కె-డ్రామా: గే, లెస్బియన్, రివెంజ్ స్టోరీలతో ప్రేక్షకులకు షాక్ ఇస్తున్న ఈ కాలం కొరియా అమ్మాయిలు

ఫొటో సోర్స్, BAEK MI-KYOUNG
- రచయిత, వెబెకే వెనెమా, జూలీ యున్యుంగ్ లీ, సమంతా హాక్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ప్రస్తుతం చాలా కొరియన్ టీవీ సిరీస్‌లలో శక్తిమంతమైన, సంక్లిష్టమైన మహిళల పాత్రలు కనిపిస్తున్నాయి. సమాజం, మీడియాలో వస్తున్న మార్పులను ఇవి ప్రతిబింబిస్తున్నాయి.
చాలా కే-డ్రామాలను హీరోల తరహాలోనే ఇప్పుడు హీరోయిన్లు కూడా నడిపిస్తున్నారు. ఈ ఏడాది అతిపెద్ద హిట్లలో ఒకటైన ‘ద గ్లోరీ’లో ఒక మహిళ తనను చిత్రహింసలకు గురిచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటూ కనిపిస్తుంటారు. అలానే ‘ఎక్స్‌ట్రార్డినరీ వూ’లోనూ ఒక మహిళా లాయర్ చుట్టూ కథ నడుస్తుంది.
మొదట్లో కే-డ్రామాల్లో మహిళల పాత్రలు అంత ఆసక్తికరంగా ఉండేవి కాదు. కానీ, ఒకప్పుడు తప్పుగా భావించే సెక్స్ సీన్లు, బైసెక్సువల్ రిలేషన్‌షిప్‌లు కూడా ప్రస్తుతం చాలా సిరీస్‌లలో కనిపిస్తున్నాయి.
‘‘1990ల కొరియన్ డ్రామాల్లో ధనవంతుల వారసులు పేద యువతులను ప్రేమిస్తూ కనిపించేవారు’’ అని కొరియన్ స్క్రీన్‌రైటర్స్ అసోసియేషన్ వైస్ చైర్ హాంక్ యున్ మీ చెప్పారు.
‘బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్’, ‘వర్కింగ్ క్లాస్ గర్ల్స్’ లాంటి డ్రామాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ తరహా డ్రామాలను ‘క్యాండీ గర్ల్’ స్టైల్‌గా పిలిచేవారు. జపాన్ కార్టూన్ ‘క్యాండీ క్యాండీ’ నుంచి ఈ పేరు వచ్చింది. ఈ సిరీస్‌లో కష్టపడి పనిచేసే ఓ అనాథ యువతి రాకుమారుడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

కానీ, ప్రస్తుతం పరిస్థితి మారిందని హాంగ్ అన్నారు. ‘‘నేడు మహిళా పాత్రల్లో మార్పు వచ్చింది. చాలా పాత్రలు స్వతంత్రంగా ఉంటున్నాయి. మంచి మంచి వృత్తుల్లో ఉన్నట్లుగా మహిళలను చూపిస్తున్నారు. వివాహ బంధాల పేరుతో కళ్లెం వేయడం లేదు’’ అని ఆమె అన్నారు.
ఇప్పటికీ ధనవంతులు, శక్తిమంతమైన పాత్రలు డ్రామాల్లో కనిపిస్తున్నాయి. అయితే, ఆ పాత్రలు పురుషులకు మాత్రమే పరిమితం కావాల్సిన పనిలేదు. దీనికి ఉదాహరణగా ‘క్రాష్ ల్యాండ్ ఆన్ యూ’ను తీసుకోవచ్చు.
కొరియా పరిశ్రమ ప్రముఖుల్లో ఒకరైన నటి, గాయని ఉమ్ జంగ్-హ్వా స్పందిస్తూ.. ‘‘90ల్లో మహిళల చుట్టూ కథ తిరగడం చాలా అరుదు. నిజానికి అక్కడ మహిళల పాత్రలు చక్కని పురుషుల కోసం ఎదురుచూడటం వరకే పరిమితం అవుతూ కనిపిస్తాయి’’ అని అన్నారు.
