పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, తన్వీర్ మాలిక్
- హోదా, పాత్రికేయులు, పాకిస్తాన్
పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం చరిత్రాత్మక స్థాయిలో లాభాల మోత మోగిస్తోంది. వరుసగా కొన్ని వారాల నుంచి స్టాక్ మార్కెట్ పెరుగుతుండటంతో రోజూ ఇండెక్స్ సరికొత్త స్థాయులను అందుకుంటోంది.
గత ట్రేడింగ్ వారంలో చివరి రోజు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 65 వేల, 66 వేల పాయింట్ల స్థాయులను అధిగమించింది. చరిత్రలోనే తొలిసారి అత్యధిక గరిష్ట స్థాయి 66 వేల 223 వద్ద ముగిసింది.
అక్టోబర్ మధ్య నుంచే స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ ప్రారంభమైంది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 50 వేల పాయింట్ల వద్ద ఉంది. కానీ, రెండు నెలల వ్యవధిలోనే ఈ ఇండెక్స్ రికార్డు స్థాయిలో 16 వేల పాయింట్లు పెరిగింది.
పాకిస్తాన్ ఆర్థిక సూచికలలో మెరుగుదల కనిపిస్తుండటంతో అక్టోబర్ నుంచే స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
పాకిస్తాన్‌కు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)కి మధ్య స్టాఫ్ లెవల్ అగ్రిమెంట్‌లో పాకిస్తాన్‌కు 70 కోట్ల డాలర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ఆర్థిక రంగానికి ఈ నిధులు చాలా కీలకం.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో స్టాక్ మార్కెట్లో ఈ వృద్ధి కొనసాగడం అత్యంత ముఖ్యం.
ఈ దేశ పరిశ్రమలు ప్రస్తుతం తీవ్ర ఇరకాటంలో కూరుకుపోయి ఉన్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరగడంతో ఈ వారం కూడా సమస్యలు మరింత క్లిష్టంగా మారాయి.
పాకిస్తాన్‌లో పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార వస్తువుల ధరలు జీవనకాల గరిష్ఠ స్థాయులకు చేరుకున్నాయి.
అయితే, పాకిస్తానీ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని రికార్డు స్థాయిలో పెరుగుతున్న స్టాక్ మార్కెట్ ప్రతిబింబిస్తుందా? సామాన్య పాకిస్తానీలు కూడా నిజంగానే లబ్ది పొందుతున్నారా? భవిష్యత్‌లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? అనేవి ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పెరుగుదల కొనసాగుతుందా?
గడిచిన వారంలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 4 వేల 532 పాయింట్లు పెరిగింది. ఇదే రికార్డు స్థాయి. ఆర్థిక అంశాలతో నిజంగానే మార్కెట్ రికార్డు స్థాయిలో పెరుగుతుందా లేదా ఊహాగానాల వాణిజ్యం ద్వారా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయులను అందుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
దీని గురించి ఆర్థిక నిపుణులు సనా తౌఫిక్ బీబీసీతో మాట్లాడారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఈ ట్రెండ్‌ను గమనిస్తే.. ఇది ఎప్పుడైనా పేలే బబుల్ లాంటిది కాదని సనా తౌఫిక్ చెప్పారు. భవిష్యత్‌లో కూడా ఇదే పెరుగుదల కనిపించనుందన్నారు.
ఎంతో కాలంగా పాకిస్తాన్ స్టాక్ ఇండెక్స్ ఈ పెరుగుదల కోసం వేచిచూసిందని, దేశంలో బలహీనమైన ఆర్థిక పరిస్థితులు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని చెప్పారు. ఆ సమయంలో మార్కెట్‌లో షేర్ల ధరలు విపరీతంగా పడిపోయాయని అన్నారు.
75 వేల పాయింట్ల వరకు పెరగనున్న ఇండెక్స్
మార్కెట్ పెరుగుదల వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు, బ్యాంకు ఆఫ్ పంజాబ్ ప్రముఖ ఆర్థికవేత్త శ్యామ్ అలి కూడా అంగీకరించారు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటూ ఉండటంతో స్టాక్ మార్కెట్ పెరుగుతుందని చెప్పారు.
