గాజాలో ఆకలితో అలమటిస్తున్న జనం, సగం మందికి ఆహారం లేదన్న ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, ఫియోనా నిమోని
- హోదా, బీబీసీ న్యూస్
గాజా జనాభాలో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని, అక్కడ పోరాటాలు కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి సీనియర్ సహాయ అధికారి ఒకరు తెలిపారు.
''అవసరమైన సామగ్రిలో కొంతభాగం మాత్రమే గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశిస్తోంది, ప్రతీ 10 మందిలో 9 మందికి ఆహారం దొరకడం లేదు'' అని యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ స్కౌ అంటున్నారు.
గాజాలో పరిస్థితులు డెలివరీలను అసాధ్యం చేశాయని ఆయన చెప్పారు.
మరణమైనా, నొప్పి అయినా బాధాకరమే: ఇజ్రాయెల్
హమాస్‌ను నిర్మూలించడానికి, ఇజ్రాయెల్ బందీలను స్వదేశానికి తీసుకురావడానికి గాజాపై వైమానిక దాడులను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటోంది.
"పౌరుడికి మరణమైనా, నొప్పయినా బాధాకరమే, కానీ, మాకు ప్రత్యామ్నాయం లేదు" అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ శనివారం బీబీసీతో అన్నారు.
"గాజా స్ట్రిప్ లోపలికి వీలైనంత ఎక్కువ వెళ్లడానికి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం" అని ఆయన చెప్పారు.
"ఆర్మీ ఇంకొంచెం కఠినంగా వెళ్లాలి. ఎందుకంటే, ఉగ్రవాదులు లొంగిపోవడాన్ని చూస్తున్నాం, వారి నెట్‌వర్క్ కూలిపోతోందనడానికి సంకేతమది" అని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి సైనికులకు చెప్పడాన్ని చిత్రీకరించారు.
ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వం అత్యవసర చట్టాన్ని ఉపయోగించింది. ఇజ్రాయెల్‌కు రూ. 884 కోట్ల కంటే ఎక్కువ విలువైన 14,000 రౌండ్ల ట్యాంక్ మందుగుండు సామగ్రిని విక్రయించడానికి ఈ చట్టం అధికారం ఇచ్చింది.

ఫొటో సోర్స్, Reuters
జనం ఆకలితో అలమటిస్తున్నారు: ఐరాస
అక్టోబరు 7 నుంచి గాజా అంతటా జనం కదలికలు తగ్గిపోయాయి, హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపారు, మరో 240 మందిని బందీలుగా తీసుకెళ్లారు.
దీంతో గాజా నుంచి ఇజ్రాయెల్ రాకపోకలను ఆపేసింది. వైమానిక దాడులను ప్రారంభించింది, గాజా ప్రజలు ఎక్కువగా ఆధారపడే సహాయ పంపిణీలను పరిమితం చేసింది.
ఏడు వేలకు పైగా పిల్లలతో సహా 17,700 మందికి పైగా గాజా ప్రజలను ఇజ్రాయెల్ హతమార్చిందని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
ఇప్పటివరకైతే ఈజిప్టు సరిహద్దులో ఉన్న రఫా క్రాసింగ్ మాత్రమే తెరిచారు, దీంతో గాజాకు పరిమితంగానే సహాయం అందుతోంది.
సహాయక ట్రక్కుల తనిఖీ కోసం కొద్ది రోజులు కెరెమ్ షాలోమ్ క్రాసింగ్‌ను తెరవడానికి వారం కిందట ఇజ్రాయెల్ అంగీకరించింది. అనంతరం ఆ ట్రక్కులు గాజాలోకి వెళ్లడానికి రఫాకు చేరుకుంటాయి.
ఈ వారం కార్ల్ స్కౌ, ఆయన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం బృందం గాజాలో పర్యటించింది. ప్రజల్లో భయం, గందరగోళం, నిరాశ చూశామంటున్నారు కార్ల్.
గిడ్డంగుల వద్ద గందరగోళం, ఆకలితో అలమటిస్తూ వేలాదిగా జనం పంపిణీ కేంద్రాల వద్ద ఎదురుచూడటం, ఖాళీ అయిన సూపర్ మార్కెట్లు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.
గతనెలలో అంతర్జాతీయ ఒత్తిడితో ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ చేసింది ఇజ్రాయెల్. ఆ సమయంలో గాజా స్ట్రిప్‌లోని బాధితులకు అవసరమైన సామగ్రి చేరింది.
అయితే ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉందని, దాన్ని తీర్చడానికి రెండో సరిహద్దు క్రాసింగ్ తెరవడం అవసరమని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అంటోంది.
కొన్ని ప్రాంతాల్లో ప్రతీ పది కుటుంబాలలో తొమ్మిది వరకు పగలు, రాత్రి ఎటువంటి ఆహారం లేకుండానే గడుపుతున్నారని కార్ల్ స్కౌ అంటున్నారు.
