నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్‌లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?

Nimisha Priya
    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ తమిళ్

ఓ హత్యకేసులో మరణ శిక్ష పడి యెమెన్ దేశంలోని జైలులో ఉన్న కేరళ నర్స్ నిమిష ప్రియ కేస్ ఇది. నిమిషను మరణ శిక్ష నుంచి బయటపడేసేందుకు ఆమె కుటుంబం పోరాడుతోంది.

అందులో భాగంగా.. యెమెన్‌లో హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందిస్తే ఆమె మరణ శిక్ష తప్పించుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఒకటి పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఈ కేసులో నిమిషను మరణ శిక్ష నుంచి తప్పించేందుకు పోరాడుతున్నావారు ఈ విషయంపై స్పందిస్తూ... ఇలాంటి వాదనల వల్ల యెమెన్‌లో ఎవరినైనా చంపేసినా డబ్బిచ్చి శిక్షలు తప్పించుకోవచ్చన్న భావన ఏర్పడుతుందని అంటున్నారు.

ఈ కేసులో డబ్బు కంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. అది.. హత్యకు గురైన వ్యక్తి కుటుంబసభ్యుల క్షమాపణ.

నిమిష విడుదలకు ప్రయత్నిస్తున్నవారు ఈ క్షమాభిక్ష కోసమే తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకే భారత్ నుంచి తామంతా యెమెన్ వెళ్తున్నామని చెప్తున్నారు.

నిమిష ప్రియ తల్లి ప్రేమ
ఫొటో క్యాప్షన్, నిమిష ప్రియ తల్లి ప్రేమ

మరణ శిక్ష తప్పించుకోవడానికి ఏకైక మార్గం

కేరళకు చెందిన 34 ఏళ్ల నిమిష ప్రియ అనే యెమెన్‌లో నర్స్‌గా పనిచేస్తుండేవారు. 2017లో యెమెన్‌కు చెందిన దలాల్ అబ్దో మహదీ హత్య కేసులో ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించడంతో ప్రస్తుతం ఆమె సెంట్రల్ జైలులో ఉన్నారు.

తన మరణ శిక్షను రద్దు చేయాలంటూ నిమిష ప్రియ చేసుకున్న అభ్యర్థనను యెమెన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ తిరస్కరించింది.

అయితే, యెమెన్‌లోని షరియా చట్టాల ప్రకారం మరణశిక్ష నుంచి బయటపడేందుకు నిమిషకు ఇంకో అవకాశం ఉంది. అది.. బాధిత కుటుంబం నుంచి క్షమాభిక్ష పొంది, వారికి పరిహారం చెల్లించడం.

నిమిషను మరణశిక్ష నుంచి తప్పించడానికి ఉన్న ఏకైక మార్గం అదే.

కానీ, యెమెన్‌లో రాజకీయ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఆ దేశం హౌతీ తిరుగుబాటుదారుల అధీనంలో ఉంది. హౌతీ తిరుగుబాటుదారులకు, యెమెన్ ప్రభుత్వానికి మధ్య చాలాకాలంగా యుద్ధం సాగుతోంది.

దేశాన్ని అధీనంలో ఉంచుకున్న హౌతీ తిరుగుబాటుదారులను భారత్ గుర్తించడం లేదు. ఈ కారణంగా భారతీయులు యెమెన్ వెళ్లడం ప్రమాదకరమని భారత ప్రభుత్వం భావిస్తోంది.

దాంతో నిమిష కుటుంబీకులు భారత్ నుంచి యెమెన్ వెళ్లడానికి మార్గం దొరకలేదు.

దీనిపై నిమిష తల్లి గతంలో ‘బీబీసీ’తో మాట్లాడినప్పుడు ‘‘నేను యెమెన్ వెళ్లి బాధిత కుటుంబాన్ని కలిసి క్షమించమని అడుగుతాను. నా కూతురిని క్షమించి నా ప్రాణం తీసుకోమని కోరుతాను’ అన్నారు.

అయితే, నిమిష కుటుంబీకులు యెమెన్ వెళ్తే వారి రక్షణ బాధ్యత చూడడానికి అక్కడ భారత్‌కు దౌత్య వ్యవస్థ ఏమీ లేకపోవడంతో అధికారులు నిరాకరించారు.