ఐఎంఎఫ్, పాకిస్తాన్ మధ్య జరిగిన స్టాఫ్ లెవల్ అగ్రిమెంట్ కూడా మార్కెట్‌కు సహకరిస్తుందని తెలిపారు. పాకిస్తాన్‌లో కొన్ని ఆర్థిక సూచికలు మెరుగుపడటంతో స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయన్నది నిజమని చెప్పారు.
స్టాక్ మార్కెట్ మరింత పెరుగుతుందని ఆర్థిక విషయాల నిపుణులు సమీవుల్లా తారిఖ్ చెప్పారు. రాబోయే నెలల్లో మార్కెట్ ఇండెక్స్ 70 వేల నుంచి 75 వేల పాయింట్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టాక్ మార్కెట్ పెరుగుదలకు కారణాలు?
ఇటీవల వారాల్లో పాకిస్తాన్ ఆర్థిక సూచికలు కొన్ని స్వల్పంగా మెరుగుపడ్డాయి. కరెంట్ అకౌంట్ లోటు తగ్గింది. మారకపు రేటు కాస్త పెరిగింది. కానీ, పాకిస్తాన్‌లో పారిశ్రామిక అభివృద్ధి మాత్రం ఇంకా సంక్షోభంలోనే ఉంది. ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ గురించి స్టాక్ మార్కెట్ ఏం వెల్లడిస్తుంది అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, భవిష్యత్‌లో కూడా ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉంటాయని స్టాక్ మార్కెట్ ప్రధానంగా సూచిస్తుందని సనా తౌఫిక్ చెప్పారు.
‘‘ఒకవేళ మీరు చూస్తే, ఆర్థిక వ్యవస్థలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. దీనిలో ప్రధానంగా మారకపు రేటు బలపడింది. దేశంలో ఫారిన్ ఫైనాన్సింగ్ రంగంలో కొంత పెరుగుదల ఉంది. దేశీయ కరెంట్ అకౌంట్ లోటు తగ్గింది’’ అని సనా తౌఫిక్ అన్నారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మార్కెట్ సూచిస్తున్నప్పటికీ, ద్రవ్యోల్బణం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా ఉన్నది నిజమని ఆయన నొక్కి చెప్పారు. పాకిస్తానీ ప్రజలకు ఇది అత్యంత ఇబ్బందికర అంశమని అన్నారు.
‘‘ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదు. కానీ, ప్రస్తుతం దానిలో కొంత మెరుగుపడింది. ఎందుకంటే, గత రెండు సంవత్సరాలుగా కొనసాగిన ఆర్థిక సంక్షోభం తగ్గింది. స్టాక్ మార్కెట్ దీన్ని ప్రతిబింబిస్తోంది. ఇది సానుకూల సంకేతాలను ఇస్తోంది’’ అని శ్యామ్ అలీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్కెట్ పెరుగుదల వల్ల సామాన్య ప్రజలకు లాభమేంటి?
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణ రేటు 30 శాతం. కరెంట్, గ్యాస్ బిల్లులు కట్టలేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆహార ధరలు కూడా పైపైనే ఉన్నాయి.
మార్కెట్ పెరుగుదల నుంచి సామాన్య ప్రజలకు నేరుగా ఎలాంటి ప్రయోజనం చేకూరదని శ్యామ్ అలీ అన్నారు. కానీ, కంపెనీలకు మంచి ఆదాయం వస్తే, దాన్ని బోనస్ షేర్లు, లాభాల రూపంలో పంచుతారు. వీటిని సామాన్య ప్రజలు కొనుగోలు చేస్తే.. ప్రయోజనం పొందవచ్చని శ్యామ్ అలీ చెప్పారు.
‘‘కంపెనీలు మంచి లాభాలు పొందితే, భవిష్యత్‌లో మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టి ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగుపడుతుంది. ఇది సామాన్య ప్రజలకు మరో రూపంలో లాభాన్ని చేకూరుస్తుంది’’ అని శ్యామ్ అలీ తెలిపారు.