‘‘నేడు చాలా మంచి, శక్తిమంతమైన మహిళల పాత్రలు తమ నచ్చినట్లుగా జీవించే రీతిలో చూపిస్తున్నారు. ఇలాంటి వయసులోనూ చక్కని మహిళల పాత్రలను పోషించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, SARAM ENTERTAINMENT
54 ఏళ్ల ఉమ్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘డాక్టర్ చా’ షూటింగ్‌లో ఉన్నారు. 20 ఏళ్లపాటు అన్ని బాధ్యతలనూ నిర్వర్తించినా తనను పట్టించుకోని కుటుంబాన్ని వదిలేసి వైద్య వృత్తిలో శిక్షణ తీసుకునే మధ్య వయసు మహిళ కథ ఇదీ.
‘‘తన కలలను నెరవేర్చుకోవాలని డాక్టర్ చా వెళ్తుంది. తల్లిగా తన కథ ఇక ముగిసింది. ఆమె ప్రయాణం అద్భుతమైనది, స్ఫూర్తి కూడా నింపుతుంది’’ అని ఉమ్ చెప్పారు.
తన కెరియర్ మొదట్లో ఇలా మధ్య తరగతి మహిళ స్వతంత్రంగా జీవించే పాత్ర ఆలోచన కూడా ఊహించుకోవడం కష్టమని ఆమె అన్నారు.
‘‘ఒకసారి మీరు 30ల వయసులోకి అడుగుపెడితే, ప్రధాన పాత్రలు రావడం కష్టం అవుతుంది. అదే 35 ఏళ్లు దాటితే, కుటుంబంలో తల్లి పాత్ర మాత్రమే దొరుకుతుంది. అద్భుతంగా కనిపించే మహిళలు కూడా వయసు వల్ల తెరకు దూరం అవుతుంటారు’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, NETFLIX
గత 50 ఏళ్లలో దక్షిణ కొరియాలో తలసరి జీడీపీ 400 డాలర్ల (రూ.33,000) నుంచి 35,000 డాలర్లు (రూ.29.17 లక్షలు)కు పెరగడంతో వచ్చిన మార్పులే మహిళల పాత్రలు మారడానికి కారణమని ఉమ్ భావిస్తున్నారు. ఈ అద్భుతమైన ఆర్థికాభివృద్ధితో సమాజంలో చాలా మార్పు వచ్చిందని, ఇదే మార్పు మహిళా పాత్రల్లోనూ కనిపిస్తోందని ఆమె అన్నారు.
‘‘కొరియా మహిళలు విద్యావంతులు. వీరికి పెళ్లి, పిల్లల కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి’’ అని స్క్రిప్ట్ రైటర్ హాంగ్ అన్నారు.
పస్తుతం జననాల రేటు అత్యల్పంగా ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. అయితే, మహిళల సమానత్వంలో ఇప్పటికీ దేశం వెనుకబడే ఉంది. కొరియాలో మగవారి వేతనంలో మూడో వంతు కంటే తక్కువే మహిళలకు ఇస్తుంటారు.
అయితే, ప్రస్తుతం తెరపై మాత్రం పురుషులతో మహిళలు సమానంగా కనిపిస్తున్నారు.
కేబుల్ చానెల్స్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ మరింత రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావడం కూడా ప్రస్తుతం పరిస్థితులు మారడానికి ఒక కారణమని ఫోర్బ్స్ కే-డ్రామా క్రిటిక్ జోవన్ మెక్‌డోనల్డ్ అన్నారు. 2016లో ఇక్కడ తొలిసారిగా కొరియన్ డ్రామ్ కింగ్డమ్‌లో నెట్‌ఫ్లిక్స్ పెట్టుబడులు పెట్టింది. ఇక్కడ మహిళలు ప్రధాన పాత్రల్లో వచ్చిన సిరీస్‌లో కింగ్డమ్ రెండోదిగా చెప్పుకోవచ్చు.