దీంతో నిమిష తల్లి ప్రేమ ‘సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ సహాయంతో దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

తమ కౌన్సిల్‌కు చెందిన ఇద్దరితో కలిసి ప్రేమను యెమెన్ తీసుకెళ్తామని కౌన్సిల్ ఆ పిటిషన్‌లో కోర్టుకు చెప్పింది.

ఈ కేసును విచారించిన దిల్లీ హైకోర్టు నిమిష తల్లితో పాటు మరొకరు వెళ్లేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, వారి యెమెన్ ప్రయాణానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వారే భద్రతపరమైన బాధ్యతలు చూసుకోవాలని కోర్టు చెప్పింది.

ఆ మేరకు అఫిడవిట్ సమర్పించాలని, ప్రయాణ వివరాలు కోర్టుకు అందించాలని చెప్పింది.

‘యెమెన్‌లో అనేక హత్య కేసులలో శిక్షలు వెంటనే అమలయ్యాయి. కానీ, ఈ కేసులో నిమిష తరఫున కారణాన్ని అర్థం చేసుకోవడంతో అక్కడి ప్రభుత్వం శిక్ష అమలుకు తొందరపడలేదు. యెమెన్ చరిత్రలో ఒక కేసులో శిక్ష అమలుకు ఇంతకాలం పట్టడం ఇదే తొలిసారి’ అని తమిళనాడుకు చెందిన శామ్యూల్ జెరోమ్ అన్నారు.

నిమిష తల్లి ప్రేమతో కలిసి యెమెన్ వెళ్లేందుకు అనుమతి లభించింది ఆయనకే. శామ్యూల్ ప్రస్తుతం తమిళనాడులో ఏవియేషన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.

‘నేను కూడా మొదట నిమిషను క్రిమినల్‌గానే చూశాను. కానీ, తరువాత నిమిష పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె క్షమాభిక్షకు అర్హురాలు అనిపించింది. అదే విషయం మీడియాకు చెప్పాను’ అన్నారు శామ్యూల్.

‘నిమిష హత్య చేసి డబ్బులిచ్చి శిక్ష నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చాలామంది అనుకుంటున్నారు. కానీ, మేం ప్రయత్నిస్తున్నది బాధిత కుటుంబం నుంచి క్షమాభిక్ష కోసం’ అన్నారు శామ్యూల్.

‘డబ్బు ఇక్కడ ప్రధానమైన విషయం కాదు. ఇక్కడ డబ్బు అనేది కేవలం క్షమాపణకు ఒక చిహ్నం మాత్రమే. క్షమించాలా వద్దా అనేది దలాల్ మహదీ కుటుంబ సభ్యులు ఇష్టం’ అన్నారు శామ్యూల్.

శామ్యూల్
ఫొటో క్యాప్షన్, శామ్యూల్

‘మేం క్షమాభిక్ష కోరుతున్నాం’

‘యెమెన్ పౌరుడిని చంపిన తరువాత డబ్బు చెల్లించినంత మాత్రాన వదిలిపెడతారా? ఇతర అనేక కేసులలో మరణ శిక్షలు వెంటనే అమలవుతున్నాయి. కానీ, నిమిష కేసులో శిక్ష అమలు విషయంలో అధికారులు ఓపికపట్టారు. నిమిష చేసిన పనిని నేను సమర్థించడం లేదు కానీ ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందన్నది చూడాలి’ అన్నారు శామ్యూల్.

‘ఇప్పుడు బాధిత కుటుంబాన్ని క్షమాపణ కోరడం ప్రధానం. ముందుగా యెమెన్ ట్రైబల్ లీడర్లతో మాట్లాడాలి. వారు మా క్షమాపణను అంగీకరించాలి. ఆ తరువాత కుటుంబం కూడా మమ్మల్ని క్షమించాలి’ అన్నారు శామ్యూల్.

క్షమాభిక్షకు వారంతా అంగీకరించినట్లు యెమెన్ కోర్టుకు తెలియజేస్తే నిమిషాకు మరణ శిక్ష తప్పుతుంది అన్నారు శామ్యూల్.

వీసా రాగానే నిమిష తల్లి ప్రేమ జనవరి మొదటివారంలో కానీ రెండోవారంలో కానీ యెమెన్ వెళ్తారని శామ్యూల్ తెలిపారు.

‘దిల్లీ హైకోర్టు తీర్పు స్వాగతించదగినది. కేరళకు చెందిన సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ గ్రూప్ ప్రయత్నం వల్లే ఇదంతా సాధ్యమైంది. నిమిషను రక్షించే ప్రయత్నాలలో వారి పాత్ర కీలకం. భారత అధికారులు కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతా బాగానే జరుగుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు శామ్యూల్.

