభించారు.
భూతవైద్యుడిగా మారడం తన నిర్ణయం కాదని కూడా ఆయన చెప్పారు.
రోమ్ వికార్ జనరల్ కార్డినల్ ఉగో పొలెట్టి (1914-1997) అమోర్త్‌ను భూత వైద్యుడిగా నియమించారు.
కొంతమంది ప్రబోధకులకు భూతవైద్యం ప్రసాదించే అధికారం కార్డినల్ ఉగో పోలేట్టికి ఉంది.
1986లో ఒకరోజు ఉదయం కార్డినల్ పొలెట్టిని గాబ్రియేల్ అమోర్త్ కలుసుకున్నారు.
అప్పుడు కార్డినల్ పొలెట్టి 36 సంవత్సరాలుగా రోమ్ డియోసెస్‌లో భూతవైద్యునిగా పనిచేస్తున్న ఫాదర్ కాండిడో అమంటిని (1914-1992) పట్ల తనకున్న అభిమానం గురించి మాట్లాడారు.
ఫాదర్ అమంటినికి సాయం చేయడానికి కార్డినల్ పొలెట్టి తనను అక్కడికక్కడే భూతవైద్యునిగా చేశారని ఫాదర్ అమోర్త్ గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, PUBLIC DOMAIN
దెయ్యం పట్టిన సంకేతాలు ఎలా ఉంటాయి?
బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల తర్వాత అమోర్త్ క్యాథలిక్ మతంలో భూతవైద్యానికి సంబంధించిన 21 సూత్రాలను కంఠస్థం చేయడం ప్రారంభించారు.
దెయ్యం పట్టిందని నమ్మే వ్యక్తి నుంచి దెయ్యాలను వెళ్లగొట్టే పద్ధతి పాత, కొత్త నిబంధనలలో ప్రస్తావించారు.
అలాగే వాటికన్ 1999లో ఇటువంటి ఆచారాలపై తన మార్గదర్శకాలకు మార్పులు చేర్పులు చేసింది.
తన పుస్తకంలో అమోర్త్ "దెయ్యాలు పట్టుకున్నాయని చెప్పుకునే చాలామంది వ్యక్తులు నిజంగా వాటితో పోరాడరు.
వారిలో ఎక్కువ మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వ్యక్తిని ముందుగా మానసిక వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి.
మొదట నేను అతని సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటా" అని రాశారు.
కాథలిక్ సిద్ధాంతం ప్రకారం దెయ్యం పట్టడం ప్రధాన సంకేతాలలో ఒక వ్యక్తి తనకు తెలియని భాషలలో మాట్లాడటం, సంఘటనలు, అతనికి తెలియని వ్యక్తులు, అతని పరిమాణానికి మించిన శారీరక బలాన్ని ప్రదర్శించడంలాంటివి ఉంటాయి.
కానీ దెయ్యం పట్టడానికి అత్యంత తీవ్రమైన సంకేతం దేవుడి పవిత్రతను ద్వేషించడం.
చర్చి లేదా ఇతర మతపరమైన ప్రదేశం, రద్దీ లేని వాతావరణంలో భూతవైద్యం నిర్వహించాలని వాటికన్ సిఫార్సు చేస్తోంది.
బాధితుడు అనారోగ్యంతో ఉంటే, వారి ఇంటి వద్ద ఆచారాన్ని నిర్వహించవచ్చు.
భద్రత దృష్ట్యా భూతవైద్యం చేసే వ్యక్తి సాధారణ పరిస్థితుల్లో ఉంటే కుర్చీలో కూర్చోవాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే స్ట్రెచర్‌లో కూర్చోవాలి.
భూతవైద్యం చేసే సమయంలో సామాన్యులు భూతవైద్యునికి సాయం చేస్తారు.
కొందరు ప్రార్థనలో సాయం చేస్తారు.
అలాగే భూతవైద్యులు ఎక్కువగా మాట్లాడరు.
"మీ పేరు ఏమిటి?, మీరు ఒంటరిగా ఉన్నారా?", "మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు?" అనే ప్రాథమిక ప్రశ్నలు అడుగుతుంటారు.
"పేరు చెప్పడాన్ని వారు వైఫల్యంగా భావిస్తుంటారు" అని ఫాదర్ అమోర్త్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భూతవైద్యుడిగా మొదటి అనుభవం
ఫాదర్ అమోర్త్ తన మొదటి భూతవైద్యాన్ని 1987 ఫిబ్రవరి 21న నిర్వహించారు.
25 ఏళ్ల రైతుకు దెయ్యం పట్టిందని తీసుకొచ్చారు. పాదర్ అమంటిని తన సహాయకుడైన అమోర్త్ వద్దకు పంపారు.
రోమ్‌లోని పొంటిఫికల్ యూనివర్సిటీ ఆంటోనిన్‌లో అమోర్త్ వైద్యం నిర్వహించారు.
బాధిత వ్యక్తి ఆంగ్లంలో మాత్రమే మాట్లాడాడు. ఆ వ్యక్తి మొదట దైవదూషణ చేస్తూ అరవడం ప్రారంభించారు.
మరొక సందర్భంలో ఒక నిరక్షరాస్య మహిళ వింతగా ప్రవర్తిస్తుందంటే అమోర్త్ వద్దకు తీసుకొచ్చారు. అమోర్త్‌ను ఆ స్త్రీ తెలియని భాషలో తిట్టారు.
2016 ఏప్రిల్‌లో ది ఎక్సార్సిస్ట్ దర్శకుడు విలియం ఫ్రైడ్‌కిన్ ఫాదర్ అమోర్త్‌కు ఒక మెసేజ్ పంపారు. భూతవైద్యాన్ని రికార్డ్ చేయడానికి అనుమతి కోరారు.
అమోర్త్ మాట్లాడుతూ " ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. వారితో పాటు భూతవైద్యులను చేరువ చేసింది.’’ అన్నారు.
కొన్నిరోజుల తర్వాత 2016 మే 1న (అమోర్త్ మరణానికి 4 నెలల ముందు) అమోర్త్ భూతవైద్యాన్ని చిత్రీకరించడానికి క్రిస్టినా అనే ఇటాలియన్ ఆర్కిటెక్ట్‌కి అనుమతి ఇచ్చారు.
దీనిని మనం నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ 'ది డెవిల్ అండ్ ఫాదర్ అమోర్త్'లో చూడవచ్చు.
ఇవి కూడా చదవండి
- గాడిద, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? ఇవి తాగితే ఆటిజం, డయాబెటిస్ తగ్గుతాయా
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