కానీ, ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పెరుగుదల వల్ల మాత్రం సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని శ్యామ్ అలీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌లో మూలధన పెట్టుబడిదారులు సుమారు రెండున్నర లక్షల మంది ఉన్నారని సనా తౌఫిక్ చెప్పారు. దేశ జనాభా 22 కోట్లలో వీరు పెద్ద సంఖ్యేమీ కాదు.
అంటే, పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ పెరుగుదల సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులపై నేరుగా ఎలాంటి ప్రభావం చూపదన్నారు. కానీ, ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్ మంచి ప్రదర్శనను కనబర్చి, ఆర్థిక పెరుగుదలను సూచిస్తే.. భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతం ఆ తగ్గింపు సూచనలేమీ కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ రంగాలు పెరుగుతున్నాయి?
వివిధ రంగాలకు చెందిన కంపెనీల షేర్ల ధరలు పెరుగుతుండంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ చరిత్రాత్మక స్థాయులను అందుకుంటోంది. దీనిలో కొన్ని రంగాలు మంచి పనితీరును కనబరుస్తున్నాయి.
బ్యాంకు షేర్లు బాగా పెరుగుతున్నాయని సనా చెప్పారు. దేశంలో వడ్డీరేట్లు అత్యధికంగా ఉండటంతో బ్యాంకులు బాగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాయని, దీంతో వాటి షేర్ల ధరలు పెరుగుతున్నాయని అన్నారు.
చమురు, గ్యాస్ రంగాలలో పనిచేసే కంపెనీల షేర్ల ధరలు కూడా ఇదే విధంగా పెరుగుతున్నాయని సనా చెప్పారు. చమురు ధరలు అత్యధికంగా ఉండటంతో, చమురు రంగానికి, రిఫైనరీలకు చెందిన షేర్లు అత్యంత గరిష్ఠ స్థాయుల్లో ట్రేడవుతున్నాయని తెలిపారు.
ప్రస్తుత వారంలో పలు రంగాలకు చెందిన కంపెనీల షేర్ల ధరల పెరుగుదలను చూస్తే.. కేవలం ఒక్క వారంలోనే 1704 శాతం వరకు బ్యాంకు షేర్ల ధరలు పెరిగాయి.
చమురు, గ్యాస్ రంగంలో పనిచేసే కంపెనీల షేర్ల ధరలు సుమారు వెయ్యి శాతం వరకు పెరిగాయి. రసాయనాలు, చమురు కంపెనీల షేర్ల ధరలు కూడా రికార్డు స్థాయిలో ఎగిశాయి.
దేశీయ మూలధన పెట్టుబడిదారుల నుంచి మాత్రమే కాక, విదేశీ మూలధన ఇన్వెస్టర్ల నుంచి కూడా కొనుగోళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. దీంతో, స్టాక్ మార్కెట్ చరిత్రాత్మక పెరుగుదలను నమోదు చేస్తోందని సనా తౌఫిక్ అన్నారు.
స్టాక్ మార్కెట్‌లో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులిద్దరూ పాలుపంచుకుంటున్నారని సనా తౌఫిక్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీం కోర్టు తీర్పు... ఈ కేసు ఎలా మొదలైంది, ఈ నాలుగేళ్ళలో ఏం జరిగింది?
- గాజాలో ఆకలితో అలమటిస్తున్న జనం, సగం మందికి ఆహారం లేదన్న ఐక్యరాజ్యసమితి
- శ్రీకాకుళం: గార ఎస్బీఐ బ్రాంచి నుంచి 7 కిలోల బంగారం ఎలా మాయమైంది, తనఖా పెట్టిన బంగారం పోతే కస్టమర్లు ఏం చేయాలి?
- ఈ ఏడాది ప్రపంచంలో అత్యుత్తమ పర్యటక గ్రామాలు ఇవేనని ఎందుకు ప్రకటించారంటే...
- World War II : హిమాలయాల్లో కూలిన 600 అమెరికా యుద్ధ విమానాల శకలాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