గాజాకు దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతానికి రెండు వైపులా ఇజ్రాయెల్ ట్యాంకులు చుట్టుముట్టడంతో అక్కడి ప్రజల పరిస్థితి భయంకరంగా ఉందని ఆయన చెప్పారు.
అన్నం ఒక్కటే తింటున్నా: డాక్టర్ అహ్మద్
ఆహారం కొరతపై డాక్టర్ అహ్మద్ మొఘ్రాబీ కన్నీళ్లు పెట్టుకున్నారు. అహ్మద్ నాజర్ ఆసుపత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ, కాలిన గాయాల విభాగం అధిపతి. నగరంలో మిగిలిన ఏకైక మెడికల్ ఫెసిలిటీ నాజర్ ఆసుపత్రి.
"నాకు మూడేళ్ల కూతురు ఉంది, నన్ను స్వీట్లు, కొన్ని యాపిల్స్ లేదా ఏవైనా కొన్ని పండ్లు కావాలని అడుగుతుంటుంది. నేను ఇవ్వలేను, నిస్సహాయుడిని" అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"తిండి చాలడం లేదు, అన్నమే ఉంది, అదొక్కటే ఉందంటే నమ్ముతారా? రోజుకు ఒక్కసారే తింటున్నాం" అని మొఘ్రాబీ అన్నారు.
ఖాన్ యూనిస్ ప్రాంతం ఇటీవలి భారీ వైమానిక దాడులకు కేంద్రమైంది. అక్కడి నుంచి వస్తున్న క్షతగాత్రులకు నాజర్ ఆసుపత్రి సరిపోలేదని హాస్పిటల్ అధిపతి చెప్పారు.
మరోవైపు హమాస్ మిలిటెంట్లు ఖాన్ యూనిస్‌లో దాక్కున్నారని ఇజ్రాయెల్ అంటోంది. బహుశా వాళ్లు సొరంగాల్లో ఉంటారని, అందుకే ఇంటింటికి తిరుగుతూ పోరాడుతున్నట్లు తెలిపింది.

ఫొటో సోర్స్, REUTERS
రక్తపాతానికి వాషింగ్టన్‌దే బాధ్యత: పాలస్తీనా
గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది.
దీంతో యుద్ధ నేరాలలో అమెరికా కూడా భాగస్వామిగా ఉందని పాలస్తీనా అధ్యక్షుడు మొహమూద్ అబ్బాస్ శనివారం ఆరోపించారు.
భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో 13 దేశాలు కాల్పుల విరమణ తీర్మానానికి మద్దతుగా ఓటేశాయి. యూకే ఓటింగ్‌కు దూరంగా ఉంది. అయితే అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.
ఆక్రమణ దళాల (ఇజ్రాయెల్) చేతుల్లో గాజాలోని పాలస్తీనా పిల్లలు, మహిళలు, వృద్ధుల రక్తపాతానికి వాషింగ్టన్‌ది బాధ్యతని మొహమూద్ అబ్బాస్ అన్నారు.
కాగా, వీటోను ఉపయోగించడాన్ని ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి రాబర్ట్ వుడ్ సమర్థించుకున్నారు.
నిరంతరం ఇలాగే కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చేలా తీర్మానం ఉందని చెప్పారు, ఇది అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడిని పునరావృతం చేయగలదని రాబర్ట్ వుడ్ తెలిపారు.
భద్రతా మండలిలో అమెరికా తీసుకున్న 'సరైన వైఖరి'ని అభినందిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
కాగా, ఏడు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ వారం క్రితం ముగిసింది.
సంధి ప్రకారం జైళ్లలో ఉన్న 180 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయగా, బదులుగా 78 మంది బందీలను హమాస్ విడుదల చేసింది.
హమాస్ చేతిలో ఇంకా 100 మందికి పైగా బందీలు ఉన్నారు.
సహర్ బరూచ్ (25) అనే ఇజ్రాయెలీ బందీని చంపేశారని కిబ్బట్జ్‌తో పాటు బందీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
హమాస్ సాయుధులు శుక్రవారం ఒక వీడియోను విడుదల చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది. బందీలలో ఒకరిని విడిపించడానికి ఇజ్రాయెల్ మిలటరీ చేసిన ప్రయత్నం విఫలమైందని, రక్తపాతం జరిగిందని అందులో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- World War II : హిమాలయాల్లో కూలిన 600 అమెరికా యుద్ధ విమానాల శకలాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే...
- అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?
- బిగ్ బజార్: రిటైల్ కింగ్ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...
- మెహందీ పెట్టుకుంటే కొందరికి అలర్జీ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోరుట్ల: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














