కశ్మీర్ ఆపిల్‌కు వచ్చిన కష్టాలేంటి?

ఆపిల్ పండ్ల తోటల పెంపకందారులు

ఫొటో సోర్స్, UMER ASIF

ఫొటో క్యాప్షన్, అనేక సవాళ్ల కారణంగా కశ్మీర్‌లోని ఆపిల్ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది
    • రచయిత, అకీబ్ జావేద్
    • హోదా, శ్రీనగర్, కశ్మీర్

పుల్వామా జిల్లాలోని వందలాది మంది ఆపిల్ రైతులు, పండ్ల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్లలో తమ పంటను నిల్వ చేశారు.

వ్యాపారులు వచ్చి తమ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారనే ఆశతో వారు పండ్ల మార్కెట్‌కు వచ్చారు.

ఈ ఏడాది దిగుబడి అయిన ఆపిల్ పండ్ల నాణ్యత మెరుగ్గా లేకపోవడంతో పంట తక్కువ ధర పలుకుతుందేమో అని ఆ రైతులు ఆందోళనలో ఉన్నారు.

భారత్‌లోని కశ్మీర్ రకరకాల ఆపిల్‌ పండ్లకు ప్రసిద్ధి. కానీ, పండ్ల మీద ఫంగస్ దాడి, వాతావరణ మార్పుల ప్రభావం, ఆర్థిక కష్టాల వంటి సవాళ్ల కారణంగా ఆపిల్ పండ్ల పరిశ్రమ సంక్షోభంలో పడింది.

రంగు, నాణ్యత, పరిమాణం ఆధారంగా ఆపిల్ పండ్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు.

ఏ కేటగిరీ పండ్లు నాణ్యమైనవి కాగా, ఫంగస్ కారణంగా దెబ్బతిన్న పండ్లను బీ, సీ కేటగిరీలుగా విడగొట్టారు. సీ కంటే బీ కేటగిరీ పండ్లు మెరుగైనవి.

‘‘ఈ ఏడాది ఆపిల్ ఉత్పత్తిలో దాదాపు 40 శాతం సీ కేటగిరీ పండ్లు ఉన్నాయి’’ అని పుల్వామాకు చెందిన ఒక పండ్ల తోటల పెంపకందారుడు గులామ్ నబీ మీర్ అన్నారు.

ఆపిల్, వాల్‌నట్, ఆల్మండ్ సాగుతో ఈ రీజియన్‌లోని 23 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని జమ్మూకశ్మీర్ ఉద్యానవన శాఖ తెలిపింది.

హిమాలయ ప్రాంతాల్లోని పండ్ల తోటల నుంచి ఏటా 20 లక్షల టన్నులకు పైగా ఎగుమతులు జరుగుతాయి. దాదాపు 12 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ ప్రాంతంలో పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయానికి ఇది దాదాపు రెట్టింపు అని బీబీసీతో శ్రీనగర్‌కు చెందిన స్వతంత్ర ఆర్థిక నిపుణుడు ఇజాబ్ అయోబ్ చెప్పారు.

కానీ, అసాధారణ వాతావరణ పరిస్థితులు ప్రమాద ఘంటికలు మోగించడం ప్రారంభించాయి.

‘‘ఏప్రిల్-మే నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటకు తెగులు సోకింది. కొందరు రైతులు పురుగు మందులు పిచికారీ చేసినప్పటికీ వర్షం కారణంగా అది తుడిచిపెట్టుకుపోయింది’’ అని అబ్దుల్లా గఫర్ ఖాజీ అన్నారు.

విపరీత వాతావరణ పరిస్థితులతో పండ్ల పరిమాణం, నాణ్యతపై ప్రభావం పడుతుందని షేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ సీనియర్ సైంటిస్ట్, డాక్టర్ తారిక్ రసూల్ రాథర్ అన్నారు.

ఆపిల్ పండ్లు

ఫొటో సోర్స్, UMER ASIF

ఫొటో క్యాప్షన్, కశ్మీర్ పర్యటక రంగం ద్వారా సమకూరే ఆదాయం కంటే ఆపిల్ వాణిజ్యంతో రెట్టింపు వస్తుందని నిపుణులు అంటున్నారు

వేసవి, వసంత రుతువులో తెగులు చూపే ప్రభావం ఆధారంగా ఆపిల్ నాణ్యతను బీ లేదా సీ గ్రేడ్‌లుగా విభజిస్తారు.

ఈ రీజియన్‌లో మునుపెన్నడూ ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితులను చూడలేదని కశ్మీర్‌లోని బుద్గాం జిల్లా చదూరా ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల రైతు గులామ్ మొహమ్మద్ భట్ అన్నారు.

‘‘మేలో కురిసిన వడగండ్లతో నా పంట నాశనం అయింది’’ అని ఆయన చెప్పారు.

ఆగస్టు, సెప్టెంబర్‌లో పొడి వాతావరణం కారణంగా ఏర్పడిన నీటి కొరత వల్ల ఆపిల్ పండ్ల రంగు తగ్గిపోయింది.

భట్ సాగు చేసే అయిదు ఎకరాల తోటలో సగానికిపైగా ఆపిల్ చెట్లకు తెగులు సోకింది.

