సిమ్లా, మనాలి.. ఉత్తర భారతదేశంలో చలికాలంలో తప్పక చూడాల్సినవి ఏవేవి?

పర్యటనలో ఒక మహిళ

ఫొటో సోర్స్, Getty Images

మంచులో నడవడం, మంచుతో కప్పబడిన పర్వతాలను చూడటం, ఎవరికి ఇష్టం ఉండదు? వేసవి పర్యటకం మాదిరే వింటర్ టూరిజాన్నీ చాలా మంది పర్యటకులు ఇష్టపడతారు.

భారత్‌లో శీతాకాలపు పర్యటకానికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి అనువైన సమయం.

ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చలిగాలులు వీస్తాయి. తాజాగా కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో మంచు వర్షం కురుస్తోంది.

పని ఒత్తిడుల నుంచి విరామం తీసుకొని కుటుంబం, స్నేహితులతో టూర్‌కు వెళ్లాలని చాలా మంది అనుకొంటుంటారు.

మరి, ఈ చలికాలంలో ఉత్తర భారతదేశంలో చూడదగిన ప్రదేశాలు ఏమిటి? అక్కడికి ఎలా వెళ్లాలి?

శ్రీనగర్

ఫొటో సోర్స్, Getty Images

శ్రీనగర్

భారత్‌లో మంచు ప్రదేశం అనగానే మనకు గుర్తుకొచ్చేది కశ్మీర్. సీతారామం(2022), ఖుషీ(2023),ఇతర సినిమాల్లో కశ్మీర్‌ని తెరపై చూసిన క్షణంలోనే ఆ వాతావరణంపై ప్రేమ కలుగుతుంటుంది.

మంచు ప్రేమికులు తప్పక చూడవలసిన ప్రదేశాలలో కశ్మీర్‌లోని శ్రీనగర్ ఒకటి. తూర్పు వెనిస్‌గా పిలుచుకునే శ్రీనగర్‌లో చష్మే షాహీ గార్డెన్, నిగీన్ లేక్, దాల్ లేక్, దౌలత్ పార్కు వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి.

గుల్మార్గ్

హిమపాతాన్ని ఆస్వాదించాలనుకునే వారు చూడాల్సిన మరో ప్రదేశం శ్రీనగర్ నుంచి 60 కి.మీ. దూరంలో ఉండే గుల్మార్గ్.

గుల్మార్గ్- గడ్డకట్టిన సరస్సులు, మంచుతో కప్పబడిన ప్రకృతి దృశ్యం, హిమాలయాలు చూడటానికి పర్యటకులు ఇష్టపడే ప్రదేశం.

ఇక్కడి గుల్మార్గ్ గొండోలాలోని కేబుల్ కార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్ సర్వీస్‌లలో ఒకటి. స్కీయింగ్ చేయాలనుకునే వారికి ఈ ప్రాంతం మంచి అనుభూతినిస్తుంది.

ఇక్కడ శీతాకాలంలో మంచు కురుస్తుంటుంది కాబట్టి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వేల మంది పర్యటకులు ఇక్కడకు వస్తుంటారు.

మనాలి

ఫొటో సోర్స్, Getty Images

మనాలి

హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి ఎత్తైన మంచు పర్వతాలు, లోయలతో పర్యటకులకు అనుభూతిని పంచే ప్రాంతం.

శీతాకాలంలో మనాలి, దాని సమీపంలోని షోలాంగ్ వ్యాలీ, రోహ్‌తంగ్ పాస్‌లలో హిమపాతం కురుస్తుంటుంది. అయితే, రోహ్‌తంగ్ పాస్ చలికాలంలో మూసివేస్తారు.

మీరు సాహస ప్రియులైతే మనాలిలో స్కీయింగ్, ట్రెకింగ్, బోటింగ్, పారాగ్లైడింగ్, ఎయిర్ బెలూన్ రైడ్ వంటివి ఆస్వాదించవచ్చు.

సిమ్లా

లిస్టులో సిమ్లా లేకుండా మనం వింటర్ టూర్ ప్లాన్ చేయలేం. బ్రిటిష్ పాలనలో వేసవి రాజధానిగా సిమ్లా ఉండేది. ఉత్తర భారతదేశంలో ప్రధాన పర్యటక కేంద్రం సిమ్లా.

శీతాకాలంలో పర్వతాలు, రోడ్లు, దుకాణాలు మంచుతో కప్పబడి తెల్లటి దుస్తులు ధరించినట్లు కనిపిస్తాయి.

వీడియో క్యాప్షన్, ఉత్తరాదిన శీతాకాలంలో తప్పక చూడాల్సిన ప్రాంతాలు ఏవి?

తీర్థన్ లోయ

నగర జీవితం నుంచి ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వారికి హిమాచల్‌లోని తీర్థన్ వ్యాలీ చక్కటి ప్రదేశం.

కులు జిల్లాలోని తీర్థన్ వ్యాలీ ప్రకృతి సౌందర్యం, ప్రశాంతమైన వాతావరణం, దట్టమైన అడవులు, సుసంపన్నమైన జీవవైవిధ్యానికి ప్రసిద్ధి.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన హిమాలయన్ నేషనల్ పార్క్, తీర్థన్ లోయకు సమీపంలో ఉంటుంది.

చలికాలంలో 'జలోరీ పాస్' మార్గం మూసివేస్తారు, కాబట్టి మీరు పుండార్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది, అక్కడి నుంచి కారులో తీర్థన్ వ్యాలీకి వెళ్లవచ్చు.

రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే సుందర్ నగర్ మార్గం ద్వారా తీర్థన్ లోయ చేరుకోవచ్చు.

పర్యాటకం

ఫొటో సోర్స్, Getty Images

ఔలి

ఉత్తరాఖండ్‌లోని ఔలి అనే చిన్న పట్టణం స్కీయింగ్‌కు ప్రసిద్ధి. శీతాకాలంలో అక్కడ సాహస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

ఇక్కడి శంఖాకార అడవులు, మంచు క్షేత్రాలు సందర్శకులకు మంచి అనుభూతిని అందిస్తాయి. మీరు స్కీయింగ్ ఔత్సాహికులైతే జనవరి, మార్చి మధ్య ఔలి వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

ఔలితో పాటు ముస్సోరీ, నైనిటాల్ ప్రాంతాలలో జనవరిలో ఎక్కువగా మంచు కురుస్తుంది కాబట్టి అప్పుడు వెళ్లడం బెటర్.

హిమపాతం దాటి చూస్తే, ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ, రాజస్థాన్‌లోని జైసల్మీర్ వంటి ప్రదేశాలు కూడా శీతాకాలపు పర్యటకానికి అనువైన ప్రదేశాలు.

ఖజ్జియర్

లిటిల్ స్విట్జర్లాండ్ అని పిలుచుకునే ఖజ్జియర్ ప్రసిద్ధ పర్యటక ప్రాంతమైన డల్హౌసీ నుంచి 24 కి.మీ. దూరంలో ఉంటుంది.

ఇక్కడి ఖజ్జి నాగ దేవాలయం ప్రసిద్ధి చెందింది. పర్యటకులు ఈ ప్రాంతంలోని పైన్ చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

డల్హౌసీని సందర్శించి, పురాతన చర్చిలు, సుందరమైన దృశ్యాలను ఆస్వాదించొచ్చు.

పర్యాటక ప్రాంతాలు

ఫొటో సోర్స్, Getty Images

చౌకగా ప్రయాణం చేయడం ఎలా?

ఒంటరిగా ప్రయాణించడం కంటే ఎక్కువ మంది కలిసి ప్రయాణించడం వల్ల ఖర్చులు తగ్గుతాయని పణిక్కర్ ట్రావెల్స్ డైరెక్టర్ పార్వతి పణిక్కర్ అంటున్నారు.

ఈ సంస్థ 56 సంవత్సరాలకు పైగా సేవలను అందిస్తోంది.

“ఉత్తర రాష్ట్రాలకు టూరిజం ఎక్కువగా దిల్లీ నుంచే మొదలవుతుంది. మీరు గ్రూపుగా వెళితే వ్యక్తుల సంఖ్యను బట్టి ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. ఒంటరిగా ప్రయాణించాలనుకునే వారు కొంచెం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది'' అని తెలిపారు.

“గదులు డబుల్ షేరింగ్ లేదా ట్రిపుల్ షేరింగ్ తీసుకుంటే ఖర్చులను మరింత తగ్గించవచ్చు. కొన్ని ప్రదేశాలకు ప్రభుత్వ రవాణాను ఉపయోగిస్తే, ఇంకాస్త ఖర్చు తగ్గించుకోవచ్చు" అని పార్వతి చెప్పారు.

పర్యాటక ప్రాంతాలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ జాగ్రత్తలు తీసుకోండి

మొదటిసారి శీతాకాలపు ట్రెక్కింగ్ చేసేవారు కింది విషయాలను గుర్తుంచుకోవాలని పార్వతి సూచిస్తున్నారు.

చలిని తట్టుకోలేనివారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

చల్లని వాతావరణానికి తగ్గట్లు బట్టలు, బూట్లు తీసుకువెళ్లండి. వాటిని పర్యటక ప్రదేశంలో కొనొచ్చనే ఉదాశీనతలో ఉండకండి.

అవసరమైన ఔషధాలు దగ్గర ఉంచుకోవడం మంచిది.

పర్వతాల్లో పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గే అవకాశం ఉంది. అందువల్ల, ఆస్తమా ఉన్నవారు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.

మీరు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కాకుండా సొంతంగా వెళ్తున్నట్లయితే, గమ్యస్థానం గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

సొంతంగా వెళ్లడం లేదా టూర్ సర్వీస్ ద్వారా వెళ్లడంలో ఏది బెటర్ అని అడిగితే, అది వారి ప్రాథమ్యాలపై ఆధారపడి ఉంటుందని పార్వతి తెలిపారు.

‘‘ఒంటరిగా ప్రయాణించిన అనుభవం ఉన్నవారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇబ్బంది ఉండదు. తక్కువ ఖర్చుతో ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఒంటరి ప్రయాణం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అయితే మొదటిసారిగా వచ్చే టూరిస్టులు సేవా సంస్థల ద్వారా వెళ్లడం సురక్షితమైనది, అది మరింత పొదుపుగా ఉంటుంది'' అని పార్వతి అన్నారు.

అలాగే “స్థానిక భాష తెలియకపోతే పర్యటక ప్రదేశాల్లో కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గైడ్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. రవాణా, ఆహారం తదితరాలకు ఎక్కువ చెల్లించకుండా జాగ్రత్త పడొచ్చు. పర్యటనలను ఆస్వాదించవచ్చు'' అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)