ప్రేమ కుమారి తరపు న్యాయవాది కెఎల్‌ బాలచంద్రన్‌ మాట్లాడుతూ.. ‘అనేక ఏళ్ల పోరాటానికి ఫలితమే దిల్లీ హైకోర్టు తీర్పు. 2020లో పరిస్థితి నిలకడగా ఉన్నప్పుడు నిమిష తల్లి, నేను యెమెన్‌ వెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అప్పటి ఆ ప్రయాణం రద్దయింది’ అన్నారు.

‘ఆ తరువాత యుద్ధం కారణంగా అక్కడికి వెళ్లలేకపోయాం. తాజా తీర్పుతో ప్రేమ కుమారికి వచ్చే నెలలో యెమెన్ వెళ్లేందుకు వీసా వస్తుంది. నిమిషను కచ్చితంగా రక్షించుకుంటామని ఆశిస్తున్నాను. యుద్ధ వాతావరణం కారణంగా ఇప్పటికీ అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. అయితే ప్రేమ కుమారి తన కుమార్తెను రక్షించాలని నిశ్చయించుకోవడంతో అక్కడికి వెళ్తున్నారు’ అన్నారాయన.

‘నా కూతురు పరాయి దేశంలో చనిపోవడం నాకు ఇష్టం లేదు. అక్కడి పరిస్థితి బాగులేదు.. వెళ్లడం క్షేమకరం కాదు. అయినా అక్కడికి వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. బాధిత కుటుంబం తప్పకుండా నా కూతురిని క్షమిస్తుందని అనుకుంటున్నాను’ అన్నారు నిమిష తల్లి ప్రేమ.

‘నిమిషకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి తల్లి కావాలి కదా’ అన్నారు ప్రేమ.

‘నిమిష చిన్నప్పటి నుంచి చదువులో రాణించింది. మా ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో చర్చి ఆమె చదువు, నర్సింగ్ విద్య ఖర్చులను భరించింది. అయితే, నిమిష ప్రీ డిప్లమో స్కూల్ పరీక్షలో పాస్ కాకపోవడంతో కేరళలో నర్స్‌గా పనిచేయడానికి అర్హత సాధించలేకపోయింది. దాంతో ఆమె యెమెన్ వెళ్లారు’ అని ప్రేమ చెప్పారు.

‘కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేయడానికి యెమెన్ వెళ్లిన నా కూతురికి ఇలాంటి దుస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఎలాగైనా నా కూతురిని కాపాడుకుంటాను’ అన్నారు ప్రేమ.

Tomy Thomas
ఫొటో క్యాప్షన్, టామీ థామస్

యెమెన్‌ వెళ్లి నర్సుగా పనిచేస్తున్న నిమిష ప్రియ 2011లో కేరళ వచ్చి టామీ థామస్‌ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత థామస్‌తో కలిసి యెమెన్‌కు వెళ్లారు. ఆయన అక్కడే ఎలక్ట్రిషియన్ అసిస్టెంట్‌‌గా పనిలో చేరారు.

2012 డిసెంబర్ తర్వాత, వారికి కూతురు పుట్టిన తరువాత తక్కువ జీతంతో అక్కడ జీవించడం కష్టమైంది. దీంతో 2014లో టామీ థామస్ కూతురితో కలిసి తిరిగి కేరళ వచ్చేశారు. నిమిష మాత్రం యెమెన్‌లోనే తన ఉద్యోగంలో కొనసాగారు.

యెమెన్‌లో తక్కువ జీతం వస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సొంతంగా క్లినిక్ పెట్టాలని 2014లో నిమిష అనుకున్నారు. యెమెన్‌లో క్లినిక్‌ పెట్టాలంటే భాగస్వామిగా స్థానికులు ఉండాలి. ఆ సమయంలో తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తి నిమిష నెలకొల్పే క్లినిక్‌లో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చారు.

ఆయన అక్కడికి దగ్గర్లో ఒక చేనేత దుకాణం నడిపేవారు. 2015 జనవరిలో నిమిష తన కూతురి బాప్టిజం కోసం కేరళ వచ్చినప్పుడు, ఆమెతో పాటు సెలవులపై మహదీ కూడా కేరళ వచ్చారు.