2019నాటికి కోర్టులు, రాజకీయాలు, చారిత్రక నేపథ్యమున్న మహిళా పాత్రలు నడిపించే డ్రామాలు మరిన్ని ఇక్కడ వచ్చాయి.
‘‘ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, సమస్యలకు పరిష్కారం చూపుతున్న మహిళలు, స్వతంత్రంగా జీవించే మహిళలు.. ఇలా చాలా మహిళా పాత్రలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి’’ అని మెక్‌డోనల్డ్ అన్నారు.
ఈ మార్పులకు కోవిడ్-19 లాక్‌డౌన్ మరింత ఊతం ఇచ్చింది. ఆ సమయంలో కే-డ్రామాలను చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
ఆ ఏడాది తను సమీక్షించిన కే-డ్రామాల్లో సగం వాటిలో మహిళల పాత్రలు శక్తిమంతమైనవి ఉన్నట్లు మెక్‌డోనల్డ్ చెప్పారు. అంటే మునుపటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి.
‘‘కొరియా సమాజంలో మార్పులు ఈ డ్రామాల్లో ప్రతిబింబిస్తున్నాయో లేదో తెలియదు. కానీ, ఇక్కడ మాత్రం మార్పు చాలా కనిపిస్తోంది’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, NETFLIX
ఫిమేల్ సూపర్‌హీరోలు
రచయిత బీక్ మీ-క్యుంగ్ కొరియన్ సిరీస్‌లకు కథలు రాస్తుంటారు. సమాజం తప్పుగా భావించే చాలా అంశాలను తన కథల్లో ఆమె స్పృశిస్తుంటారు.
‘‘ప్రతి కొత్త షోతో కొత్త సరిహద్దులను దాటేందుకు నేను ప్రయత్నిస్తుంటాను’’ అని ఆమె అన్నారు.
2021లో విమర్శకుల మన్ననలు అందుకున్న కే-డ్రామా ‘మైన్’లో ఆమె ఇద్దరు మహిళల మధ్య ప్రేమ కథను చూపించారు. కొరియన్ టీవీలో తొలి బైసెక్సువల్ స్టోరీ ఇదీ. దీనికి మంచి స్పందన వచ్చింది. అయితే, కొంత ఆగ్రహం కూడా వ్యక్తమైంది.
అయితే, మహిళలు ప్రధాన పాత్రల్లో వచ్చే కథలను తీసుకురావడం కూడా అంత తేలికేమీ కాదు. 2017లో బీక్ తీసుకొచ్చిన ‘ద లేడీ ఇన్ డిగ్నిటీ’ని బ్రాడ్‌కాస్టర్లు చాలాసార్లు ప్రసారం చేసేందుకు తిరస్కరించాయి.
‘‘ఇది ఇద్దరు మధ్యతరగతి మహిళల కథ, వాణిజ్యపరంగా దీనితో పెద్దగా ప్రయోజనం ఉండదు అని వారు భావించేవారు’’ అని ఆమె చెప్పారు.
అతీంద్రియ శక్తులను సంపాదించే మహిళ కథ స్ట్రాంగ్ గర్ల్ బాంగ్ సూన్‌తో పెద్ద హిట్ అందుకోవడంతో కొరియన్ బ్రాడ్‌కాస్టర్ జేటీబీసీ మొత్తానికి ‘లేడీ విత్ డిగ్నిటీ’ని తీసుకుంది.
అప్పుడే స్ట్రాంగ్ గర్ల్ బాంగ్ సూన్ బద్దలు కొట్టిన రికార్డులను లేడీ విత్ డిగ్నిటీ మరోసారి బద్దలుకొట్టి చూపించింది.
‘‘మొదట్లో ఆ షో వల్ల వ్యతిరేకత వచ్చింది. కానీ, అదృష్టవశాత్తు అది పెద్ద హిట్’’ అని బీక్ చెప్పారు.