కశ్మీర్ లోయలో గత ఏడేళ్లలో తరచుగా విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడటం పెరిగిపోయిందని జమ్మూకశ్మీర్ వాతావరణ విభాగం డేటా చూపిస్తోంది.

2010 నుంచి 2022 మధ్య జమ్మూకశ్మీర్‌లో విపరీత వాతావరణం కారణంగా 550 మందికి పైగా చనిపోయినట్లు ఆ డేటా తెలుపుతోంది.

కశ్మీర్‌లో 2021 జులై 18న 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత ఎనిమిదేళ్లలో జులై నెలలో ఈ స్థాయిలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు ఇవ్వడం ఇదే మొదటిసారి.

అలాగే ఇదే ఏడాది జనవరి నెలలో కశ్మీర్ లోయలో గత 30 ఏళ్లలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కశ్మీర్‌లోని స్వతంత్ర వెదర్ ఫోర్‌కాస్టర్ ఫైజాన్ ఆరిఫ్ కెంగ్ చెప్పినదాని ప్రకారం, ఈ రీజియన్‌లో మార్చి నుంచి ఏప్రిల్ మధ్యవరకు సాధారణం కంటే దాదాపు 12 డిగ్రీ సెల్సియస్‌ల అధిక ఉష్ణోగ్రతలతో పొడి వాతావరణం ఏర్పడింది. ఫలితంగా ఆపిల్ పంట త్వరగా పూతకు వచ్చింది. కానీ, ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జూన్ వరకు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

‘‘ఈ విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దెబ్బతింది’’ అని ఆయన చెప్పారు.

వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పంట రవాణా విషయంలోనూ రైతులకు సవాళ్లు ఎదురవుతున్నాయి.

శరదృతువులో పంట కోత మొదలవుతుంది. కానీ, శీతకాలంలో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై విరిగిపడే కొండచరియల కారణంగా మిగతా ప్రపంచంతో కశ్మీర్ లోయకు సంబంధాలు తెగిపోతాయి. కశ్మీర్ లోయను దేశంలోని ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే ఏకైక రహదారి ఇదే.

జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగి పడినప్పడు ఆపిల్ పండ్లను తీసుకెళ్లే వందలాది ట్రక్కులు రోజుల తరబడి నిలిచిపోవడం అక్కడ సర్వసాధారణం.

భారతీయ పండ్ల మార్కెట్లలో ఇరాన్ ఆపిల్‌ పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని దిల్లీకి చెందిన అజాద్‌పూర్ పండ్ల మార్కెట్‌లోని కశ్మీర్ ఆపిల్ మర్చంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు విజయ్ తైరా అన్నారు.

ఇది కశ్మీర్ ఆపిల్ మార్కెట్ షేర్‌, ధరను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

‘‘రెండు వారాల క్రితం ఒక కశ్మీర్ ఆపిల్ బాక్స్‌ రూ. 1000-1300 పలికింది. ఇప్పుడు 800 రూపాయలకే ఒక బాక్స్‌ను అమ్ముతున్నారు. ఇది ఉత్పత్తికి అయిన ఖర్చుకు కూడా సరిపోదు’’ అని కశ్మీర్ వ్యాలీ ఫ్రూట్ గ్రోవర్స్ కమ్ డీలర్ యూనియన్ (కేవీఎఫ్‌జీ) అధ్యక్షుడు అహ్మద్ బషీర్ చెప్పారు.

అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆపిల్ పండ్లపై 20 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా రైతుల్ని నిరాశ పరిచిందని ఆయన అన్నారు.

ఆపిల్

ఫొటో సోర్స్, UMER ASIF

ఫొటో క్యాప్షన్, విపరీత వాతావరణం కారణంగా ఆపిల్ పండ్ల పరిమాణం, నాణ్యతపై ప్రభావం పడుతుందని సీనియర్ సైంటిస్టులు అన్నారు

సంక్షోభాన్ని పరిష్కరించడంలో జోక్యం చేసుకోవాలంటూ కేవీఎఫ్‌జీ నవంబర్‌లో ప్రధాని మోదీకి లేఖ రాసింది.

ఈ సమస్యలను సమాఖ్య స్థాయిలోనే పరిష్కరించవచ్చని ఈ రీజియన్ ఉద్యానవనశాఖ విభాగం చెబుతోంది.

‘‘ఈ ఆందోళనలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాం. వారు మాత్రమే దీనిపై ఏదైనా చేయగలరు’’ అని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మంజూర్ అహ్మద్ మీర్ అన్నారు.

నకిలీ లేదా నాణ్యతలేని పురుగు మందులను అమ్మే డీలర్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని ఆపిల్ పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘‘ఈ పురుగు మందుల నాణ్యమైనవే అయితే, మా తోటలకు తెగులు తక్కువగా ఉండాలి కదా’’ అని భట్ అన్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకున్నామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ షఫీకా ఖాలిద్ చెప్పారు.

పురుగు మందుల పిచికారీ షెడ్యూల్‌కు సంబంధించిన సలహాలను రైతులు పట్టించుకోనప్పుడు సమస్యలు తలెత్తుతాయని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)