నిమిష తన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి రూ.50 లక్షలు అప్పు తీసుకున్నారు. నెల తర్వాత నిమిష తన క్లినిక్‌ ప్రారంభించేందుకు యెమెన్‌కు తిరిగి వెళ్లారు. యెమెన్‌కు వెళ్లగానే క్లినిక్ ప్రారంభించేందుకు పేపర్‌వర్క్ ప్రారంభించారు. దీంతో భర్త, కూతుర్ని అక్కడికి తీసుకెళ్లవచ్చు అనుకున్నారు. కానీ, మార్చిలో అంతర్యుద్ధం ఏర్పడడంతో వారు అక్కడికి వెళ్లలేకపోయారు.

యుద్ధం తరువాత రెండు నెలల్లో భారత్ సుమారు 4,600 మంది భారతీయులను, వెయ్యి మంది వరకు విదేశీ పౌరులను యెమెన్‌ నుంచి సురక్షితంగా తరలించింది. నిమిష, మరికొంతమంది మాత్రం యెమెన్‌ను వీడలేదు.

‘క్లినిక్ కోసం మేం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాం. అందుకే, ఆమె దాన్ని విడిచిపెట్టి, రాలేకపోయింది’ అని ఆమె భర్త థామస్ చెప్పారు.

క్లినిక్ బాగా నడుస్తుండేది. కానీ, మహదీ ప్రవర్తన ఏమీ బాగుండటం లేదని నిమిష తమకు చెప్పేదన్నారు థామస్.

నిమిషను పెళ్లి చేసుకున్నట్లు మహదీ తప్పుడు ఆధారాలు సృష్టించినట్లు థామస్ దిల్లీ హైకోర్టుకు చెప్పారు.

మహదీ ఆమెను శారీరకంగా హింసించేవారని, క్లినిక్‌పై వచ్చే ఆదాయాన్ని ఆయనే తీసుకునేవారని ఆ పిటిషన్లో చెప్పారు.

వారి మధ్యన సంబంధాలు చెడినప్పుడు, క్లినిక్‌లో వచ్చే డబ్బుల విషయంలో మహదీని నిమిషా ప్రశ్నించడం మొదలు పెట్టారు.

‘చాలాసార్లు నిమిషాను మహదీ గన్‌తో బెదిరించే వాడు. ఆమె దేశం విడిచి వెళ్లకుండా పాస్‌పోర్టు కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై చర్యలు తీసుకోవడానికి బదులు, ఆమెనే ఆరు రోజుల పాటు జైలులో ఉంచారు’ అని పిటిషన్‌లో చెప్పారు.

ఆ తరువాత మహదీ హత్యకు గురయ్యారని.. ఆ హత్య గురించి 2017లో టీవీ న్యూస్ ఛానళ్ల ద్వారా తెలుసుకున్నట్లు థామస్ చెప్పారు.

‘‘మలయాళీ నర్సు నిమిష ప్రియ భర్తను(మహదీ) హత్య చేసిన కేసులో యెమెన్‌లో అరెస్ట్ అయ్యారు. ఆయన శరీరాన్ని ఆమె ముక్కలు ముక్కలు చేశారు’’ అని వార్తలలో వచ్చిందని థామస్ తెలిపారు.

సౌదీ అరేబియాతో ఉన్న యెమెన్‌ సరిహద్దుకు దగ్గర్లో నిమిష ప్రియ అరెస్ట్ అయ్యారు. ముక్కలు చేసిన మహదీ మృతదేహం నెల తర్వాత నీళ్ల ట్యాంకులో దొరికింది.

‘‘నిమిషా ఉద్దేశపూర్వకంగా మహదీని చంపలేదు. ఆమె కూడా బాధితురాలే’’ అని నిమిష తల్లి తరఫున వాదిస్తున్న వలసదారుల హక్కుల కార్యకర్త, సుప్రీంకోర్టు న్యాయవాది కేఆర్ సుభాష్ చంద్ర, కౌన్సిల్ దిల్లీ హైకోర్టులో తమ వాదనలను వినిపించారు.

‘‘మహదీ ఆమె పాస్‌పోర్టును లాక్కున్నాడు. ఆయన దగ్గర్నుంచి పాస్‌పోర్టు‌ను తిరిగి తీసుకోవాలని చాలా ప్రయత్నించింది. అందుకే, మహదీకి మత్తుమందు ఇచ్చింది. కానీ, అది ఓవర్‌డోస్ అయి, అతను మరణించాడు’’ అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)