‘‘ఆ డ్రామా తర్వాత మహిళల పాత్రలు మరింత ప్రధానంగా, శక్తిమంతంగా, స్వతంత్రంగా కనిపించడం మొదలైంది. అయితే, ఇంకా మార్పు రావాల్సింది చాలా ఉంది’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, NETFLIX
తన తాజా కెమెడీ సిరీస్ ‘స్ట్రాంగ్ గర్ల్ నామ్-సూన్’లో మరొక కొత్త అపోహను బద్దలు కొట్టేందుకు బీక్ ప్రయత్నించారు. అదే వృద్ధుల ప్రేమ.
‘‘కొరియన్ ప్రేక్షకులు రొమాంటిక్ కామెడీలను ఎక్కువగా చూస్తుంటారు. అయితే, ఎక్కువగా యువకుల ప్రేమ కథలే మనకు కనిపిస్తుంటాయి. కానీ, టీవీల ముందు కూర్చునే వారిలో ఎక్కువ మంది సీనియర్లు ఉంటారు’’ అని ఆమె చెప్పారు.
అయితే, వృద్ధుల ప్రేమ కథలను రాయొద్దని, వీటిని ఎవరూ చూడరని చాలా మంది తనకు చెప్పారని ఆమె అన్నారు.
‘‘వృద్ధ మహిళలకు కూడా తమ జీవితంలో ప్రేమించే హక్కు ఉంటుంది’’ అని బీక్ చెప్పారు.
ఆమె సృష్టించిన బామ్మ పాత్ర నామ్-సూన్‌ను 67 ఏళ్ల కిమ్ హే-సూక్ పోషించారు.
షోలో ఆ బామ్మ మాట్లాడుతూ ‘‘నేను కొరియన్ డ్రామాలను చూడటం మానేశాను. ఎందుకంటే వీటిలో కేవలం యువకుల ప్రేమనే చూపిస్తుంటారు’’ అని చెబుతారు. ‘‘సీనియర్లకు కూడా హృదయం ఉంటుంది. వారి శరీరం వదులై పోవచ్చు. కానీ, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది’’ అని ఆ పాత్ర అంటుంది.
‘‘ఇది ప్రపంచానికి నేను ఇవ్వాలనుకునే సందేశం’’ అని బీక్ అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
తొలి ఫిమేల్ జనరేషన్ సూపర్‌హీరో సిరీస్‌ను కూడా తీసుకురావాలని బీక్ భావిస్తున్నారు. అయితే, తమకున్న తక్కువ బడ్జెట్ పరిమితుల్లోనే దీన్ని తీసుకురావాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ‘‘మార్వెల్ కథలకు, నా కథలకు మధ్య చాలా తేడా ఉంటుంది’’ అని ఆమె నిట్టూర్చారు.
‘‘మహిళలు ప్రధాన పాత్రల్లో రాసే స్క్రిప్టులకు పెట్టుబడులు తీసుకురావడం చాలా కష్టం’’ అని హాంగ్ అన్నారు. ఆమె సినిమాలతోపాటు టీవీ కోసం కూడా పనిచేస్తుంటారు. ‘‘మహిళ ప్రధాన పాత్రలో కథ సిద్ధం చేస్తే, బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయం తలుచుకుంటే నాకు చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది’’ అని అన్నారు.
2016నాటి ఆమె తొలి సినిమా ‘మిస్సింగ్’లో ప్రధాన పాత్రలో కనిపించే వితంతువైన ఒక మహిళ అదృశ్యమైన తన కుమార్తె కోసం గాలిస్తుంటారు. ‘‘నా విషయంలో నేను గర్వంగా ఉన్నాను. ఎందుకంటే నేను మహిళలు ప్రధాన పాత్రల్లో కథలను తీసుకొస్తున్నాను’’ అని ఆమె చెప్పారు.
కరోనావైరస్ వ్యాప్తి సమయంలో కొరియా సినిమా పరిశ్రమ నష్టాలు మూటకట్టుకుంది. కానీ, కే-డ్రామా సిరీస్‌లను చూసే ప్రేక్షకుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో చాలా మంది సినీ ప్రముఖులు కే-డ్రామాల వైపు అడుగుపెట్టారు. దీంతో క్రమంగా కే-డ్రామా, సినిమాల మధ్య తేడా తగ్గింది.

ఫొటో సోర్స్, NETFLIX/LIM HYO SEON
కరోనావైరస్ మహమ్మారికి ముందు ఏడాదికి 80కిపైనే పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చేవి. కానీ, ఈ ఏడాది ఆ సంఖ్య ఆరుకు పడిపోయిందని హాంగ్ చెప్పారు. ‘‘సినిమా పరిశ్రమకు ఇది కాస్త బాధాకరమైన వార్తే. కానీ, కొరియన్ కంటెంట్‌కు ఇది మంచిదని నేను భావిస్తున్నాను’’ అని ఆమె అన్నారు.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి పెట్టుబడుల ప్రవాహంతోపాటు కథల్లో కొత్తకొత్త మార్పులు భవిష్యత్‌లోనూ కొనసాగే అవకాశముంది. నెట్‌ఫ్లిక్స్ కొత్తగా 2.5 బిలియన్ డాలర్లు (రూ.20.84 వేల కోట్లు) పెట్టుబడులను కొరియన్ డ్రామాలో పెట్టాలని భావిస్తోంది. 2022లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లలో 60 శాతం మంది ఏదో ఒక కొరియన్ డ్రామాను చూశారు. మరోవైపు డిస్నీ, అమెజాన్ ప్రైమ్, ఇతర సంస్థలు కూడా ఇదే మార్గంలో ముందుకు వెళ్తున్నాయి.
అయితే, కొత్త కథలను రాసేటప్పుడు ఇకపై బడ్జెట్ గురించి ఆలోచించాల్సి రాకపోవచ్చని హాంగ్ అన్నారు. ‘‘అయితే, స్క్విడ్ గేమ్ ఎఫెక్ట్‌తో మహిళా కథలను పక్కన పెట్టి యాక్షన్ డ్రామాలకు పెద్దపీట వేసే దిశగా మార్పులు రావచ్చు’’ అని కూడా ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘ప్రేక్షకుల కోసం మరింత ఎక్కువ యాక్షన్ కోరుకోవచ్చు. ఇది మహిళా రచయితలకు అంత మంచిది కాదు’’ అని ఆమె అన్నారు.
నెట్‌ఫ్లిక్స్ పెట్టుబడులు పెట్టుండకపోతే స్క్విడ్ గేమ్ లాంటి సిరీస్ తెరపైకి వచ్చుండకపోవచ్చని మెక్‌డోనల్డ్ అన్నారు. ఎందుకంటే అందులో హింస మరింత ఎక్కువని చెప్పారు.
కే-డ్రామాల్లో మార్పులను ఇప్పటికే స్పష్టంగా తాను చూడగలుగుతున్నట్లు ఆమె అన్నారు. ‘’14 ఏళ్ల నుంచీ నేను వీటిని చూస్తున్నాను. ఒకప్పుడు హింస తక్కువగా ఉండేది. సెక్స్ కూడా అంతే. పదో ఎపిసోడ్ వరకూ ముద్దు సీన్ కూడా వచ్చేది కాదు. కానీ, ప్రస్తుతం అలా కాదు’’ అని ఆమె అన్నారు.
అయితే, హింసలో మహిళలు కూడా ప్రస్తుతం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఉదాహరణకు ‘మై నేమ్’ను తీసుకోండి. ఇందులో ఓ పోలీసు కుమార్తె తన తండ్రి హత్యపై ప్రతీకారం తీర్చుకుంటుంది. దీనిలో చాలా హింస, సెక్స్ సీన్లు ఉన్నాయి.
కే-డ్రామాలు ఒకప్పుడు చాలా సంప్రదాయంగా ఉండేవి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ఇవి ఆకర్షించేవి.
‘‘ఇక్కడ మహిళలు స్వేచ్ఛగా సెక్స్ చేస్తున్నట్లు చూపించేవారు కాదు. కానీ, ప్రస్తుతం ఇది చాలా మారింది’’ అని మెక్‌డోనల్డ్ అన్నారు.
అయితే, భిన్న జెండర్లు, సెక్సువాలిటీని ఇక్కడ పాజిటివ్ కోణంలో చూపిస్తున్నారు.
హిట్ డ్రామా ‘ఇటావాన్ క్లాస్’లో ట్రాన్స్‌జెండర్ పాత్ర చాలా హుందాగా ఉంటుంది. ఇది కూడా కార్టూన్ నుంచే స్ఫూర్తి పొందిన కథ.
దీని కోసం తెర వెనుక పనిచేసిన వారిలో మిన్‌యంగ్ అలీసియా హాంగ్ కూడా ఒకరు. కకావో ఎంటర్‌టైన్మెంట్ ఎగ్జిక్యూటివ్ అయిన హాంగ్ స్పందిస్తూ.. ‘‘ఇలాంటి కథలను ఎంచుకునేటప్పుడు ఎవరినీ నొప్పించకుండా తీయాల్సి ఉంటుంది’’ అని ఆమె అన్నారు.
‘‘రొమాంటిక్ సన్నివేశాల విషయానికి వస్తే కొరియన్ డ్రామాల్లో మగవారి పాత్రలు కాస్త దూకుడుగా ఉంటాయి. ఇది ప్రపంచ ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా మేం చూస్తున్నాం’’ అని ఆమె చెప్పారు.
మగవారిలో పురుషాహంకారం ఉండాల్సిన అవసరంలేదని కే-డ్రామాలు, కే-పాప్ నిరూపించాయని అలీసియా హాంగ్ భావిస్తున్నారు. ‘‘సెన్సిటివ్‌గానూ ఉంటూనే మంచి పాత్రలను తీసుకురావచ్చు’’ అని ఆమె అన్నారు.
క్లాసిక్ కే-డ్రామాల్లో హీరోలు కాస్త అహంకారంతో కనిపించినప్పటికీ, తర్వాత నెమ్మదిగా ఏడ్వడం, తమ మనసులోని భావాలు చెప్పడం లాంటివి తనకు బాగా నచ్చుతాయని మెక్‌డోనల్డ్ అన్నారు.
‘‘కే-డ్రామాలకు మహిళలు ఎక్కువగా ఆకర్షితులు కావడానికి ఇదే ప్రధాన కారణం కావచ్చు. మొదట్లో కాస్త కఠినంగా ఉండేటప్పటికీ, నెమ్మదిగా ఆ పాత్రల్లో సున్నితత్వం కనిపిస్తుంది’’ అని చెప్పారు.
అయితే, ‘‘కొరియా డ్రామా మరింత మారిపోకూడదు. ఎందుకంటే అది కే-డ్రామాలా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారు’’ అని అన్నారు.
‘‘అదే సమయంలో స్త్రీల అభిరుచులేమిటో పురుషులు గుర్తించాలి. ఎందుకంటే శతాబ్దాల నుంచి పురుషుల అభిరుచులకు తగినట్లుగా మహిళలు మారుతూ వచ్చారు’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీం కోర్టు తీర్పు... ఈ కేసు ఎలా మొదలైంది, ఈ నాలుగేళ్ళలో ఏం జరిగింది?
- గాజాలో ఆకలితో అలమటిస్తున్న జనం, సగం మందికి ఆహారం లేదన్న ఐక్యరాజ్యసమితి
- శ్రీకాకుళం: గార ఎస్బీఐ బ్రాంచి నుంచి 7 కిలోల బంగారం ఎలా మాయమైంది, తనఖా పెట్టిన బంగారం పోతే కస్టమర్లు ఏం చేయాలి?
- ఈ ఏడాది ప్రపంచంలో అత్యుత్తమ పర్యటక గ్రామాలు ఇవేనని ఎందుకు ప్రకటించారంటే...
- World War II : హిమాలయాల్లో కూలిన 600 అమెరికా యుద్ధ విమానాల శకలాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















